Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Schemes for campaign?: పథకాలకు ప్రచారమా? అధికార దుర్వినియోగమా?

Schemes for campaign?: పథకాలకు ప్రచారమా? అధికార దుర్వినియోగమా?

ప్రచార ఆర్భాటాలకు ప్రజా సొమ్ము కూడా

దేశ ప్రజల ప్రయోజనం కోసం ఏటా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి నిజంగా చేరాయా, లేదా అని పరిశీలించడం చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఇందులో సందేహమేమీ లేదు. ఇది అడపాదడపా జరగాల్సిన వ్యవహారం. సంక్షేమ రాజ్యంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం, వాటి ఫలాలు, ఫలితాలు అందరికీ చేరేలా చూడడం, వాటిని బట్టి కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం, నిధుల కేటాయింపును పెంచడం వంటివి జరుగుతూనే ఉండాలి. కేంద్రప్రభుత్వం సరిగ్గా ఇదే పని చేయదలచుకుంది. వాహనాలకు మైకులు అమర్చి, వీడియోలను ఏర్పాటు చేసి, వాడవాడలా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడం, వారు వాటిని అందుకునేలా చేయడం నవంబర్‌ 15 జరగబోతుంది. ఈ కార్యక్రమం జనవరి 25 వరకూ కొనసాగుతుంది. దీపావళి తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా సుమారు 2.7 లక్షల పంచాయతీల పరిధిలో ఈ సంక్షేమ పథకాల ప్రచారం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో భారీగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, నిరుపేదలకు సంక్షేమ పథకాల వివరాలు సక్రమంగా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, అత్యధిక సంఖ్యాక పేద జనాభాకు ఈ పథకాలను గురించిన అవగాహన లేదు. వీటిని ఎలా పొందాలన్నది తెలియదు. వీటి విషయంలో ఎవరికి కలుసుకోవాలన్నది తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకాల పట్ల పూర్తి అవగాహన చాలా తక్కువలో ఉంటుంది. రాష్ట్రయ ప్రభుత్వాలు చేపట్టే పథకాల విషయంలో కొద్దిగానైనా అవగాహన ఉంటుంది కానీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో చాలా తక్కువగా అవగాహన ఉండే అవకాశం ఉంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం జరగదు. ఈ పరిస్థితిలో తమ పథకాల పట్ల ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ముఖ్యంగా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమీక్షించే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే ఊరూరా తిరుగుతూ ఈ పథకాలకు ప్రచారం కల్పించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది.
‘వీక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ పేరుతో భారత ప్రభుత్వం తమ తొమ్మిదేళ్ల విజయాలను, సాఫల్యాలను దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడానికి ‘రథ ప్రభారీ’లను ఏర్పాటు చేసి, ఆ బాధ్యతను కొందరు అధికారులకు అప్పగించడం జరుగుతోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం ఒక సర్క్యులర్‌ జారీ చేసినట్టు తెలిసింది. సహజంగానే ఇది రాజకీయంగా ఒక వివాదాంశంగా మారింది. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం తమ ప్రచారానికి బ్యురాక్రాట్లను, సివిల్‌ సర్వంట్లను రాజకీయమయం చేసే ఆలోచనలో ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. ఈ సర్క్యులర్‌ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతేకాక, సెలవుల్లో ఉన్న సైనికులు భారత ప్రభుత్వ సైనిక అనుకూల పథకాలను ఏ విధంగా అమలు చేస్తోందో తెలియజేస్తూ ప్రచారం చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను కూడా ఉపసంహరించుకోవాలని ఆయన అదే లేఖలో ప్రధానిని కోరారు.
ప్రతిపక్షాల అనుమానాలు
