Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Sikhs: జాతీయవాద సిక్కులకు భద్రత అవసరం

Sikhs: జాతీయవాద సిక్కులకు భద్రత అవసరం

సిక్కు గురువులు, యోధులు మొదటి నుంచి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినవారే. వారి చరిత్ర అంతా పోరాటాలకే అంకితమయింది. మొఘల్‌ రాజుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన గురు అర్జున్‌ దేవ్‌, గురు తేగ్‌ బహదూర్‌, మొట్టమొదటి సిక్కు రాజ్యాన్ని స్థాపించిన బందా సింగ్‌ బహదూర్‌, సిక్కు సామ్రాజ్యాన్ని నెలకొల్పిన రంజిత్‌ సింగ్‌ వంటి వీరాధివీరులంతా జాతీయవాదులు. తిరుగులేని దేశభక్తులు. వీరంతా మొఘల్‌ రాజుల మీద పోరాడినవారే. వారు వారి మత పవిత్రతను కాపాడుకోవడం కోసమే కాదు, విదేశీ పాలకుల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇందులో ఎవరి నోటి వెంటా ఖలిస్తాన్‌ అనే మాటే రాలేదు. అయితే, కొన్ని శతాబ్దాలు గడిచేసరికి ఐ.ఎస్‌.ఐ, పాకిస్థాన్‌ ప్రభుత్వాల మద్దతుతో జర్నాయిల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే వంటి తీవ్రవాదులు కుట్రలు, కుతంత్రాలతో దేశానికి సమస్యలు సృష్టించడం ప్రారంభించారు. సిక్కు గురువనే ముసుగులో దారుణాలకు, దురాగతాలకు ఒడిగట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆపరేషన్‌ బ్లూస్టార్‌ కారణంగా అమృత్‌సర్‌ స్వర్ణాలయంలో హతమయ్యాడు.
భింద్రన్‌వాలేను హతమార్చినందుకు ప్రతీకారంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని సిక్కు తీవ్రవాదులు కాల్చి చంపడం, ఆ తర్వాత సిక్కుల ఊచకోత చోటు చేసుకోవడం వంటివి జరిగి, సిక్కుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ సిక్కుల దేశభక్తిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అనే నకిలీ ప్రవచనకర్త గురువు ముసుగులో ఖలిస్థాన్‌ కోసం సాయుధ పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. సాధారణంగా దొంగ గురువులు, నకిలీ గురువుల వల్లే మానవాళి నాశనం ప్రారంభం అవుతుందనే వాస్తవాన్ని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. గత కొన్ని వారాలుగా దేశం ఇతని వల్లే అల్లకల్లోలం అవుతోంది. అమృత్‌పాల్‌ సింగ్‌ పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల మద్దతుతో, మాదక ద్రవ్యాలకు సంబంధించిన డబ్బుతో దేశంలో ఆగడాలు సృష్టిస్తూ, తన మతాన్ని సైతం ప్రమాదంలో పడేస్తున్నాడు. ఒక పక్క సాధారణ పాకిస్థానీలు ఆకలితో అలమటిస్తుండగా, ఈ ఖలిస్థాన్‌ తీవ్రవాదులను మాత్రం ఆ దేశం పెంచి పోషిస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఉంది. కెనడా, బ్రిటన్‌లలో సురక్షిత స్థావరాలలో కూర్చుని ప్రత్యేక ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఊపిరిపోస్తున్న ఖలిస్థానీ తీవ్రవాదులు అమృత్‌పాల్‌ సింగ్‌కు డబ్బు, ఆయుధాలు అందజేస్తున్నారు. అతని దేశద్రోహ కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నారు.
