Homeఎడిటోరియల్ / బహుళSeptember 17: సెప్టెంబర్‌ 17: విద్రోహమే చరిత్ర

September 17: సెప్టెంబర్‌ 17: విద్రోహమే చరిత్ర

సెప్టెంబర్‌ 17ను అర్థం చేసుకోవాలంటే అధికారపు ముద్రలను మాత్రమే చూడకూ డదు. ప్రజల తిరుగుబాటును చూడాలి. ఆ తిరుగుబాటుకు ఒక పేరు పెడితే అది విద్రోహం. విద్రోహం అంటే కేవలం ఆయుధం పట్టడం కాదు. తరతరాలుగా అలవాటైన భయాన్ని తిరస్కరించడం. ‘‘దొర చెప్పిందే చట్టం’’ అనే పరిస్థితిని ప్రశ్నించడం. ‘‘వెట్టి చేయాల్సిందే’’ అనే ఆజ్ఞకు ‘‘లేదు’’ అనడం. ‘‘భూమిపై నీకేం హక్కు?’’ అనే ప్రశ్నకు ‘‘నేను దున్నుతున్నాను కాబట్టి నాకూ హక్కుంది’’ అని సమాధానం చెప్పడం. కుల అవమానాన్ని, మహిళపై వివక్షను, పేదరికాన్ని విధిగా అంగీకరించకుండా ఎదిరించడం. తెలంగాణ రైతాంగ పోరాటం ఈ సమస్త తిరస్కారాల సమ్మేళనం. అందుకే సెప్టెంబర్‌ 17 చరిత్రను ‘‘విలీనం’’ అనే ఒక్క పదంలో బంధించడం సరిపోదు.

- Advertisement -

హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రక వాస్తవం. 1948 సెప్టెంబర్‌లో భారత సైనిక చర్య జరిగింది. సెప్టెంబర్‌ 17న నిజాం లొంగిపోయాడు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లోకి వచ్చింది. ఈ పరిణామానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. దాన్ని నిరాకరించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే తెలంగాణ ప్రజల విముక్తి చరిత్ర మొత్తం అని చెప్పడం మాత్రం చరిత్రను కుదించడం. ఎందుకంటే.. నిజాం లొంగిపోయే నాటికే తెలంగాణ గ్రామాల్లో ప్రజల తిరుగుబాటు విస్తృత ప్రజా శక్తిగా ఎదిగింది.

ఆ తిరుగుబాటు ఏ మతానికి వ్యతిరేకంగా సాగలేదు. అది దోపిడీకి వ్యతిరేకంగా సాగింది. ముస్లింలను శత్రువులుగా చూడ లేదు. భూస్వామ్య ఆధిపత్యాన్ని, వెట్టి వ్యవస్థను, అక్రమ వసూళ్లను, దొరల పెత్తనాన్ని ప్రశ్నించింది. అందుకే ఈ పోరాటాన్ని హిందూ – ముస్లిం ఘర్షణగా మార్చడం చరిత్రకు మరోసారి అన్యాయం చేయడమే. తెలంగాణ రైతాంగ పోరాటంలో హిందూ రైతులు న్నారు. ముస్లిం ప్రజాస్వామిక వాదులున్నారు. దళిత కూలీలు న్నారు. ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలున్నారు. మహిళలు ముం దుండి పోరాడారు. భూమి కోసం, భుక్తి కోసం, గౌరవం కోసం పోరాడిన ప్రతి మనిషి తన ముద్ర వేశాడు.

షేక్‌ బందగీని కేవలం ముస్లిం వ్యక్తిగా చూడలేం. ఆయన దోపిడీకి వ్యతిరేకంగా నిలిచిన ప్రజా పోరాట యోధుడు. చాకలి ఐలమ్మ కేవలం ఒక పేద మహిళ కాదు. భూమి, ఆత్మగౌరవం, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా నిలిచిన ప్రతిఘటనకు ఆమె ఒక ప్రతీక. దొడ్డి కొమురయ్య ప్రజల భయాన్ని పగలగొట్టిన తిరుగు బాటుకు ప్రతీక. జాటోత్‌ ఠానూ నాయక్‌ వంటి యోధుల పోరా టాలు తండాలు, అడవులు, పల్లెల్లో విస్తరించిన ప్రజా ప్రతిఘటనకు సాక్ష్యాలు. షోయబుల్లా ఖాన్‌ కలం నిరంకుశత్వానికి, మతతత్వా నికి వ్యతిరేకంగా నిలిచింది. మఖ్దూం మొహియుద్దీన్‌ కవిత్వం ప్రజల విముక్తి ఆకాంక్షకు స్వరం ఇచ్చింది. వీరిని మతపు గోడల్లో బంధించడం అంటే తెలంగాణ చరిత్రను అవమానించడమే.

