Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Senior citizens: వృద్ధ జనాభా ఓటు బ్యాంకు కాదా?

Senior citizens: వృద్ధ జనాభా ఓటు బ్యాంకు కాదా?

సీనియర్ సిటిజెన్స్ సంక్షేమం ప్రభుత్వాలకు పట్టదేం?

దేశంలో వృద్ధులను వారి పిల్లలు, సమాజమే కాదు, ప్రభుత్వాలు సైతం పట్టించుకోవడం లేదు. దేశంలో మత పరమైన, కుల సంబంధమైన ఓటు బ్యాంకులున్నాయి కానీ, వృద్ధుల ఓటు బ్యాంకు మాత్రం అభివృద్ది చెందడం లేదు. నిజానికి, భారతదేశ జనాభా క్రమంగా పెరగడమే కాదు, వయసులోనూ వృద్ధి చెందుతోంది. దీర్ఘాయుర్దాయానికి అవకాశాలు పెరుగుతున్నాయి. శిశు మరణాల సంఖ్య ఆయేటికాయేడు గణనీయంగా తగ్గిపోతోంది. 2050 వచ్చే నాటికి దేశంలో యువకుల సంఖ్య కంటే వృద్ధుల సంఖ్య బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2022 నాటికే దేశంలో 60 ఏళ్ల పైబడినవారి సంఖ్య 14.90 కోట్లకు చేరుకుంది. అంటే మొత్తం దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య 10 శాతానికి పైగానే ఉంది. 2050 నాటికి దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య 20 శాతం మించిపోయే అవకాశం ఉందని జనాభా లెక్కల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 34.70 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. అంతే కాదు, 2036 నాటికే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి అయిదు మందిలో ఒకరు వృద్ధులు అయ్యే అవకాశం ఉంది. వృద్ధుల జనాభాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఈ వ్యత్యాసం మరీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.

- Advertisement -

గత ఏడాది ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ విడుదల చేసిన భారతీయ వృద్ధాప్య నివేదిక, ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వంటి ఇతర సంస్థలు విడుదల చేసిన నివేదికలను బట్టి, దేశంలో వృద్ధుల జనాభా ఏ స్థాయిలో పెరుగుతున్నదీ, దీని ప్రభావం ఎలా ఉండబోతోందీ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితిగతులను కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు రూపొందించవలసిన పథకాలు, విధానాలు, కార్యక్రమాల గురించి ఈ నివేదికల్లో ప్రముఖంగా సూచనలు చేయడం జరిగింది. ఇప్పటి తరం వృద్ధులకే కాకుండా, భావి తరాల వృద్ధుల సంక్షేమం కోసం కూడా ఇప్పటి నుంచే చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. అత్యధిక శాతం వృద్ధులు కుటుంబ సభ్యుల మీదా, ఇతరుల మీదా ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో మున్ముందు వారి పరిస్థితిని, దుస్థితిని పరిగణనలోకి తీసుకుని వారి ఆర్థిక, సామాజిక అవసరాలకు ఊతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బహుళ జాతులు, బహుళ సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఆచార సంప్రదాయాలకు, విలువలకు, ప్రమాణాలకు తగ్గట్టుగా వృద్ధుల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉంది.

