దేశద్రోహానికి సంబంధించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు అవకాశం ఇవ్వవద్దంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఈ వలస పాలకుల నాటి చట్టంపై మళ్లీ అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఈ చట్టాన్ని తాము త్వరలో రద్దు చేయబోతున్నామని, వీటి స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్) లేక కొత్త ఇండియన్ పీనల్‌కోడ్ కు పార్లమెంట్ ఆమోదం తెలియజేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే అమలులోకి రావడం జరుగుతుందని, ఇదివరకటి నుంచి అమలులో ఉన్న పాత చట్టాన్నే ఇప్పుడు అమలు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే, ఇదివరకటి దేశ ద్రోహ చట్టం కింద కేసులు నమోదై, విచారణలో ఉన్నవారిని ఇదివరకటి చట్టంప్రకారమే విచారించడం జరుగుతుందని, దీని రాజ్యాంగబద్ధత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలియజేసింది.
ఈ చట్టాన్ని కొత్తగా ఎవరికీ అమలు చేయవద్దని, ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దేశ ద్రోహానికి సంబంధించి ఐ.పి.సి సెక్షన్ 124(ఎ)ను ఇక నుంచి అమలు చేయవద్దని కూడా అది సూచించింది. ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని బట్టి ఈ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తన అసమ్మతిని చెప్పకనే చెప్పినట్టయింది. దేశ ద్రోహం కేసులకు వర్తించే ఐ.పి.సి సెక్షన్ 124 (ఎ) ఒక రాక్షస చట్టమనే అభిప్రాయం చాలా కాలంగా వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతూనే ఉంది. ఈ చట్టం రాజ్యాంగబద్ధత గురించి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 124 (ఎ)లో పేర్కొన్న నేరాలన్నీ కొత్తగా రూపొందించిన బి.ఎన్.ఎస్ చట్టంలోని సెక్షన్ 150లో కూడా పొందుపరచడం జరిగింది. కొత్త చట్టంలో దేశ ద్రోహం అనే మాటను ఎక్కడా ప్రస్తావించలేదు కానీ, ‘దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకు భంగం కలిగించే చర్యలు’ అంటూ దీని నిర్వచనాన్ని విస్తరించడం జరిగింది. శిక్షలను కూడా మరింత కఠినతరం చేయడం జరిగింది. ఈ దేశ ద్రోహ చట్టానికి తాము స్వస్తి పలికే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టయింది.
ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయవద్దని లా కమిషన్ గతంలోనే ఒక నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ ఈ ఏడాది ప్రారంభంలో తన 279వ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తూ, కొన్ని సవరణలతో ఈ చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. ప్రభుత్వం ఈ విషయంలో కమిషన్ సిఫారసులను తుచ తప్పకుండా స్వీకరించింది. అయితే, ప్రధాన న్యాయమూర్తి సి.వై. చంద్రచూడ్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ప్రభుత్వ అభిప్రాయాలతో ఏమాత్రం ఏకీభవించడం లేదు. దీనిపై విచారణను చేపట్టవద్దని, వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం వెనుక ఉన్న ఉద్దేశం దీనిపై కాలయాపన చేయించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. న్యాయస్థానం తన అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు, మార్చుకునే ఉద్దేశంలో ఉన్నప్పుడు దీనిపై విచారణ చేపట్టడం భావ్యం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్థమవుతోంది. దీని ప్రభావం ప్రజల వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛల మీద పడే అవకాశం ఉంది.
Sedition law: దేశద్రోహ చట్టంపై తర్జనభర్జనలు
ఐ.పి.సి సెక్షన్ 124(ఎ)ను ఇక నుంచి అమలు చేయవద్దని సుప్రీం సూచన