Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Nada Maharishi Balamurali: సంగీత సరస్వతి బాలమురళీ

Nada Maharishi Balamurali: సంగీత సరస్వతి బాలమురళీ

ఈరోజు బాలమురళీకృష్ణ వర్ధంతి

ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. శిశుర్వేత్తి… పశుర్వేత్తి… వేత్తిగాన రసఃఫణిః అని సంగీత ప్రాధాన్యత గురించి చెప్పారు. అవధు లెరుగనిది, ఎల్లలు ఒల్లనిది, భాషాభేదాలు లేనిది. ప్రాంతీయతలు తెలియనిది సంగీతం ఒక్కటే. కర్నాటక సంగీతం అనగానే వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాల మురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహాను భావుడు బాలమురళి. కీర్తనలు, ఎంకి పాటలు, తత్వాలు, లలిత గీతాలు, భక్తి గీతాలు… ఆయన పాడింది పాట, ఆలపించింది రాగం అన్నట్లుగా ఉంటుంది. వేలాది కాసెట్లు, రికార్డ్లు విడుదల చేశారు. బాలమురళీ కేవలం గాయకుడే కాదు, వాగ్గేయకారుడు కూడా. 72 మేళ కర్తల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ఆయన.
లవంగి, త్రిశక్తి, మహతి లాంటి పెక్కు రాగాలు సృష్టించిన సంగీత సరస్వతి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాల మురళీకృష్ణ.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ (జూలై 6, 1930 – నవంబర్ 22, 2016) కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయ కారుడు, సినీ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేశారు. వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

- Advertisement -

మంగళంపల్లి బాలమురళీకృష్ణ
1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా శంకర గుప్తంలో పట్టాభి రామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. కొచ్చర్లకోట రామరాజు ఆయన మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేసి, మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి వద్ద చేరాడు. తదనంతరం ఆయన శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ సంగీత కారుడు, వేణువు, వయోలిన్, వీణ విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకర గుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. 1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయన గురువు సుసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా కచేరి చేశారు. ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ ఆయన పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచారు. తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగారు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీత ప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి.

బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించారు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, బాణీ సమకూర్పులో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషితో కలిసి, తర్వాత పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేశారు. ఈ కచేరీలు దేశంలో ప్రజాదరణ తీసుకు రావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహద పడ్డాయి.

1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమా ద్వారా ఆయన గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమైనారు. తర్వాత ఆయన గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయన చేత పాడించారు. 1967లో రోజా రమణి ప్రహ్లాదుడిగా, ఎస్. వి. రంగారావు హిరణ్య కశిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడిగా నటించారు. అదే సినిమాలో అతను ఆది అనాదియు నీవే దేవా, నారద సన్నుత నారాయణా, వరమొసగే వనమాలి పాటలు కూడా పాడారు. అలాగే నర్తనశాల చిత్రంలో అతను పాడిన సలలిత రాగ సుధారస సారం, శ్రీరామాంజ నేయ యుద్ధంలో మేలుకో శ్రీరామా, ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీరామ జయరామ, గుప్పెడు మనసు చిత్రంలో మౌనమె నీ బాస ఓ మూగ మనసా, మేఘ సందేశం చిత్రంలో పాడనా వాణి కల్యాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.

హంసగీతెలో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు. 1976లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా మంగళంపల్లి జాతీయ అవార్డు అందుకున్నారు. కన్నడ సినిమా మధ్వాచార్యకు అందించిన సంగీతానికి గాను 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా, 1987లో ఉత్తమ సంగీత దర్శకుడిగాను జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 2001లో తెలుగు విశ్వ విద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు. కర్నాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్ని 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సినీ సంగీత దర్శకునిగా, సినీ గాయకునిగా జాతీయ అవార్డులు, సంగీత కళానిధి, గాన కౌస్తుభగాన, కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాథ జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాథ మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర తదితర లెక్కలేనన్ని బిరుదులు వరించాయి. ఆయన తన గాత్రంతోనే కాకుండా వయోలిన్, మృదంగం తోనూ ఖ్యాతి గడించారు. ఆయన అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేశియా, సింగపూర్, అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశారు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడారు. అనకాపల్లిలో చివరిసారిగా కచేరీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 25వేలకు పైగా కచేరీలు ఇచ్చిన గొప్ప గాయకుడు మంగళపల్లి బాలమురళీ కృష్ణ.

నవంబర్ 22… బాలమురళీ కృష్ణ వర్ధంతి
………………………………..
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News