సాహితీ ప్రపంచానికి అవధులుండవు. దాదాపు 24 భారతీయ భాషల్లో ఏటా అత్యుత్తమ సాహిత్య పురస్కారాలు అందజేస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీకి కూడా హద్దులు, పరిమితులు ఉండవు. ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ డోగ్రి, గుజరాతి, కశ్మీరీ, మణిపురి, ఒడియా, పంజాబి, రాజస్థాని, తెలుగు, సంస్కృతం, సింధీ, అస్సామీస్, బోడో, బెంగాలి, మలయాళి, కన్నడ, సంతాలి తదితర భాషల్లో తొమ్మిది కవితా సంకలనాలు, ఆరు నవలలు, అయిదు కథా సంకలనాలు, మూడు వ్యాస సంకలనాలు, ఒక పరిశోధనకు పురస్కారాలు ప్రకటించడం జరిగింది. ప్రతి కొన్ని కిలోమీటర్లకు భాష మారిపోయే విభిన్న భాషలున్న భారతదేశంలో, అందులోనూ అనేక భాషలు అంతరించిపోతున్న పరిస్థితుల్లో తమ తమ సాహిత్యాల్లో అసమాన ప్రతిభా పాటవాలు కనబరచిన వారికి పురస్కారాలతో గుర్తింపునివ్వడం నిజంగా గొప్ప విశేషమే. దీనికి సంబంధించిన శుభ ఫలితాలను మాటలతో చెప్పలేం. పైరవీలు, ప్రజా సంబంధాలు, రాజకీయ సంబంధాలు అందరికీ సాధ్యం కావు. అందులోనూ సాహితీవేత్తలకు ఇది అందని మావి పండే. ఇటువంటి పరిస్థితుల్లో సాహిత్య అకాడమీ ద్వారా గుర్తింపు లభించి, ప్రాచుర్యంలోకి రావడం సాహితీవేత్తలకు గొప్ప వరమనే చెప్పవచ్చు. ఇది సాహితీవేత్తలకు విశేషమైన ప్రోత్సాహం. సాహిత్య అకాడమీ నుంచి పురస్కారం లభిస్తే, వారు మరిన్ని గ్రంథాలు రాయడానికి అవకాశం ఏర్పడుతుంది. వారి సాహిత్యాన్ని పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ పాఠ్య గ్రంథాలుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశవ్యాప్త గుర్తింపు ద్వారా ఎటువంటి మట్టిలోని మాణిక్యమైనా వెలుగులోకి వస్తుంది.
అంతేకాదు, వారి సాహిత్య ప్రక్రియ ఇంగ్లీషుతో సహా ఇతర భాషల్లోకి అనువాదం కావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ ఏడాది తన ఇంగ్లీషు నవల ‘రెక్వీమ్ ఇన్ రాగ జానకి’కి కేంద్ర సాహిత్య అకాడమీ అత్యున్నత పురస్కారం పొందిన నీలమ్ శరణ్ గౌర్ తన గ్రంథం త్వరలో ఇతర భారతీయ భాషలన్నిటిలోకి అనువాదం కావడం ఇందుకు ఉదాహరణ. అయితే, కేంద్ర సాహిత్య అకాడమీ 1955 నుంచి పురస్కారాలు అందజేస్తున్నప్పటికీ ఆ పురస్కారాలు బుకర్ ప్రైజ్ లేదా పులిట్జర్ అవార్డు స్థాయికి ఎదగలేకపోతున్నాయి. 1954లో దీన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ పేరుతో ఏర్పాటు చేశారు. ‘‘సాహితీ గోష్ఠులు, ప్రసంగాలు, ప్రచురణలు, ప్రోత్సాహం వంటివి ఒక కేంద్రీకృత సంస్థ’’గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంగ్లీషుతో సహా 24 భారతీయ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైయిన ఏకైక సంస్థ ఇది. ఆ లక్ష్య సాధన దిశగా ఆ అకాడమీ పని చేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గోష్టులు, ప్రసంగాలు, ఉపన్యాసాలు, చర్చలు, అధ్యయన తరగతులు, శిక్షణ తరగతులు వగైరాలను నిర్వహిస్తోంది. అయితే, వీటిని గురించిన ప్రచారం ఎక్కడా కనిపించదు. వీటిని ప్రోత్సహించడానికి సంబంధించిన కార్యక్రమం కూడా ఎక్కడా చోటు చేసుకోదు. ఏయ కార్యక్రమం ఎక్కడ, ఏ విధంగా, ఎప్పుడు జరుగుతోందనే విషయం ఎవరికీ అంతుబట్టదు. చాలా తక్కువ మందికి దీని కార్యక్రమాలను గురించిన సమాచారం అందుతుంది.
సాహిత్య పురస్కారమన్నది అత్యున్నత పురస్కారమే కానీ, దీని నుంచి బాల సాహిత్య పురస్కారం, భాషా సమ్మాన్ (అనువాదం) పురస్కారాలను కూడా ప్రకటించడం జరుగుతోంది. ఈ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ప్రాయోజితం చేయడానికి, వాటికి ప్రాచుర్యం కల్పించడానికి జరుగుతున్నది చాలా స్వల్పమేనని చెప్పాలి. ఈ అకాడమీకి చెందిన వెబ్ సైట్ ను అప్ డేట్ చేయడం జరగడం లేదు. పైగా దీని నిండా వ్యాకరణ దోషాలు కనిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో దీని ఆచూకీ గానీ, ఉనికి గానీ ఎక్కడా కనిపించదు. వాస్తవానికి ఇది వేలాది పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటుంది. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి కానీ, మార్కెట్లో ఎక్కడా కనిపించే అవకాశం ఉండదు. కొత్త తరం ప్రజలు ఫోన్లకు, టీవీ తెరలకు అతుక్కుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకున్న విస్తృతమైన నెట్ వర్కుతో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రజల్లోకి ఎంతగానో చొచ్చుకుపోయి ఉండవచ్చు. తన సుసంపన్న సాహితీ వారసత్వాన్ని ప్రజలకు సన్నిహితం చేయవచ్చు. కానీ, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుతెన్నులు ఎవరికీ అంతుబట్టడం లేదు.