Sunday, December 8, 2024
Homeఓపన్ పేజ్పాటల తూటాలు బిగించె పెన్‌ గన్‌ సీరపాణి ‘బ్రెన్‌ గన్‌'

పాటల తూటాలు బిగించె పెన్‌ గన్‌ సీరపాణి ‘బ్రెన్‌ గన్‌’

బ్రెన్‌ గన్‌లో పాటల తూటాలు బిగించి పేల్చేయమంటాడు

‘కవీనాం కవిః’ అంటే కవులకు కవి అని అర్థం. కొందరు కవులు కవులకు మార్గదర్శకులౌతారు. అదేవిధంగా మరికొందరు కవులు యువకుల్ని, నవకవుల్ని ఉత్తేజపరుస్తారు. ఇలాంటి సందర్భాలు మన సాహితీరంగంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనబడుతూ ఉంటాయి. ఆధునిక కవుల్లో గురజాడ, శ్రీశ్రీ వంటి వారు ఆ కోవకు చెందుతారు. కళింగాంధ్రకు చెందిన అభ్యుదయకవి సీరపాణి రచించిన ‘బ్రెన్‌ గన్‌’ అనే కవిత ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. ఈ కవిత సీరపాణి రచించిన ‘డమరుధ్వని’ కవితా సంపుటి లోనిది.
‘రాసుకోవోయ్‌ కవీ!
రాకాసి కోరలు గీసుకోనీవోయ్‌ కవీ!
అణువణువున అణుబాంబులు ప్రేల్చుకో!
జీవితాన్ని హవిస్సుగా వ్రేల్చుకో’
అందరి కవులకూ ఇలాంటి సందేశాలు అవసరం లేదు. కవిత్వమనేది శంగారం, హాస్యం, కరుణ మొదలైన నవరసాల్లో ఏ రసంలోనైనా రాయవచ్చు. ఏ విషయం మీదైనా రాసి మెప్పించవచ్చు. కానీ ప్రస్తుతం ‘బ్రెన్‌ గన్‌’ అనే ఈ కవిత ప్రగతివాద కవులను గూర్చి చెబుతున్నది. ఇది వీర, రౌద్ర, భయానక రసాల్లో ఉంటుంది. ప్రజాభ్యున్నతిని కోరే కవి అభ్యుదయ నిరోధక శక్తులతో పోరాటం చెయ్యవలసి ఉంటుంది. అందుచేత ‘రాకాసి కోరలు గీసుకోనీవోయ్‌ కవీ’ అని అంటున్నాడు. ఈ నీ పోరాటంలో నీకు భయంకరమైన సంఘటనలు ఎదురౌతాయి. అయినా అణువణువునా అణుబాంబులు ప్రేల్చుకొమ్మనీ, జీవితాన్ని హవిస్సుగా వ్రేల్చుకొమ్మనీ అంటున్నాడు.
‘ఎక్కదలచిన రైలు కిందే
ముక్కలైపోవోయ్‌!
మూడు యాభైలెవడు బ్రతికెను
ముందు కురికీవోయ్‌’
‘నువ్వు ఎక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు’ అంటారు ఆరుద్ర. ఆ ఆలస్యానికి తాళలేక ఏదో ఒక రైలు ఎక్కేస్తావంటాడు. కాకపోతే సీరపాణి ఈ కవితలో ‘ఎక్కదలచిన రైలు కిందే ముక్కలై పోవోయ్‌’ అంటాడు. అంటే కార్యసాధనలో ఎదురయ్యే అవాంతరాలకు బలిదానం చేసి అయినా ప్రగతిని సాధించమంటున్నాడు. ఆ విషయానికి సమన్వయంగా ‘ఎవడు బతికేడు మూడు యాభైలు’ అనే లోకోక్తినే పునరుక్తిగా చెబుతున్నాడు. అంటే ఎప్పటికైనా మరణం తప్పదు కదా! అని.
‘ఇల్లూ-పొల్లూ, పిల్లా-జల్లా
ఎక్కడి వేదాంతం?
బ్రతుకూ-భాగ్యం జానేదేవ్‌!
పదవోయ్‌ సద్గురు దేవ్‌’
ఏ కాలంలో నైనా ప్రజల కోసం తమ ధన మాన త్యాగం చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. పురాణ కాలంలో అయితే బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, దధీచి, కర్ణుడు మొదలైన మహాదాతలు, త్యాగమూర్తులు బలిదానం చేసిన వారే. అంతెందుకు మన భారత స్వాతంత్య్ర సమరంలో ఎన్నెన్నో త్యాగాలూ, బలిదానాలు చేసిన దేశభక్తులు కోకొల్లలు. ప్రజాకవిని ఇక్కడ గురుదేవునిగా సంబోధిస్తున్నాడు.
‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఆకాశం
దాని మెడలో మినుకు మినుకున కునుకుతున్న
పునుకుల పట్టెడ తారా నివహం’
ఈ ఒక భయానక దశ్యాన్ని కళ్ళకు కట్టించేందుకు ఆకాశాన్ని ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిగా’ కవి ఊహిస్తున్నాడు. వెయ్యి తలలు ఖండించిన చింతామణి వంటిది ఈ క్రూరమైన వ్యవస్థ. దానికి సాక్ష్యంగా దాని మెడలో కపాలాల పట్టెడు వ్రేలాడుతోంది. ఆకాశములో మినుకు మినుకుమనే నక్షత్రాలే ఆ కపాలాలుగా కవి అభివర్ణిస్తున్నాడు.
‘చీకటి కోట బురుజు మీద ఉస్సు
రంటూ వ్రేలాడుతోంది ఉడుపతి శిరస్సు!
ఎప్పుడు నరుకుతావయ్యా ఈ చీకటి కట్లు? ఇంకెప్పుడు కడతావయ్యా స్వర్గానికి మెట్లు?’
ఉడుపతి అంటే చుక్కలకు రాజు చంద్రుడు. అతన్ని ఓ తిరుగుబాటు నాయకుడిగా కవి వర్ణిస్తున్నాడు. చీకటి కోట అంటే ఈ దౌర్జన్య పూరితమైన వ్యవస్థ. ఆ కోట బురుజు మీద ఆ నాయకుడి శిరస్సు ఉరి తీయబడి వ్రేలాడుతోందట. ఇంకా ఎప్పుడు ఈ వ్యవస్థకు ఉన్న బంధాలు ఛేదిస్తావు? ఇంకెప్పుడు స్వర్గానికి మెట్లు కడతావు? అని కవిని ప్రశ్నిస్తున్నాడు.
‘అల్పాయస్సులో హేమంతాలు వెయ్యి
ఇప్పటికే, నీ జీవితం సిగరెట్టు సగం రొయ్యి’
ఆరు రుతువుల్లోనూ హేమంతం ఒక గడ్డుకాలంగా భావిస్తాం. పచ్చని ఆకుల సైతం హేమంతంలో పండువారి ఎండిపోయి శిశిరంలో రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ స్వల్పకాలికమైన జీవితంలో గడ్డు రోజులన్నీ హేమంతాల వంటివే! అంటే సుఖశాంతులకు నోచుకోనివి. లోకం పోకడ తెలుసుకునే సరికే సగం జీవితం గడిచిపోతుందని అంతరార్థం.
‘అందుకే, అందుకో ఆదర్శాల బ్రెన్‌ గన్‌
పాటల తూటాలు బిగించి, పేల్చీవోయ్‌ ధన్‌ ధన్‌’
ఇక ఎంతమాత్రమూ కాలయాపన చెయ్యక తన ఆదర్శాలు అనే బ్రెన్‌ గన్‌లో పాటల తూటాలు బిగించి పేల్చేయమంటున్నాడు. ఒక తూటా గురి తప్పకుండా ప్రయోగిస్తే ఒక గుండెలోకి మాత్రమే దూసుకుని పోగలదు. అదే ‘పాట’ అయితే లక్షల కోట్ల హదయాలను ప్రభావితం చెయ్యగలదు. దీన్నిబట్టి తూటా కంటె పాట ఎంత శక్తివంతమైనదో తెలుస్తోంది. తూటా ప్రయోజనం అతి స్వల్పం. పాట ప్రయోజనం అనల్పం. అది ఏ కాలంలో నైనా ధ్వనిస్తుంది. తూటా హింసాత్మకం. పాట అహింసాత్మకం. ఈ కవిత రచనా కాలం 1972వ సంవత్సరం. 1974లో ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో ఈ కవిత ప్రచురించబడింది.

  • పిల్లా తిరుపతిరావు
    7095184846
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News