Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Secular parties Sita slogan: సీతాదేవికి గుడి, నితీష్ కు ఓట్లు

Secular parties Sita slogan: సీతాదేవికి గుడి, నితీష్ కు ఓట్లు

వామ్మో జై హిందుత్వ అనకపోతే ఇక మన ఓట్లు, సీట్లు గల్లంతవ్వటం ఖాయం. ఈ భయం పట్టుకుంది దేశంలోని అన్ని సెక్యులర్ పార్టీలకు. తాజాగా జనతా దళ్ యునైటెడ్ (జేడీయు) కూడా ఈ భయంతో వణికిపోతూ తన పంథాను మార్చుకుంది. తన ‘కోర్ వోటర్’ ఎక్కడ జై బీజేపీ అంటాడో అన్నది జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ను పట్టి పీడిస్తున్న సమస్యగా మారిపోయింది. అందుకే ఆయన సీతమ్మకు జై కొడుతున్నారు.

- Advertisement -

గుర్తుందా మొదటిసారి ప్రధాని మోడీని ప్రధానిగా గెలిపించుకునేందుకు ‘హర్ హర్ మోడీ’ అనే నినాదాన్ని ఎత్తుకుంది బీజేపీ. ఇదే రూటులో పయనిస్తున్న నితీష్ ఇప్పుడు ‘హర్ ఘర్ గంగాజల్’ అంటూ శుద్ధ హిందీ, శుద్ధ సంస్కృతం, శుద్ధ హిందుత్వ నినాదాన్ని వినిపిస్తున్నారు. భగిరథి ప్రాజెక్టు పేరుతో సాగుతున్న పనులను ‘హర్ ఘర్ గంగాజల్’ అంటూ జేడీయు పిలుస్తుండటం విశేషమే.

మొత్తానికి బిహార్ లో సరికొత్త రాజకీయాలు తీసుకుంటున్న మలుపులు బహు రంజుగా మారుతున్నాయి. బిహార్ లో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీల కూటమి ఇలాంటి ఫార్ములాతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా శాశ్వతంగా చెక్ పెట్టచ్చనే యోచనలో ఉంది. అందుకే హిందువుల సెంటిమెంట్లకు మొట్టమొదటి సారి వీరి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తోంది.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రభావం ఈ కూటమిపై గట్టిగా పడింది. అంతెందుకు బిహార్ కు చెందిన మంత్రి జేడీయూ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ అయితే అందరికంటే ముందే చాలా అడుగులు ముందుకేసి ఈ రేసులో దూసుకుపోతున్నాయి. సీతాదేవికి ‘సీతమడి’లో గుడి కట్టాలని మంత్రి బిజేంద్ర కేంద్రానికి విజ్ఞప్తి చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అంతేకాదు అయోధ్యలో రామమందిరం తరహాలో ఇక్కడి సీతామడిలోనూ భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా అయోధ్య తరహాలోనే సీతమ్మకు గుడి కట్టాలని ఆయన డిమాండ్ చేస్తుండటం చాలా ఆసక్తికలిగిస్తోంది. ఆర్కియాలజీ శాఖ ధ్రువీకరించలేదు కానీ పురవాస్తు శాఖ (ఏఎస్ఐ) ఇక్కడనే సీతాదేవి పుట్టిందని ధ్రువీకరిస్తే చాలు సీతమడిని మరో అయోధ్యలా మార్చేందుకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం తహతహలాడుతోంది. బిహార్ లోని సీతామడిలోనే సీతాదేవి జన్మించినట్టు స్థలపురాణం ప్రకారం భావిస్తారు.

