Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Tribal university: ఎట్టకేలకు సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ

Tribal university: ఎట్టకేలకు సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ

ఒక శాతం కూడా గిరిజనులు యూనివర్సిటీ చదువులు చదవట్లేదు

కారడవుల్లో కకావికలమైన బతుకులతో కాలం వెళ్లదీస్తున్న ఆదివాసుల్లో.. చదువుల వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్య కోసం 889.07 కోట్ల రూపాయలతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ప్రారంభించనుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన ‘సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం’ గా పేరు పెట్టడం హర్షణీయం. వచ్చే ఏడాది నుండి తాత్కాలికంగా తరగతులు ప్రారంభించడానికి రెండు కోర్సులతో కూడిన పోస్టర్ను తల్లుల దీవెనలతో మహిళా దినోత్సవం రోజున ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 2017 లోనే యూనివర్సిటీకి ఆమోదం తెలిపింది. గిరిజనులు భాష, సంస్కృతి, ఆచారాలు, కళలలో ప్రత్యేక శైలి కలవారు. అటవీ ఆధారిత ఉత్పత్తులు, ఔషధాలను ఉపయోగించుకొనే ప్రావీణ్యం వారి సొంతం. కాబట్టి వారికి నాణ్యమైన విద్యను అందించి, వారి సేవలను సామాజిక పునర్నిర్మాణానికి అందించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం 2008లో మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో తొలి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నెలకొల్పింది.
మన రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కానీ, గిరిజనుల అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యతతో పోల్చితే సుమారు 17 శాతం తక్కువ. రాష్ట్రంలో వీరి జనాభా 10 శాతంగా ఉంది. కళలు, భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలలో గిరిజనుల శైలి విభిన్నం. అలాగే నైపుణ్యాలు, సామర్థ్యాల విషయాల్లో అత్యంత ప్రతిభావంతులు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఉన్నత విద్యను అభ్యసించే సగటు జనాభాతో పోల్చి చూసినప్పుడు గిరిజనుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో గిరిజన యూనివర్సీటీని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి ప్రాంతంలో(2019) ఏర్పాటు చేశారు. 2019 తెలంగాణలోని జాకారంలో తాత్కాలిక తరగతులు ప్రారంభించడానికి హెచ్ సి యూ కి భాధ్యత అప్పగించినప్పటికీ ఆరంభం కాలేదు. అలాగే ఈ యూనివర్సీటీలో 30 శాతం సీట్లు రాష్ట్ర కోటాగా కేటాయించాలని గత రాష్ట్రప్రభుత్వం నిర్ణయించగా ఇప్పుడున్న ప్రభుత్వం 35శాతానికి పెంచింది. కానీ తెలంగాణ గిరిజన అభ్యర్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా 50శాతం సీట్లు తెలంగాణ గిరిజనులకే కేటాయించాలి. అలాగే ఉద్యోగాలు కనీసం 50శాతం వారికే కల్పించాలి.
నేడు ఆదివాసీలు విద్య, ఉపాధి రంగాల్లో చాలా వెనకబడిపోయారు. ఉన్నత చదువులు చదవలేక, నాగరిక సమాజంలో ఇతరులతో పోటీ పడలేకపోతున్నారు. పశుపోషణ, అటవీ ఉత్పత్తుల సేకరణ, వ్యవసాయం చేసుకుంటూ ఏజెన్సీకి పరిమితం అయ్యారు. ఐదవ షెడ్యూల్ కు చెందిన ఆదివాసీ భూభాగంలోని తెలంగాణ ఆదివాసీలకు సరైన ఉన్నత విద్యావకాశాలు అందక చాలా మంది నేడు నిరాశ్రయులుగా మిగులుతున్నారు. విద్య, ఉపాధి అవకాశాలు ఆదివాసీల దరికి చేరక పట్టణ ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్నత విద్యను అందించే ఆదివాసీ యునివర్శిటి వల్ల ఆదివాసీ సమాజం విద్య, ఉపాధి రంగాల్లో ముందడుగు వేస్తుంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, అస్థిత్వం మనుగడ అంతమవుతున్న నేపద్యంలో ఈ యునివర్శిటీ ద్వారా ఆదివాసీ సమాజాన్ని మేల్కొల్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నేడు ఆదివాసీల స్ధితి గతులను సంపూర్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ యునివర్శిటి వల్ల భవిష్యత్ తరాలను ఉన్నత విద్యావంతులుగా చూపించాలంటే ఈ యునివర్శిటి అనివార్యము. 75 ఏళ్ల ఆదివాసీల వెనుకబాటుకు పరిష్కారం చూపాలి. వివిధ పార్టీల ప్రముఖులు ఎన్నికల సమయంలో ఏజెన్సీలోని ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడుతున్నారే గానీ అది ఆచరణకు అందనంత దూరం ఉంది.
నేడు ఆదివాసీలు విద్యారంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వంటి వృత్తి విద్య, ఉన్నత చదువులు పొందాలంటే వారికి ప్రైవేట్ కళాశాలలే దిక్కు. వేలు లక్షలు పెట్టి చదవాలంటే ఆర్ధిక స్తోమత ఆదివాసీలకు లేదు. మైదాన ప్రజలతో చాలా మంది ఆదివాసీలు పోటిపడలేక చదువును మధ్యలోనే మానేస్తున్నారు. ఆదివాసీ గ్రామాలలో సరైన పాఠశాలలు, కళాశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నంటికి పరిష్కార మార్గంగా ఏజెన్సీలలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ ప్రత్యేక యూనివర్సిటీ దోహద పడుతుంది. మానవ వనరుల ఉత్పత్తి ప్రక్రియలో, అభివృద్ధి ప్రక్రియలో ఆదివాసీలు భాగస్వామ్యం అవుతారు.
ప్రపంచ వ్యాపితంగా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభం సవాళ్లు ఒకేవిధంగా ఉంటున్నాయి. ఆదివాసీ తెగల రాజ్యంగ రక్షణలు, భాష, వేషధారణ, గిరిజన కళలను సంరక్షించడానికి ఈ విశ్వవిద్యాలయం ఉపకరిస్తుంది. ఆదివాసీ జీవన ప్రమాణాలు, వారి నైపుణ్యం, అభివృద్ధి, అవకాశాలు అంతరించి ఈ సమాజపు సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించాలి. ఆదివాసీ సమాజంపై జరుగుతున్న దోపిడి పీడన సమాజ పరిణామక్రమం వంటివి ఆదివాసీ యూనివర్సిటీ ద్వారా చర్చకు వస్తాయి. నేడు ఆదివాసీ విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు వచ్చే సరికి ఒక శాతానికి తగ్గిపోతున్నారు. యూనివర్సిటీలో రాజ్యమేలుతున్న ప్యూడల్ రాజకీయ అధిపత్య దోరణులకు ఆదివాసీ విద్యార్థులు తట్టుకొలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైరవీలు, రాజకీయ నాయకులు అండదండలు ఉన్నవారికే ఇతర యూనివర్సిటీలలో సీట్లు ఇస్తున్నారు. ఆదివాసీ విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక, సరైన సామర్ధ్యం ఉండీ కూడా యూనివర్సిటీ స్థాయిలో ఆదివాసీ విద్యార్థులు రాణించలేక పోతున్నారు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీలో తెలంగాణ సీట్ల వాటాను, ఉద్యోగ శాతాన్ని పెంచాలి.

* గుమ్మడి లక్ష్మీ నారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక,
సెల్ : 9491318409

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News