Sant Sevalal Maharaj Jayanti: శివాజి మహారాజ్‌కు శ్రీశైలం భ్రహ్మారాంభ అమ్మవారు ఖడ్గం బహుకరించినట్టు, శ్రీ సేవాలాల్ మహారాజ్ గారికి జగదాంబ (దండి యాడి) అమ్మవారు 34 సంవత్సరాల జీవితాన్ని బహుకరించారు.
శ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారా ప్రజలకు దేవుడి తో సమానం. ఆయన బంజారా సమాజానికి సేవ చేసి మహోన్నతమైన స్థానాన్ని అందుకున్నారు. బంజారా ప్రజల సంక్షేమానికై తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు శ్రీ సేవాలాల్ మహారాజ్ . అంతటి గొప్ప మహాయోధుడి జన్మదిన శుభాకాంక్షలతో బంజారా ప్రజలందరికి రామ్ రామ్, జై సేవాలాల్.
సేవాలాల్ గుత్తి మండలం లోని రాంజీ నాయక్ తాండ లో రామవత్ భీమా నాయక్, ధర్మిణి మాత దంపతులకు జన్మించారు.
ఏక్ ఝమ్మరీ ర్ జ్హోల్ కచ్చ…
ఓ జ్హోలేర్ కావలి దండి యాడి కచ్చ…
జ్హోలేన్ లాయి ఏక్ ఖాడు కచ్చ…
ఓ ఖాడున్ కిది సాత్ ఖాడు కచ్చ…
ఓ సాతి ఖాడున్ చాలాయే వాళ్ళో సాత్ సాలెరో బాలక్ కచ్చ…
ఓ బాలకేర్ నామ్ ‘సేవా లాల్’ కచ్చ…
బంజారా ప్రజలు సాత్ భవానీలను కొలుస్తారు. వారిలో అందరికి పూజారులు ఉన్నారు కానీ దండి భవానికి మాత్రం లేరు. తనకు కూడా భగత్‌ను ఏర్పాటు చేయాలనీ సాత్ భవానీలు నిర్ణయించుకుంటారు. అదే సమయంలో బంజారా ప్రజలు మత మార్పిడుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. వారు సాత్ భవానీలను ప్రార్థించి తమను ఏకతాటిపై నడిపే ఒక మహాపురుషుడ్ని నాయకుడిగా ప్రసాదించమని ప్రాధేయపడతారు.
12 సంవత్సరముల తరువాత..
అప్పుడు తుల్జా భవాని ప్రత్యక్షమై మీరు కోరిన మేరకు శిశువును ప్రసాదిస్తాం, కానీ అతడు 12 సంవత్సరముల తరువాత దండి భవానికి భగత్‌గా మారిపోవాలి. ఈ షరతును ఒప్పుకునే తల్లిదండ్రులు ఎవరైనా ముందుకు వస్తే వారి కడుపున ఆ శిశువు జన్మించేలా వరమిస్తాము అని పలికి, నంగరి పెద్ద అయిన బాణావత్ భృగరాజ్‌కు బారాడా ప్రాంతంలోని ఒక నంగరిలో 12 సంవత్సరాలుగా సంతాన ప్రాప్తి కలగని ధర్మణిని అభ్యర్థించమని సూచిస్తుంది.
సేవలు చేయడానికి భగత్..
అభ్యర్ధన విన్న భీమ నాయక్, ధర్మిణి బాయి తమకు సంతానం కలిగే భాగ్యం దొరుకుతుందని భావించి మొదటి శిశువును దండి భవానికి అప్పగించడానికి ఒప్పుకున్నారు. అప్పటినుంచి దండి భవాని ముసలావిడ రూపంలో భీమా నాయక్ ఇంట్లోనే ఉంటూ ధర్మిణి, భీమా నాయక్‌లను ప్రేమగా చూసుకునేది. తనని అమ్మగా భావించిన భీమా దండి భవానిని మార్ మా (మా అమ్మ) అని సంబోధించేవాడు (అనగా దండి భవాని మేర మా గా, దండి యాడిగా నేటికీ పూజలు అందుకుంటున్నారు). అలా ధర్మిణి బాయికి నవమాసాలు నిండుతుంటాయి. తనకు సేవలు చేయడానికి భగత్ జన్మించబోతున్నాడని దండి యాడి చాలా సంతోషంగా ఉంటుంది. తమకు మార్గనిర్దేశనం చేసే యోధుడు పుట్టబోతున్నాడని నంగరి వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. బరాడా నుండి భీమ నాయక్ గుత్తి చేరుకొని రాంజీ నాయక్ నంగరిలో నివాసం ఏర్పారచుకుంటారు.
బంజారా ప్రజలకు సేవ చేయడానికి ..
