డాక్టర్ హసేనకు మనుషులంటే ఇష్టం, మట్టి మనుషులు అంటే ఇంకా ఇష్టం, అమ్మంటే ప్రాణం. నాన్నంటే ఆరో ప్రాణం. ఓడిపోయిన చోట గెలవడం, గెలుపును అందరికీ పంచడం, డాక్టర్ హసేనాకు అలవాటు. ఫోన్లో పరిచయమైనా బాల్యంలో స్నేహమైనా, ఆ గొంతులో ఆ పలకరింపులో తేడా కనిపించదు. మాట్లాడే ప్రతి మాట ఆప్యాయానురాగాలను స్నేహాన్ని పంచేదిగా, పెంచేదిగా ఉంటుంది. కులమతాలు అతను అభిమతంలో కనిపించవు. అందుకే అతని కవిత్వాన్ని ఇష్టపడకుండా ఉండలేం. చదివాక అభినందించకుండా అస్సలు ఉండలేం. ఒక మనిషితో సహవాసం చేస్తే అభిమానం పెరగడం సహజం కానీ ఒక పుస్తకం చదివి మని షి హృదయాన్ని అంచనా వేయడం అంటే ఆ కవిత్వం హసేనదై ఉంటుంది. ఆ కవిత్వం మనదై, మన జీవితంలోనిదై ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవిత అనుభవంలోనిదై ఉంటుంది. బిడ్డా ఎప్పుడొస్తవ్ అనగానే ఒక తల్లి, ఒక బిడ్డ , ఒక విషాదం, ఒక కష్టం, ఒక జ్ఞాప కం, ఒక ప్రేమ, ఒక బరువైన హృదయం, భయంకరమైన అను భవం, మనదిగా మన చుట్టుపక్కల జీవిస్తున్న ఇరుగుపొరుగు వాళ్ళదిగా అనిపిస్తుంది. అందుకే నిన్ను నీవు తెలుసుకోవాలంటే డాక్టర్ హసేనగారి కవిత్వం చదవాలి. విదేశాలలో ఉన్న కొడుకు కోసం ముసలి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని లేదా గల్ఫ్ లో ఉన్న కొడుకు ఈ పండుగ కైనా వస్తాడని ఎదురుచూస్తూ కన్నవారు పడే వేదన అని పుస్తకంపై కవర్ పేజీ శీర్షిక చూడగానే అనిపి స్తుంది పాఠకులకు కానీ మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్లిన కొడు కును తలుచుకుని తల్లి పడే వేదనే ఈ బిడ్డా ఎప్పుడొస్తవ్, అని తెలి యగానే గుండె బరువెక్కుతుంది.
కడుపుకు కత్తెర పెడ్తేగాని
బయటకు రానని మారం చేస్తే
కత్తిగాట్లు భరించిన….
కాలానికి కన్నుకుట్టి మీ అయ్యను యములోడు లాక్కు పోతే అనే మాటలు ఒంటరి మహిళ జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో సమాజంలో చూస్తూనే ఉన్నాం. కొడుకును కోల్పోయిన స్త్రీ బతుకు, భర్తను కోల్పోయి ఎవరికోసం బ్రతకాలనే బాధను… మాతృ హృదయాన్ని… హృదయ విదారక దృశ్యాలను తన అక్షరా లతో పాఠకుల గుండె లోతుల్లో నిలిచిన కవిగా డాక్టర్ హసేనను చెప్పవచ్చు.
నిజంగా కాలంతో పాటు మారిన వారే చరిత్ర పుటల్లో నిలిచిపోతారని అందుకు నిదర్శనం అభ్యాసం అనే కవిత ….
కిరాతుడు వాల్మీకిగా, /వేమన యోగిగా,/ భీమ్రావు రాంజీ, అంబేద్కర్‌గా /మోహన్ దాస్ కరంచంద్ మహాత్ముడిగా/ పరివర్త నం చెందడం అంటే, జ్ఞాన సూర్యుడిలా వెలగాలంటే వ్యక్తిత్వం సమగ్రంగా వికసించాలి అనడంలో డాక్టర్ హసేన ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా మనకు ఈ కవితలో కనిపిస్తాడు.
