చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు పెద్దలు. అధికారం అండగా ఉంది కదాని అధికారంలో, పదవుల్లో ఉన్నవాళ్లు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. ఆ తర్వాత తమకు కావల్సినవాళ్లు అధికారం కోల్పోయిన తర్వాత అంతకు అంత అనుభవించక తప్పదు. ఆ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు దీన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వరుసగా వివిధ శాఖలకు చెందిన అధికారులకు ఎదురవుతున్న పరిస్థితి చూస్తుంటే.. ఇంకా ఇంకెన్ని జరుగుతాయో అనిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రులు, మంత్రులు చెప్పారు కదాని వాళ్లు అన్నదానికల్లా తలాడిస్తే ఏం జరుగుతుందో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి చూస్తున్నాం. అప్పట్లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి లాంటి వాళ్లు రాజశేఖరరెడ్డి చెప్పినట్లల్లా చేసి, ఆయన అన్నదానికి తలాడించి చివరకు జైలుపాలయ్యారు. అంతేకాదు.. ఆ తర్వాత కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన వాళ్లు కింది స్థాయిలోనే ఆగిపోయారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో గురువారం అరెస్టు చేసి విజయవాడ తీసుకెళ్లారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇసుక నుంచి మొదలుపెట్టి అన్నిరకాల గనులు, భూగర్భవనరుల దోపిడీకి సహకరించారన్నది వెంకటరెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థ కేవలం నగదు మాత్రమే తీసుకుంటూ ఇసుక విషయంలో అడ్డదిడ్డంగా దోపిడీ చేస్తూ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము కూడా సక్రమంగా చెల్లించకపోయినా సంబంధిత శాఖకు అధిపతిగా ఉన్న వెంకటరెడ్డి పల్లెత్తు మాట అనలేదు సరికదా.. ఆ సంస్థ అక్రమాలకు కొమ్ముకాశారు. 1059 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పుడు కేవలం 259 కోట్ల రూపాయలే చెల్లించి, మిగిలిన 800 కోట్లకు తాము ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేశామని, దానికి దీనికి సరిపోయిందని జేపీ పవర్ వెంచర్స్ చెప్పుకొచ్చినప్పుడు కూడా.. దాన్ని ఏమాత్రం పరిశీలించకుండా మొత్తం 1059 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టేసినట్లు ఆయన రాసేసుకున్నారు. ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. కేవలం ఈ 800 కోట్లతో మాత్రమే సరిపెట్టకుండా.. దాదాపు రూ.2,566 కోట్ల మేర ఇసుక రూపంలో దోపిడీకి వెంకటరెడ్డి సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. నిజానికి కేవలం ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. 2020లో ఆయనను గనులశాఖ డైరెక్టర్‌గా నియమించారు. తర్వాత కొన్ని రోజులకు ఏపీఎండీసీ ఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు పదవులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీకి కావల్సిన అండదండలన్నీ అందించారన్నది వెంకటరెడ్డి మీద ఉన్న ప్రధాన ఆరోపణ. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మూడో కంటికి కూడా దొరక్కుండా తప్పించుకుని పారిపోయిన వెంకటరెడ్డి .. ఎట్టకేలకు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు తెలియడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వచ్చి ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
అలాగే.. ముంబయి నగరానికి చెందిన కాదంబరీ జత్వానీ అనే బాలీవుడ్ నటిని బ్లాక్ మెయిల్ చేసి, ఆమె మీద తప్పుడు కేసులు పెట్టడంతో పాటు లైంగికంగా కూడా వేధించిన కుక్కల విద్యాసాగర్ అనే వైఎస్ఆర్‌సీపీ నాయకుడికి వత్తాసు పలుకుతూ, కాదంబరి మీద లేనిపోని కేసులు పెట్టి ఆమెను ముంబయి నుంచి విజయవాడ తీసుకొచ్చి జైల్లో పెట్టించిన వ్యవహారం కూడా పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో గతంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరుపొందిన పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ తదితరుల పేర్లు ఇప్పటికి బయటకు వచ్చాయి. