భారతీయ సమాజం మూలాలు పొదుపు అనే పునాదిపై నిర్మితమయ్యాయి. తరతరాలుగా భారతీయులు పొదుపు మంత్రం జపిస్తూనే తమ జీవన గమనాన్ని సాగించారు. ఇంట్లో ఎనిమిది – పది మంది సంతానం, వాళ్ల పిల్లలు అందరూ ఉన్నా కూడా వేసవి సెలవులు రెండు నెలల పాటు అందరినీ పోషించేవారు. అలాగని ప్రతిరోజూ అందరికీ పంచభక్ష్య పరమాన్నాలు అక్కర్లేదు. ఉన్నదాంట్లోనే కడుపు నిండా తిని ఎంచక్కా ఆడుకునేవారు. ఉన్న కొద్ది వనరుల తోనే అందరూ ఆనందంగా గడిపేవారు. ఈ పొదుపు అలవాటే భారతీయులను ఎన్నో ఆర్థిక మాంద్యాల నుంచి కాపాడుతూ వచ్చింది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాలతో అతలాకుతలం అయిపోయిన సందర్భాల్లో సైతం భారతీయ ఆర్థిక వ్యవస్థ ఈ పొదుపు పునాదుల మీద చాలా బలంగా నిలబడింది. అయితే 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో పరిస్థితులు సమూ లంగా మారాయి. పొదుపు స్థానంలో వినియోగం ప్రధాన భూమిక పోషిస్తోంది. నేడు లక్ష రూపాయల జీతం వస్తున్నా, ప్రతి నెలా 20వ తేదీ రావడానికి ముందే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. క్రెడిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలు మనిషిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.
మారిన ఆదాయం – మారుతున్న పొదుపు తీరుతెన్నులు
భారతీయ గృహ పొదుపు రేటు చరిత్రను పరిశీలిస్తే కొన్ని కీలక మార్పులు కనిపిస్తాయి. 1951లో కేవలం 10 శాతం కంటే తక్కువగా ఉన్న ఈ రేటు, 2007-08 ఆర్థిక సంవత్సరంలో 25.2 శాతానికి చేరుకుని గరిష్ట స్థాయిని తాకింది. కానీ, ఇటీవలి కాలంలో వినియోగ ఖర్చులు పెరగడం, జీవనశైలి మార్పుల వల్ల ఈ పొదుపు రేటు మళ్లీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గృహ పొదుపు రేటు 18.4 శాతానికి పడి పోయింది. తలసరి ఆదాయం పెరిగినప్పటికీ, ఆ ఆదాయం పొదు పుగా మారడం లేదు. వచ్చిన ఆదాయం కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఖర్చులు ఉంటున్నాయి. ఒకప్పుడు మగవాళ్ల దుస్తులు అంటే రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు కనీసం రూ.5వేలు లేనిదే షర్టు ఏం బాగుంటుందన్న స్థాయికి వచ్చేశారు. ఇక ఆడవారి దుస్తులు, ఇతర యాక్సెసరీల విషయం చెప్పనే అక్కర్లేదు. ఆఫీసులో ఏదైనా ఈవెంట్ ఉందంటే చాలు.. వెంటనే రూ.10వేలు పెట్టి దుస్తులు, ఇతర షాపింగ్ చేసేస్తు న్నారు. పొరుగింట్లో పిల్లవాడి మొదటి పుట్టినరోజు అంటే కొత్త చీర, జాకెట్, దానిమీద వర్క్.. ఇలా వీటన్నింటి పేర్లతో వేలకు వేలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఆదాయం ఆఠాణా ఉంటే ఖర్చు బారాణా ఉంటోంది. ప్రజల ఆదాయం పెరిగేకొద్దీ విలాసా లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా యువత తమ సంపాద నలో ఎక్కువ భాగాన్నితక్షణ అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారు. గతంలో భారతీయులు తమ ఆస్తులను ఎక్కువగా బంగారం, స్థిరాస్తి రూపంలో దాచుకునేవారు. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచు వల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఆస్తుల వాటా పెరుగుతున్నప్పటికీ, మొత్తం పొదుపు రేటు మాత్రం ఆందోళనకరంగా తగ్గుతోంది. వస్తున్న ఆదా యంలో పొదుపు చేస్తున్న మొత్తం 20శాతానికి లోపు కూడా ఉండకపోవడం ప్రమాదాలకు సంకేతం అని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ సౌలభ్యం వెనుక దాగున్న ఖర్చుల ఉచ్చు
