తెలుగు సాహితీ ప్రపంచానికి కవికోకిల దువ్వూరు రామిరెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆ మాటకొస్తే తెలుగు ప్రజలకు కూడా ఆయన పేరు, ఆయన సాహితీ సేవ కరతలామల కమే. నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఒక రైతు కుటుంబంలో 1895 నవంబర్ 9న పుట్టి, 1947 సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచిన రామిరెడ్డి ప్రతి క్షణం సాహిత్య సేవే ఉఛ్వాస నిశ్వాసాలుగా జీవితం గడిపారు. ఏ సాహితీవేత్తా చేయని, చేయడానికి సాహసించని ప్రయోగాలెన్నో చేసి, తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. 1929లోనే విజయవాడలోని ఆంధ్ర మహా పరిషత్ ఆయనను ‘కవికోకిల’ బిరుదుతో సత్కరించిందంటే ఆయన సాహితీ సేవ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయనను నెల్లూరు జిల్లా వాసులు ‘సింహపురి సిరి’ అని అభివర్ణించేవారు. ఆయన అనేక ప్రబంధాలు రాశాలు. ఖండకావ్యాలు రాశారు. సంస్కృతం నుంచి, అరబిక్ నుంచి మంచి పద్య కావ్యాలను తీసుకుని అద్భుతంగా తెలుగులో అనువాదాలు చేశారు. అనేక తెలుగు సినిమాలకు కథలు రాయడంతో పాటు, సంభాషణలు కూడా రాయడం జరిగింది. అప్పట్లో ఆయన హైదరాబాద్ పర్యటన శీర్షికతో భాగ్య నగరానికి సంబంధించిన అనేక విశేషాలను, వింతలు, విడ్డూరాలను పాఠకులకు అందించారు.
ఆయన 1918 నుంచే తన సాహితీ సేవను ప్రారంభించారు. ఆ ఏడాది ఆయన ‘వనకుమారి’, ‘కృషీవలుడు’ అనే రెండు అద్భుతమైన పద్య కావ్యాలను సాహితీ ప్రపంచాని అందించారు. ఆ రెండు పద్య కావ్యాలతో ఒక్కసారిగా తెలుగునాట ఆయన పేరు మార్మోగిపోయింది. ఇందులో కృషీవలుడు పద్య కావ్యం రైతు ఎంతటి కష్టజీవో, ప్రజలకు తిండి పెట్టడానికి అతను జీవితంలో ఎన్ని త్యాగాలు చేస్తాడో ఆయన అద్భుతంగా వర్ణించారు. ఇది చదివిన వారికి హృదయం ద్రవించక మానదు. 1919లో కూడా ఆయన రచనా వ్యాసంగం, సాహితీ సేవ కొనసాగాయి. ఆయన 1935లో ఉమర్ ఖయామ్ రుబాయత్ లను తెలుగులోకి ‘పానశాల’ పేరుతో అనువాదం చేశారు. తెలుగు రాష్ట్రంలో ఈ గ్రంథంలో ఉమర్ ఖయామ్ రుబాయిత్‌లకు అఖండ ప్రాచుర్యం ఏర్పడడమే కాకుండా రామిరెడ్డి పేరు ప్రఖ్యాతులు కూడా విశేషంగా వ్యాపించిపోయాయి. అప్పటికీ, ఇప్పటికీ పానశాలకు సాటి రాగల పద్య కావ్యం మరొకటి రాలేదంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఆ తర్వాత ఆయన 1944లో రాసిన ‘ఫలితకేశము’, ‘నలజారమ్మ’, ‘స్వతంత్ర రథము’, ‘అగ్నిప్రవేశము’ తదితర ఖండ కావ్యాలు తెలుగు సాహిత్య రంగాన్ని ఒక ఊపు ఊపాయి.
అకస్మాత్తుగా ఆయన సతీమణి మరణించడం ఆయనను బాగా కుంగదీసింది. ఆ విషాదం నుంచి ఆయన ఒక పట్టాన బయటకు రాలేకపోయారు. ఆమె మీద, ఆమెతో తనకున్న జ్ఞాపకాల మీద ఆయన రాసిన కవితలు, విషాద గీతాలు ఎటువంటి రాతి గుండెనైనా కరిగించేస్తాయి. గీత రచయితగా, సంభాషణల రచయితగా రామిరెడ్డి తెలుగు సినీ ప్రపంచాన్ని కూడా ఉర్రూతలూగించారు. 1939లో విడుదలయిన ‘బాలాజీ’ సినిమాకి కథ, సంభాషణలతో పాటు గీతాలను కూడా ఆయనే సమకూర్చారు. ఇదే చిత్రాన్ని 1960లో ‘శ్రీవెంకటేశ్వర మహత్యం’ పేరుతో పునర్నిర్మించడం జరిగింది. 1939లోనే విడుదలయిన ‘నల దౌత్యం’ అనే చిత్రానికి కూడా రామిరెడ్డే కథ, సంభాషణలు, గీతాలు రాయడం జరిగింది. తెలుగు సాహితీవేత్తలకు మకుటాయమానంగా రాణించిన దువ్వూరి రామిరెడ్డి తన 52వ ఏటనే కన్నుమూయడం తెలుగు సాహితీ రంగాన్ని కలచివేసింది.
Sahithi Vanam: సాహితీ లోకానికి కిక్కిచ్చిన ‘పానశాల’
ఎటువంటి రాతి గుండెనైనా కరిగించే సాహిత్యం దువ్వూరి కలానికున్న బలం