Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Senior citizens: కొరవడుతున్న వృద్ధుల సంక్షేమం

Senior citizens: కొరవడుతున్న వృద్ధుల సంక్షేమం

వార్ధక్యం అనేది ప్రతి మనిషికి సహజంగా సంభ వించే దశ. అది సృష్టి ధర్మం. మనదేశంలో 60 ఏళ్ళు నిండిన వారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణి స్తారు. 1951 నాటికి భారత్‌లో 2 కోట్లున్నవృద్ధుల సంఖ్య 2011కి 10.4 కోట్లకి చేరింది. ప్రస్తుతం అది 13.8 కోట్లని తేలింది. 2050 నాటికి ఈ సంఖ్య 31.9 కోట్లకు చేరు తుందని అంచనా. మన దేశంలో అధిక శాతం వృద్ధులు గ్రామాల్లో నివసిస్తున్నట్లు, వీరిలో 90శాతం మంది దారి ద్య్రరేఖకు దిగువనున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మనిషి జీవితకాలం పెరుగుదల వల్ల వృద్ధుల సంఖ్య క్రమే పీ అధికమవుతోంది. కానీ, తదనుగుణంగా వారి సంక్షేమ చర్యలు పుంజుకోవడం లేదనేది కఠోర వాస్తవం. నేడు సీనియర్‌ సిటిజన్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు-ఆరోగ్యం, ఆర్థికం, ఒంటరితనం. ఈ నేపథ్యంలో వారికి కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ప్రభుత్వ పరంగా రక్షణలు అవసరం. ఇపుడు ఉమ్మడి కుటుంబవ్యవస్థ పోయి, పలు వ్యాపకాలతో పిల్లలు దూరమై, ఎవరికి వారుగా బతుకుతున్న రోజులివి. దాంతో వృద్ధులు విధిలేక ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తోంది. మరి కొంతమంది పిల్లల నిరాదరణకు గురై, ఏ ఆధారమూ లేక వృద్ధా శ్రమాల్లో జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారు. వార్ధక్యంలో జవ సత్వాలుడిగి, సంపాదించే శక్తిలేక వేదనల పాలవు తున్నారు.
అరకొర చర్యలు
భారత రాజ్యాంగం 41వ అధికరణం వృద్ధుల సమ స్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెబు తోంది. అందుకే ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు, సంక్షేమ చర్యలైతే చేపట్టింది. వృద్ధపౌరుల సంక్షేమం కోసం 1999లో ఒక జాతీయ విధానాన్ని ప్రకటించింది. అలాగే 2007లో ‘తల్లిదండ్రుల, వృద్ధపౌరుల ఆలనా పాలన చట్టం’ని రూపొందించింది. తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేసినా, వాళ్ళని వేధించినా, వాళ్ళ సంక్షేమాన్ని ఉపేక్షించినా అలాంటి పిల్లలు శిక్షార్హులవుతారని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అలాగే ప్రభుత్వం కనీసం జిల్లాకొక వృద్ధా శ్రమం నెలకొల్పాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సీని యర్‌ సిటిజన్లకు ప్రత్యేక పడకలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో పొందుపరచబడి ఉంది. అయితే చట్ట నిబంధనలు కాగితాలకే పరిమితమై, వృద్ధు లకు సమగ్ర ప్రయోజనాలు అందడంలేదు. పలు రాష్ట్రాల్లో కనీసమాత్రంగానైనా ఈ చట్టం అమలవుతున్న దాఖలాలు లేవు. ప్రజలకు దీనిపై సరియైన అవగాహనా కల్పిచడం లేదు. ఇక ఆర్థిక పరమైన విషయాలకొస్తే, దారిద్య్రరేఖకు దిగువనున్న వృద్ధులకు మాత్రం వృద్ధాప్యపు పింఛన్లు చెల్లిం చబడుతున్నాయి. అవి వాస్తవ రూపంలో ఏ మేరకు వృద్ధు లకు ఊరట కల్పిస్తున్నాయనేదే ప్రశ్నార్థకం. గతంలో సీని యర్‌ సిటిజన్లకు రైళ్ళలో ఉన్న రాయితీని కోవిడ్‌ కాలం నుంచి ఎత్తివేశారు. వృద్దులకు మేలు చేసే ఈ రాయితీని రద్దుచేయడంతో పలు విమర్శలు, విజ్ఞప్తులు వస్తున్నా కేంద్రం దీనిని పునరుద్ధరించడం లేదు. అలాగే కేంద్ర పింఛనుదార్లకు 65, 70, 75 ఏళ్ళకు 5, 10, 15శాతం చొప్పున అదనపు పింఛను ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం 110వ రిపోర్టులో సిఫార్సు చేసింది. దీనివల్ల అల్పాదాయ పింఛనుదార్లకు వృద్ధాప్యంలో కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అయితే దానిని కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా సదుపాయాన్ని కల్పిస్తుంటే, కేంద్రం మాత్రం 80 ఏళ్ళు లోపున్న పింఛనుదార్లకు ఎటువంటి అదనపు పిఛను కల్పిం చకపోవడం శోచనీయం. పాశ్చాత్య దేశాలు దీటైన చట్టా లు, పథకాలు రూపొందించి వృద్ధులను మెరుగైన రీతిలో సంరక్షించుకుంటున్నాయి. తద్భిన్నంగా భారత్‌లో అర కొర రాయితీలు, పథకాలతో వృద్దుల సంక్షేమ స్ఫూర్తే కొల్ల బోతోంది. వాస్తవిక కార్యాచరణ కొరవడి, వృద్ధుల సమస్యలు పోనుపోను పెచ్చరిల్లుతున్నాయి. ‘గ్లోబల్‌ ఏజ్‌ వాచ్‌ ఇండెక్స్‌’ (హెల్పేజ్‌ ఇంటర్నేషనల్‌ విభాగం) ప్రపంచ వ్యాప్తంగా 96 దేశాలలోని వృద్ధుల ఆరోగ్య, ఆర్థిక, సామా జిక పరిస్థితుల ఆధారంగా 2015లో ఓ ప్రత్యేక సూచీని విడుదల చేసింది. ఆ సూచీలో ఇండియా 71 వ స్థానంలో శ్రీలంక, నేపాల్‌ల కంటే కూడా వెనకబడి ఉండటం విచారకరం.
ప్రభుత్వాలదే బాధ్యత
కోవిడ్‌ కాలంలో వృద్ధులు అధిక బాధల పాలయై నేటికీ భారంగా బతుకులీడుస్తున్నారు. ముఖ్యంగా పల్లె ల్లోని వృద్ధులు వైద్యసదుపాయాలు, ఆదాయాలు కొరవడి ఓపలేని అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రభు త్వాల చేయూత ఎంతో అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పూనిక వహించి వృద్ధుల ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతు లను బలోపేతం చేసే సమ్మిళిత విధానాలను రూపొం దించాలి. వృద్ధాప్య పింఛన్లు, ప్రభుత్వ ఆరోగ్యసేవలు స్పష్టమైన రీతిలో అందుబాటులోకి రావాలి. నేడు ప్రతి ఆసుపత్రిలోనూ వైద్యం కోసం వృద్ధ రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోంది. దీంతో వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. వయస్సు రీత్యా వారికి ప్రత్యేక విభాగాలు, కౌంటర్లు లాంటివి ఏర్పాటు చేసి కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయా ల్లోనూ వారికి వేరే క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. దైవ దర్శనానికెళ్ళే వృద్ధులకు తిరుమల తరహాలో అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక దర్శన సదుపాయాలు కల్పించాలి. ఇలాంటివన్నీ ఆర్థికేతర రాయితీలే కాబట్టి ప్రభుత్వాలకు భారముండదు. పైగా ఇటువంటి చర్యలు ద్వారా సీనియర్‌ సిటిజన్లను సముచిత రీతిలో గౌరవించినట్లవుతుంది. రైళ్ళ లో రద్దుచేసిన వృద్ధుల రాయితీని తక్షణమే పునరుద్ధరిం చాలి. వృద్ధాశ్రమాలను చాలావరకు స్వచ్ఛంద సంస్థలే ఏర్పాటు చేస్తున్నాయి తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. కనుక ఆ దిశగా ప్రభుత్వం చర్యలు గైకొనాలి. వృద్ధుల భాద్యత కుటుంబ సభ్యులదే అయినా, వారి హక్కులను, సంక్షేమాన్ని పరిరక్షించాల్సింది ప్రభు త్వమే. వాస్తవానికి వృద్ధులు జాతీయ సంపద. సమాజానికి దిక్సూచి లాంటివారు. వారి అనుభవాలు ముందు తరాలకు అమూల్యమైన పాఠాలు. అలాంటి వాళ్ళను ఆదు కోవడం, ఆసరా కల్పించడం ప్రభుత్వం భారంగా భావించ కూడదు. అది విద్యుక్త ధర్మంగా భావించాలి. అందుకే వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేయడంలో ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలి. వాళ్ళ శ్రేయానికి దోహదపడేలా పాలకులు చిత్తశుద్ధితో క్రియాశీలక చర్యలు చేపడితేనే సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ పథకాలు సాకారమవుతాయి. లేదా అవి ఎండమావులుగానే మిగిలిపోతాయి.

– పీ.వీ.ప్రసాద్‌,
విజయవాడ, 9440176824

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News