భారతదేశం నేడు డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) లావాదేవీలు వీసా లాంటి అంతర్జాతీయ సంస్థలను కూడా దాటిపోయాయి. అయితే, ఈ సాంకేతిక విప్లవం భారతీయుల వినియోగ విధానాన్ని కూడా మార్చింది. గతంలో జేబులో నుంచి నోట్లు తీసి ఇస్తున్నప్పుడు కలిగే స్పృహ, ఇప్పుడు ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నప్పుడు కలగడం లేదు. దీనివల్ల ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఇటీవల చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, సుమారు 75 శాతం మంది వినియోగదారులు యూపీఐ సౌలభ్యం వల్ల తమ ఖర్చులు పెరిగినట్లు ఒప్పుకుంటున్నారు.
కార్డుల సంస్కృతితో..
మరోవైపు, క్రెడిట్ కార్డుల సంస్కృతి ప్రజలను విపరీతంగా అప్పుల ఊబిలోకి నెడుతోంది. 2019లో క్రియాశీలకంగా ఉపయో గిస్తున్న క్రెడిట్ కార్డుల సంఖ్య 5.4 కోట్లు కాగా, 2024 డిసెంబర్ నాటికి అది 10.8 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం ఐదేళ్లలో కార్డుల సంఖ్య రెట్టింపు అయింది. దీంతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు కూడా భారీగా పెరిగాయి. 2019 మార్చిలో రూ.87,686 కోట్లుగా ఉన్న బకాయిలు, 2024 జూన్ నాటికి రూ.2.70 లక్షల కోట్ల కు చేరుకు న్నాయి. క్రెడిట్ కార్డులపై వార్షిక వడ్డీ రేట్లు 45 శాతం వరకు ఉంటు న్నాయి, ఇది సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేస్తోంది.
యువత, ముఖ్యంగా మిలీని యల్స్, జెన్-జీ తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి అప్పులు చేయడా నికి కూడా వెనుకాడటం లేదు. సగ టున ఒక క్రెడిట్ కార్డు వినియోగ దారుడు నెలకు సుమారు రూ.16,911 ఖర్చు చేస్తున్నాడు. సగటు లావాదేవీ విలువ రూ.4,200 పైచిలుకు ఉం టోంది. భారతీయులు తమ ఆదా యంలో అత్యధిక భాగాన్ని విని యోగానికి మళ్లిస్తున్నారు. గణాంకాల ప్రకారం, భారతీయ గృహాల మొత్తం పొదుపు రేటు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18.1 శాతానికి పడి పోయింది. అంటే భారతీయులు తమ ఆదాయంలో సుమారు 81.9 శాతాన్ని ఖర్చులకు లేదా అప్పులు తీర్చడానికి ఉపయోగి స్తున్నారు. ఇప్పుడు చాలామంది ఒకటి కాకుండా రెండేసి, మూడేసి క్రెడిట్ కార్డులు కలిగి ఉంటున్నారు. వాటిలో కొన్నింటిని సినిమా టికెట్ల మీద ఆఫర్ల కోసమని, మరికొన్నింటిని విమానాశ్రయాల్లోని లాంజ్ ఆఫర్ల కోసమని వాడుతున్నారు. ఏదో పేరు చెప్పి.. అన్ని కార్డులనూ ప్రతి నెలా వాడేస్తున్నారు. దీనివల్ల అప్పు భారం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. ఎప్పటి కప్పుడు కార్డు బకాయి కట్టేసేవారి విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ, ఒక్కసారి అదుపు తప్పిందంటే వడ్డీల భారం కొండంత పేరుకుపోయి.. జీవితాలను అతలాకుతలం చేసేస్తుంది.