విదేశాల సహాయ సహకారాలు
భారతదేశం అభివృద్ధి చెందడం, అగ్రరాజ్యాలకు దీటుగా బలోపేతం అవుతుండడం, పటిష్ఠంగా ఉండడం గిట్టని పాకిస్థాన్‌ ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులకు వీలైనప్పుడల్లా, శాయశక్తులా కొమ్ము కాస్తూనే ఉంటోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అనుభవరాహిత్యాన్ని, అసమర్థతను అవకాశంగా తీసుకుని, అమృత్‌పాల్‌, అతని సహచరులు పంజాబ్‌ రాష్ట్రంలో హిందువులు, సిక్కుల మధ్య వైరాన్ని, ద్వేషాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపర భింద్రన్‌వాలేను సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, కొందరు సిక్కుల భావజాలాన్ని కేంద్ర ప్రభుత్వానికి, యావత్‌ సిక్కు సమాజానికి మధ్య జరుగుతున్న పోరాటంగా కొన్ని దేశాలు, అక్కడి మీడియా యథాశక్తి విష ప్రచారాన్ని చేపట్టాయి. ఖలిస్థానీలు విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలను ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశాయి. విచిత్రమేమిటంటే, అమృత్‌సర్‌కు సమీపంలోని జలియన్‌వాలాబాగ్‌లో సిక్కులను ఊచకోత కోసిన బ్రిటన్‌ ఇప్పుడు ఖలిస్థానీలకు ఆశ్రయం, ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోంది. పైగా, లండన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంపై ఖలిస్థానీల దాడి సంగతి తమకు తెలియదని బుకాయిస్తోంది. ఇక పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్కడ దేశ వ్యతిరేక శక్తులు బలపడుతున్నారని ఆ పార్టీ విమర్శకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
కాగా, ఆ రాష్ట్రంలో అకాలీ, కాంగ్రెస్‌ పార్టీలుఅధికారంతో పాటు తమ సిక్కు ఓటు బ్యాంకులను కూడా కోల్పోయినందువల్ల ఖలిస్థానీల విజృంభణకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని బాధ్యురాలని చేసే ప్రయత్నం చేస్తున్నాయి. విచిత్రంగా ఈ పార్టీలు ఖలిస్థానీలను తప్పుపట్టకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాటి దృష్టిలో అమృత్‌పాల్‌ సింగ్‌ కంటే భగవంత్‌ సింగ్‌ మాన్‌ ఎక్కువ ప్రమాదకారి. విచ్ఛినకర శక్తులు, వేర్పాటువాద శక్తులు పేట్రేగిపోయినా వాటికి నష్టమేమీ లేదు. ఒక ‘అమృత్‌ధారి’ సిక్కుగా అమృత్‌పాల్‌ సింగ్‌ అవతరించడం ఎలా సాధ్యపడింది. నున్నగా గడ్డం గీసుకుని, దుబాయ్‌లో ఒక ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసిన అమృత్‌పాల్‌ హఠాత్తుగా రెండవ భింద్రన్‌వాలేగా ఎలా మారిపోయాడు? అతనికి తెరవెనుక సహాయ సహకారాలు అందిస్తున్నవారెవరు? అతన్ని ఒక భింద్రన్‌వాలేగా తీర్చిదిద్ది, భారతదేశంలో విధ్వంసకర కార్యకలాపాలు సాగించడానికి పంపించింది ఈ మద్దతుదారులే. అతను సిక్కులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ, సాయుధ అంగరక్షకులతో యథేచ్ఛగా పంజాబ్‌లో తిరగడం ప్రారంభించాడు.
నాయకుడుగా ఎదిగిన తీరు
ప్రస్తుతం అజ్థాతంలోకి వెళ్లిన ఈ వేర్పాటువాది ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అనే సంస్థకు అధిపతిగా మారాడు. అంతకు ముందు ఈ సంస్థను శాంతియుతంగా నిర్వహించిన దీప్‌ సిద్ధు నుంచి అతను ఈ సంస్థను చేజిక్కించుకున్నట్టు కనిపిస్తోంది. అతను ఈ సంస్థకు అధిపతి అయిన మూడు వారాల్లోనే ఈ సంస్థ కార్యకలాపాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఆ సంస్థ కార్యకలాపాలు ఫేస్‌బుక్‌లో ప్రవేశించాయి. అమృత్‌పాల్‌ సింగ్‌ను ఒక గురువుగా, ఒక ప్రవచనకర్తగా, సిక్కుల శ్రేయోభిలాషిగా అది ప్రచారం చేయడం మొదలైంది. మొత్తానికి వారిస్‌ పంజాబ్‌ దే అతన్ని ఒక హీరోను చేసింది. ఈ సంస్థ కార్యకలాపాలను గమనించిన దీప్‌ సిద్ధు కుటుంబం పంజాబ్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది కానీ, ప్రభుత్వం పట్టించుకోలేదు. నాలుగు నెలలు గడిచేసరికి అమీత్‌పాల్‌ ‘రివైవ్‌ ఖలిస్థానీ మూవ్‌మెంట్‌’ అనే సంస్థను ప్రారంభించాడు. తన సహచరులతో కలిసి రాష్ట్రమంతా తిరుగుతూ, డబ్బును, ఆయుధాలను సేకరించాడు. గ్రామాలలో మతపరమైన సభలు, సమావేశాలు నిర్వహించాడు. అతని పేరు, అతని కార్యకలాపాలు క్రమంగా వార్తలకెక్కడం మొదలైంది.
