అల్లర్లను, హింసా విధ్వంసకాండలను అదుపు చేయడంలో ‘అలసత్వంతో’ వ్యవహరిస్తున్నందుకు మణిపూర్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు మండిపడింది. గత మే 3వ తేదీన ప్రారంభమైన జాతి సంబంధమైన కలహాలు, కక్షలు, కార్పణ్యాలు నిరవధికంగా కొనసాగుతూ ఉండడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ లో హింసాకాండకు సంబంధించి 6,500కు పైగా ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు అయినప్పటికీ, పోలీసులు అతి తక్కువ సంఖ్యలో అరెస్టులు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై తమకు తాజాగా నివేదిక సమర్పించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించిన విచారణకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ నెల 7వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అల్లరి మూకల హింసా విధ్యంస కాండల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగం పూర్తిగా కుప్పకూలిపోయాయని, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అల్లర్ల సందర్భంగా ఇద్దరు మహిళలను వివస్త్రలుగా ఊరేగించడం, వారిపై ఆ తర్వాత అత్యాచారం జరిపినట్టు వైరల్ అవుతున్న వీడియోలపై కూడా సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. తమకు పోలీసులపై గానీ, సి.బి.ఐపై గానీ నమ్మకం లేదని ఆ మహిళలు సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగడం, మణిపూర్ ప్రభుత్వం ఇంతవరకూ సరైన చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో కల్పించుకుంది. మొత్తం మీద మణిపూర్ అల్లర్లకు సంబంధించి తమ దృష్టికి అనేక దారుణాలు రావడంతో స్వయంగా ఒక కమిటీ ద్వారా దర్యాప్తు చేయడానికి కూడా సుప్రీంకోర్టు ప్రతిపాదించడం జరిగింది. సుప్రీం కోర్టు మందలింపులు, హెచ్చరికలతో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ కేంద్రంలోని బీజేపీ సహాయంతో కొత్త చర్యలు చేపట్టడానికి నడుంబిగించారు.
సుదీర్ఘ కాలం అల్లర్లు కొనసాగుతున్నాయంటే ఇందుకు ప్రభుత్వ అలసత్వమైనా కారణం అయి ఉండాలి లేక దీని వెనుక రాజకీయ కారణాలైనా ఉండి ఉండాలని అల్లర్ల చరిత్ర నిరూపిస్తోంది. మణిపూర్ అల్లర్లకు సంబంధించినంత వరకు ఇవి బయటి వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయంతో మణిపూర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే, అల్లర్లు ప్రారంభం కాగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి, అరెస్టులు జరపాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభం కాగానే పోలీసులు అరెస్టులు చేయడంలో ఆలస్యం చేసినట్టు కనిపిస్తోంది. నిందితులతో పాటు ఇటువంటి పోలీసులను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకత్వం కూడా ఈ అల్లర్లను తప్పుగా అర్థం చేసుకున్నట్టు, తేలికగా తీసుకున్నట్టు అర్థమవుతోంది. దీనిపై ప్రధాని వెంటనే ప్రకటన చేయాలనే డిమాండును పాలక పక్షం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని విజ్ఞాపన పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇరవై ఒక్క పార్టీలతో ఏర్పడిన ప్రతిపక్ష ‘ఇండియా’ బృందం ఇటీవల మణిపూర్ లో పర్యటించడం జరిగింది.
SC serious on Manipur: మణిపూర్ పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
6,500కు పైగా ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదైతే అతి తక్కువ సంఖ్యలో అరెస్టులా?