1739లో ఫిబ్రవరి 15, తెల్లవారుజామున ధర్మిణి బాయికి బిడ్డ జన్మిస్తాడని గ్రహించిన మేరమా, నంగరిలో ఆనందంగా పాటలు పాడుతూ నంగరి వాసులతో కలిసి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. దండి యాడికి, బంజారా ప్రజలకు సేవ చేయడానికి పుట్టిన బిడ్డ కాబట్టి ‘సేవ’ అని నామకారణం చేసి అందరూ సంతోషపడుతారు. దండి యాడి బంజారా ప్రజలతో, ‘మీ నిజ స్థితిని మీకు వివరిస్తూ, మీ ధర్మములోని విశిష్టతను బోధ పరుస్తూ, మిమ్మల్ని సక్రమమైన మార్గంలో పయనింపజేసే.. మహిమాన్వితమైన నాయకుడు, బోధకుడు జన్మించాడని, మీరు అతడిని అనుసరించి ధన్యులు కండి అని బంజారా ప్రజలకు హితబోధ చేస్తుంది.’
సేవదాస్కు దండి యాడి ఆట పాటలు నేర్పుతూ, చక్కటి విషయాలను బోధిస్తూ, సొంత కొడుకులా చూసుకుంటుంది. సేవ లాల్‌ను ఏడేండ్ల ప్రాయంలోనే ఖాడు (పశువుల మంద)తో అడవికి పంపించడానికి ప్రయత్నం చేసేది. తల్లిదండ్రులు అడ్డు చెప్పగా సేవ సకల విద్యలు నేర్చుకోవాలని ధైర్యం చెప్పి ఒప్పించి అడవికి పంపిస్తూ, సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ఓ గీతాన్ని ఆలపిస్తుంది.
‘సేవా రే ఖాడుమ జారోచ్చి సదరేసి ఆజో…
బేటా రే వాటేపర జ్హోల చ్చ, జ్హోలేమా ఖాయిచ్చ…
ఖాయిమ చొరచ్చ…
చోరె రో పీడచ్చ…
బేటా రే సధరేసి ఆజో, దాడో ఢళి జాయ…
బేటా రే తారీ యాడి తాతి చ్చు, తారే రుమాలే పర బేటీ చ్చు…
డర మతే బేటా, ఝార మతే బేటా!
తలపాగాపై నీకు తోడుగా..
అర్ధం: ఆవుల మంద మెపడానికి వెళ్తున్న నా బిడ్డా! వెళ్లే దారిలో అడవి ఉంది, ఆ అడవిలో ఊబి లాంటి ఓ గుంత ఉంది, ఆ గుంతలో దోపిడి దొంగలు ఉన్నారు. వారి బెడద చాలా ఉంది. ఇంటికి తొరగా వెనుదిరుగు. సూర్యాస్తమయం కాక మునుపే ఇల్లు చేరుకో. ఎలాంటి ఇబ్బంది ఎదురయినా బెదురకు, నీలో ఉన్న ధైర్యాన్ని చెదరనీయకు. నీ నీడగా నేను నీ వెనువెంటే వుంటాను. నీ తలపాగాపై నీకు తోడుగా ఉంటాను.
కొంతకాలానికి దండి యాడి సేవా లాల్‌ను ఖాడు (ఆవుల మంద)తో పాటుగా తనకు ప్రియమైన ప్రదేశం అయినటువంటి ఝమ్మరి ర్ జ్హోల్ కు తీసుకెళ్తుంది. ఝమ్మరి ర్ జ్హోల్ ఎంతో ఆహ్లాదకరమైన సుందర ప్రదేశం. భూలోక స్వర్గమును తలపించే ఆ మనోహరమైన ప్రదేశం ఏడేళ్ల వయసున్న సేవా లాల్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆవుల మందతో పాటు సెలయేర్లు, జలపాతాలు, చెట్లు, పక్షులు, జంతువులు సేవాలాల్‌కు స్నేహితులుగా మారాయి. అక్కడ దండి యాడి సేవాలాల్‌కు సకల విద్యలు నేర్పిస్తుంది. తనలో ధైర్య సాహసాలు నింపడానికి అప్పుడప్పుడు అదృశ్యం అయ్యేది.
ఒక మందతో వెళ్లి.. ఏడు మందలతో తిరిగి ..
కొంత కాలానికి ఒక మందతో వెళ్లిన సేవా లాల్ ఏడు మందలతో తిరిగి నంగరికి చేరుకొని బంజారా ప్రజలకు మార్గ నిర్దేశనం చేస్తూ, తాను నేర్చుకున్న సకల విద్యలు భోదిస్తూ, సనాతన ధర్మ రక్షణే మొదటి ధ్యేయమని వాణిజ్య, వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని తాను ప్రేమగా పెంచుకున్న ఆవుల మందను దానం చేస్తాడు. ధర్మం రక్షించబడాలని కోరుకుంటాడు.
