జగమెరిగిన కవి శ్రీరంగం నారాయణ బాబు. ఆయన పేరు గుర్తుకు వస్తే చాలు తెలుగునాట ప్రతి సాహితీవేత్తకూ, ప్రతి సాహిత్యాభిమానికీ ఆయన రచనలు ‘రుధిరజ్యోతి’, ‘గేదెపెయ్యె’, ‘కిటికీలో దీపం’, ‘మౌన శంఖం’ వంటివి గుర్తుకు వచ్చి మనసు ఎటో వెళ్లిపోతుంది. విజయనగరంలో మే 17, 1906లో జన్మించి 1961 అక్టోబర్ 2న చెన్నైలో కన్నుమూసిన నారాయణ బాబు దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సాహితీ రంగాన్ని ఒక ఊపు ఊపారు. అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్య రచనలకు, భావ కవిత్వాలకు భిన్నంగా ఆయన కొంత మంది సాహితీ మిత్రులతో కలిసి అధి వాస్తవికత (surrealism) అనే విదేశీ ప్రక్రియతో రచనలు చేయడం ప్రారంభించారు. ఒక యథార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినప్పుడు ఆ విషయానికి సంబంధించిన మూల రూపాన్ని వివిధ విపరీత పరిస్థితుల్లో వర్ణించి, మరువలేని చిత్రంగా ప్రదర్శించడాన్నే సర్రియలిజం అంటారు. దీన్ని ‘అధి వాస్తవికత’గానే చాలా మంది పరిగణించారు. అయితే, నారాయణ బాబు మాత్రం దీన్ని ‘అతి వాస్తవికత’గా సంభావించారు. ఈ ప్రక్రియ విదేశాలకు చెందినదే అయినా పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృష భాషల్లోని పదాలను ఈసర్రియలిజంలో ప్రయోగించేవారు. అధి వాస్తవికతను ఆయన పూర్తిగా భారతీయం చేశారు.
ఆయన రాసిన విశాఖపట్నం, ఫిడేలు నాయుడుగారి వేళ్లు, గడ్డిపరక, తెనుగు రాత్రి, కపాల మోక్షం, ఊరవతల, పండగనాడు, సంపెంగి తోట తదితర రచనలు 1940, 1050లలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం తర్వాత కవితా రంగంలో కొన్ని వినూత్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల ప్రభావం ఆంధ్ర సాహిత్యం మీద కూడా ప్రసరించింది. కవితా వస్తువుకు ఇంతకు ముందున్న విలువలు తారుమారు కావడం మొదలైంది. పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం పెరిగిన కారణంగా సమాజంలో కొందరు సంపన్ను లుగా మారుతుండగా, అత్యధికులు పేదలుగా మారిపోవడం ప్రారంభమైంది. సాధారణ మనుషు లను అనునిత్యం వేధిస్తున్న ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యాలు, అకాల మరణాలు వంటి అంశా లను అనేక రూపాల్లో వ్యక్తం చేయడం జరిగేది. కవులు, రచయితలు వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే రచనలు చేయకుండా ఉష్ట్రపక్షుల మాదిరిగా ఊహాగానాలు, ఆధునిక భావాలు, ఆధునిక పోకడలతో రచనలు చేసి జనాన్ని ఆకట్టుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. కష్టనష్టాలలో మునిగి తేలుతున్న సామాన్య జనానికి భావ కవుల శృంగార కల్పనలు, స్త్వ్రర విహారాలు కూడా తలకెక్కడం జరిగేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల బతుకులను కళ్లకు కట్టినట్టు వివరించగల అధి వాస్తవిక రచనలకు ప్రాధాన్యం పెరగడం ప్రారంభమైంది.
కావ్య వస్తువులు, కవితా వస్తువులలో వైవిధ్యం లేకపోవడం, పైగా పునరుక్తి దోషం ఏర్పడడం వల్ల కావ్యాలు, కవితల పట్ల విముఖత ఏర్పడింది. భావ కవితలకు ఈ సమస్యే ఎదురైంది. వాస్తవికత దృష్టితోనే రచనలు చేయాలని, ఇవి మాత్రమే సాధారణ ప్రజలను ఆకట్టుకుంటాయని పాశ్చాత్య దేశాల కవులు, రచయితల్లో అభిప్రాయం ఏర్పడింది. దీని ఫలితంగానే సర్రియలిజం పుట్టుకొ చ్చింది. దీని ప్రభావమే నారాయణ బాబు వంటి కవుల మీద కూడా పడింది. సామాన్యుల సమస్యలతో పాటు సమాజంలోని క్రౌర్యం, కుతంత్రం, మోసం, వ్యగ్రత వంటి అంశాలను కూడా అధి వాస్తవిక వాదం అక్కున చేర్చుకుంది. సమాజంలోని మాలిన్యాన్ని కప్పిపుచ్చినంత మాత్రాన అది మటుమాయం కాదు. దాన్ని కవితల ద్వారా కూడా బహిర్గతం చేయాలి. ప్రతి అంశాన్ని సామాజిక విమర్శనా దృష్టితో తరచి తరచి చూడాల్సి ఉంటుంది. సమాజాన్ని ఎక్కడికక్కడ విమర్శించడం వాస్తవికవాద లక్షణం. ఈ లక్షణాలను నారాయణ బాబు తన కవితల్లో వంద శాతం అనుసరిం చారు. ఎవరూ చెప్పని పద్ధతిలో, ఎవరూ అనుసరించని ప్రక్రియలో తన మనసులోని భావాలను విప్పిచెప్పడం నారాయణబాబుకు చాలా ఇష్టం. పది మాటల్లో చెప్పాల్సిన దానిని ఆయన ఒకే మాటలో చెబుతారు. ఈ శిల్పం ఇతర కవులకు అలవడేది కాదు. అందుకనే నారాయణ బాబు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల గుండెల్లో చిరస్మణీయంగా నిలిచిపోతారు.
Sahithi Vanam: జగమెరిగిన కవి నారాయణ బాబు
'సర్రియలిజం' అంటే తెలుసా?