భారతదేశం గురించి మాట్లాడాలంటే ముందుగా కులాల గురించి మాట్లాడాలి, కులo పునాదులపై నిర్మించబడ్డ దేశం అస్తి త్వం గురించి మాట్లాడాలి, ప్రేమకు -ప్రేమలకు ఎప్పుడు అడ్డు గోడలా ఈ కులాలు నిలుస్తాయని కవి ప్రేమికులను గెలిపించాలని చూస్తాడు నువ్వు నేను కవితలో…. సాంకేతికత పెరిగినా, కుల మతాల అడ్డుగోడలు కూలనప్పుడు, నువ్వు నేను ఏకం అయ్యేది ఎలా అని ప్రశ్నిస్తాడు.
అంగారక గ్రహం చేరినా అంధకారపు పోకడలు ఎందుకు అంటూ నిలదీస్తాడు ఓ చోట. కనిపించని దేవుడు, దయ్యం అంటే మనిషికి ఎందుకంత భయం అని, దేవుడి పేరుతో జరిగే మోసాలు, దయ్యం పేరుతో జరిగే హత్యలకు నేటి సమాజంలో జరిగే అజ్ఞా నపు మూఢనమ్మకాలను గుర్తుకు చేస్తూ మానవత్వం పెరగాల్సిన చోట, మృగతత్వం ఎందుకు పెరుగుతుంది అనే శేష ప్రశ్నను లేవనెత్తుతాడు.. కవి ‘రవి గాంచని చోట కవి గాంచును‘ అనే వాక్యం డాక్టర్ హసేనకి సరిపోతుందని నా అభిప్రాయం, మనకు తెలిసిన విజ్ఞానం ఇతరులకు అందించడం, ఆ విజ్ఞానం ప్రేయసికి ఆపాదిస్తూ మన మనసులను తొలుస్తూ, కవుల్ని, కావ్యాల్ని, కవి త్వ తత్వాల్ని గుర్తు చేయడం అంటే ఒక కవిగా తన విస్తృతిని పెం చుకుని వస్తువును మనకు పరిచయం చేశాడు అనిపిస్తుంది ఈ క్రింది కవితను చూస్తే…. నండూరి ఎంకివా
కృష్ణశాస్త్రి ఊర్వశివా బాపిరాజు శశికళ వా
విశ్వనాథ కిన్నెరసానివా
జక్కన చెక్కిన శిల్పానివా
రవి వర్మ శృంగార చిత్రానివా
డావెన్సీ సృష్టించిన మోనాలిసాకు ప్రతిరూపానివా
కాళిదాసు శకుంతలవా రతీ దేవి సోదరివా
అల్లసాని వరూధినివా… అంటూ తెలుగు సాహిత్యాన్ని ప్రాచీ న కావ్యాలను సాహిత్య స్పృహతో దేనిని ఎక్కడ ప్రతిష్టించాలో తనకు కచ్చితమైన కవితా దృష్టి ఉందని ఎవరు నువ్వు అనే ఈ కవిత ద్వారా అర్థం చేసుకోవచ్చు…
జ్ఞాపకాలు అనే కవితలో
కరుగుతున్న కొవ్వొత్తి లాంటిది జీవితం/ పరుగెత్తే గుర్రం లాంటిది కాలం /వాడి పోయే పువ్వు లాంటిది యవ్వనం అనే జీవిత సత్యాలను అల్పాక్షరాలతో ఇంత అద్భుతమైన అర్థాలను, అంగీకరించక తప్పని నిజాలను విప్పి చెప్పిన డాక్టర్ హసేన పరి ణితి చెందిన కవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు….