వివాహాల వెర్రి: ఆడంబరం కోసం అప్పులు
భారతీయ వివాహ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ఎదిగింది. దీని విలువ సుమారు రూ. 10 లక్షల కోట్లు. ఒకప్పుడు ఇంటి దగ్గర పందిరి వేసి, బంధుమిత్రుల సమ క్షంలో సాదాసీదాగా జరిగే పెళ్లిళ్లు, ఇప్పుడు ‘ఫ్యామిలీ ఐపీఓ’గా మారిపోయాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఒక పెళ్లి కోసం రూ.30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఒకప్పుడు హిందువులలో వివాహం అంటే ఎదురు సన్నాహాలు, పెళ్లి, తలంబ్రాలు, అప్పగింతలు.. ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు తీరు మారిపోయింది. ముందు ప్రీవెడ్డింగ్ షూట్‌లు, తర్వాత హల్దీ, మెహందీ, సంగీత్, బారాత్, డాన్సులు.. వీటన్నింటి పేరుతో వారం రోజులు కూడా చేస్తున్నారు. వీటన్నింటికీ ఒక్కోదా నికి ఒక్కో కలర్ థీమ్ పెట్టి, వచ్చిన అతిథులకు అవే రంగు దుస్తులు ఇప్పిస్తున్నారు. వీటన్నింటి వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మామూలు పెళ్లికే కనీసం రూ.30-50 లక్షల వరకు అవుతుంటే, ఇలాంటి పెళ్లిళ్లకు కనీసం కోటి నుంచి 5 కోట్ల రూపాయల వరకు అవుతోంది. దీనికితోడు బంగారం, ఇతర సామాగ్రి కొనుగోళ్లు అదనం. రిటర్న్ గిఫ్టుల పేరుతో కూడా చాలా పెద్దపెద్ద ఖర్చులు అవుతున్నాయి.
వెడ్ ఇన్ ఇండియా
ఇక ఇవన్నీ చాలవన్నట్లు.. 72 శాతం మిలీనియల్స్, జెన్ జీ యువత డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం రూ. 80 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేయడం వల్ల దేశంలోని విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లిపోతోంది. ప్రధాని మోదీ ‘వెడ్ ఇన్ ఇండియా’ పిలుపునిచ్చారు, దీని ద్వారా భారత్ లోని కాశ్మీర్, కేరళ లాంటి ప్రాంతాలను వివాహ వేదికలుగా ఎంచుకోవాలని సూచించారు. కుటుంబాలు తమ జీవితకాల పొదుపులో సుమారు 40-50 శాతాన్ని కేవలం ఒక పెళ్లి కోసమే ఖర్చు చేయడం ఆందోళ నకరమైన విషయం. నాకు బాగా తెలిసిన ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా తమ కుమారుడి పెళ్లి కోసం రూ. 15 లక్షలకు పైగా అప్పు చేశారు. ఆయనకు పొలాలు, తోటలు, వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా ఉన్నా.. అప్పటివరకు చేసిన పొదుపు మొత్తం ఖర్చుచేయడంతో పాటు అదనంగా కుమారుడి పెళ్లికి రూ.15 లక్షల అప్పు చేశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పెళ్లిలో ఉండే రకరకాల తంతుల కోసం ఆ కుటుంబంలో భార్య, భర్త, పెద్ద కొడుకు, కోడలు, మనవడు, పెళ్లి కొడుకు.. ఇలా అంద రికీ దాదాపు 10-12 రకాల సూట్లు, ఖరీదైన చీరలు కొన్నారు. దీనికోసం తెలిసినవాళ్లందరి దగ్గర చేతికి వీలైనంత అప్పులు చేసేసి, ఇప్పుడు అవి తీర్చలేక తిప్పలు పడుతున్నారు.