సేవా లాల్‌కు పన్నెండు సంవత్సరాల వయసు నిండటంతో దండి యాడి నంగరి పెద్ద అయిన భృగరాజ్, భీమ దంపతులకు తమ షరతును గుర్తు చేస్తుంది. ఇన్నాళ్లుగా తమతో ఉన్నది దండి యాడి, సాక్షాత్తు జగదాంబ మాత అని తెలుసుకున్న దంపతులు ఆశ్చర్యానికి గురవుతారు. సేవా లాల్‌ను అమ్మతో పంపించాల్సిన సమయం వచ్చింది అని తెలుసుకుని తమ ప్రియమైన పుత్రుడిని వదులుకోలేక అమ్మ ఆజ్ఞను తిరస్కరించలేక దుఃఖంలో మునిగిపోతారు.
సేవా లాల్ కూడా తన తల్లి దండ్రులను, నంగరి ప్రజలను వదిలి తాను రాలేనని వారికి సేవ చేయడం, వారిని ఆదుకోవడం, కాపాడుకోవడం తన మొదటి ధర్మం అని, మూగ జీవులపై అపారమైన ప్రేమ పెంచుకోవడం వల్ల తాను వాటిని ఎప్పటికీ భవానికి నైవేద్యంగా సమర్పించలేను అని తన బాధను వ్యక్తపరుస్తాడు.
సేవాలాల్ కనుక భగత్‌గా మారితే ..
అప్పుడు దండి యాడి సేవా లాల్ ముందు ఒక షరతును ఉంచుతుంది. పరిస్థితుల ప్రభావం చేత సేవాలాల్ కనుక భగత్‌గా మారితే జీవితం మొత్తం తన సేవలోనే ఉండిపోవాలి, ఒకవేళ అన్నీ ఓర్చుకొని కేవలం సేవా లాల్‌గా మాత్రమే ఉంటే తాను పన్నెండు సంవత్సరాల పాటు సేవా లాల్‌కు తోడుగా ఉంటూ మార్గనిర్దేశనం చేస్తానని చెప్పి కొంత సమయాన్ని గడువుగా ఇచ్చి అదృశ్యం అవుతుంది.
ఈ సమయంలోనే భారత దేశంలో బ్రిటీష్ పరిపాలనలో వివిధ రకాల వాహనాలు, రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల వాణిజ్యం, వ్యాపారం కుంటుపడి బంజారాల లదణ్ణి ఖాన కుంటుపడింది. బంజారా ప్రజలు శౌర్య పరాక్రమములు సంక్రమించిన రాజాపుత్ర వంశానికి చెందినవారు, విశ్వాస ప్రాప్తులు, ఆత్మవిశ్వాసం కలిగినవారు. అట్టి జాతి మనుగడకై నంగరి నాయకులు సేవా లాల్ నేతృత్వములో జాతి రక్షణకై కార్యాచరణ రూపొందించుకుంటారు. కానీ మేరమా అండదండలు కరువవడంతో బంజారాల లదణ్ణి ఖానా సాగేటట్టు చేయడంలో, మత మార్పిడులను తిరస్కరించడంలో విజయం సాధించలేకపోతారు.
సేవా లాల్ నిస్సహాయతను చూసి దండి యాడి ప్రత్యక్షమై తన భగత్‌గా మారమని కోరుతుంది. కానీ సేవా లాల్ ఒప్పుకోడు. ఆగ్రహానికి గురైన మేరమా పలురకాల కష్టాలకు గురి చేస్తుంది. ఎన్ని కష్టాలు పెడుతున్నా సేవా మాత్రం ఉదయం, సాయంత్రం ఆ తల్లికి పూజలు చేస్తూనే ఉండేవాడు. అయినా కూడా మేరమా సేవా కుటుంబీకులను, నంగరి ప్రజలను కష్టాల పాలు చేస్తూ ఉండేది.
సేవా లాల్ ఒక మాయావి..
ఇదే అదనుగా భావించిన గుండియ (జాతి అధర్ముడు, పరమతస్తుల బహుమానాలకు బానిస అయినవాడు) అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ సేవా లాల్ ఒక మాయావి అని అపోహలు సృష్టిస్తూ, అతడిని ఈ నంగరి నుండి వెలివేయాలని నంగరి వాసులను ప్రలోభపెడుతూ ఉండేవాడు.సేవా లాల్ అనుభవిస్తున్న బాధలు తల్లిదండ్రులను కలిచివేస్తాయి. వారు మేరమాకు ఎలా అయితే పూజలు చేస్తున్నావో అలాగే భగత్‌గా మారిపొమ్మని, అప్పుడు ఆ తల్లి కరుణిస్తుందని సూచిస్తారు. కానీ సేవా లాల్ మాత్రం మూగ జీవులను ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించడం తన వల్ల కాదు అని తన బాధను వ్యక్త పరుస్తాడు.