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను సెప్టెంబర్ 23న డెహ్రడూన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. తన భూమిని చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, భరత్ కుమార్ అనే ఇద్దరికి విక్రయించేందుకు 5 లక్షలు కాదంబరీ జత్వానీ అడ్వాన్స్ తీసుకున్నారని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారు. జత్వానీని తాము చూడలేదని నాగేశ్వరరాజు, భరత్ కుమార్ చెప్పారు. ఓ పారిశ్రామికవేత్త తనపై అత్యాచారం చేశారని జత్వానీ బాంద్రా కుర్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 2023 డిసెంబర్ 17న ఆ పారిశ్రామికవేత్తపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించాలి. కానీ, ఆ సమయంలో ఆమె విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. దీంతో ముంబై పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. అయితే దీనంతటికీ అసలు కారణం ఒక్క వైఎస్ఆర్‌సీపీ నాయకుడిని కాపాడాలన్న ఏకైక ఉద్దేశం మాత్రమే అన్నది స్ఫష్టంగా రుజువైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు బలయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు కొమ్ముకాశారని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు. తిరుపతి లోక్‌సభకు జరిగిన ఆ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు వేరే ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి, తమ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించారన్నది సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు రుజువు చేశారు. వీడియోలు చూపించినా కూడా గుర్తుతెలియని వ్యక్తులు అంటూ కేసు మూసేసిన నేపథ్యంలో ఒకరు, నేరుగా బస్సుల్లో వచ్చి ఓట్లు వేస్తున్నారని చెప్పి తీసుకొచ్చి చూపించినా.. అబ్బే అలాంటిది ఏమీ లేదంటూ అసలు కేసే పెట్టని మరొకరు.. ఇలా మొత్తం నలుగురిని ఇప్పటికి సస్పెండ్ చేశారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే టౌన్ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ అనే అధికారిని అరెస్టు చేశారు. ఆయన వద్ద లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. తెరాస/భారాస అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న నాయకులు చెప్పింది చెప్పినట్లు విని.. వాళ్లకు అవసరమైన వారికి ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేయడం, ఇతరత్రా అవసరమైన అన్ని పనులూ చేసిపెట్టడం వల్ల అంత అక్రమార్జన చేయగలిగారు. దీనంతటికీ కూడా కారణం అధికారంలో ఉన్న నాయకులు మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి నేను సాగించిన ఈ పాతికేళ్ల అక్షరయాత్రలో ఇంత స్థాయి అక్రమాలు చేసిన అధికారి దాదాపు ఎవరూ లేరు. టౌన్ ప్లానింగ్ విభాగం అన్నది బంగారు గుడ్లు పెట్టే బాతే అయినా.. ఈ విభాగంలో ఇప్పటివరకు సాగించిన అక్రమాలు ఒక ఎత్తు అయితే బాలకృష్ణ లాంటి అధికారులు సాగించినవి మరో ఎత్తు.
మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో రోజుకు ఒక కొత్త పేరు వినిపిస్తోంది. ‘‘నీటి పారుదల శాఖలో 50 శాతానికిపైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజినీర్లే ఉన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే.. వారినే కొనసాగిస్తున్నారని మేం ఆరోపణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏరకంగా విశ్లేషించాలో తెలియడం లేదు. ప్రతిరోజూ వీళ్లంతా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి.. ప్రాజెక్టు అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆయన అడిగిన ప్రశ్నలకు మాత్రం వీళ్ల దగ్గర సమాధానాలు లేవు. ఎవర్ని ఎవరు రక్షించాలో వాళ్లకు అర్థం కావడం లేదు’’ అంటూ నీటి పారుదల శాఖలోని పలువురు ఇంజినీర్లకు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి ఇప్పటికి వందేళ్లు దాటాయని, హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తూ నగరాన్ని రక్షిస్తున్నాయంటే వాటి నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యే కారణమని చెప్పారు. ‘‘లక్ష కోట్లతో కట్టిన తర్వాత కూలిన కాళేశ్వరం ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా!? వందేళ్లైనా చెక్కుచెదరని ప్రాజెక్టులు కట్టిన విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుంటారో తొలిరోజు ఉద్యోగంలో చే రుతున్న ఇంజనీర్లే ఆలోచించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల పేరుతో అక్రమాలకు పాల్పడి, అందులోని కొన్ని భాగాలు కుంగిపోయేంతవరకు కారకులైనందుకు ఇంజినీర్లపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పినదానికల్లా తలాడించి, ఆయన ఇచ్చిన డిజైన్లనే ఏమాత్రం ముందూ వెనకా చూడకుండా ఖరారు చేసేసిన చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్ల నుంచి ఈఎన్‌సీల వరకు అందరి మెడపైనా కత్తి వేలాడుతోందంటూ సీఎం అన్నారు.
