సాహిత్యము ప్రవహించే నది లాంటిది నదిపుట్టుక ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక సందర్భాన్ని కల్గి వుంటుంది. దాని గర్భము చిన్నదిగా ఉన్నప్పటికి అది ప్రవహిస్తున్న కొద్ది శాఖోపశాఖలుగా విస్తరించి విశాలమైన మైదానాల గుండా ప్రవహిస్తు అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ ముందుకుసాగి చివరికి సముద్రంలో కలిసి అంతర్ధానమైపోతుంది. సాహిత్యము కూడా నది లాంటిదే. నది ఆవిర్భావం వలే “భావం” పుట్టుక ఒక “సృజనాత్మక” ప్రక్రియ అది చిన్నగా మొదలై కావ్యాలై, గేయాలై, పద్యాలై, పాటలై, నాటకమై వివిధ రూపాలతో బయటికి వస్తుంది. దాని ప్రభావం ఉత్తుంత తరంగం వలే ప్రభంజనం సృష్టిస్తుంది. అందుకే సాహిత్యానికి అంతటి మహత్తు ఉంది. ప్రపంచగమనాన్ని విప్లవాలను ప్రభావితం చేయగల్గింది సాహిత్యముతో కూడిన రచనలే అంటే ఎవరైన నమ్మగలరా అందుకే “విశ్వశ్రేయం కావ్యం” అన్నారు పెద్దలు. ప్రపంచం యొక్క శ్రేయస్సును కోరేది సాహిత్యమే. అది ఏ ప్రక్రియతో కూడిన రచన ఐన కావచ్చును.
ఇక తెలుగు సాహిత్యం విషయానికొస్తే చాలా మంది కవులు పలు సృజనాత్మక రచనలు చేసి సమాజంపై చెరగని ముద్ర వేశారు. అలాంటివారిలో డా.సి.నారాయణ రెడ్డి గారు కూడా ఒకరు. వీరు 29, జులై 1931 లో హనుమాజీపేట గ్రామం సిరిసిల్ల తాలూకా, కరీంనగర్ జిల్లలో జన్మించారు. ప్రాధమిక మరియు మధ్యమిక విద్యను పుట్టిన ఊరులో చదివి 1949లో హైదరాబాద్ లోని చాదర్ ఘట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి బి.ఏ. చదివిన అనంతరం 1954లో ఎం.ఏ. పూర్తిచేసి ఆచార్య ఖండవల్లి లక్ష్మి రంజనం గారి పర్యవేక్షణలో “ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు” అనే అంశముపై పరిశోధన పూర్తిచేసి “డాక్టరేట్” పట్టా పొందారు. కొద్ది కాలం నిజాం కళాశాలలో తెలుగు ఆధ్యాపకుడిగా, అనంతరం 1963 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడర్ గా, ప్రొఫెసర్ గా పనిచేశారు. అధికార భాషా సంఘం చైర్మన్ గా, తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా, తెలుగు ప్రాంతం నుండి కవిగా మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిగా నియమింపబడటం అరుదైన విషయం.