మంత్రి బిజేంద్ర చేసిన ఈ కామెంట్ల తరువాత కొద్ది రోజులు కూడా గడిచాయో లేదో ఇటు సీఎం నితీష్ కుమార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘గంగా జల్ అపుర్తి యోజన’ అనే విశేషమైన ప్రాజెక్టును వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో పవిత్ర గంగానది నీటిని పైప్ లైన్ ద్వారా నలందా ఉన్న రాజ్ గిర్, గయా, నవాడా వంటి ప్రాంతాలకు సప్లై చేస్తారు. సుమారు 151 కిలోమీటర్ల మేర ఈ గంగా నది నీటి పంపిణీ జరిగేలా చూస్తారు. ఈ కార్యక్రమంలో జేడీయూ నేతలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ సీఎం నితీష్ ను ఏకంగా ‘అపర భగీరథుడు’ అని పొగుడుతూ పోయారు. అంతేకాదు జరాసంధుడి అఖారాను అభివృద్ధి చేయాలని, ఇందుకు నిధులు కావాలని కేంద్రాన్ని ఎంతోకాలంగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని నితీష్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘జరాసంధ్ కా అఖారా’ అనే నలందలోని ఓ ప్రాంతంలో మగధ రాజు జరాసంధుడిని కృష్ణుడి సూచనల మేరకు భీముడు చంపాడని ప్రతీతి. ఈ ప్రాంతాన్ని ఏఎస్ఐ, కేంద్రం అభివృద్ధి చేయాలని నితీష్ పోరాడుతున్నారు. అందుకే పదేపదే మహాభారతాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.

పురాణాలు, ఇతిహాసాలు, హిందూ మతంపై పేటెంట్ రైట్స్ మావంటే మావి అనే స్థాయిలో బీజేపీతో ఇతర పార్టీలు పోటీ పడుతుండటం ఈమధ్య మనదేశంలో రొటీన్ గా మారింది. రాజకీయాలు కుల, మతతత్వంగా మారుతున్నాయనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రసంగించారంటే చాలు మన మైథాలజీని ప్రస్తావించకుండా ఆ ప్రసంగాలు అస్సలు ముందుకుపోవు. తమ ప్రధాన ప్రత్యర్థి, అత్యంత బలమైన ప్రత్యర్థిని మట్టి కరిపించాలంటే అదే రూట్ లోనే తామూ ప్రయాణించాలని బీజేపీయేతర పార్టీలన్నీ ఫిక్స్ అయ్యాయి. ఈమధ్య సీతాదేవి, భగీరథుడు, పవిత్ర గంగాజలం, జరాసంధుడు వంటివి బిహార్ రాజకీయాల్లో అంతర్భాగంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఝలక్ దెబ్బకు హిందూ ఓటర్లబాట పడుతున్నారు నితీష్.

వీటిని గట్టిగా విమర్శిస్తున్న బీజేపీ విష్ణుపాద టెంపుల్ లోకి ఓ అన్యమతస్థుడిని నితీష్ వెంటబెంటుకుని ఈమధ్యనే వెళ్లారనే విషయాన్ని ఎత్తిపొడుస్తూ విమర్శలకు దిగుతోంది. సీతాదేవికి బ్రహ్మాండమైన గుడిని కట్టాలని డిమాండ్ చేయటమంటే అది ‘జెండర్ ఈక్వాలిటీ’ అంటూ జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ సరికొత్త వాదనకు పదును పెట్టడం చూస్తుంటే మన రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టాయో అర్థమవుతోంది.

బీజేపీ రాముడు అంటుంటే, అయోధ్య అంటుంటే జేడీయూ మాత్రం సీతాదేవి, సీతామడి అంటోందని రాజకీయ పండితులు సైతం విస్మయానికి గురవుతున్నారు.