మహిళల పట్ల నిర్లక్ష్యం
ఆందోళనకర విషయమేమిటంటే, దేశంలో వృద్ధుల సమస్యలతో పాటు, వృద్ధుల జనాభాతో పాటు, వితంతువుల జనాభా, సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అంతేకాదు, వృద్ధులు, వితంతువుల సగటు ఆయుఃప్రమాణం కూడా పెరుగుతోంది. 2036 నాటికి దేశంలో వందేళ్లు దాటిన వారి సంఖ్య లక్షలకు చేరుకోబోతోందని అంచనా. దేశంలో 60 ఏళ్లు పైబడిన మహిళల్లో సగానికి సగం మంది వితంతువులే. వయసు పెరుగుతున్న కొద్దీ వితంతువుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోవడం వల్ల ఎక్కువగా కష్టనష్టాల పాలవుతున్నది మహిళలే. వీరు ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడి బతకాల్సి వస్తోంది. వృద్ధాప్యంలో వీరు నాణ్యమైన జీవనశైలిని అనుభవించడానికి అవకాశాలు ఉండడం లేదు. వృద్ధులకు సంబంధించి దేశంలో అక్కడక్కడా కొన్ని సంక్షేమ కేంద్రాలు
పనిచేస్తున్నప్పటికీ, వృద్ధులకు ఇవి అందని మానిపండ్లే అవుతున్నాయి. నిజానికి కొన్ని ప్రభుత్వాలు తమ కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వృద్ధులకు అవగాహన లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, చిన్న కుటుంబాలు పెరిగిపోవడం, అత్యధిక సంఖ్యాక వృద్ధులకు సంక్షేమ కార్యక్రమాలు అందకపోవడం, వారికి ఎటువంటి చేయూతా లభ్యం కాకపో వడం వంటి కారణాల వల్ల ఈ పోటీ ప్రపంచంలో వారి జీవితాలు దుర్భరంగా, దుస్సహంగా మారు తున్నాయి. అంతకన్నా ఆందోళనకర విషయమేమిటంటే, ఎక్కువ మంది వృద్ధులు ఒంటరిగా బతకాల్సి వస్తోంది. దీనివల్ల వారి కష్టనష్టాలు పెరగడమే కాకుండా, ఆపదలకు మరింత అవకాశం ఏర్పడుతోంది. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా వృద్ధ వితంతువుల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంక్షేమానికి విధాన నిర్ణయాల్లో సముచిత స్థానం కల్పించాల్సి ఉంటుంది. వృద్ధుల సంపూర్ణ సంక్షేమానికి తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలు
రూపుదిద్దుకోవాల్సి ఉంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం బతికే అవకాశాలున్నందువల్ల వితంతువులకు ప్రతి పథకంలోనూ అగ్రప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభించిన తర్వాత నుంచి వృద్ధులు కష్టనష్టాలు మరింత ఎక్కువయ్యాయని నివేదికలు తెలియజేస్తున్నాయి.

పింఛన్లకు దూరం
దేశంలో కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా అత్యధిక సంఖ్యాక కుటుంబాల్లో వృద్ధ తల్లి తండ్రులకు పిల్లలతో జీవించే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి. వారి ఆరోగ్యం గురించి, వారి అవసరాల గురించి పట్టించుకోవడం అన్నది క్రమంగా తగ్గి పోతోంది. పైగా వారి మీద హింస పెరుగుతున్నట్టు కూడా నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో వివరాలను బట్టి తెలుస్తోంది. ఆస్తుల కోసం, డబ్బు కోసం కొందరు పిల్లలు వేధిస్తే, వారి బాగోగులు చూడడం ఇష్టం లేక మరికొందరు వేధించడం జరుగుతోంది. సంపన్న కుటుంబాల్లో సైతం వృద్ధుల పట్ల గృహ హింస పెరుగుతున్నట్టు ఈ బ్యూరో ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. నిజానికి, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను చేపడుతున్నప్పటికీ, వాటి అమలులోని లోపాల కారణంగా వృధ్ధుల జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోవడం లేదు. వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు, వారి హక్కులకు సంబంధించిన చట్టాల విషయంలో వారికి సరైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.

కేంద్రంలోని సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ 2007లో తల్లితండ్రులు, సీనియర్ సిటిజెన్ల నిర్వహణ, సంక్షేమ చట్టాన్ని తీసుకువచ్చింది. మరింత సమర్థవంతంగా, పటిష్టంగా వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, వారికి నాణ్యమైన జీవితం అందించడమే ఈ చట్టం ముఖ్యఉద్దేశం. కుటుంబంలోని వృద్దుల బాగోగులను, సంక్షేమాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులు పట్టించుకోవాలని, వారికి నెలసరి భరణం కూడా ఇవ్వాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు లేదా పిల్లలు విఫలం అయ్యే పక్షంలో వారిపై చర్యలు తీసు కోవడానికి కూడా ఈ చట్టం వీలు కల్పిస్తోంది. తల్లితండ్రుల ఆస్తిపాస్తులకు రక్షణ కల్పించడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తోంది. అయితే, వీటన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వృద్దులకు పింఛను సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది. ఇటువంటి వ్యవహారాలను న్యాయ స్థానాలు తేల్చి చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలే హేతుబద్ధంగా పింఛను మొత్తాల్ని ప్రకటించడం వల్ల వృద్ధులకు ఎంతో మేలు చేసినట్టవుతుంది. వృద్ధుల సంక్షేమం పిల్లల చేతుల్లో కంటే ప్రభుత్వాల చేతుల్లోనే ఎక్కువగా ఉంటుందనే విషయం గమనించాల్సి ఉంటుంది. వృద్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకునే పక్షంలో పిల్లల నుంచి కూడా సంరక్షణ పెరుగుతుంది.

– డాక్టర్ వి. కనకదుర్గ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News