Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్SC on Manish bail: బెయిల్‌ పిటిషన్‌ పై విచిత్రమైన తీర్పు

SC on Manish bail: బెయిల్‌ పిటిషన్‌ పై విచిత్రమైన తీర్పు

సాక్షాలు లేకపోయినా అధికార దుర్వినియోగం మాత్రం జరిగింది

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ నాయకుడు అయిన మనీశ్‌ శిశోడియా బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరిస్తూ చేసిన కఠిన వ్యాఖ్యలు దాదాపు తుది తీర్పుకు సమానంగా ఉన్నాయి. మద్యం విధానాన్ని దుర్వినియోగం చేయడానికి సంబంధించి ప్రస్తుతం ఒక కేసు విచారణలో ఉన్న సమయంలో ఆయన బెయిలుకు పిటిషన్‌ పెట్టుకోవడం, దాన్ని కోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే, ఈ పిటిషన్‌ ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తుది తీర్పు స్థాయిలో ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను బట్టి మున్ముందు న్యాయస్థానం ఆయనకు ఎలాంటి శిక్ష విధించబోతోందో, ఆయన కేసు విషయంలో న్యాయమూర్తి మనసులో ఏముందో తదితర విషయాలన్నీ దాదాపు బయటపడిపోయినట్టయింది. అక్రమ నిధుల మళ్లింపు నిరోధక చట్టాన్ని (పి.ఎం.ఎల్‌.ఎ) ఆయన ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై రూపొందించిన విధానం కొద్దిమంది పలుకుబడి కలిగిన వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ మనీశ్‌ శిశోడియా తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని కలగజేయడానికి ప్రయత్నించారని న్యాయమూర్తి ఆయన బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరిస్తూ ఘాటుగా విమర్శించారు. ఆయన పనితీరు, వ్యవహార శైలి ప్రజాస్వామ్య సూత్రాలకు తీరని ద్రోహం కలిగించే విధంగా ఉందని కూడా న్యాయమూర్తి మండిపడ్డారు. బెయిల్‌ అభ్యర్థన మీద న్యాయమూర్తి ఇంతగా వ్యాఖ్యలు చేయడం నిజానికి అసమంజసంగా కనిపిస్తోంది. ఇంకా విచారణ జరగకుండానే, నేరం నిర్దారణ కాకుండానే తీర్పునిచ్చేసినట్టుగా ఉందని న్యాయ నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు ఏడాదిగా చెరసాల జీవితం గడుపుతున్న శిశోడియా మీద రెండు సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఇందులో సి.బి.ఐ మద్యం విధానానికి సంబంధించి నేర కోణంపై దర్యాప్తు జరుపుతుండగా, మనీ లాండరింగ్‌ కోణాన్ని ఇ.డి దర్యాప్తు చేస్తోంది. శిశోడియా ఇప్పటికే అనేక పర్యాయాలు బెయిలు కోసం అభ్యర్థించడం, కోర్టు ఈ బెయిలు అభ్యర్థనలను తిరస్కరిస్తూ రక రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ, ప్రస్తుతం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మాత్రం దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.
శిశోడియా కేసులో సరైన సాక్ష్యాధారాలను అందజేయలేదంటూ దర్యాప్తు సంస్థల తీరు మీద గత ఏడాది సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అప్రూవర్‌ చెప్పిన విషయాలు తప్ప మరే సాక్ష్యాధారాలూ అందజేయ లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే రెండు విచారణల్లో కేసు తేలిపోతుందని కూడా సుప్రీం కోర్టు అప్పట్లో విమర్శించింది. నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచడం మంచిది కాదని, ఇప్పటికే అకారణంగా జైల్లో ఉంచుతున్నట్టు కనిపిస్తోందని ఢిల్లీ హైకోర్టు దర్యాప్తు సంస్థల మీద తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది. చివరికి ఆయన బెయిల్‌ పిటిషన్లనే కాక, సంబంధిత ఇతర పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఇ.డి విచారణ పూర్తి కానప్పటికీ, ఆయన మీద ఆరోపణలు నిర్ధారణ కానప్పటికీ, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణ మాత్రం సమంజసంగానే కనిపిస్తోందని, ఈ ఒక్క ఆరోపణ నిర్ధారణ అవుతున్నట్టు కనిపిస్తోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏది ఏమైనా, ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాస్తంత తీవ్రతరంగానే కనిపిస్తున్నాయి.
నిజానికి, ప్రజాస్వామ్య విలువలకు, సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నారని, ద్రోహం చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం రాజకీయ వ్యాఖ్యలను తలపిస్తోంది. మనీ లాండిరింగ్‌ కేసుల్లో బెయిల్‌ రావడం అనేది కష్టసాధ్యమైన వ్యవహారమే అయినప్పటికీ, ఏదో ఒక శుభ ముహూర్తంలో బెయిల్‌ దక్కకపోతుందా అని నిందితులు ఆశించడం సహజం. బెయిలును తిరస్కరించడానికి గల కారణాలను తెలియజేయాల్సిన న్యాయమూర్తి కేసుపై తీర్పు చెప్పేయడానికి సిద్ధపడడం విచిత్రంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News