ఇటు గుళ్లూ, గోపురాలు, అర్చకులు, వాళ్లకు జీతాలు, అర్చకుల నియామకాలు, టెంపుల్ టూర్ కు సబ్సిడీలు ఇలా పలు పథకాలను అమల్లోకి తెస్తోంది డీఎంకే సర్కారు. మరోవైపు ;కాశీలో చెన్నై సంగమం’ అంటూ వారణాసికి-రామేశ్వరానికి ఉన్న అనుబంధాన్ని వెలికి తీస్తూ కమలనాథులు కొత్త విషయాన్ని ద్రవిడులకు అర్థమయ్యేలా చెప్పేస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ పూజలు, గుళ్లు, పీఠాధిపతుల విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక విశాఖ శారదా పీఠంతో, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో సీఎం జగన్ కు ఉన్న అనుబంధం మనం రోజూ చూస్తున్న విషయమే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ ఆధ్వర్యంలో 1400 హిందూ దేవాలయాలు కొత్తవి నిర్మించే ప్రకటనలు ఇవన్నీ ఎన్నికల సన్నాహకాలే అని అర్థం కానిదెవరికి. తాము అధికారంలోకి వస్తే తీర్థయాత్రలకు సబ్సిడీ ఇస్తామంటూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్టాండర్డ్ మ్యానిఫెస్టో పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. హిందూ వ్యతిరేకి కాదు, హిందూవాది, హిందుత్వాన్ని ఆకళింపు చేసుకున్న నేతగా ఇమేజ్ ఉండటం ఇప్పుడు ఎన్నికల్లో అతి ముఖ్యమైన అర్హత అనే విషయాన్ని బీజేపీయేతర పార్టీలు ఆలస్యంగానైనా గుర్తిస్తున్నాయి. మనదేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు కాబట్టి ఈ మెజార్టీ ఓటర్ల సెంటిమెంట్లను గౌరవించి, గుర్తించాలనేది ఈ ఎన్నికల సూత్రాలు చెబుతున్న అసలు తత్వం.

అటు ‘భారత్ జోడో యాత్ర’లో బిజీగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కనిపించిన అన్ని గుళ్లూ, గోపురాలకు వెళ్తున్నారు. మొక్కేస్తున్నారు, బొట్లు పెట్టుకుని, పూజలు చేసేస్తున్నారు, తన గోత్రాన్ని చెబుతున్నారు, సాష్టాంగ నమస్కారం చేసేస్తూ తన వస్త్రధారణ కూడా గుడికి వెళ్లినప్పుడు సంప్రదాయబద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి దీన్నంతా ఏమనాలి?

‘చర్చ్ అండ్ పాలిటిక్స్’ ఎప్పుడూ విడదీయలేని అవినాభావ సంబంధాన్ని పెనవేసుకుని ఉంటాయని వెస్ట్ లో ఎంతోమంది పొలిటికల్ ఫిలాసఫర్స్ శతాబ్దాలుగా చెబుతూనే వస్తున్నారు. అభివృద్ధిలో పరుగులు పెడుతూ ‘ఏషియన్ టైగర్’ గా గర్జిస్తున్న మనదేశం లౌకిక దేశమైనా ఓట్ల రాజకీయాలు మాత్రం తారాస్థాయిలో జరుగుతున్నాయి. మెజారిటీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న పార్టీలు ఆయా సామాజిక సమీకరణాల ఆధారంగానే రాజకీయాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారన్నది అక్షర సత్యం. క్యాస్ట్ ఈక్వేషన్ తరువాతే ఏ ఈక్వేషన్ అయినా. ఆఖరుకి దేశంలోని ఏ ప్రముఖ రాజకీయ పార్టీనైనా తీసుకోండి ఆ పార్టీ అధినేతలు ఎవరైనా, ఎప్పుడు ప్రజల ముందు, మీడియా ముందు కనిపించినా పలు సామాజిక సమీకరణాలకు నిలువెత్తు రూపంగా తన వెంట మందీ మార్బలాన్ని వెంటేసుకుని తిరుగుతుంటారు. అంతేకాదు ఓబీసీ లీడర్ ను తిట్టాలంటే మరో ఓబీసీ లీడర్ నే ప్రయోగిస్తుంది ఏ పార్టీ అయినా. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లీడర్ పై ఆరోపణలు గుప్పించాలంటే ప్రత్యర్థి పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లీడర్ తోనే సంచలన ఆరోపణలు చేయిస్తారు. పార్లమెంట్ లో, అసెంబ్లీలో, బయట బహిరంగ సభలో, లేదా మీడియాతో మాట్లాడేటప్పుడైనా ఆయా నేతలు వాళ్ల వాళ్ల సామాజిక వర్గం నేపథ్యంలోనే ప్రసంగాలు, ప్రకటనలు, ఆరోపణలు చేస్తుండటం ఓ సక్సెస్ ఫార్ములాగా మనదేశంలో పాటిస్తున్నారు. దశాబ్దాలుగా ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయాలే సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News