అతను పంజాబ్‌ వ్యాప్తంగా అనేక చోట్ల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, “ఖలిస్థానే మా లక్ష్యం. దీన్ని ఒక దుర్మార్గ భావనగా, సంఘ వ్యతిరేక విధానంగా భావించకూడదు. దీనిని మేథో కోణం నుంచి పరిశీలించాలి. దీనివల్ల భౌగోళికంగా సిక్కులకు ఒనగూడే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఖలిస్థాన్‌ అనేది ఒక సిద్ధాంతం. సిద్ధాంతం అనేది ఏనాటికి మరణించదు. మనకు ఇది ఢిల్లీ ఇవ్వాల్సిన అవసరం లేదు” అంటూ అతను సిక్కుల భావోద్వేగాలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. హోం మంత్రి అమిత్‌ షాకు కూడా ఇందిరా గాంధీకి పట్టిన గతే పడుతుందంటూ అతను హెచ్చరికలు కూడా చేశాడు. విచిత్రమేమిటంటే, అమృత్‌పాల్‌ సింగ్‌ వ్యవహారాలు, కార్యకలాపాలు కళ్లెదుట స్పష్టం కనిపిస్తున్నా పంజాబ్‌ పోలీసులు అతని మీద చర్య తీసుకున్న పాపాన పోలేదు. అయితే, అతను ఎప్పుడైతే అంజనా పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశాడో, అతని మీద పోలీసుల దృష్టి పడింది. అతని కోసం పెద్ద ఎత్తున వేట మొదలైంది. అతనికి ప్రజల్లో కూడా పలుకుబడి తగ్గింది.
స్వార్థ రాజకీయ ప్రయోజనాలు
వెంటనే అతని మీద చర్య తీసుకోవాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌, అకాలీదళ్‌లు డిమాండ్‌ చేయడం ప్రారంభించాయి. అయినప్పటికీ పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దీనిపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. పంజాబ్‌ పోలీసులు అతని సహచరుల ఇళ్లపై దాడులు చేసి, చాలామందిని అరెస్టు చేశారు కానీ, సకాలంలో అతని ఇంటిపై దాడి చేయకపోవడం వల్ల అతను పారిపోవడానికి వీలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో తేలిందేమిటంటే, అతని సంస్థ వారిస్‌ పంజాబ్‌ దేకు అజ్ఞాత సంస్థల నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలు అందాయి. వీటిపై ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం అయింది. ఇది ఇలా ఉండగా దాలి గుంటలో చేపల వేట మాదిరిగా అకాలీదళ్‌ తమ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ చేజిక్కించుకున్న సిక్కు వోట్లను తిరిగి రాబట్టుకోవడం కోసం, అమృత్‌పాల్‌ సహచరులకు మద్దతుగా కోర్టులో పిటిషన్లు వేయడం ప్రారంభించింది. విదేశాల్లోని సిక్కు పార్లమెంట్‌ సభ్యులు పలువురు సిక్కులను భారత ప్రభుత్వం అణచివేస్తోందని, మానవ హక్కులను హరించి వేస్తోందని ప్రచారం మొదలుపెట్టారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల ప్రభుత్వాలు ఇటువంటి ప్రచారాలకు యథాశక్తి వంతపాడుతున్నాయి.
ఆసియాలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్‌ను బలహీనపరచడానికి, అస్థిర పరచడానికి విదేశీ శక్తులు పావులు కదపడం ప్రారంభం అయిపోయింది. అయితే, అమృత్‌పాల్‌ వంటి వ్యక్తిని ఎదగనిచ్చి, విచ్ఛిన్నశక్తులకు అవకాశం ఇచ్చి దేశాన్ని బలహీనపరచడానికి ఎవరు ప్రయత్నించినా వారి ఆటలు సాగనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని, ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి అది కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా స్వయంగా కూడా దీని అంతు తేల్చడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. సిక్కుల దేశభక్తిని, దేశం కోసం వారు చేసిన త్యాగాలను, వారి శ్రమ తత్వాన్ని సంకుచిత రాజకీయాల కోసం, పక్షపాత చర్యల కోసం వదులుకోవడం అనేది జరిగే పని కాదు.

- Advertisement -

డాక్టర్‌ ఆర్‌. వసుంధరా దేవి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News