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలికి 1988లో “విశ్వంభర” కావ్యమునకు గాను జ్ఞానపీట్ అవార్డు పొందిన రెండవ తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. (మొదటి వారు విశ్వనాధ సత్యనారాయణ “రామాయణకల్ప వృక్షం” నకు 1977లో)
1992 లో భారత ప్రభుత్వంచే “పద్మభూషణ్ అవార్డు అలాగే “మంటలు – మానవుడు” రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1973), 1977లో పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు. అలానే “విశ్వంభర” కావ్యమునకుగాను బిల్వారా అవార్డు భారతీయ భాషా పరిషత్తు కలకత్తా 1980 ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు ఎన్ని అవార్డులు ఇచ్చి సన్మానించినా వీరు మాత్రం తెలుగు సాహిత్యంలో “సినారె”గా చిరకీర్తిని పొందారు. వీరి గూర్చి ప్రముఖ రచయిత కుందుర్తి ఆంజనేయులు నారాయణరెడ్డి గారు “దేవరకొండ బాలగంగాధర్ తిలక్ లాగా రెండంచుల పదును గల కత్తి, కవిత్వంతో అగ్ని చల్లగలడు మరియు అమృతం కురిపించగలడు” అంటారు. అందుకే నారాయణ రెడ్డి గారిని మానవత్వము కలబోసిన సమన్వయ శాంతి మూర్తిగా పరిగణించాలి, అభ్యుదయం, శాంతి విప్లవం, మానవత, సమతాభావం అన్నింటిని సమపాళ్ళల్లో కలిపి కవిత్వాన్ని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నడిపించగల ధీశాలి. శ్రీశ్రీ వారసత్వాన్ని గురజాడ వారి “పాతకొత్తల మేలు కలయిక” అన్నట్లుగా ఇరువురిని సమన్వయo చేసుకొని ముందుకు నడిచారు. సినారె రచనలు: ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు (పరిశోధనా గ్రంధం), విశ్వంభర (కావ్యం) ప్రపంచపదులు, నవ్వని పువ్వు, అజంతా సుందరి, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాధ నాయకుడు, జాతిరత్నం, ఋతుచక్రం, జలపాతం, మధ్యతరగతి మందహాసం, మంటలు, మానవుడు, ఉదయం నా హృదయం, పగలే వెన్నెల (చలన చిత్రగీతాల సంకలనం) పాటలో ఏముంది నా మాటలో ఏముంది, సినిమా పాటల విశ్లేషణ, తెలుగు గజళ్ళు, కవితా నా చిరునామా, వ్యాసవాహిని, సమీక్షణం, మా ఊరు మాట్లాడింది మొదలైనవి. చివరి వరకు వ్రాస్తూనే చివరిమజిలీని ఆస్వాదిస్తు కొత్తతరం కవుల గూర్చి “కుర్రాలోస్తున్నారు జాగ్రత్త కొత్త గొంతు లెగరేసుకుంటూ” అంటూకొత్తగా వస్తున్న కవులతో కూడా పోటీపడి పలు సృజనాత్మక రచనలు చేశారు.
“విశ్వంభర” కావ్యం గూర్చి జీ.వి.సుబ్రహ్మణ్యం వంటి ఆధునిక విమర్శకులు చాలా మంది బహుముఖాలుగా ప్రస్తుతించారు. ఇది వచనా కవితా ప్రక్రియలో వెలుబడిన ఆధునిక మహాకావ్యం, సినారె గారి మానవతావాద ప్రస్థానంలో ఇది ఒక మణిదీపం లాంటిదని చెప్పవలెను. “విశ్వంభర” అంటే భూమి, ప్రపంచం, అనే అర్ధాలు కలవు, అంటే భూగోళం, పుట్టుక, భూమి అనబడే మట్టితో కూడిన భూమి గూర్చి కాదు, ఆ మట్టిలో పుట్టిన మనిషి అనబడే జీవి పొందిన వికాసాన్ని, ఆ వికాసం గ్రామం, నాగరికతా క్రమంలో ఆ మనిషి యొక్క చైతన్య స్థాయి గూర్చి, ఆ చైతన్యానికి మూలమైన మట్టితో మనిషికి గల సంబంధమే “విశ్వంభర”, విశ్వంభరే మానవుడు అని ప్రసిద్ధ రచయిత ఆచార్య ఎన్.గోపి గారు ఈ కావ్యం గూర్చి వివరించారు. విశ్వంభర కావ్యంలోని కొన్ని విశేషాలు తెల్సుకుందాం.
నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర.
కాళ్ళకింద ధూళిపొర.
ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్ళల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి.
చిచ్చు ముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి.
ఆవిరిలో ఆ నీలితెర
అంటుకున్నప్పుడు
అద్దిన బిళ్ళలు చిట్లిపడ్డాయి.
ధూళి పొరలో పొడిచిన
విత్తుల పొత్తికడుపుల్లో
చెట్లు నెత్తురు పోసుకున్నాయి.