యుద్ధమేఘాలతో కూలుతున్న వ్యవస్థలు
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తోం ది. 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర పోరు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, భారత్ లాంటి దేశాలపై సైతం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు సరఫరా మార్గా లపై ఇరాన్ నియంత్రణ, ప్రపంచ ఇంధన మార్కెట్లో ధరల పెరు గుదల భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం పశ్చిమాసియాపై సుమారు 80 శాతం ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పలు విధాలుగా ప్రభావం పడుతోంది. ప్రపంచంలోని 20 శాతం ఇంధన రవాణా జరిగే హర్ముజ్ జల సంధిని ఇరాన్ దాదాపు మూసివేసింది. దీనివల్ల చమురు రవాణా నిలిచిపోయి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల ఇప్పటికే మన చమురు మార్కె టింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1500 కోట్ల నష్టాలు వస్తున్నాయి. విదేశాల నుంచి చమురు కొనడానికి భారత్ ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయా ల్సివస్తోంది. ఇది రూపాయి విలువను మరింత తగ్గిస్తోంది. యుద్ధం ప్రారం భమైన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మే 11న జరిగిన ఒక్క సెషన్‌లోనే సుమారు రూ. 6.52 లక్షల కోట్ల పెట్టుబడి దారుల సంపద హరించుకుపో యింది. ముడి చమురు ధరలు పెర గడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, అది గొలుసుకట్టుగా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇంధన ధరల భారంతో ఏవియేషన్ స్టాక్స్ కుప్ప కూలాయి. ఇండిగో షేర్లు 7 శాతం, స్పైస్జెట్ 4 శాతం మేర నష్టపో యాయి. విమాన టికెట్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుం డా పోతున్నాయి. విదేశీ ప్రయాణాల ఖర్చు పెరగడంతో థామస్ కుక్ ఇండియా లాంటి అంతర్జాతీయ ట్రావెల్ కంపెనీల వాటాలు 5 నుంచి 6 శాతం పడిపోయాయి. విదేశీ మార క ద్రవ్యాన్ని కాపాడటానికి బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని పిలుపునివ్వడంతో టైటాన్, కళ్యాణ్ జువెలర్స్ లాంటి కంపెనీలు 10 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. రసాయన ఎరువుల తయారీకి చమురు అనుబంధ ఉత్పత్తులు అవసరం.
అంతర్జాతీయంగా ఎరువుల ధరలు రూ. 3,000 దాటినా, ప్రభుత్వం రాయితీలు ఇచ్చి రైతులకు రూ. 300కే అందిస్తోంది, ఇది ఖజానాపై భారీ భారం మోపుతోంది. యుద్ధం కారణంగా పెరుగుతున్న ధరల ప్రభావం సామా న్యుడి వంటగది నుంచి పొదుపు ఖాతా వరకు అన్నిచోట్లా చాలా తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే పెరగగా అతి త్వరలో మరో విడత వడ్డనకు సర్కారు సిద్ధమైంది. ఇది కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులను పెంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ఆదాయం సరిపోకపోవడంతో ప్రజలు క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా అప్పులు తీసుకుం టున్నారు.