ఊహించినట్టుగానే బీజేపీ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది. భారత ప్రభుత్వం పేదలకు, గ్రామీణ ప్రజలకు చేపడుతున్న పథకాల గురించి వారికి తెలియజెప్పాలని, వారికి వీటిపట్ల అవగాహన కల్పించాలని మాత్రమే అధికారులకు సూచించడం జరిగిందని రెవెన్యూ విభాగం వివరించింది. అధికారుల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని విస్మరించరాదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సంవత్సరాంతానికి చేరుకుంటున్నందు వల్ల పథకాలకు సంబంధించిన వ్యయాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని, అవి గరిష్ట స్థాయిలో ప్రజలకు చేరేలా చూడాల్సిన అవసరం ఉంటుందని కూడా ప్రభుత్వం వివరించింది. జాయింట్‌ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, డైరెక్టర్ల స్థాయి అధికారులకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేసి, ప్రజలకు వివరించే బాధ్యతలను అప్పగించింది. పార్టీల మధ్య వాద వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ తదితర బ్యురాక్రాట్లు తటస్థంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. పాలక పక్షానికి, ప్రభుత్వానికి కొమ్ముకాయడం జరుగుతోందంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న బ్యురాక్రాట్లు ఈ విమర్శలకు దూరంగా ఉండడం అవసరం. కాగా, కేంద్ర మప్రభుత్వం ఈ విధంగా తమ పథకాలకు ప్రచారం చేయడం అనేది మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నప్పటికీ, ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఎలా ఉండబోతోందన్నది అర్థం కావడం లేదు. ఇక్కడ ఇటువంటి ప్రచారం జరపవచ్చా, లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నిజానికి ఈ రాష్ట్రాల్లో సం క్షేమ పథకాల కోసం కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాక, ఇందులో ఒకటి రెండు రాష్ట్రాలలో ఇవి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా కూడా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర పథకాలుగా అమలు చేయడం, పైపెచ్చు కేంద్రం ఏమీ చేయడం లేదనే ప్రచారం చేయడం కూడా జరుగుతోంది. కాగా, ప్రధాన ప్రతిపక్షాలు గ్యారంటీలను, అనేక ఉచితాలను ప్రకటిస్తున్న రాష్ట్రాలలో పోటీని తట్టుకోవడానికి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
ప్రజల కోసమే ఇదంతా!
ప్రజల కోసం ప్రారంభించిన పథకాలు లబ్ధిదారులకు చేరడం, లక్ష్యాలను పూర్తి చేసుకోవడం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమే. ఇందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మాత్రం సందేహాస్పదంగా ఉంది. రథ ప్రభారీలు, ప్రభుత్వ సాఫల్యాలు, ప్రదర్శనలు, వేడుకలు అంటూ ప్రభుత్వం తమ సర్క్యులర్‌లో వాడిన పదజాలం ప్రతిపక్షాలు అనుమానపడడానికి ఆస్కారం కల్పిస్తోంది. అధికారులకు రథ ప్రభారీలను ఏర్పాటు చేయడమేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇది ప్రభుత్వ అధికారులకు సంబంధించిన నియమ నిబంధనల్లో ఎక్కడుంది? ఇందులో పాలన కంటే రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణలు అవసరమే కానీ, వాటి కోసం ప్రభుత్వం వాడే పదజాలం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యురాక్రాట్లు వీలైనంతగా రాజకీయాలకు దూరంగా ఉండక తప్పదు. వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పార్టీల కోసం పని చేయకూడదు. పార్టీల్లో సభ్యులు కాకూడదు. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వారు ఆయా ప్రభుత్వ విధానాలను అమలు చేయాల్సిందే. లేని పక్షంలో పాలన స్తంభించిపోతుంది. పాలకపక్ష ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత వీరికి ఉండకూడదు. అవి వీరికి ప్రాధాన్యం కాకూడదు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఎంతో నమ్మకస్థుడు, విధేయుడు అయిన వి.కె. పాండ్యన్‌ కు పదవీ విరమణ తర్వాత క్యాబినెట్‌ ర్యాంకు ఇవ్వడం వివాదాన్ని సృష్టించింది. హద్దులు, పరిమితులు దాటకూడదన్న అభిప్రాయానికి బీజేపీ ప్రభుత్వం స్థిరంగా కట్టుబడి ఉండాలి. అధికారులు కూడా పాలక పక్ష కార్యకలాపాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ప్రజలకు పాలనా యంత్రాంగం మీద నమ్మకం పోయినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడం ఖాయం.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News