Monday, August 19, 2024
Homeఓపన్ పేజ్Sahithi Vanam: విజ్ఞాన ఖని జ్ఞానానంద కవి

Sahithi Vanam: విజ్ఞాన ఖని జ్ఞానానంద కవి

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానానంద కవి గురించి వినని వారుండరు. 1922 ప్రాంతంలో హైద రాబాద్‌ నగరంలో జన్మించిన సూరగాలి తిమోతీ జ్ఞానానంద కవి అటు తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇటు ఆంధ్ర ప్రాంతంలో కూడా సాహితీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అపురూప, అపూర్వ సాహితీవేత్త. తన 88 ఏళ్ల జీవిత కాలంలో ఆయన సుమారు 40 అద్వితీయ గ్రంథాలను సృష్టించిన జ్ఞానానంద కవి తన పేరుకు తగ్గట్టుగానే సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, తెలుగు భాషాభిమానుల్లో జ్ఞానాన్ని పంచిపెట్టారు. ఆయన రాసిన ధర్మ గ్రహం, వంశధార, అక్షరాభిషేకం, గోల్కొండ కావ్యం, క్రీస్తు ప్రబంధం, నా జీవిత గాథ వంటివి వేటికవే సాటి. సాహితీ లోకంలో సంచల నాలు సృష్టించిన ఈ గ్రంథాలు ఇప్పటికీ సాహితీవేత్తలు, పరిశోధకులు, భాషా శాస్త్రవేత్తల నోళ్లలో నానుతూనే ఉంటాయి.
ఆయన ఓ విశిష్ట పరిశోధకుడు. ప్రతి తెలుగు భాషా కావ్యాన్నీ లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన దేని గురించి రాసినా, దేని గురించి మాట్లాడినా అది ఒక గ్రంథమే అవుతుంది. అటువంటి వ్యక్తి మీద ఆ తర్వాతి కాలంలో పలువురు పరిశోధనలు చేసి, డాక్టరేట్లు సంపాదించుకోవడం జరిగింది. ప్రభుత్వాలతో సహా అనేక సంస్థలు ఆయనకు ఘన సన్మానాలు చేసి, కవి శిరోమణి’ వంటి బిరుదులిచ్చి ఆయన పట్ల, ఆయన రచనల పట్ల తమకున్న ప్రత్యేక గౌరవాభిమానాలను చాటుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఆయనకు ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని అందజేసింది. ఆయనకు సాహిత్యాభిమాను లంతా ప్రతిష్ఠాకరమైన పైడి లక్ష్యయ్య పురస్కారాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక సంస్థ ఆయనకు హంస అవార్డునిచ్చి గౌరవించింది. ఇవి కాకుండా, 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ అందజేసింది. ఆ తర్వాత 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. వీటన్ని టికీ మించి తెలుగునాట లక్షలాది మంది ప్రజల్లో ఆయన చిరస్థానం సంపాదించుకోవడం విశేషం.
ఆ తర్వాత 2001లో జ్ఞానానంద కవికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం ఆయనకు దేశవ్యాప్త గుర్తింపును తీసుకు వచ్చింది. 2011 జనవరిలో ఆయన తన 88వ ఏట కాకినాడలో కన్నుమూశారు. దాదాపు చివరి క్షణం వరకూ ఆయన పఠనంలోనూ, పరిశో ధనల్లో గడిపారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఎంత మంది శిష్యులనుతయారు చేశారో అంచనా వేయలేం. ఆయన జీవితమంతా సారస్వత సేవకే అంకితమైంది. తన జీవిత కాలంలో కవిత్వానికి, కవిత్వ రచనకు, కవిత్వ గ్రంథాలకు ఉచ్ఛ దశ పట్టించిన జ్ఞానానంద కవి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆధునిక పోకడలను జొప్పించడమే కాకుండా, తన రచనల ద్వారా తనలోని భారతీయతా భావాలను అద్బుతంగా వ్యక్తం చేశారు. కుల, మతాలకు అతీతమైన భారతదేశాన్ని ఆయన కలలుగన్నారని ఆయన తోటి సాహితీవేత్తలు చెబుతుండేవారు. అత్యంత కఠినమైన భావాన్ని కూడా సరళ భాషలో వ్యక్తం చేయడంలో ఆయనను మించినవారు లేరు.
పండితులతోనే కాక, పామరులతో సైతం క్షణాల్లో కలిసిపోయే జ్ఞానానంద కవి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు నీరాజనాలు పట్టేవారు. ఒక సాధారణ స్థాయి నుంచి ఎంతో కష్టపడి పైకి రావడంతో పాటు సాహితీవేత్తల్లో ఒక దిగ్గజంగా వెలిగిన జ్ఞానానంద కవి ఎంతో సౌమ్యుడు, రాగ ద్వేషాలకు అతీతుడు. అందరినీ సమానంగా చూడడమనేది ఆయన సహజ స్వభావం. ఎప్పుడూ కవి పండితుల మధ్యే కాలం గడిపిన ఈ కవి శిరోమణి ఎప్పటి కప్పుడు తన కవిత్వాల్లో ఒక కొత్త తెలుగు మాటను జొప్పించేవారు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకూ అనేక ప్రాంతాల్లో అనేక పర్యాయాలు పర్యటించిన జ్ఞానానంద కవి విజ్ఞానాన్ని పంచడంతో పాటు, విజ్ఞానాన్ని సమకూర్చుకునే వారు కూడా. అవన్నీ తన కవితల్లో సరళ భాషలో వ్యక్తం అవుతుండేవి. అటువంటి విజ్ఞాన ఖని ఇప్పుడు తెలుగు ప్రజల మధ్య లేకపోవడం నిజంగా ఒక పెద్ద వెలితే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News