పై వాక్యాలను బట్టే సినారె గారికి కవిత్వంపై ఎంతటి పట్టువుందో అర్ధం చేసుకోవచ్చును. “విశ్వంభర” కావ్యంలోనివి (పేజీ నెం.1) ఆ వాక్యాలు, “తను పుట్టకముందే నెత్తి మీద (తలాపున) నీలి ఆకాశం మరియు కాళ్ళ కింద దూళి పోర అంటే మట్టి/ భూమి అని అర్ధం, మనిషికి మరియు మట్టికి ప్రకృతితో వుండే అనుబంధం గూర్చి సృజనాతమకమైన శైలిలో విశ్లేషించారు. మట్టి పొరల్లో విత్తులు లేదా విత్తనాల ద్వారా చెట్లు జీవంపోసుకున్నాయి అంటూనే. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు చిలుకల ముక్కుల్లో చిగురు తొడిగిన పలుకులు సుడిగాడ్పుల రెక్కల్లో పడగలెత్తిన రొదలు ఒకటేనెమో! అంటారు, అలానే చెట్లను వేడిగాలులతో మాడ్చే మండుటెండ, మాడిన చెట్ల చెక్కిల్లను తడిమి మెరుగు పెట్టె పిండి వెన్నెలా ఒకటేనెమో! ఎంత సహజమైన ప్రకృతివర్ణన, పగలు వెన్నెల రెండింటికి వృత్యాసం వున్నా ఒకదానికొకటి ముడిపడి వుంటాయి.
‘ఈ గొంతు నీది
మరి ఏదీ నీ సహచరిది?’
‘పలికే ఈ గొంతులో
ప్రతిశబ్దం ఇద్దరిది.’
‘తెలుసా!
శాసన ధిక్కారానికి ఫలితం?’
‘తెలుసు –
మట్టిలా మొలకెత్తే మరో జీవితం.’
‘ఆ జీవితానికి
అనుక్షణం మృత్యుభయం!?’
‘ఆ మృత్యువు కోరలతో
ఆడుకోవడం మాకు ప్రియం.’
‘అయితే వెళ్ళిపో మట్టిమనిషీ!
ఆ మట్టిలోకి.’
‘అలాగే;
వెళ్ళి పొంగిస్తాను ఆ మట్టిని నింగిపైకి.’
‘అందాకా వచ్చిందా నీ అహంకృతి?’
‘అక్కడే మొదలవుతుంది
మానవసంస్కృతి.’
పై వాక్యాలు “విశ్వంభర” కావ్యంలోనివి (పేజీ నెం.8) సాధారణ సాహిత్య పరిజ్ఞానం వున్న వ్యక్తికి సైతం అర్ధం అయ్యే రీతిలో వున్న అలతి అలతి పదాలకూర్పు సినారె గారిది. మట్టి నుండి మొదలైన మానవ జీవితానికి అనుక్షణం వెంటాడే మృత్యువు అలాంటి మృత్యువుతో సైతం ఆడుకోవడం మాకు ఇష్టం అంటూనే మట్టిలో కలిసిన తర్వాత మొదలవుతుంది మానవ సంస్కృతి అంటాడు, మట్టితో మానవ నాగరికతలు మొదలయ్యాయని మట్టితో గాఢమైన అనుబంధం మనిషికి ఉంటుందని చెప్పాడు పై కవితలో.
సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా?
హిమనగానికి బొగ్గుపూస్తే నల్లబడుతుందా?
తలుపులూ కిటికీలు ఎంతగ మూసుకుని వున్నా –
తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా?
ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా?