ప్రధాని పిలుపుతో మళ్లీ మొదలవుతున్న పొదుపు
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ భారతీ యులకు పొదుపు ఆవశ్యకతను గుర్తుచేశారు. ఈ పిలుపు నకు స్పందిస్తూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కొన్ని పొదుపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై విధాన భవన్‌కు చేరుకుని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడ మే కాకుండా, అనవసర విదేశీ పర్యటనలను రద్దు చేశారు. ఆంధ్రప్ర దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయ్ పరిమాణాన్ని 12 వాహనాల నుంచి 4 వాహనాలకు తగ్గించారు. మంత్రి నారా లోకేష్ తన భద్రతను రెండు వాహనాలకే పరిమితం చేసుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో రిక్షాను ఎంచుకోగా, బిహార్ మం త్రులు అశోక్ చౌదరి, మదన్ సహ్ని కార్ పూలింగ్ పద్ధతిని అనుస రించారు. హర్యానా మంత్రి అరవింద్ శర్మ సైకిల్‌పై కార్యాలయా నికి వెళ్లి ఇంధన పొదుపుపై సందేశం ఇచ్చారు. అయితే, ఇలాంటి పొదుపు చర్యలు ఒకవైపు జరుగుతున్నా, మరోవైపు భారీ బహిరంగ సభలు, ఆర్భాటపు విందులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు తమ పట్టును చాటుకోవడానికి చేసే ఈ భారీ ఖర్చులను కూడా నియంత్రిం చాల్సిన అవసరం ఉంది.
పొదుపు బాట పట్టాలంటే ఏం చేయాలి?
ఆర్థిక క్రమశిక్షణ అనేది ఒక నెలతో ముగిసేది కాదు, అది నిరంతర ప్రాక్టీస్. పొదుపు చేయాలనుకునే వారు ఈ క్రింది ఆచరణాత్మక మార్పులు చేసుకోవాలి:
1. 50-30-20 సూత్రం: ఆదాయంలో 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలకు, 20 శాతం తప్పనిసరిగా పొదుపు ఖాతాలోకి మళ్లించాలి.
2. అత్యవసర నిధి: కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి.
3. ఇంధన పొదుపు: ప్రధాని సూచించినట్లు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, మెట్రో రైళ్లు లేదా ప్రజా రవాణాను వాడాలి.
4. బంగారం కొనుగోళ్ల నిలిపివేత: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఏడాది పాటు బంగారం కొనకూడదని ప్రధాని పిలుపునిచ్చారు.
5. మనీ ఆడిట్: ప్రతి నెలా చేసే ఖర్చులను నిశితంగా పరిశీలించాలి. అనవసరమైన ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను తగ్గించుకోవాలి.
6. వంట నూనె వినియోగం: వంట నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించాలి. ఇది ఆరోగ్యానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు రెండింటికీ మేలు చేస్తుంది.
7. డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దు: ఆడంబరాల కోసం విదేశాలకు వెళ్లకుండా దేశీయ పర్యాటక ప్రాంతాల్లోనే వివాహాలు జరుపుకోవాలి.
పొదుపు అనేది కేవలం వ్యక్తిగత లాభం కోసం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి ప్రతీక. పశ్చిమా సియా యుద్ధం లాంటి సంక్షోభాలు మనకు ఒక హెచ్చరిక. ప్రతి భారతీయుడు తన సంపాదనలో కొంత భాగం పొదుపు చేస్తూ, స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇస్తే, ఏ విదేశీ శక్తీ మన ఆర్థిక వ్యవ స్థను ప్రభావితం చేయలేదు. మన పూర్వీకులు నేర్పిన పొదుపు పాఠాలను ఆధునిక కాలానికి అనుగుణంగా మలచుకుని, అప్పుల భారం లేని భవిష్యత్తును నిర్మించుకోవడమే మనందరి బాధ్యత. పొదుపు చేసే ప్రతి రూపాయి కూడా దేశ నిర్మాణం కోసం మనం ఇచ్చే విరాళమే. ఇంకెందుకు ఆలస్యం..మళ్లీ మన మూలాల్లోకి (బ్యాక్ టు బేసిక్స్) వెళ్దాం. భారతీయులకు ముందునుంచి అలవా టుగా ఉన్న పొదుపును పాటిద్దాం. మన జీవితాలను మనమే బాగుచేసుకుందాం.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ

