Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Sahithi vanam: జనరంజక సాహితీవేత్త పింగళి

Sahithi vanam: జనరంజక సాహితీవేత్త పింగళి

కొత్త మాటలను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి

తెలుగునాట పింగళి నాగేంద్రరావు పేరు వినని వారుండరు. సినీ రచయితగా లబ్ధ ప్రతిష్ఠుడైన పింగళి సాహిత్యంలో కూడా చేయి తిరిగిన వ్యక్తి. నాటకాల రచయితగా, సంభాషణల రచయితగా, గేయ రచయితగా ఆయన తెలుగు చలన చిత్రాలకే కాదు, నాటక రంగానికి కూడా చిరపరిచితుడు. హాస్య రసాన్నే కాదు, శృంగార రసాన్ని కూడా అద్భుతంగా పండించగల దిట్ట. తెలుగు చలన చిత్రాలకు ఆయన రాసిన నవనవోన్మేషంగా ఉండేవి. కొత్త మాటలను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. సమకాలీన రచయితలే కాక, ఆ తరువాతి తరం సాహితీవేత్తలు కూడా ఆయన సృష్టించిన పదజాలాన్ని, పద బంధాలను తమ రచనల్లో యథేచ్ఛగా ఉపయోగించు కున్నారు. కథ, సంభాషణలు, గేయాలు, గీతాలకు సంబంధించినంత వరకూ ఆయన తెలుగు సాహితీ రంగంలోనూ, తెలుగు పాఠకుల హృదయాలలోనూ చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు పాతాళభైరవి, మాయాబజార్‌, మిస్సమ్మ వగైరాలు. ఢింబక, డింగరి, గింబళి వంటి తెలుగు పదాల సృష్టికర్త ఆయనే.
బొబ్బిలి సమీపంలోని రాజాంలో 1901 డిసెంబర్‌ 29న గోపాలకృష్ణ, మహాలక్ష్మి దంపతులకు జన్మించిన పింగళి నాగేంద్రరావు చిన్నప్పటి నుంచి కొత్త పదాలను సృష్టించడం పట్ల మక్కువ పెంచుకున్నారు. ఆయన బంధువుల్లో చాలామంది అప్పట్లో మచిలీపట్నానికి వలస వచ్చే యడంతో ఆయన తల్లితండ్రులు కూడా ఆ తర్వాత మచిలీపట్నం వచ్చేయడం జరిగింది. అక్కడి ఆంధ్ర జాతీయ కళాశాలలో ఆయన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పింగళి ఆ సమయంలోనే జన్మభూమి అనే తన మొదటి రచనను వెలు వరించారు. ఈ పుస్తకం రాసినందుకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలయిన తర్వాత కొంత కాలం పాటు టీచర్‌ గా పనిచేశారు. ఆ తర్వాత ఖరగ్పూర్‌ వెళ్లి బెంగాల్‌ నాగపూర్‌ రైల్వే డివిజన్‌ లో రెండేళ్ల పాటు పనిచేశారు. ఆయన అక్కడ కార్మిక సంఘానికి కూడా నాయకత్వం వహించారు. ఖరగ్పూర్‌ లో ఉండగానే ఆయన ద్విజేంద్రలాల్‌ రాసిన మేబార్‌ పతన్‌ అనే నాటక పుస్తకాన్ని తెలుగులోకి మేవాడు రాజ్యపతనం పేరుతో అనువదిం చారు. బెంగాలీ భాషలో ఉన్న పాశాని అనే నాటక పుస్తకాన్ని కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సొంతగా జేబున్నీసా అనే నాటకాన్ని రాశారు. ఈ మూడు నాటకాలనూ ఆ తర్వాత కృష్ణా పత్రికలో ప్రచురించడంతో పాటు, ఆకాశవాణిలో ప్రసారం చేయడం జరిగింది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ లో చేరిన పింగళి, దేశమంతటా పర్యటించారు. చివరికి సబర్మతి ఆశ్రమానికి కూడా వెళ్లారు.
కొంత కాలం పాటు అక్కడే ఉండి ఆ తర్వాత మచిలీపట్నం తిరిగి వచ్చిన పింగళి 1924లో దేవర కొండ వెంకట సుబ్బారావుకు చెందిన ఇండియన్‌ డ్రామా కంపెనీలో రచయితగా, కార్యదర్శిగా చేరారు. ఆస్కార్‌ వైల్డ్‌ రాసిని డుబోయ్‌ ఆఫ్‌ పడువా అనే పుస్తకాన్ని ఆధారం చేసుకుని, 1928లో వింధ్యారాణి అనే నాటకాన్ని రాసి ప్రదర్శించడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర ఆధారంగా ‘నా రాజు’ అనే నాటకాన్ని కూడా రాశారు. మరో ప్రపంచం అనే సాంఘిక నాటకాన్ని, రాణీ సంయుక్త అనే చారిత్రక నాటకాన్ని కూడా ఆయన రాసి, ప్రదర్శించడం జరిగింది. ఆయన పదాల గారడీ అద్భుతంగా ఉండేది. 1971 మే 6న ఆయన దివంగతులయ్యారు. ఆయన రాసిన నాటకాలన్నిటినీ కలిపి ‘పింగళీయం’ పేరుతో సంకలనాలుగా ప్రచురించడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News