రక్త సంబంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు, ఆత్మీయ తలు, ఆప్తుల పలకరింపుల గురించి పట్టింపు హసేనకు ఉన్నం తగా ఎవరికీ ఉండదనిపిస్తుంది, అందుకే ప్రతి విషయాన్ని సాంకేతి కతకు అభివృద్ధికి ముడిపెట్టి మరీ చెప్తున్నారు. అది పెరిగినప్పుడు బంధం కూడా పెరగాలనే కవి భావన చాలా గొప్పనైనది… బంధం ఎప్పుడు బందీ కాదు /బరువు బాధ్యతల ఆవేదన కాదు/ రక్షా బంధన్ అయినా/ రక్తసంబంధం అయినా /సాంకేతిక విలువలతో ముడి పెట్టకు అని… సాంకేతిక విలువల కన్నా మానవ విలువలే గొప్పవని చెప్పే కవి హృదయం ప్రశంసనీయం.
నిజంగా ఒక కవి అక్షర సేద్యం చేస్తున్న కర్షకుడిని నేను అని చెప్పాలంటే ఎంతో ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, సునిషిత దృష్టి, విమర్శలను ఎదుర్కొనే తత్వం, అన్నింటికీ మించి విశాల హృద యం, అభ్యుదయ ఆలోచనలు కలిగి ఉండాలని సుస్పష్టం… అవ న్నీ పుష్కలంగా ఉన్న కవి కాబట్టి ఈ మాటలు ధైర్యంగా అన్నాడే మో అనిపిస్తుంది, అక్షర సేద్యం అనే కవితలో …
నేను భవిష్యత్ తరాల వారధిని/ వర్తమానానికి సారధి నేనే / యుద్ధము నేనే శాంతి నేనే/ నేనే రోగగ్రస్తుడిని/ ఆరోగ్యవంతుడిని ఆకలి, పోరాటం, ఐశ్వర్యాన్ని ప్రశ్నించడం, ఆర్తనాధాల వైపు నిల బడడం లాంటి పదాలు వాక్యాలు చూస్తే నిజంగా అగ్నిని విరజిమ్ముతూ రాకెట్ ఆకాశంలోకి వెళ్లినట్టుగా – పాఠకుని అంత రంగంలోకి అక్షరాలువెళ్లి హృదయ స్పందనలో కలిసిపోతాయి… ఒక సినిమాటిక్ చిత్రీకరణ లాగా మన మెదడును పరిగెత్తిస్తాయి…
నాన్న కోసం సైనికుడివై / దేశం కోసం అమరుడివై అనే రెం డు పదాలు ఒక మనిషి 100 సంవత్సరాల జీవితాన్ని అక్షరీ కరిం చినట్లు అనిపించింది… తండ్రి ఆశయాన్ని , దేశభద్రత కోసం తన విధి నిర్వహణను, ప్రాణ త్యాగాన్ని… చేసిన కల్నల్ సంతోష్ బాబు గురించి ఇంత క్లుప్తంగా వివరించడం అంటే కలం తిరిగిన కవికే సాధ్యమయ్యే విషయం.. అది హసేన విషయంలో నిజమని భావించవచ్చు. ఇందులోనే తన ప్రాంతాన్ని ప్రాంత అమర త్వాన్ని, మరువని కవిగా హసేన ను చూడవచ్చు…
ప్రతి కొడుకుకి మొదటి హీరో తన తండ్రి అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.. అలాంటి తండ్రి ఇక మనకు కనిపించడని తెలిస్తే పడే వేదన వర్ణించలేనిది, దాన్ని హసేన..తన తండ్రిని కోల్పోయినప్పుడు…
రంజాన్ పండక్కి కొత్త బట్టలు కట్టుకోకుండానే, తెల్లబట్టల్లో చుట్టబడితివి అనే వాక్యం లో శాంతికి చిహ్నమైన తెల్ల వస్త్రం కవి మనసును అశాంతికి గురిచేసిందని, తండ్రి మరణం మిగిల్చిన అంతులేని విషాదంగా నాన్న అనే కవితలో వివరించాడు…
ఇందులో కవితలు కవి స్వానుభంలోనివే , అని అవి మన తాలూకు జ్ఞాపకాలను కూడా గుర్తు చేసి, మనదైన కవిత గా అనిపిస్తూ చదివిస్తుంది … అందుకే బిడ్డా ఎప్పుడొస్తవ్ అనే కవితా సంపుటి వర్తమాన యువ కవులు చదివి ఆదర్శంగా తీసుకోవాలని పిస్తుంది….
