నిరంతర అక్షర సేద్యం చేసిన అసమాన సాహితీ తపస్వి, ప్రఖ్యాత సినీ గేయకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం అని పాటల తోటలో విహ రించి, జగమంత కుటుంబం నాది అంటూ ఘంటాపథంగా చెప్పి లాలిజోలాలిజో అని అమ్మ ప్రేమను, సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని, ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూచుందామా, వాళ్ళేం సాధించారో కొంచం గమనిద్దాం, అనగనగా ఆకాశం ఉంది, ఆకశంలో మేఘం ఉంది, తెల్లారింది లేగండోయ్, మనం మనం కలిస్తే జనం అంటూ భక్తతత్వాన్ని, తాత్వికతను, మేల్కొలుపును, ఆలోచనలను రగిలించే 3 వేలకు పైగా గీతాలను ఆయన సినిమాలకు రాశారు. తెలుగు పాటకు ఊపిరిపోసిన శబ్ద మాం త్రికుడు, అక్షర శ్రామికుడు సిరివెన్నెల. తెలుగు సినీగేయ చరిత్రలో గొప్ప పదప్రయోగాలతో ఆయన పాటల ప్రస్థానమే ఒక ప్రత్యేక అధ్యా యంగా సాగింది. శృతిలయలు, స్వర్ణకమలం, గాయం, శుభలగ్నం, శ్రీకారం, సిందూరం, ప్రేమకథ, చక్రం, గమ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లోని పాటలకు మొత్తం పదకొండు సార్లు నంది అవార్డులు అందుకున్న సినీకవిగా ఆయనదొక రికార్డు. సిరివెన్నెల సినిమాలో రాసిన విధాత తలపున అన్న తొలి పాటకే నంది అవార్డు అందుకోవడం కూడా సీతారామశాస్త్రి సినీగీత ప్రయాణంలో ఒక అరు దైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. మనస్విని, కళాసాగర్, కిన్నెర, వంశీ, రసమయి, భరతముని సంస్థల అవార్డులను ఆయన పొందారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 2019లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి గౌరవించింది. పాటల తోటలో తేనెల వానలు కురిపించిన ప్రతిభాశాలి సిరివెన్నెల. మాధుర్యంలో తలమునకలేసి పరమానందాన్ని, ఆలోచనాశీలతను పెంచే పాటలె న్నింటినో తన మధుర జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లిన అసాధారణ సినీ గేయకవి సిరివెన్నెల. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదంగా ఆయన కలం ఒలికిన ప్రతి పాట భాసించింది. సినీగీతాలకు తనదంటూ సొంత గొంతుకతో కావ్యగౌరవం ఆపాదించిన అక్షర యోగి సిరివెన్నెల. ఆది భిక్షువు, వాడినేది కోరేది… బూడిదిచ్చే వాడినేమి అడిగేది, తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేమి అడిగేది… బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏమి అడిగేది అని శివతత్వాన్ని తెలిసి లోకానికి ఎంతో గొప్పగా చాటారు. మదిని నిద్రలేపే ఎన్నో పాటలకు ఆయన ఆవిష్కర్త అయ్యా రు. పాటకు విశ్వరూపమై వెండి తెరపై సిరివెన్నెలలు కురిపించారు.
సిరివెన్నెల పాటల వెనక ఎంతో సాహిత్య అధ్యయనశీలత, నిరంతర సాధన సుస్పష్టంగా కన్పిస్తుంది. నానృషి కురుతే కావ్యం అన్న అక్షర సత్యం ఆయన పాటల్లో వెలుగులీనింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పూర్తిపేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖపట్నం జిల్లా అనకా పల్లిలో 20మే 1955లో చేంబోలు వెంకటయోగి, సుబ్బలక్ష్మి దంప తులకు సీతారామశాస్త్రి జన్మించారు. సీతారాముడు అని ఆయనను అందరూ పిలిచేవారు. అనకాపల్లిలోనే బాల్యం, విద్యాభ్యాసం కొన సాగింది. 1971లో కాకినాడ ఆదర్శ జూనియర్ కళాశాలలో ఇంటర్మీ డియెట్, పిఆర్ కళాశాలలో బికామ్, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1974లో టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగం లభించగా రాజమండ్రి, తాడేపల్లిగూడెం, కాకినాడలలో 1983 వరకు పని చేశారు. తండ్రి వేంకటయోగి అధ్యాపకునిగా కాకుండా వివిధ భాషల్లో ప్రావీణ్యమున్న గొప్ప పండితుడు కావడంతో ఆయన నుండి భగవద్గీత, శ్రీ శంకర భగవత్పాదుల శివానందలహరి, పోతన భాగ వతంలోని అష్టమస్కంధం, గణితశాస్త్ర పరిచయాలను సీతారామశాస్త్రి నేర్చుకున్నారు. 