షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల సమపంపిణీ (వర్గీకరణ) అంశంపై ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీలు ఒకే గ్రూపు కాదని, అవి విభిన్న జాతుల సమహారం అని సర్వోన్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల ధర్మాసనం ‘వర్గీకరణ’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏకసభ్య కమిషన్లు నియమించాయి. ఈ నేపథ్యంలో ‘వర్గీకరణ’ వాదోపవాదాల్లో వాస్తవాలపైన చర్చ జరగాల్సిన అవసరముంది.
ఆర్టికల్ 341 ‘వర్గీకరణ’కు వ్యతిరేకం
వాస్తవం: ఆర్టికల్ 341 ఎస్సీ జాబితాలో ఒక కులాన్ని చేర్చడాన్నీ, తొలగించడాన్నీ మాత్రమే చెబుతుతుంది. అందులో ఎక్కడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొనలేదు. కాలానుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి చట్టం, ఆర్టికల్ సవరించుకునే అవకాశం, అధికారం ఉన్నది. స్వాతంత్య్ర పోరాటకాలంలో దేశంలో ఉన్న సామాజిక స్థితిగతులు వేరు. అంటరాని తన జాతులకు రిజర్వేషన్లు కల్పించడం బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏకైక లక్ష్యం. ఎస్సీలలో అసమానతలపైన బాబాసాహెబ్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. కానీ అప్పటి తెల్లదొరలు, నల్లదొరల నుంచి జాతి సంక్షేమం కోసం ఉమ్మడిగా రిజర్వేషన్లు అనుభవించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఉప వర్గీకరణ జోలికి వెళ్లలేదు. అందుకే ఆర్టికల్ 341లో తీసివేతలు, కూడికలు మాత్రమే పొందుపరిచారు. అయినా రిజర్వేషన్లు తొలుత పదేళ్లకే ఉద్దేశించారు. అవి సరిగ్గా అమలైతే పదేండ్లకాలంలో ఎస్సీలు కూడా సమాజంలోని మిగతా వర్గాలతో సమానంగా ఎదుగుతారనే ఒక అంచనాతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ అవి సరిగ్గా అమలుకాక పోవడం, అరకొరగా అమలైన రిజర్వేషన్లను ప్రతి పదేండ్లకు పొడగిస్తూ వచ్చారు. అయినా వాటిని కేవలం కొన్ని కులాలు మాత్రమే వినియోగించుకోవడం వల్ల మిగతా సమూహాలు తమ హక్కులు, వాటాల కోసం ఉద్యమాల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘వర్గీకరణ’ దేశవ్యాప్తంగా జరగాలి
వాస్తవం: పుండు ఒక చోట ఉంటే మందు మరో చోట పెట్టమన్నట్టుంది ఈ వాదన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసున్న తెలంగాణ ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్ మొదలైంది. ఈ ప్రాంతంలోనే ఉద్యమం నడిచింది. ప్రత్యేక రాష్ట్రం కల నెరవేరింది. సమస్య ఉన్నచోటే పరిష్కారం అవసరమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ కులాల మధ్య అసమానతలున్నాయి గనుక డిమాండ్ ఉన్నచోట ‘వర్గీకరణ’ జరగవలసిందే. ఇదే రాజ్యాంగ ధర్మం. రిజర్వేషన్లు ఏ ఒక్కరిసొత్తు కాదు. రాజ్యాంగ ఫలాలు ఉద్దేశించబడిన వర్గాలు సమానంగా పంచుకోలేనప్పుడు వాటి అమలుతీరు వల్ల అంతరాలకూ, అంత:కలహాలకూ దారి తీస్తుంది. దాని వల్ల రాజ్యాంగం అపహాస్యానికి గురవుతుంది. రాజ్యాంగం అమలైన 75 ఏళ్లల్లో ఉన్నత వర్గాలు సైతం రిజర్వేషన్లు కావాలని రోడ్డెక్కినప్పుడు ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు కల్పించారు. మరి రిజర్వేషన్ల జాబితాలో ఉండి అంటరానితనం, అసమనాతలు ఎదుర్కొం టున్న ఎస్సీ కులాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా జనాభా దామాషా పద్ధతిలో అవకాశాలు కల్పించాలి.