ప్రజల వర్గ చైతన్యాన్ని మత గుర్తింపులతో భర్తీ చేయడం చరిత్రను మలచే సులభమైన రాజకీయ పద్ధతి. రైతు – భూస్వామి సంబంధాన్ని పక్కకు నెట్టాలి. కూలీ – దోపిడీదారు సంబంధాన్ని కనిపించనివ్వకూడదు. పేద – ధనిక మధ్య అసమానతను మరుగు పరచాలి. అప్పుడు హిందూ- ముస్లిం విభజనను ముందుకు తెస్తే ప్రజల దృష్టి అసలు ప్రశ్నల నుంచి మళ్లుతుంది. నిజాం ఏ మతానికి చెందినవాడు? అనే ప్రశ్న కంటే, ఆయన పాలనలో భూమి ఎవరి చేతుల్లో ఉంది? ఎవరు వెట్టి చేశారు? ఎవరి శ్రమ దోచుకున్నారు? ఎవరు గడీల్లో అధికారాన్ని అనుభవించారు? ఎవరు ఆకలితో ఉన్నారు? అనే ప్రశ్నలు ముఖ్యమైనవి. చరిత్రను వర్గ సంబంధాల నుంచి విడదీస్తే ప్రజల పాత్ర కనుమరుగవుతుంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వాన్ని కూడా గుర్తించాలి. ఆంధ్ర మహాసభ ప్రజా చైతన్యానికి వేదికగా నిలిచింది. కమ్యూనిస్టు కార్యకర్తలు గ్రామాల్లో పనిచేశారు. వెట్టి వ్యతిరేక పోరాటాలను నిర్మించారు. రైతులను సంఘటితం చేశారు. భూ స్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలను విస్తరించారు.

సుమారు మూడు వేల గ్రామాలకు విస్తరించిన ఈ పోరాటం కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మిగలలేదు. గ్రామీణ సామా జిక సంబంధాలను మార్చే ప్రయత్నంగా ఎదిగింది. పేదలు భూమిపై తమ హక్కును ప్రకటించారు. శ్రమకు గౌరవం కోరారు. దొరల గడీలకు ప్రత్యామ్నాయంగా ప్రజా శక్తిని నిర్మించారు. ఇదే విద్రోహం. అయితే సెప్టెంబర్‌ 17తో తెలంగాణ ప్రజల పోరాటం ముగియ లేదు. నిజాం పాలన ముగిసిన తరువాత కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలోని రైతాంగ పోరాటంపై సైనిక దమనకాండ కొనసాగింది. ప్రజలు సాధించిన భూములు, హక్కులపై తిరిగి దాడులు జరిగాయి. భూస్వామ్య ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి సెప్టెంబర్‌ 17ను అంతిమ విముక్తి రోజుగా మాత్రమే చూడలేం. అది ఒక చారిత్రక మలుపు. ఇదే ప్రశ్నను మతతత్వ రాజకీ యాలు తప్పించు కోవాలనుకుంటాయి. నిజాం వెళ్లిపోయిన తరువాత కూడా ప్రజల పోరాటం ఎందుకు కొనసాగింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే భూమి ప్రశ్నను, వర్గ ప్రశ్నను, భూస్వామ్య సంబంధాలను, కమ్యూనిస్టుల పాత్రను చర్చించాల్సి వస్తుంది.

అలాగే హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో చేరిన తరువాత కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ప్రజలపై జరిగిన సామూహిక హింసను కూడా చరిత్ర నుంచి తొలగించకూడదు. సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక ఈ హింసకు సంబంధించిన వివరాలను నమోదు చేసింది. ఈ విషాదాన్ని గుర్తించడం నిజాం నిరంకుశత్వాన్ని సమర్థించడం కాదు. రజాకార్ల దౌర్జన్యాన్ని సమర్థించడం కాదు. కానీ ఒక ప్రజాసమూహంపై జరిగిన హింసను దాచిపెట్టి చరిత్రను మతపు విజయగాథగా మార్చడం కూడా చారిత్రక నిజాయితీ కాదు. ప్రజా చరిత్రకు ఒక నైతికత ఉంటుంది. మనకు నచ్చిన విషయాలను మాత్రమే గుర్తుంచుకుని, నచ్చని విషయాలను దాచిపెట్టదు. నిజాం నిరంకుశత్వాన్ని ఖండిస్తూనే ముస్లిం ప్రజలపై జరిగిన హింసను గుర్తించగలదు. రజాకార్ల హింసను ఖండిస్తూనే మతతత్వ రాజకీయాలను తిరస్కరించగలదు. భారత సైనిక చర్యకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తిస్తూనే, దానికి ముందున్న రైతాంగ తిరుగుబాటును కూడా గుర్తించగలదు. అదే చారిత్రక నిజాయితీ.