ప్రాణం ఉన్నంతవరకు నేను నీ కాళ్ళ కింద/ ప్రాణం పోయా క నువ్వు నా కింద /చూశావా సృష్టి విచిత్రం/ నాలుగు రోజుల జీ వితానికి/ నా పైనే అజమాయిషీ చేస్తున్నావ్. గర్వం తలకెక్కితే ఒక్కసారి స్మశానం వైపు చూడు అంటూ డబ్బు, గర్వం, స్వార్థంతో నిండిన సమాజానికి అద్భుతమైన సమాధానం అవును నేను మట్టినే అనే కవిత. స్వార్థపూరిత మనుషుల మనస్తత్వాన్ని మానవ త్వం వైపు మళ్ళించేదిగా ఈ కవితలో మనకు కనిపిస్తుంది…
నవతరానికి కవిత్వ నడకలు నేర్పే కవిత రైతు ఎందుకో వెనక బడ్డాడు. మనం గత 15రోజులుగా కురుస్తున్న వర్షాలుచూస్తుంటే, రైతు గోడును, ఆత్మహత్యలను గుండెలవిసేలా ఏడవడాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ కవిత చూపిస్తుంది. చంద్రమండలం పైకి రాకెట్లు పంపినా, ఆ టెక్నాలజీ రైతు పంటను నీళ్లలో కలవకుండా ఆపలేక పోయింది, రైతును కావాలనే ప్రభుత్వాలు వెనక బడేసాయా? అనిపిం చేలా ప్రతి ఒక్కరి నీ ఆలో చింప జేస్తుంది.. ఈ కవిత..
అన్నదాత గోడు ఆలకించే వాడు ఎవడు ఆత్మహత్యలకు అడ్డు కట్ట వేసేదెవడు
కరోనా సృష్టించిన విలయాన్ని కూడా కవి వదిలిపెట్టలేదు… అది సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. ఆ జ్ఞాప కాలు ఇంకా గుండెపోటు రూపంలో భయపెడుతూనే ఉన్నాయి.
ఇల్లు ఖాళీ చేశారు హృదయం ఉన్న ప్రతి మనిషి కళ్ళను చెమ్మగిల్లేలా చేసే కవిత.. వ్యవసాయం చేసుకుంటూ ఊరిలో వాడు/ ఉద్యోగరీత్యాపట్నంలో నేను/15 రోజుల క్రితం మిత్రుడు ఫోన్ చేశాడు ఇంటికి రమ్మని.. పని ఒత్తిడిలో పడి మర్చి పోయాను / వాడు నాకు ప్రాణ స్నేహితుడు…
ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే స్నేహితుడు కానరాని లోకా లకు వెళ్ళాడని తెలిసినప్పుడు ప్రతి స్నేహితుని గుండె బరువెక్కి కన్నీరు కారుస్తుంది , అది నిజంగా జరిగిన వాస్తవ సంఘటనను అక్షరాల్లో బంధించిన కవి, తన జ్ఞాపకాలను మన జ్ఞాపకంగా అనుభూతిని పొందేలా చేశాడు కవి.