ఎస్సీలంతా ఒకే గ్రూపు. కాబట్టి వీరిని వేరు చేయవద్దు
వాస్తవం: ఇది ఒక అందమైన మోసపూరితమైన స్టేట్మెంట్. అసలు దళితులను వేరు చేయడానికి కలిసున్నదెప్పుడు? నిచ్చనమెట్ల కులవ్యవస్థలో ఏ రెండు కులాలూ ఒక్కటి కావు. సంస్కృతి, సంప్రదాయలు, వృత్తి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను బట్టి చూసినా దళితులు నాడు, నేడు, ఎప్పుడూ ఒకటిగా లేరు. ఏ కులం అస్థిత్వం దానిదే. అందువల్ల ఎస్సీలు హోమోజీనియస్ ఎంతమాత్రం కాదు. అవి హెటిరోజీనియస్–విభిన్నజాతుల సమాహారం. మిగతా గ్రూపుల్లోని కులాల మధ్య కంచం పొత్తు, మంచం పొత్తు లేనట్టే ఎస్సీల్లోని ఏ రెండు కులాలు కలిసి భోజనాలు చేయవు. ఒకరింటికి ఒకరు పిల్లనిచ్చి వివాహ సంబంధాలు ఏర్పరచుకోవు. ‘వర్గీకరణ’ అనేది ఉమ్మడి రిజర్వేషన్లను 59 కులాలు కలిసుండే పంచుకునే విధానం. దీని వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లా భౌగోళికంగా విడిపోయేదేమీ ఉండదు. కుటుంబంలోని ఉమ్మడి ఆస్తిని నలుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోవడం వల్ల భూమి బద్ధలవ్వదు. ఆకాశానికి చిల్లులూ పడవు!
ఎస్సీ రిజర్వేషన్లను మాలల కంటే మాదిగలే అధికంగా అనుభవించారు
వాస్తవం: ఒకవేళ మాదిగలు రిజర్వేషన్లు పెద్ద మొత్తంలో అనుభవించి ఉంటే మాలలూ, ఇతర కులాలకూ అన్యాయం జరిగినట్లే కదా! ఆ లెక్కన చూసుకున్నా రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి. ఈ ‘వర్గీకరణ’తోనే అసమానతలు తగ్గేందుకు బాటలు పడతాయి. 1965లో భారత ప్రభుత్వం నియమించిన బీఎన్ లోకూర్ కమిషన్ చెప్పినట్టుగా మాలలను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించడంగానీ, కొంతకాలం రిజర్వేషన్లను నిలిపివేయడంగానీ జరగదు. మాలలకూ జనాభా దామాషా ప్రకారం మిగతాకులాలతోపాటు రిజర్వేషన్ల పంపకం ఉంటుంది.
రిజర్వేషన్లను మాదిగలు అసలే అనుభవించలేదా?
వాస్తవం: రిజర్వేషన్లు అమలైన కాలం నుంచి మాదిగలతోపాటు మాలలు, ఇతర కులాలు అనుభవించాయి. కులవృత్తి, సామాజిక, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ ఫలాలు అనుభవించడంలో హెచ్చు తగ్గులు న్నాయి. మాల,మాదిగ కులాల్లోని కొన్ని కుటుంబాలు ఒకస్థాయికి మించి ‘వారసత్వం’గా అనుభవించాయి. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాయి. అలాంటివారికి రిజర్వేషన్ల ఫలాలు తక్షణం నిలిపివేయాలి. లేదా క్రీమీలేయర్ పద్ధతిని వర్తింపజేయాలి.