సెప్టెంబర్‌ 17ను ‘‘విలీనం, విమోచనం, సమైక్యత’’ అనే అధికారిక లేదా రాజకీయ పదజాలంలో మాత్రమే బంధించ కూడదు. ప్రజల చరిత్రకు మరో పదం ఉంది. అది విద్రోహం. విద్రోహం అంటే వెట్టికి ‘‘లేదు’’ అనడం. విద్రోహం అంటే భూమి కోసం పోరాడటం. విద్రోహం అంటే దొర ముందు తలవంచక పోవడం. విద్రోహం అంటే కుల అవమానాన్ని తిరస్కరించడం. విద్రోహం అంటే మహిళను రెండో తరగతి మనిషిగా చూడటాన్ని ప్రశ్నించడం. విద్రోహం అంటే తన జీవితంపై తనకే హక్కు కావాలని ప్రకటించడం. ఈ అర్థంలో సెప్టెంబర్‌ 17 గతానికి సంబంధించిన తేదీ మాత్రమే కాదు. వర్తమానాన్ని ప్రశ్నించే తేదీ.

నేడు రైతుకు భూమిపై పూర్తి భద్రత ఉందా? కూలీకి తన శ్రమకు తగిన వేతనం వస్తుందా? దళితుడికి సంపూర్ణ సామాజిక గౌరవం ఉందా? ఆదివాసీకి జల్‌ జంగల్‌ జమీన్‌పై హక్కు ఉందా? మహిళకు సమాన హక్కులు ఉన్నాయా? యువతకు గౌరవప్రదమైన ఉపాధి ఉందా? ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే ప్రజాస్వామిక వాతావరణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడే సెప్టెంబర్‌ 17 చరిత్ర వర్తమానంలోకి వస్తుంది. అందుకే.. సెప్టెంబర్‌ 17ను మతతత్వ రాజకీయాలకు అప్పగించకూడదు. అధికారిక ఉత్సవాలకు పరిమితం చేయకూడదు. ఒక పార్టీ రాజకీయ ఆస్తిగా మార్చకూడదు. ప్రజల పోరాట చరిత్రగా తిరిగి ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. విలీనం ఒక రాజకీయ పరిణామం. విమోచనం ఒక రాజకీయ నినాదం. కానీ విద్రోహం ప్రజల అనుభవం. విలీనం అధికారాన్ని గురించి చెబుతుంది. విద్రోహం ప్రజలను గురించి చెబుతుంది. విలీనం ఒక సంస్థానం భారత యూనియన్‌లో చేరిన విషయాన్ని చెబుతుంది. విద్రోహం ఎందుకు ప్రజలు దొరలకు, భూస్వామ్యానికి, వెట్టికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లేచారో చెబుతుంది. అందుకే సెప్టెంబర్‌ 17ను ప్రజల జ్ఞాపకంగా, ప్రజల హక్కుల పోరాటానికి ప్రతీకగా చూడాలి. విద్రోహమే చరిత్ర. విద్రోహమే ప్రజల జ్ఞాపకం. విద్రోహమే భవిష్యత్తును ప్రశ్నించే శక్తి. ప్రజలు తమ జీవితాలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు చరిత్ర కదులుతుంది. గడీలు కదులుతాయి. సింహాసనాలు కదులు తాయి. అధికారపు ముద్రలు కదులుతాయి. సెప్టెంబర్‌ 17 ఆ కదలికకు ఒక చారిత్రక ముద్ర. ఆ ముద్రను మతతత్వ రాజకీ యాలు చెరిపేయకూడదు. అధికారిక ఉత్సవాలు మసకబార్చ కూడదు. ప్రజల జ్ఞాపకమే దాన్ని నిలబెట్టాలి. సెప్టెంబర్‌ 17 విద్రోహ దినం. విలీనం మాత్రమే కాదు. విమోచనం అనే మతతత్వ నినాదం కాదు. ప్రజలు అణచివేతకు వ్యతిరేకంగా లేచిన చరిత్ర. తెలంగాణ చరిత్ర. ప్రజల చరిత్ర. అదే విద్రోహం.

మామిండ్ల రమేష్‌ రాజా
తెలంగాణ కార్యదర్శి,
సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌
78932 30218

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News