ఆ తల్లి కోసమే జన్మించిన..
అలసిపోయిన మేరమా సేవా లాల్‌పై పెంచుకున్న మమకారం వల్ల కొంత కాలానికి మరలా ప్రత్యక్షమై సేవాలాల్‌ను తన దాసుడిగా, బంజారా ప్రజల మార్గదర్శకుడిగా ఎంచుకొని జన్మను ప్రసాదించానని పలుకుతూ ఆనాటి షరతును పాటించాల్సిందేనని ఆజ్ఞాపిస్తుంది.అప్పటికే కృంగిపోయి ఉన్న సేవా లాల్ అమ్మ ఆగ్రహానికి గురికాక ముందే ఈ సమస్యకు స్వస్తి పలకాలని భావించి, ఆ అమ్మ ధ్యానంలో నిమగ్నమై సాత్ భవానీలను ప్రార్ధిస్తూ, బంజారా ప్రజల శ్రేయస్సు కోసం ఆ తల్లి ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటానని, మూగ జీవులను బలిచేయలేను కానీ, మేరమా కృప బంజారా ప్రజలపై ఉండటం కోసం ఆ తల్లి కోసమే జన్మించిన తాను ఆ తల్లికి నైవేద్యంగా తనను సమర్పించుకుంటానని, ఇకపై ఎల్లవేళలా బంజారా ప్రజలకు అండదండగా నిలవాలని మేరమా ను కోరుతాడు.
పెంచిన ప్రేమ మేరమా హృదయాన్ని కలిచి వేయగా, మేరమా మన షరతులో నీవే గెలిచావురా సేవా. అని పలికి ‘ఫేరి ఫర్, మలక్ మాండ్’ అని ఆశీర్వదించి సేవా లాల్ ను సంత్ సేవాలాల్ ప్రకటిస్తుంది.
తెలుపు, కాషాయపు రంగు జండాలను..
సంత్ సేవా లాల్ మేరమాను బంజారా జాతిని సన్మార్గంలో నడిపే మార్గదర్శకురాలిగా, తన గురువుగా భావించి తన దళంతో తెలుపు, కాషాయపు రంగు జండాలను చేత బట్టి, ఎరుపు రంగు రుమాలును తలకు చుట్టి, తోళ్య రామ్ అను తెల్లని అశ్వముపై స్వారీ చేస్తూ… బంజారా జాతిని ఉద్దేశించి, సంచార జీవితానికి స్వస్తి పలికి, స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, జాతి ధర్మాన్ని పరిరక్షించుకోవాలని, సకల విద్యలను అభ్యసించి వాణిజ్య వ్యాపారాల్లో రాణించాలని విలువలతో కూడిన సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని, జాతి ధర్మ రక్షణకు, దేశ సమగ్రతకు యువత ముందుకు రావాలని ఉతేజపరుస్తూ…
సేవా ఫేరి ఫర్ రోచ్చ.. అని గుర్తించడం జరిగింది.
ఏక్ పగేరో, దస్ కామేరో.. అని కీర్తించారు.
శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ తన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎలాంటి ప్రలోభాలకు, వ్యామోహాలకు గురికాకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు పోరాడి తన ముప్పై నాలుగు సంవత్సరముల జీవితంలో గొప్ప యోధుడిగా, మహాజ్ఞానిగా, తత్వవేత్తగా, సంస్కర్తగా గుర్తించబడి ప్రసిద్ధి గాంచారు.
‘పోరియా తార..
బంజారా ప్రజలు సేవాలాల్‌ను ‘పోరియా తార’ (శుభ ఘడియలను సూచించే నక్షత్రం)గా భావిస్తారు. అన్ని శుభ సందర్భాలలో ప్రథమ దైవంగా భావిస్తారు. బియ్యం, బెల్లం, నెయ్యి తో ‘లాప్సీ’ని, బెల్లం, నెయ్యి, రొట్టెతో ‘చుర్మో’ను తయారు చేసుకొని తమని ఆశీర్వదించమని ‘అర్ధాస్’ చేస్తూ, లాప్సీ, చుర్మో లను అగ్నిలో నేతి ధారతో సేవాలాల్ బాపుకు నైవేద్యంగా సమర్పించి భోగ్ భండార్ కార్యక్రమం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు.
సగటేరో లాల్… హమారో బాపు సేవా లాల్…
రామ్ రామ్, జై సేవా లాల్.
– స్రవంతి నేనావత్
ఇంగ్లీషు అధ్యాపకులు
రేపు శ్రీసద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి

