Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్SC on Marriage: వివాహ స్వేచ్ఛపై సుప్రీం రూలింగ్‌

SC on Marriage: వివాహ స్వేచ్ఛపై సుప్రీం రూలింగ్‌

ప్రాథమిక హక్కే కానీ, ప్రకృతి విరుద్ధం వివాహమా ?

వివాహాలు, వివాహ వ్యవస్థలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కొత్త భాష్యాలు చెప్పింది. వివాహం అనేది ప్రాథమిక హక్కే కానీ, ప్రకృతి విరుద్ధం వివాహం చేసుకునే వారి విషయంలో తామేమీ చెప్పలేమని, అది పార్లమెంటులోనే తేలాల్సి ఉంటుందని అది ఇటీవల స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన పిటిషన్లపై రూలింగ్‌ ఇస్తూ స్పష్టం చేసింది. నిజానికి, వివాహాలకు సంబంధించిన సమానత్వం విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలతో పాటు పౌరుల్లో కూడా చర్చనీయాంశమైంది. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకే కాక, వైవాహిక స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించిన విలువలకు కట్టుబడేవారిని కూడా సుప్రీం కోర్టు రూలింగ్‌ తీవ్ర కలవరానికి గురి చేసింది. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వివాహమనేది ప్రాథమిక హక్కు కాదని ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది.
ప్రత్యేక వివాహ చట్టానికి (ఎస్‌.ఎం.ఏ) తాము కట్టుబడి ఉంటామని, ఇందులో పురుషులు, స్త్రీలు తప్ప మిగిలిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా దీన్ని స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు వర్తింపజేయడమనేది తమ పరిధిలోని విషయం కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ చట్టంలో కొత్త భాషను ప్రవేశపెట్టే ప్రయత్నం తాము చేయమని కూడా తేల్చి చెప్పింది. వివాహానికి సంబంధించిన విషయాలలో అందరికీ సమాన హక్కు ఉంటుందని, ఇందులో సమానత్వం ఉండాలని చెప్పాలన్న పక్షంలో పార్లమెంట్‌ తప్పకుండా ఒక చట్టం చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పిల్లలను దత్తత తీసుకునే విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుకూలంగా స్పందించారు. ఇతర న్యాయమూర్తులు మాత్రం దీన్ని గట్టిగా వ్యతిరేకించారు.
ప్రత్యేక వివాహ చట్టం సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు అతీతంగా రూపుదిద్దుకుందని, అయితే, కేవలం పురుషులకు, స్త్రీలకు మధ్య మాత్రమే వివాహ బంధం ఏర్పడుతుందని చెప్పి స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లను దీని నుంచి మినహాయించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. వివాహ వ్యవస్థలోని సహజమైన లక్షణాలను బట్టి, ఇది ఎంతో వివక్షాపూరితంగా కనిపిస్తోందని వారు వ్యాఖ్యానించారు. అయితే, ఈ చట్టంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా వారిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని పిటిషనర్లు వాదించారు. సుప్రీంకోర్టు ఈ స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల విషయంలో వివక్షతో వ్యవహరించడం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరిస్తూ, దీనికి పరిష్కారంగా తప్పకుండా పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వివాహమనేది సహజంగా పురోగతి చెందాలని, దీన్ని బలవంతంగా సంస్కరించలేమని కూడా అది వ్యాఖ్యానించింది.
స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు వివాహాలు చేసుకోవడానికి పార్లమెంట్‌ పరంగా చట్టం రూపుదిద్దుకోవాల్సిన అవసరమేమీ లేదని, సుప్రీంకోర్టుతన రూలింగులు, తీర్పుల ద్వారా కూడా ఇందుకు మార్గం సుగమం చేయవచ్చనీ అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు. వివాహం చేసుకోవడమనేది వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రాల మీద ఆధారపడి ఉంటుందని, ఇది అందరికీ సరిసమానంగా వర్తించే విషయమనీ వారు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు అనేక సంక్షేమ పథకాలను, సౌకర్యాలను, హక్కులను వర్తింపజేస్తున్నప్పుడు వివాహానికి అనుమతి మంజూరు చేయడంలో తప్పేమీ లేదని వారు వాదిస్తున్నారు. వారి లైంగికత ఆధారంగా వారు ఏ పథకానికీ దూరం కాలేదని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వారు స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు అన్న కారణంగా వారికి స్వేచ్ఛను, సమానత్వాన్ని కల్పించడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
పిటిషనర్ల వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తన తీర్పునిస్తూ, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష ఉన్నప్పటికీ, దీని పరిష్కారం కోసం పార్లమెంట్‌ తప్పనిసరిగా చట్టం చేయాల్సి ఉంటుందని పునరుద్ఘాటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలించడానికి తాము ఒక కమిటీని నియమించబోతున్నామని, ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా తాము చట్టం తీసుకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది. అయితే, సుప్రీం కోర్టు ఈ కమిటీకి కాలపరిమితిని విధించడం గానీ, మార్గదర్శకాలు సూచించడం కానీ, జరగకపోవడం నిరాశ కలిగించింది. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు వివాహ సంబంధమైన స్వేచ్ఛను కల్పించడం వల్ల జీవిత బీమా, ఆరోగ్య బీమా వంటివి చేయించుకోవడానికి, పిల్లలను దత్తత తీసుకోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News