సాధారణంగా ఇతర రాష్ట్రాలలో ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఇతర దేశాలలో నివసిస్తున్న ప్రజల గురించి ఆసక్తి కనబరడచంలో వింత లేదు. అందులోనూ ఇతర దేశాలలో నివసిస్తున్న తెలుగు వారి గురించి తెలుసుకోవడానికి మరింత ఆరాటపడతాం. విదేశాల నుంచి మనవారెవరైనా మన ఇళ్లకు వచ్చినప్పుడు వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఎంత ఉత్సాహం చూపిస్తామో అందరికీ తెలిసిన విషయమే. ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పేరుతో మల్లికేశ్వరరావు కొంచాడ రాసిన ఓ గ్రంథం మీ ఆరాటాలు, ఆసక్తులు, ఆరాలు, కుతూహలాలన్నిటికీ సరైన సమాధానం. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న మల్లికేశ్వరరావు కొంచాడ తెలుగు మూలాలకు ఏమాత్రం దూరం కాకపోగా, అక్కడ తెలుగు లోకాన్ని సృష్టించి, ఆ భాష, ఆ జీవన శైలిలోని మాధుర్యాన్ని అక్కడి ప్రజలకు పంచుతుంటారు. ‘తెలుగు మల్లి’ పేరుతో ఆయన అక్కడ ఒక తెలుగు వార్తలు, సాహిత్యానికి సంబంధించిన వెబ్ సైట్ ఒక్క ఆస్ట్రేలియాలోని తెలుగు వారి జీవితాలనే కాకుండా, వివిధ దేశాలలో ఉన్న తెలుగువారి భాషార్తిని, భావార్తిని కూడా తీరుస్తూ ఉంటుంది.
ఆస్ట్రేలియాలో తెలుగువారి అరవయ్యేళ్ల ప్రస్థానానికి సంబంధించిన వింతలు, విడ్డూరాలు, విశేషాలు ఇతర కథా కమామిషులతో ఆయన ఈ అనుభవాల సంకలనాన్ని ప్రచురించారు. ఇది ఆస్ట్రేలియాలోని తెలుగువారి అనుభవాలు, జ్ఞాపకాలను కథలు కథలుగా వివరించడమే కాకుండా, ఈ దేశానికి కొత్తగా వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ఒక దిక్సూచిగా కూడా ఉపయోగపడుతుంద నడంలో సందేహం లేదు. ఇందులో ప్రసిద్ధుల అనుభవాలూ ఉన్నాయి, పామరుల అనుభవాలూ ఉన్నాయి. గ్రంథకర్త మల్లికేశ్వరరావు కొంచాడ మాట ల్లోనే చెప్పాలంటే, “ఆస్ట్రేలియా గడ్డపై తొలి సారిగా తెలుగువారు పప్పుల దినుసుల దుకాణాలను తెరచి చరిత్ర పుటల్లో సమున్నతమైన స్థానాన్ని నిలుపుకున్నారు. భోజన ప్రియలైన తెలుగువారి అలవాట్లను ఆకళింపు చేసుకుని, అంది వచ్చిన అవకాశాన్ని అమృత భాండంలా మలుచుకున్నారు. వ్యాపార నిబద్ధతలో అందె వేసిన చెయ్యిగా అందరి మన్ననలు అందుకున్నారు.” మొదట్లో తెలిసిన వస్తువులతోనే వ్యాపా రాలు మొదలుపెట్టారు. తమకు తెలియనివెన్నో ఉన్నాయన్న సంగతి కాలక్రమేణా వినయోగ దారులు అడుగుతుంటే తెలుసుకుని, వాటిని స్వయంగా భారతదేశం నుంచి రప్పించి తెలుగువారు, భారతీయులే కాకుండా, స్థానిక గ్రీకులు, రష్యన్లు, మలేషియన్లు, యూదులను కూడా ఆకట్టుకున్నారు. వ్యాపార దృక్పథంలో మానవతా కోణాన్ని కూడా జోడించి పలువురు తెలుగువారు పలు ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందినట్టు ఆయన వివరించారు.
కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు, తెలుగు సంఘాలు, తెలుగువారికి చెందిన స్వచ్ఛంద సంస్థలు భారతీయ విద్యార్థులకు, భారతీయ కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని 1995లోనే మెల్బోర్న్ వచ్చి స్థిరపడిన రెడ్డిచర్ల రాజుగారు వివరిం చారు. చాలామంది విద్యార్థులు కోవిడ్ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే వారి ఇళ్లకు, రూములకు వెళ్లి బియ్యం, పప్పులు, ఇతర దినుసులు పంపిణీ చేయడం జరిగింది. వ్యాపారాల్లో ఏమాత్రం అనుభవం లేకుండా మొదలుపెట్టి, గత రెండు దశాబ్దాలుగా అటు విని యోగదారుల అవసరాలను గుర్తించి, ఇటు భారతీయ సంఘాలతో మమేకమై, సాంస్కృతిక కార్య క్రమాల్లో కూడా భాగస్థులై, వ్యాపారాలకు గట్టి పునాదులు వేయడమే కాకుండా, భారతీయ సమాజానికి వెన్నెముకగా నిలిచారు. మల్లికేశ్వరరావు కొంచడా రాసిన ఈ తెలుగు పుస్తకం ఎంతో మందికి స్ఫూర్తిని, ఉత్తజాన్ని ఇవ్వడమేకాకుండా, మార్గదర్శకంగా కూడా ఉపయోగపడుతుంద నడంలో సందేహం లేదు.
Sahithi Vanam: తూర్పు తీరంలో తెలుగు రేఖలు
ఆరాటాలు, ఆసక్తులు, ఆరాలు, కుతూహలాలన్నిటికీ సరైన సమాధానం