ఆధునిక తెలుగు సాహిత్యంలో అవసరాల రామకృష్ణారావు పేరు వినని వారుండరు. ఆయన పేరు వినగానే ఎవరికైనా ముఖం మీద చిరునవ్వు ఉదయిస్తుంది. హాస్య రచనలో ఆయన అందెవేసిన చెయ్యి. ఏ కధ రాసినా, ఏ నాటిక రాసినా ఆయన అందులో కొంతయినా చమత్కారాన్ని, హాస్యాన్ని పండిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కథలు రాయడంలోనూ, ఇతివృత్తాలను ఎంచుకోవడంలోనూ ఆయనది ఒక విలక్షణమైన పంథా. 1931 డిసెంబర్ 21న తూర్పు గోదావరి జిల్లా తునిలో పుట్టి పెరిగిన రామకృష్ణారావు 2011లో తనువు చాలించే నాటికి సుమారు 600 కథలు రాశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు, ఆయన 15 నవలలు, నాలుగు చిన్న పిల్లల నవలలు రాశారు. రేడియో నాటికలకు పరిమితే లేదు. ఆయన బాల సాహిత్యంలో కూడా ఆరితేరినవారు అయినందువల్ల పిల్లల కోసం వివిధ పత్రికల్లో కథలతో పాటు, క్విజ్ లు, పొడుపు కథలు, చిన్న చిన్న సందేశాత్మక వ్యాసాలు కూడా రాయడం జరిగింది.
జార్జి ఆర్వెల్ మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పొందిన రామకృష్ణారావు ఆ తర్వాత సైన్స్, మేథమేటిక్స్, ఇంగ్లీషు అధ్యాపకుడుగా పనిచేశారు. ఆయన పేరు తలచుకున్న మరు క్షణం అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ‘పేకముక్కలు’, ‘సంపెంగలు-సన్నజాజులు’, ‘కేటు-డూప్లికేటు’, ‘అస్తిపంజరం’, ‘రసవద్గీత’. ఆయన 17 ఏళ్ల వయసులోనే కథలు రాయడం ప్రారంభించారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు ఆయన రచనా వ్యాసంగం చేస్తూనే ఉన్నారు. ఒక ప్రముఖ దినపత్రికలో ఆయన అంగ్రేజీ మేడ్ ఈజీ అనే పేరుతో కాలమ్ నిర్వహించారు. దాని ద్వారా సులభ శైలిలో ఇంగ్లీషు బోధించడానికి కృషి చేశారు. ఆ తర్వాత శెభాషితాలు పేరుతో మరో కాలమ్ కూడా నిర్వహించి సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై వ్యాసాలు కూడా రాశారు. సుమారు 52 ఏళ్లపాటు తాను రాసిన కథలను పేకముక్కలు పేరుతో సంకలనంగా వెలు వరించారు. ఆయన ఇంగ్లీషులోనే బోధించేవారు. అయినప్పటికీ ఆయన తెలుగులోనే కథలు రాసే వారు. రాయడంలోనే కాదు, బోధించడంలోనూ, మాట్లాడడంలోనూ కూడా హాస్య రసమే తొణికిసలాడేది.
ఆయన తన కథలతో వెలువరించిన మరో కథా సంకలనం ‘అర్థమున్న కథలు’ పుస్తకానికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1994లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆయనను ఉత్తమ హాస్య రచయిత పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీ తెలుగు అకాడమీ కూడా ఆయనకు 2000 సంవత్సరంలో ఉత్తమ రచయిత పురస్కారం అందించింది. ఆయన చమత్కార ధోరణి, మధ్య మధ్య వ్యంగ్యాస్త్రాలు, హాస్యస్ఫూర్తి కారణంగా ఆయనకు తెలుగునాట వేలాది శిష్యులు ఏర్పడ్డారు. బోధనాపరంగానే కాకుండా, సాహిత్యంలో కూడా ఆయనను వందలాది మంది అనుసరిస్తుండేవారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తెలుగు సాహిత్యానికే అంకితమయ్యారు తప్ప ఏనాడూ కీర్తిప్రతిష్టల కోసం అర్రులు చాచలేదు. సంచలనాత్మక రచనలతో కానీ, సామాజిక స్పృహతో కానీ ధగధగలాడిపోకుండానే పాఠక హృదయాల్లో చెరగనిముద్ర వేయగలిగిన సమర్థులైన రచయితల్లో అవసరాల రామకృష్ణారావు ఒకరు. సినిమాల నాణ్యత మీద అయితేనేమి, వ్యక్తుల విపరీత బుద్ధుల మీద అయితేనేమి, సంస్థల పెడధోరణుల మీద అయితేనేమి రామకృష్ణా రావు వ్యాఖ్యలు క్లుప్తంగానూ, చురుగ్గానూ ఉండి, తగలవలసిన చోట తగిలేవి. అరుదైన హాస్య, వ్యంగ్య, చమత్కార రచయిత ఆయన.