‘వర్గీకరణ’ వల్ల కేవలం మాదిగలే లబ్దిపొందుతారు
వాస్తవం: ఇది అబద్ధపు ప్రచారం మాత్రమే. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’ జరిగితే అత్యంత వెనుకబడిన కులం మొదటగా లబ్దిపొందుతుంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న వెనుకబడిన కులం తర్వాతి స్థానంలో లబ్దిపొందుతుంది. ఈ లెక్కన 59 కులాల్లో ఏ కులానికీ నష్టం జరగదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ కులం జనాభా ఎంతో ఆ కులం అంతే రిజర్వేషన్లు అనుభవిస్తుంది. ఎవరి వాటాలు వారు పొందినప్పుడు అసమానతలు తగ్గి ఐక్యంగా ఉండేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇప్పటిదాకా రిజర్వేషన్లను ‘సంతృప్తికరం’గా వినియోగించుకున్న కుటుంబాలతో పేదలైన మాల,మాదిగలతోపాటు ఇతర కులాలు పోటీ పడలేవు కాబట్టి ఇందుకోసం ఎస్సీలను ఎ.బి.సి.డి.ఇ లుగా వర్గీకరించాలి. ఇ గ్రూపులో క్రీమీలేయర్ వర్గాన్ని చేర్చి ఒకశాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించాలి. పేదిరికం జనాభా దామాషా ప్రకారం మిగిలిన ఎస్సీలను ఎ.బి.సి.డి గ్రూపులలో చేర్చాలి.
జోన్ల వారీగా లేదా జిల్లాల వారీగా ‘వర్గకరణ’ వల్ల మేలు
వాస్తవం: రిజర్వేషన్ల సమ పంపిణీకి జోన్లవారీగా లేదా జిల్లాల వారీగా ‘వర్గీకరణ’ విధానం దోహదపడుతుంది. టీచర్ల కొలువులు, విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ అధికంగా జిల్లాల వారీగానే జరుగుతుంది కాబట్టి ఆ ప్రకారం ‘వర్గీకరణ’ను అమలు చేయడం సమంజసం. ఏ కులం జనాభా ఎక్కువగా ఉండి, ఇప్పటి వరకు రిజర్వేషన్లను అనుభవించలేదో ఈ విధానంలో నష్టపోకుండా ఉండే అవకాశముంది. 2011 జనాభా లెక్కలు లేదా 2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జిల్లాల వారీగా ‘వర్గీకరణ’ చేపడితే అందరికీ మేలు జరుగుతుంది.
‘వర్గీకరణ’ వల్ల దళితుల ఐక్యత దెబ్బతింటోంది
వాస్తవం: అసమానతలున్న చోట ఐక్యత ఎప్పటికీ సాధ్యం కాదు. ‘వర్గీకరణ’ లేకపోవడమే విభజనకు దారి తీస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ చట్టం 2000 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏబీసీడీ’లు అమలైన కాలంలో వెనుకబడ్డ దళితులు అప్పటికే రిజర్వేషన్ల వల్ల ముందున్న దళితులతో పోటీ పడేందుకు ప్రయత్నం జరిగింది. ఆ కాలంలోనే దండోరా నాయకత్వం దళితుల ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించింది. వెనుకబడిన తరగతు (బీసీలు)లల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అమలవుతోంది. ఈ వర్గీకరణ వల్ల బీసీల నడుమ ఏనాడు ఘర్షణ చోటు చేసుకోలేదు. పైగా బీసీలల్లో రాజ్యాధికారం ఉమ్మడిగా కోసం పోరాడాలనే కాంక్ష పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’ జరిగాక జరిగేది కూడా ఇదే!
