Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్SC Sub-Quota Verdict: కుల వర్గీకరణలపై చరిత్రాత్మక తీర్పు

SC Sub-Quota Verdict: కుల వర్గీకరణలపై చరిత్రాత్మక తీర్పు

రిజర్వేషన్లను మంజూరు చేయడానికి సంబంధించి రాష్ట్రాలు షెడ్యూల్డ్‌ కులాలలో ఉప వర్గీకరణను చేపట్టడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం నిజంగా చరిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల రిజర్వేషన్ల అధికార పరిధిలో ఒక అడుగు ముందుకు వేయడానికి రాష్ట్రాలకు అధికారం లభించింది. ఇదే విషయంలో చాలా కాలంగా పరస్పర విరుద్ధమైన రూలింగులు వెలువడిన నేపథ్యంలో ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారానికి ఎట్టకేలకు తెర దించింది. రాజ్యాంగం తప్పనిసరి చేసిన సమానత్వానికి ఉప వర్గీకరణ ఏమాత్రం విరుద్ధం కాదని, రాజ్యాంగ సూత్రాలను ఏవిధంగానూ ఉల్లంఘించడం జరగడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి, సమానత్వం సాధించడానికి ఈ ఉప వర్గీకరణ ఎంతగానో దోహదం చేస్తుందని కూడా అది పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాలలోని వర్గాలన్నీ ఒకే జాతికి చెందినవి కాకపోవడం వల్ల, వాటిని వేరు వేరుగా పరిశీలించడానికి అవకాశం ఉన్నందువల్ల ఉప వర్గీకరణ చేపట్టడానికి అభ్యంతరమేమీ ఉండకపోవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
షెడ్యూల్డ్‌ కులాలలోనే కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు అందని స్థితిలో ఉప వర్గీకరణ వల్ల అందరికీ రిజర్వేషన్‌ ఫలాలు తగ్గే అవకాశం ఉంటుందని అది తెలిపింది. వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఉప వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నందువల్ల ప్రతి రంగంలోనూ ఈ వర్గాలకన్నిటికీ సమాన ప్రాతినిధ్యం లభించే అవకాశం కూడా ఉంది. పంజాబ్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు కొద్ది కాలం క్రితం షెడ్యూల్డ్‌ కులాలలోని అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేశాయి కానీ, వాటికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. నిజానికి, షెడ్యూల్డ్‌ కులాల్లో ఉప వర్గీకరణ చేపట్టడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఉప వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహ రించడానికి వీల్లేదని, వివిధ వర్గాలకు సంబంధించిన సమాచారాన్నంతా సేకరించి, దానికి తగ్గ ట్టుగా వర్గీకరణ చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సవాలుగా మారబోతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతులు, సాధనాల ద్వారా వారి వెనుకబడినతనాన్ని లోతుగా అధ్యయనం చేసి ఒక అంచనాకు రావలసి ఉంటుంది. ఇది ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని బట్టి, విద్యా ప్రమాణాలను బట్టి మాత్రమే అంచనా వేయకూడదు. వివిధ వర్గాల సామాజిక స్థితిగతుల్ని సాపేక్షికంగా ఒక కొలబద్ద ప్రకారం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజర్వేషన్లలో ఈ ఉప వర్గీకరణను జాతీయ స్థాయిలో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వర్గం పరిస్థితి సామాజికంగా మారిపోయే అవకాశం ఉంది. మొత్తం మీద ఉప వర్గాలకు సంబంధించి రాష్ట్రాల్లోనూ, జాతీయ స్థాయిలోనూ సమగ్ర అధ్యయనాలు జరపవలసిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలోనే కుల గణన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సాధారణంగా ఇటువంటి వ్యవహారాల్లో రాజకీయ, ఓట్ల ప్రాధాన్యాలు కీలక పాత్ర పోషించే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో న్యాయ స్థానాలు తగిన రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
ఈ ఉప వర్గీకరణ అంశం చాలా కాలం నుంచే కర్ణాటకలో ఒక చర్చనీయాంశంగా మారింది. రాజ్యాం గాన్ని సవరించయినా ఉప వర్గీకరణకు అవకాశం కల్పించాలంటూ సిద్దరామయ్య ప్రభుత్వం డిమా్‌ండ చేయడం జరిగింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు దీనికి పచ్చ జెండా ఊపినప్పటికీ, వీటికి తగ్గ ట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవలసి ఉంటుంది. ఫలితంగా కొంత కాలం పాటు ఈవ్యవహారం ఒక బృహత్తర కార్యక్రమం కాబోతోంది. ఈ విధానాలను అమలు చేయడంతో పాటు ఈ కొత్త వర్గాల కోసం తమ పథకాలను మార్చుకోవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల్లో బాగా వృద్ధిలోకి వచ్చినవారిని రిజర్వేషన్ల నుంచి తొలగించాలంటూ మొత్తం ఏడుగురు న్యాయమూర్తుల్లో నలుగురు న్యాయమూర్తులు సూచించడం కాల క్రమంలో ఒక వివాదాస్పద అంశంగా మారే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News