పారిశుద్ధ్య కార్మికులను యోధులుగా, పర్యావరణ ప్రేమికు లుగా, వర్ణించడం తోపాటు మనుషులు చెత్తలాగా, మురికి, మలి నమంటిన మనస్సును కలిగి ఉన్నారని వారు మారాలని కోరుకో వడం సముచితం…
మలినమైన మనసులతో మనుషులు/ వీధుల పైకి చెత్తను విసిరేస్తే/ మన చెత్త పనులను చీపురుతో ఊడ్చేస్తారు / అంటూ శ్రమజీవుల పక్షపాతిగా కవి కనిపిస్తాడు…
మానవ సంబంధాలకు విలువనిస్తూ మనిషిని అహం నుండి బయట పడాలనే సందేశం నేటి సమాజానికి జీవన విధానం నేర్పించే తత్వవేత్తలాగా కవి ఆలోచనలు మనకు కనిపిస్తాయి. కవి త్వం, వర్ణన, భావం పోలికలతోనే ఆగిపోలేదు హసేన కవిత్వం… ప్రకృతి చుట్టూ, స్నేహం చుట్టూ, అమ్మ , నాన్న, చదువుల నిల యం , మార్గదర్శకులు , చెట్టు, రైతు , సఫాయి కార్మికులు, మన తో పాటు ఒక ప్రపంచం అని తెలియజేసిన కవి మనోనేత్రంతో దర్శించి పరిసరాలను, పరిస్థితులను జీవన చిత్రానికి అన్వయించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన పుస్తకమే బిడ్డా ఎప్పుడొస్తవ్.
పాఠకుల మదిలోకి జ్ఞాపకాల తెరలను, దొంతరలుగా నిక్షి ప్తం చేసి, ప్రతి వ్యక్తి తనలోకి తొంగి చూసుకొని తన్మయత్వం చెందే విధంగా రాయడం కొందరికే సాధ్యం. ఈ విషయంలో కవి డాక్టర్ హసేన విజయం సాధించాడని చెప్పవచ్చు.
ఒకచోట కృష్ణున్ని, మరోచోట జీసస్‌ను, ఇంకోచోట అల్లాహ్ ను పరిచయం చేస్తూ మతాలు మనసుకు సంబంధం లేనివని మని షే నిజమైన దైవత్వం కలవాడని చెప్పే వాక్యాలు కవి ‘లౌకికత్వాన్ని మానవీయతను’ సమాజం పట్ల బాధ్యతను మనకు తెలియజేస్తూ, స్నేహభావము, ఆప్యాయతను కలగజేసి పాఠకునికి ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తూ కవిత లను చదివిస్తాయి….
డాక్టర్ హసేన కవితలు మనతో మాట్లాడుతాయి, మనల్ని మాట్లాడిస్తాయి, మనల్ని ఓదార్చుతాయి, ధైర్యాన్నిస్తాయి, బ్రతు కుపై భరోసాను, జీవితంపై ఆశను కలిగిస్తాయి. కులమతాలు లేని కొత్త సమాజంను కోరుకుంటూ కవి మనల్ని ఆ దారిలో నడిపించా లనుకోవడంతో పాటు సామాజిక అంశాలు, భవిష్యత్తులో జరగ బోయే ప్రకృతి విపత్తులు, విలయాలు, వాటికి నివారణ అంశాల్ని కూడా తన కవితలలో స్పృశించడం అక్షరీకరించడం పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
డాక్టర్ హసేన మొదటి కవితా సంపుటి లోనే పాఠకులకు దగ్గరై కవితా హృదయుల మదిని దోచుకున్నాడు. కూరెళ్ళ శ్రీని వాస్ చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.. వాక్యాల అంతరార్థంను అలవోకగా తెలియజేస్తూ మనసుకు హాయిని, ఆనందాన్ని కలుగ జేస్తాయి అతని చిత్రాలు. కవితల పక్కనే చిత్రాలు ఉండి ఉంటే పాఠకునికి సులభతరమైన అవగాహన ఉండేది.
పురాణ, ఇతిహాసాలు భావ వర్ణనతో కూడిన పదాలు ఉండ డం వలన భావ కవిత్వం అనే భావన పాఠకునికి కలుగుతుంది అవి లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పుస్తకానికి ముందు మాటలు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఏనుగు నర సింహారెడ్డి, ఆచార్య సూర్య ధనుంజయ్, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ రాసి కవి యొక్క ఉద్దేశాన్ని, మానవీయ విలువలను స్పృశించడం కొసమెరుపు, డాక్టర్ హసేన నుండి సమాజాన్ని చైతన్యవంతం చేసే మరిన్ని కవితా సంపుటాలు రావాలని సహృదయంతో కోరుకుందాం…
- డాక్టర్. మెంతబోయిన సైదులు
9010910956