పై వాక్యాలు “ప్రపంచపదులు” (పేజీ నెంబర్ – 18) లోని వాక్యాలు అవి. కవియొక్క (తాత్వికతకు నిదర్శనాలు. విశాలమైన సముద్రానికి జిడ్డు పూస్తె మైలపడుతుందా? అని ప్రశ్నిస్తాడు, అలాగే మంచుకొండ ఐనటువంటి హిమాలయాలకు బొగ్గురాస్తే నల్లబడుతుందా? తలుపులు, కిటికీలు నువ్వూ ఎంతగా మూసుకొని వున్నా కాలంతో పాటు వచ్చే వృద్ధాప్యం/ ముసలితనం రాకుండా ఉంటుందా? ఎంతో తార్కికత, పరిపక్వత, అనుభవసారం ఈ పదాల్లో కన్పిస్తాయి, తెలుగు సాహిత్యంలో ఇదో కొత్తరకమైన సాహిత్య ప్రక్రియ, దీనికి ఆద్యుడు సినారే గారు కావడం గొప్ప విషయం.
“మట్టీ మనిషీ ఆకాశం
వీటిచుట్టే అల్లుకుంది సృష్టికథాసూత్రం
మట్టి ప్రసవించిన చెట్లు మనిషి చేతుల్లా లేచి
నింగిని తట్టి లేపుతాయి
ఉలికిపడ్డ పగటికన్ను తెరుచుకుంటుంది”
ఈ వాక్యాలు “మట్టి మనిషి ఆకాశం” అనే వచన కవిత్వం లోనివి. సినారె గారు దీనిని 1997లో రచించారు ఇది దీర్ఘ కావ్యం.
సినారె కవిత్వంలో “మట్టిని మనిషిని వేటిని వదిలిపెట్టని కవి, ఇవి రెండు సినారె గారి ద్వారా “పేటెంట్” పొందిన “కవిత వస్తువులు”, మట్టితో మనిషికి, మనిషితో మట్టికి ఉండే అవినాభావ సంబంధం గూర్చి తెలియజేస్తాడు. అందుకే నీరు లేని చోట చేప వుండజాలదు, అన్నట్లుగా మట్టిపైనే మనిషి మనుగడ ఇదే కదా సృష్టి సూత్రం అంటాడు. ఇది అందరికి తెల్సిన విషయమే కదా. ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలి, ఆనందంగా మనిషి జీవించాలి అనేది సినారె గారి అంత: సూత్రం.
“అవయవాలు చస్తాయిగానీ ఆలోచనలు చావవు
శరీరం చివికి మట్టిలో కలిసిపోతుంది గుర్తుపట్టలేకుండా
ఆశయాలు జీవించే వుంటాయి
కాలఫలకం మీద చెక్కిన సంచలనాక్షరాలై”
ఈ వ్యాక్యాలు ఎంతటి వాస్తవాలో మనకు తెలిసిన విషయమే, అవయవాలు చస్తేనే శరీరం మట్టిలో కలిసిపోతుంది కాని ఆశయం సజీవంగా, ఉండిపోతుంది, కాలం అనే మనోఫలకంపైన నీ చరిత్ర సంచలనమైన అక్షరాలుగా నిలబడిపోతుంది అంటూ, తన చరిత్రను జులై 06, 2017లో ముగించి సాహిత్య శేషులుగా చిరకాలం చిరంజీవిగా, సాహిత్యకారుడిగా అందరి మదిలో నిలిచారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నోమధురమైన, సామాజిక సందేశాలు ఇచ్చే పాటలు మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనిఏనా?, వగలరానివి నీవే సొగసుకాడను నేనే, పాటలో ఏముంది, నా మాటలో ఏముంది, ఊ అను ఊఉ అను, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, చిగురులు వేసిన కలలన్ని, కండగేలిచింది కన్నెదొరికింది, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, తోటలో నా రాజు తోగిచూసేను నేడు, గోగులపూచే గోగులకాచే ఓ లచ్చగుమ్మడి, అ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం లాంటి ఎన్నో సందేశాత్మక పాటలు వ్రాసి తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటు ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు, సినారె అనగానే “గజళ్ళ” గుబాళింపు గుర్తుకొస్తాయి. అలాంటి అరుదైన వ్యక్తికి అక్షర నీరాజనం.
డాక్టర్ మహ్మద్ హసన్
సెల్ నెం. 9908059234.