1965 నుండి 1968 వరకు విశ్వనాథ వేయిపడగలు, పురిపండ అప్పులస్వామి ఆంధ్రమహాభారత వచన గ్రంథం, చంద మామ పత్రికలోని అరేబియన్ నైట్స్ కథలను చదివి ప్రాచీన, ప్రాచ్య సాహిత్యలపై సీతారామశాస్త్రి అవగాహన పెంచుకున్నారు. అదే క్రమం లో తనలోని విభిన్న ఆలోచనలకు అక్షర రూపమిచ్చి చిన్న కథలు, నాటికలు, పాటలు రాయడం ప్రారంభించారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అనేక మంది సాహితీమిత్రులతో పరిచయం ఏర్పడింది. ధరణి అనే కలం పేరుతో విజయ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికలతో కథలు, కవితలు రాశారు. సీతారామశాస్త్రికి పాటలు పాడాలనే కోరిక ఉండేది. కొంతకాలం తరువాత పాడడం తనతో కాదని గ్రహించి తమ సోదరుడు శ్రీరామమూర్తి సూచన మేరకు కవిత్వం రాశారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఎంఏ చదువుతుండగానే సినీదర్శకులు కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశం సీతారామశాస్త్రికి ఇచ్చా రు. సిరివెన్నెల సినిమాకు తొలిసారి గీత రచన చేశారు. ఆ తరువాత ఆయన ఇంటిపేరుగా సిరివెన్నెల మారిపోయింది. జగమంత కుటుం బం అన్న భావనతో ఎదిగిన సీతారామశాస్త్రి అదే భావనతో తన పిల్లల ను తీర్చిదిద్దారు. భార్య పద్మావతి, కుమారులు యోగి, రాజా, కుమార్తె లలిత ఆయన కుటుంబ సభ్యులు. అందరి మనసును గెలిచిన రచయి తగా విలువల శిఖరంగా జీవిస్తూ ఆ స్పర్శను తన పాటల్లో కనబరిచి సాహిత్య విలువలను ఎంతగానో పెంపొందించారు.
తెలవారదేమోస్వామీ.. నీ తలపుల మునకలో అలసినదేవేరి అల వేలు మంగకూ, అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? స్వర్ణో త్సవాలు చేద్దామా? దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని వంటి పాటలలో సీతారామశాస్త్రిదైన ప్రత్యేక ముద్ర కన్పిస్తుంది. సినీగీత రచనలో ఉన్నప్పటికీ తన ఇష్టదైవమైన శివునిపై గీతాలను రచించి 1999లో శివదర్పణం పేరుతో పుస్తకం రచించారు. ఇది ఆయన న్యూ యార్క్ క్వీన్స్ లైబ్రరీలో ఆమెరికా పర్యటనలో భాగంగా ఆవిష్కృత మైంది. తాను రాసిన పాటల సందర్భాలను పేర్కొంటూ సిరివెన్నెల తరంగాలు పేరుతో ఒక పుస్తకాన్ని ఆయన వెలువరించారు. నందివర్థ నాలు అనే పుస్తకం పురస్కారాలు వచ్చిన సిరివెన్నెల పాటలను విశ్లేషిస్తూ ప్రచురితమైంది. సిరివెన్నెల రాసిన పెళ్లిపాటలను కళ్యాణ రాగాలు పేరుతో సంకలనంగా ముద్రించారు. తెలవారనీయని తలపు లమునకలో ఓలలాడించే ఎన్నెన్నో రసరమ్యగీతాలకు సిరివెన్నెల ప్రాణం పోశారు. ఎన్నెన్నో జీవిత సత్యాలు సిరివెన్నెల పాటలలో దొరు కుతాయి. ఆ పాటల నుండి స్ఫూర్తి పొందిన వారు అనేకులున్నారు. ప్రాగ్దిశ వేణియ, దినకర మయూఖ తంత్రులు వంటి అద్భుత పదాలను పాటల్లో కూర్చడంలో తన ప్రత్యేకత ఏమిటో చూపించారు. నాని హిరోగా నటించిన శ్యామ్‌సింగరాయ్‌లోని రెండు పాటలు సిరివెన్నెల రాసిన ఆఖరి గేయాలు. వెలకట్టలేని వేడుకలా, కొలవలేని వెన్నెలలా అప్రతిహతంగా ఆయన ఆపాత మధురమైన, ఆలోచనాత్మకమైన సినీ గీత రచనా ప్రయాణం సాగింది. ఊపిరితిత్తుల కేన్సర్‌తో తీవ్ర అస్వ స్థతకు గురై 24 నవంబరు 2021న సికింద్రాబాదు కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. న్యుమేనియా లక్షణాలతో చికిత్స పొందుతూ 30 నవంబరు 2021న సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1 డిసెం బరు 2021న హైద్రాబాదు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తన పాటలతో ఎందరినో ఆకట్టుకొని వెలకట్టలేని మహో న్నత భావాల నిధులను అందించి వెళ్లిన చిరస్మరణీయ సినీ గేయకవి సిరివెన్నెల.
- డా. తిరునగరి శ్రీనివాస్
8466053933
(నేడు సిరివెన్నెల జయంతి)