వీటన్నింటికంటే పెద్దది.. తెలంగాణలో వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ కేసు. అప్పటి కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీలలోని పలువురు ముఖ్య నేతలే టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను.. అలాగే బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ ఫోన్ తో పాటు, ఆయన గన్ మెన్, పీఆర్ఓ, సెక్యూరిటీల ఫోన్లు ట్యాపింగ్ గురైనట్టు విచారణలో తేలింది. 4 నెలల్లో ఏకంగా 4500 ఫోన్లను ట్యాప్ చేశారు. ఎన్నికలకు 15 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన 190 మంది ఫోన్లను ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ట్యాప్ చేయించారని వెల్లడైంది. ట్యాప్ చేసిన 340 జీబీకి చెందిన భారీ సమాచారాన్ని ధ్వంసం చేసేశారు. హార్డ్ డిస్కులను కూడా పూర్తిగా సమాచారం మొత్తం తొలగించి, ధ్వంసం చేసి మూసీ నదిలో పారేశారని సర్కారు వెల్లడించింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడ్డారని అంటున్నారు. ఇక ఇదే కేసులో.. ఎస్‌ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొన్నట్టు తేలింది. ఈ డివైజ్ తీసుకోవాలంటే కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ అదేమీ లేకుండానే రవిపాల్ ఆ డివైజ్‌ను తీసుకొచ్చి, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసుకున్నట్టు దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు. ఇలాంటి అక్రమాలన్నింటికీ పాల్పడిన వారిలో కొందరు అధికారులు అమెరికాలో దాక్కుని దోబూచులు ఆడుతున్నారు. వాళ్లమీద ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఒకవేళ ఏదైనా విమానాశ్రయంలో వాళ్లు కనిపిస్తే చాలు.. వెంటనే అరెస్టుచేసి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
ఇలా అధికారులు చేస్తున్న అక్రమాలన్నింటికీ నిజానికి కర్త, కర్మ, క్రియ రాజకీయ నాయకులే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పటి నిఘా విభాగం అధిపతిగా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగం లేకుండా.. చిట్టచివర పదవీ విరమణ చేసే రోజున ఒక్కరోజు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగారు. ఆయన మీద వచ్చిన తీవ్రమైన ఆరోపణలే అందుకు కారణం. వాళ్లు, వీళ్లు అన్న తేడా లేకుండా రాజకీయ నాయకులు దాదాపు అందరూ తమకు కావల్సిన కొంతమంది అధికారులను ఎంపిక చేసుకుని, తమ మాట వినేలా వాళ్లను తయారు చేసుకుంటారు. ఎన్నటికీ వీళ్లే అధికారంలో ఉంటారన్న అపోహతో అధికారులు కూడా వాళ్లు చెప్పిన మాటలకు తలాడిస్తారు. దీనివల్లే ఇలాంటి ఘోరాలు జరిగిపోతున్నాయి.
నిజానికి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి హోదాలు అత్యున్నతమైనవి. ఎంతో కష్టపడి చదివి, మానసికంగా కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం అయితే తప్ప వాటిలో ర్యాంకు సాధించడం సులభం కాదు. అలాగే వివిధ శాఖల్లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్లాలన్నా అందుకు అహోరాత్రాలు శ్రమించాలి. అంత కష్టపడి, ఉన్నత స్థాయి సాధించిన తర్వాత ఇంకేం బావుకుందామని ఇంకా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ, అధికార పదవుల్లో ఉన్న పెద్దలు చెప్పినదానికల్లా తలాడించాలి? ఇలా చేయడం వల్ల వాళ్లకు ఒరిగేది ఏముంటుంది? ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన చివరి రోజు వరకు నీతి, నిజాయితీలతో ఉంటే వచ్చే సంతృప్తి ముందు కేవలం ఒకటి రెండు ప్రమోషన్లు, లేదా కొద్దిపాటి అక్రమ సంపాదన నిలబడతాయా? ఈ విషయాన్ని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు పదే పదే ఎందుకు విస్మరిస్తున్నారు? పనిచేసిన కాలంలో ఒక్క మచ్చ కూడా పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంచి పేరు సంపాదించుకోవటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అంతేతప్ప.. నామమాత్రంగా వచ్చే కొద్దిపాటి తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోయి తప్పుదోవ పడితే.. జీవితాంతం ఆ మచ్చను మోయాల్సిందే. అంతేకాదు, తర్వాతి తరాలకు సైతం ఆ పేరు అలాగే ఉండిపోతుంది.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