Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Sankarambadi Sundarachari: 'ప్రసన్నకవి' శంకరంబాడి

Sankarambadi Sundarachari: ‘ప్రసన్నకవి’ శంకరంబాడి

ఆయన ఎంతో ప్రసన్నంగా కనిపించేవారు కాబట్టి 'ప్రసన్న కవి' అని బిరుదు

శంకరంబాడి సుందరాచారి అనే పేరు వినగానే ‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ’ అనే తెలుగు గీతం గుర్తుకు వస్తుంది. ఆ గీతాన్నిరచించిన కవి ఆయనే. ఆయన రాసింది ఆ గీతాన్ని మాత్రమే కాదు, అనేక కావ్యాలను రాశారు. ‘ప్రసన్న కవి’, ‘భావకవి’ అనే బిరుదులు ఆయనకు ఉన్నాయి. ఆయనను ‘అహంభావ కవి’ అని కూడా పిలిచేవాళ్లు. 1914 ఆగస్టు 10న తిరుపతిలో పుట్టి పెరిగిన శంకరంబాడి సుందరాచారి 1977ఏప్రిల్‌ 8న తిరుపతిలోనే కాలధర్మం చెందారు. ఆయన మాతృభాష తమిళం. మదనపల్లెలోని బిసెంట్‌ థియొసాఫికల్‌ సొసైటీ కాలేజీలో ఇంటర్మీడియట్‌ వరకు చదివిన సుందరాచారి చిన్నప్పుడే తండ్రి మీద అలిగి ఇంటి నుంచివెళ్లిపోయారు. హోటల్‌ సర్వర్‌ గా, రైల్వే కూలీగా కూడా పనిచేసిన సు ందరాచారి ఆ తర్వాత ఆంధ్రపత్రిక దినపత్రికలో ఉప సంపాదకుడుగా చేరి జీవనం కొనసాగించారు. అక్కడి నుంచి బయటికి వచ్చేసి, విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేశారు.
ఆయనకు మొదటి నుంచీ పద్య రచన మీద ప్రీతి. అందులోనూ తేటగీతి ఛందస్సులో పద్యాలు రాయడమంటే మహాప్రీతి. ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని ఆయన తేటగీతిలోనే రాశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వేదమ్మాళ్‌ కొద్ది కాలానికే మానసిక వ్యాధికి గురి కావడంతో ఆయన ఎంతో వేదనకు లోనయి, మద్యపానానికి అలవాటు పడ్డారు. జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితానికి అలవాటుపడ్డారు. 2004లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో ఉన్న అన్నపూర్ణ సర్కిల్‌ లో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.
శంకరంబాడి సుందరాచారి చాలా గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. తేటగీతి ఛందస్సులో ఆయన వందలాది పద్యాలు రాశారు. ‘నా పేరు కూడా తేటగీతిలో ఇమిడింది. అందుకని తేటగీతి అంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అనేవారు. తేటగీతి ఛందస్సులో రాసిన ‘మా తెలుగు తల్లికి’ గీతంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం గురించి నాలుగు పద్యాల్లో ఎంతో రమ్యంగా వర్ణించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు ఆయన ఎంతో ఆవేదన చెంది ‘బలిదానం’ అనే కావ్యం రాశారు. విచిత్రమేమిటంటే, స్కూలు పిల్లలకు ఆయనే ఈ పద్యాలను చదివి వినిపించడం కూడా జరిగింది. ‘సుందర రామాయణం’ పేరుతో ఆయన అద్భుతంగా రామాయణాన్ని కూడా రాశారు. అదే విధంగా ఆయన ‘సుందర భారతం’ కూడా రాశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరును మకుటంగా తీసుకుని ఆయన రాసిన ‘శ్రీనివాస శతకం’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇవే కాక ‘జపమాల’, ‘బుద్ధగీతి’ పేర్లతో ఆయన బుద్ధ చరిత్రాన్ని కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత ఆయన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ‘గీతాంజలి’ని తెలుగులోకి అనువదించారు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా ఈ స్వతంత్ర అనువాదం ఎన్నో ప్రశంసలు పొందింది.
ఇవి కాకుండా, ‘ఏకలవ్యుడు’ అనే ఖండకావ్యాన్ని ‘కెరటాలు’ అనే గ్రంథాన్నికూడా ఆయన రాశారు. ‘సుందర సుధా బిందువులు’ అనే పేరుతో భావగీతాలు కూడా రాశారు. జానపద గీతాలు రాయడం జరిగింది. అనేక స్థలపురాణాలను రాశారు. ఇవి కాక, నాస్వామి, పేద కవి, అపవాదు, నేటి కవిత్వము, కార్వేటి నగరరాజ నీరాజనము అనే గ్రంథాలను కూడా రాయడం జరిగింది. ఆయన కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశారు. మహాత్మా గాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు రాశారు. దీనబంధు అనే సినిమాలో నటించడం కూడా జరిగింది. 1942లో దీనబంధు సినిమా కోసమే ఆయన ‘మా తెలుగు తల్లికి’ అనే పాట రాశారు. అయితే, ఈ పాట యుగళ గీతానికి పనికి రాదని చెప్పి సినిమా నిర్మాత తిరస్కరించడంతో దీన్ని ఆ సినిమాలో చేర్చలేదు. గ్రామ్‌ ఫోన్‌ రికార్డు కోసం టంగుటూరి సూర్యకుమారి ఈ పాటను పాడిన తర్వాత ఈ పాటకు గుర్తింపు వచ్చింది. ఆయన ఒకసారి ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూను కలిశారు. తాను రచించిన బుద్ధ చరిత్రలోని ఒక పద్యాన్ని ఆయన అప్పటికప్పుడు ఇంగ్లీషు పద్యంగా అనువదించి నెహ్రూకు వినిపించినప్పుడు నెహ్రూ ముగ్ధుడైపోయి ఆయనకు వెంటనే 500 రూపాయలు బహూకరించారు. శంకరంబాడి సుందరాచారి ఎంతో ప్రసన్నంగా కనిపించేవారు. ఆ కారణంగానే ఆయనకు ప్రసన్న కవి అనే బిరుదు లభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News