Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Save tigers: పులులను రక్షించుకుందాం

Save tigers: పులులను రక్షించుకుందాం

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

ఒకప్పుడు పులిని చూస్తే మనిషి భయపడేవాడు. ప్రస్తుతం సీన్‌ మారింది. మనిషిని చూస్తే సాక్షాత్తూ పులే భయపడుతోంది. చంపొద్దు అంటూ దీనంగా వేడుకుంటోంది. మనిషి దురాశకు పులులు బలైపోతున్నాయి. పులి చర్మంతో సహా ఇతర శరీర భాగాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్నేళ్లుగా డిమాండ్‌ పెరిగింది. దీంతో వేటగాళ్లు చెలరేగిపోతున్నారు. వేటగాళ్ల క్రౌర్యానికి ఏడాదికేడాది భారీ సంఖ్యలో పులులు బలైపోతున్నాయి. వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ లెక్కలే దీనికి సాక్ష్యం. ఈ నేపథ్యంలో జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తోంది యావత్‌ ప్రపంచం. పులుల సంరక్షణకు ప్రపంచదేశాలు కలిసి రావాలంటోంది వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌.

- Advertisement -

పులి.. ..ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పులి…వీరత్వానికి ప్రతీక. ఫలానా వ్యక్తి పులి లాంటోడు వంటి డైలాగులు సమాజంలో ఉన్నాయంటే పులులకు మనుషులు ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తోంది. పులి….భారతదేశ జాతీయ జంతువు. వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ లెక్కల ప్రకారం 20వ శతాబ్దం ప్రారంభం నుంచి అడవి పులుల సంఖ్య 95 శాతం కంటే ఎక్కువ తగ్గింది. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి .పులుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు వేటతో పాటు వాతావరణ మార్పులు. అలాగే కొంతకాలంగా పులుల సహజ ఆవాసాలను నాశనం చేస్తున్నారు పాలకులు. వ్యవసాయం, కలప, అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వివిధ ప్రయోజనాల కోసం అడవులను ఎడాపెడా నరికివేస్తున్నారు. దీంతో పులులు తమ సహజ ఆవాసాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పులుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని 2010లో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన టైగర్‌ సమ్మిట్‌లో వన్యప్రాణి నిపుణులు నిర్ణయించుకున్నారు. 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నాయి ప్రపంచదేశాలు.

అంతరించిపోయిన మూడు ఉపజాతులు
పులి శాస్త్రీయ నామం పాంథెర టైగ్రిస్‌. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పులుల ఉపజాతులు ఉండేవి, అయితే 20వ శతాబ్దంలో మూడు ఉపజాతులు అంతరించిపోయాయి. 1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3200లోపే ఉంది. దీనినిబట్టి పులుల పరిస్థితి ఎంతలా తగ్గిపోయిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ వందేళ్లలో 90 శాతానికి పైగా పులులు అంతరించిపోయాయి. విచక్షణ రహితంగా వేటాడటంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే పులులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. పులుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది ప్రతి రోజూ దాదాపు ఐదు కిలోమీటర్లు అడవుల్లో నడుచుకుంటూ వెళతారు. పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు. భారత్‌లో నాలుగేళ్లకోసారి పులులను లెక్కిస్తుంటారు. భారతదేశంలో పులుల లెక్కింపు విధానం రెండేళ్ల కిందట గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించింది. కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికారడ్స్‌’కు ఎక్కింది మన పులుల గణన. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగుతుంది. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఏ సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. పగ్‌ మార్క్‌ విధానంలో సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనేదాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.

మనదేశంలో బెంగాల్‌ టైగర్స్‌ !
భారతదేశంలో ఎక్కువగా బెంగాల్‌ టైగర్స్‌ ఉంటాయి.పులుల సంరక్షణ కోసం మనదేశం 1972లో భారతీయ వన్యప్రాణి (సంరక్షణ) చట్టాన్ని తీసుకువచ్చింది. భారతదేశంలో మొత్తం 53 టైగర్‌ రిజరవ్స్‌ ఉన్నాయి. వీటిలో నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ అతి పెద్దది. వీటిలో అతి చిన్నది
మహారాష్ట్రలోని బోర్‌ టైగర్‌ రిజర్వ్‌. పులుల సంరక్షణకు సంబంధించి అనేక చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం.ఇందులో ప్రాజెక్ట్‌ టైగర్‌ ను ప్రస్తావించుకోవాలి. ప్రాజెక్ట్‌ టైగర్‌ను 1973లో ప్రారంభించారు. పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకమే ప్రాజెక్ట్‌ టైగర్‌. అలాగే వేటగాళ్ల బారి నుంచి పులులను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ. ఈ సంస్థను 2005లో ఏర్పాటు చేశారు. పులులు 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అయితే షాకింగ్‌ విషయమేమిటంటే పులి పిల్లలు పుట్టినప్పుడు వాటికి కళ్లు కనపడవు. తమ తల్లి నుంచి వచ్చే వాసనను బట్టి అనుసరిస్తాయి. పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయి. లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి. పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పులి పిల్లలు చనిపోతాయని వైల్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ చెబుతోంది. పులి శరీరంపై చారలు ఉండటం సహజం. అయితే ప్రతి పులికి చారలు వేర్వేరుగా ఉంటాయి. మనుషుల్లో ఏ ఇద్దరికీ ఒకేలాంటి వేలి ముద్రలు ఉండనట్లే, ఏ రెండు పులులకూ ఒకేరకమైన చారలు ఉండవు. పులులు బాగా ఈదుతాయి. ఆహారం కోసం ఈదుతూ చాలా దూరం వెళతాయి. సింహాలు గుంపులుగా జీవిస్తాయి. కానీ పులులు ఒంటరిగా జీవిస్తాయి. ప్రతీ పులి తనకంటూ ఓ భారీ ప్రాంతాన్ని ఎంచుకుంటుంది. సాధ్యమైనంతవరకూ అక్కడే ఉండటానికి ఇష్టపడుతుంది. పులులు సహజంగా పగటి వేళ కంటే రాత్రివేళ బాగా వేటాడగలవు. రాత్రిపూట మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవని జంతు పరిశోధకులు చెబుతున్నారు. పులులకు ముందు కాళ్ల కంటే వెనక కాళ్లు ఎక్కువ పొడవుగా ఉంటాయి. ఫలితంగా అవి ఒక్కో జంపునకు ఎక్కువ దూరం గెంతగలవు. అలా గెంతుతున్నప్పుడు వాటికి ఉండే పొడవైన తోకతో అవి బ్యాలెన్స్‌ చేసుకుంటూ అటూ ఇటూ మలుపులు తిరుగుతుంటాయి.పులుల పాదాల కింద మెత్తగా ఉంటుంది. అందువల్ల అవి నడిచేటప్పడు శబ్దం రాదు. ఫలితంగా అవి వేటాడేటప్పుడు, సైలెంట్‌గా వచ్చి పరుగెడుతాయి. పులులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి. ఏమైనా వేటగాళ్ల బారి నుంచి మన జాతీయ జంతువైన పులిని రక్షించుకుందాం.

               ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News