‘వర్గీకరణ’ ఉద్యమం వల్ల ఉమ్మడి ఆశయమైన రాజ్యాధికారం మరుగున పడుతుంది
వాస్తవం: ‘వర్గీకరణ’ ఉద్యమం వల్ల అంటరానిజాతుల్లోనే అంటరానివారుగా నలిగిపోయిన మాదిగలతోపాటు చిందు, డక్కలి, మాస్టిన్, రెల్లి వంటి అనేక కులాలు ఉనికిలోకి వచ్చి తమ అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. ‘వర్గీకరణ’ ఉద్యమం వల్లనే ఎస్సీల్లోని అన్ని కులాల్లో సామాజికన్యాయం, ఆత్మగౌరవం, రాజకీయ చైతన్యాలు పెరిగాయి. ఉన్న అవకాశాలే పంచుకోలేనప్పుడు ‘రాజ్యాధికార’ వాదన హాస్యాస్పదం. ‘వర్గీకరణ’ను అడ్డుకోవడం వల్లనే ‘రాజ్యాధికారం’ ఆలస్యమవుతుంది!
ప్రభుత్వ రంగంలో నియామకాలే తగ్గిపోయి ఉన్నదంతా ప్రైవేటుపరమవుతుంటే ఇంకా రిజర్వేషన్ల ‘వర్గీకరణ’ కోసం ఉద్యమించడం వృథా ప్రయాస
వాస్తవం: ఉన్నదంతా ప్రైవేటుపరమవుతుంటే ఆధిపత్య కులాల్లోని పేదలు ప్రభుత్వ రంగంలో చేపట్టే నియామకాల్లో ‘ఈడబ్ల్యూఎస్’ పేరిట రిజర్వేషన్లను ఎందుకు పొందారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటైన, ఏర్పాటవుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, దేశవ్యాప్తంగా వెలుస్తున్న యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల మాటేమిటి? అంటే జనాభాకు తగ్గట్టుకు ప్రభుత్వ సంస్థలు, కొలువులు, కోర్సులు వస్తూనే ఉన్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు అమలవుతూనే ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వరంగ సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గుతున్నాయని అనుకుంటే ఆ తగ్గుతున్న వాటిని ఇంతకు ముందు అనుభవించిన వారే అనుభవించాలా? ఉన్న అరకొర వాటినే ఉమ్మడిగా అనుభవించలేనప్పుడు రేప్పొద్దున ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు అమలైతే మళ్లీ వాటిని ఎవరు ఛేజిక్కించుకుంటారు? కలిసుండి పంచుకుంటేనే ప్రభుత్వం రిజర్వేషన్లను జనాభాకు తగ్గట్టుగా పెంచమని కొట్లాడొచ్చు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు సాధించుకోవడానికీ ఐక్య కార్యాచరణను రూపొందించుకోవచ్చు.
బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానానికి ‘వర్గీకరణ’ వ్యతిరేకం
వాస్తవం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానానికి లోబడే రిజర్వేషన్ల సమ పంపిణీ అయిన ‘వర్గీకరణ’ డిమాండ్ కొనసాగుతున్నది. అప్పటిదాకా ఎస్సీలంతా ఒక్కటే అనుకున్న సమాజానికి, ప్రభుత్వాలకు దళితుల్లో దళితులున్నారని దండోరా ఉద్యమం మొదలయ్యాకే తెలిసొచ్చింది. నాడు అంబేడ్కర్ సాధించిపెట్టిన రిజర్వేషన్లను అందరికీ సమపంపిణీ చేయాలనే ఎరుకను చర్చకుపెట్టిన ‘వర్గీకరణ’ ఉద్యమం అంబేడ్కరిజాన్ని మరో మెట్టు ఎక్కించింది. ప్రజాస్వామ్యం అంటేనే సమాన ప్రాతినిధ్యం. విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లోనూ అవకాశాలు జనాభా ప్రతిపాదికన అనుభవించడమే అంబేడ్కర్ ఆలోచనా విధానం. దీనివల్ల ఏ వ్యక్తికీ, ఏ కుటుంబానికీ, ఏ కులానికీ నష్టం ఉండదు. పైగా ఈ సమపంపిణీ వల్ల శతాబ్దాలుగా విడిపోయిన కులాలు, వర్గాలు ఏకమై ఉమ్మడి లక్ష్యమైన రాజ్యాధికార ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది!
డా. మహేష్ కొంగర, సీనియర్ జర్నలిస్ట్