Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Shocked Israel: ఖంగుతిన్న ఇజ్రాయెల్‌

Shocked Israel: ఖంగుతిన్న ఇజ్రాయెల్‌

ఇజ్రాయిల్ పాలిట శాపంగా మారిన మసాద్ ఫెయిల్యూర్

గాజా జల సంధి నుంచి హమాస్‌ బృందాలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నిజానికి ఈ దాడి జరగడానికి రెండు మూడు నెలల నుంచే ఎంతో ప్రణాళిక అవసరం అవుతుంది. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్ఠలున్న ఇజ్రాయెల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌కు ఈ దాడి గురించి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ మొసాద్‌ ప్రతిష్ఠ ఈ హఠాత్‌ పరిమాణంతో దారుణంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. ఒక్క మొసాద్‌ ప్రతిష్ఠే కాదు, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ ప్రతిష్ఠ కూడా దారుణంగా దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదం పట్ల ఎంతో కఠినంగా, అప్రమత్తంగా వ్యవహరించే నెతన్యాహూ హమాస్‌ దాడితో దేశ భద్రత విషయంలో ఘోరంగా వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది. తనకు ఎంతో అనుకూలమైన సంకీర్ణ ప్రభుత్వం నిర్వహిస్తున్న నెతన్యాహూ నిజానికి మరో విషయంలో కూడా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు. గత కొద్ది వారాలుగా ఆయన ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుని ఉంది. ఆయన తమ న్యాయవ్యవస్థ అధికారాలను కత్తిరించడంతో చివరికి సైన్యం నుంచి కూడా పలువురు అధికారులు వైదొలగడం జరిగింది.
హమాస్‌ తీవ్రవాదులు ఏదో దారుణ మారణకాండ తలపెట్టబోతున్నారనే విషయం చూచాయగా అర్థమవుతూనే ఉంది. అందుకు సంబంధించిన సంకేతాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వంతో సహా దేశ ప్రజలంతా యూదుమత సంబంధమైన సెలవు కాలాన్ని వేడుకగా జరుపుకుంటున్న సమయంలో హమాస్‌ దాడులు ప్రారంభమయ్యాయి. 1987లో వెస్ట్‌ బ్యాంక్‌, 2000లో గాజా జలసంధిని ఆక్రమించుకున్నప్పటి నుంచి పాలస్తీనాలో అశాంతి, అల్లర్లు చెలరేగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ మీద హమాస్‌ ఒక కన్నువేసే ఉంది. హమాస్‌ తీవ్రవాదులు గత శనివారం నాడు ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులతో దాడి చేసే అరగంట ముందు, తీవ్రవాదులంతా మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల మీద ఒక్కసారిగా గాజాలో ప్రవేశించారు. కంచెలు, బ్యారికేడ్లను దాటుకుని గాజాలో తుపాకులతో ప్రవేశించిన హమాస్‌ తీవ్రవాదులు ఆ తర్వాత ఇజ్రాయెల్‌ మీద దాడి చేయడానికి ఎంతో సమయం పట్టలేదు. కొన్ని బృందాలు యుద్ధ విమానాల ద్వారానూ, మరికొన్ని బృందాలు నీటి ద్వారానూ ఇజ్రాయెల్‌లో ప్రవేశించి మారణకాండకు ఒడిగట్టారు. 2008 నవంబర్‌ 26న పాకిస్థానీ ఉగ్రవాదులు ముంబై మీద దాడి చేసిన విధంగానే, హమాస్‌ తీవ్రవాదులు కూడా యథేచ్ఛగా ప్రజలు, సైనికులు, పోలీసుల మీద కాల్పులు జరుపుతూ ముందుకు దూసుకుపోయారు. ఈ తీవ్రవాదులు జరిపిన కాల్పులలో కనీసం 600 మంది పౌరులు మరణించి ఉంటారని అంచనా.
ఒకపక్క ఈ విధమైన దాడులు జరుగుతున్న సమయంలో మరి కొంతమంది తీవ్రవాదులు ఇజ్రాయెల్‌ సైనికుల మీద తుపాకులతో దాడులు చేస్తూ వీలైనంత మంది పౌరులు, సైనికులను గాజాకు తీసుకుపోయారు. వీరిని అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్‌ నుంచి తమకు కావాల్సింది సాధించాలనే తీవ్రవాదుల ఉద్దేశంగా కనిపిస్తోంది. కొంత మంది సైనికుల శవాలను, ఒక నగ్నమహిళ మృతదేహాన్ని వారు రోడ్ల మీద లాక్కుంటూ తీసుకు వెళ్లడాన్ని బట్టి ఈవిషయంలో వారెంత పైశాచికానందాన్ని పొందుతున్నారో, దీనిని వారెంత ఘన విజయంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిని మామూలు దాడిగాకాక, ఒక పూర్తిస్థాయి యుద్ధంగానే గుర్తించిన నెతన్యాహూ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే దాకా నిద్రపోయేది లేదని శపథం చేసింది. సుమారు 23 లక్షల జనాభా కలిగిన గాజాపై ఇజ్రాయెల్‌ ఆ తర్వాత దాడి చేసి 40 మంది పాలస్తీనియన్లను హతమార్చింది.
హమాస్‌ను, దాని నాయకత్వాన్ని ఇజ్రాయెల్‌ తుడిచిపెడుతుందో లేదో తెలియదు కానీ, ఈ మధ్య గాజా పౌరులు నలిగిపోతున్నారు. ఈ హఠాత్‌ పరిమాణాన్ని వారుకూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ హమాస్‌ దాడికి ఇరాన్‌ ప్రభుత్వ మద్దతు పూర్తి స్థాయిలో ఉందనడంలో సందేహం లేదు. తమ అణ్వస్త్ర కేంద్రాలపై గూఢచర్యం జరుపుతున్న మొసాద్‌ మీద పగతో ఇరాన్‌ ఈ దాడికి మద్దతునిచ్చింది. ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియాల మధ్య సయోధ్య పెరగడం, పశ్చిమాసియా దేశాల మధ్య సహకారం ఏర్పడడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ మారణకాండ చోటు చేసుకోవడం నిజంగా విచిత్రంగా ఉంది. ఇజ్రాయెల్‌ మచ్చలేని దేశం కాదు కానీ, మానవ హక్కుల పేరుతో మారణకాండకు పాల్పడడం ఇజ్రాయెల్‌కు కూడా భావ్యం కాదనే చెప్పాల్సి ఉంటుంది. కాగా, హమాస్‌ తీవ్రవాదులు కూడా తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News