Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Bribes to vote in Parliament: లంచం ఇచ్చినా తీసుకున్నా నేరమే!

Bribes to vote in Parliament: లంచం ఇచ్చినా తీసుకున్నా నేరమే!

సభా హక్కులకు సంబంధించిన వ్యవహారం కాబోదు..

పార్లమెంటు సభ్యులకు లంచం ఇచ్చే విషయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న తీర్పును సుప్రీంకోర్టు ఎట్టకేలకు వెలువరించింది. సుమారు 25 ఏళ్ల క్రితం జె.ఎం.ఎం లంచం కేసులో లంచం ఇచ్చేవారికి, లంచం తీసుకునేవారికి మధ్య వివక్షను చూపిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అప్పట్లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం మీద వచ్చిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన కొందరు పార్లమెంటు సభ్యులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో లంచం ఇచ్చిన వారికి శిక్షలు విధిస్తూ, లంచం తీసుకున్న వారిని శిక్షల నుంచి మినహాయించడం జరిగింది. పార్లమెంటులో ఏం చేసినా, ఎవరికి ఓటు వేసినా అది సభాహక్కుల కిందకు వస్తుంది కనుక పార్లమెంటు సభ్యులు ఏ కారణంగా ఎవరికి ఓటు వేసినా దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనే కారణంపై ఆ కేసులో లంచం తీసుకున్నవారిని శిక్షలు లేకుండా వదిలేయడం జరిగింది. లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన అజిత్‌ సింగ్‌ అనే సభ్యుడికి మాత్రం శిక్ష వేయడం జరిగింది. లంచం తీసుకున్నప్పటికీ, ఆయన పార్లమెంటుకు గైర్హాజర్‌ అయినందు వల్ల కొద్దిపాటి శిక్ష వేయడం జరిగింది.
అప్పటి తీర్పును ప్రస్తుతం సుప్రీంకోర్టు సవరించుకోవడం జరిగింది. సభా హక్కులకు సంబంధించిన ఈ తీర్పులోని తప్పిదాన్ని అది సరిదిద్దుకుంది. చట్టసభల్లో మాటకు, చేతకు, ఓటుకు సంబంధించి సభ్యులు లంచం తీసుకున్న పక్షంలో వారికి తప్పకుండా శిక్ష వేయాల్సి ఉంటుందని, వారు ఏ విధంగానూ సభా హక్కులకు అతీతులు కారని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అప్పటి పి.వి. నరసింహారావు వర్సెస్‌ ప్రభుత్వం కేసు (1998)లో అత్యధిక సంఖ్యాక న్యాయ మూర్తులు ఇచ్చిన తీర్పును ప్రస్తుతం ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు ధర్మాసనం పక్కన పెడుతూ, పార్లమెంటు పనితీరులో నీతి నిజాయతీలనేవి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలని స్పష్టం చేసింది.
పార్లమెంటు లేదా శాసనసభల్లో సభ్యుల భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రాలకు సంబంధించిన ఆర్టికల్‌ 105 (పార్లమెంటు సభ్యులు), ఆర్టికల్‌ 194 (శాసనసభ్యులు) సభా హక్కులకు సంబంధించినవని, ఇవి లంచాలకు వర్తించవని సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది. పార్లమెంటు ఉభయ సభల లోపల ఎవరు ఎవరికి ఓటు వేసినా, ఏ కారణం వల్ల ఓటేసినా అది సభా హక్కుల కిందకే వస్తుందని, దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1998లో సుప్రీంకోర్టు ధర్మాసనం కేవలం సభా హక్కులకు మాత్రమే అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అయితే, సభా హక్కుల్ని ఈ విధంగా పరిమితం చేయడం వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అత్యధిక సంఖ్యాకులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు లంచం తీసుకున్నా, ఇతరత్రా అవినీతికి పాల్పడినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. పార్లమెంటులో సమర్థమైన చర్చలు, వాదోపవాదాలకు అవకాశం లేకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమావేశాలు జరిగే అవకాశం ఉందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా జరిగింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ఈ లోటుపాట్లను సవరించింది. చట్ట సభ సభ్యులు లంచం ఇచ్చినా, తీసుకున్నా అది వ్యక్తిగత వ్యవహారమే అవుతుంది తప్ప సభా హక్కులకు సంబంధించిన వ్యవహారం కాబోదని, దీని ప్రభావం సభా హక్కుల మీద ఉండడం జరగదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆర్టికల్‌ 194 ప్రకారం శాసనసభలో సభ్యుల ప్రవర్తన అనేది సభా హక్కుల కిందకే వస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడినా, ఎవరికి ఓటు వేసినా సభా హక్కుల కిందకే వస్తుంది. అయితే, అవినీతికి పాల్పడడం మాత్రం అందరికీ వర్తించే విధంగానే శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అవినీతికి అతీతంగా, నీతి నిజాయతీలతో వ్యవహరించడానికి మాత్రమే సభా హక్కులు తోడ్పడతాయని కూడా అది పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News