Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Sluggish economy: ఆర్థిక మాంద్యంలో ఆచితూచి అడుగులు

Sluggish economy: ఆర్థిక మాంద్యంలో ఆచితూచి అడుగులు

ఒకపక్క కోవిడ్‌ మహమ్మారి, మరోపక్క ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కఠినాతికఠినంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. నిజానికి, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది మాటల వరకూ బాగానే ఉంటుంది కానీ, చేతల దాకా వచ్చేసరికి చాలా కష్టమైన విషయం. పైగా, ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడమన్నది మరీ కష్టంగా ఉంటుంది. రుణాలు మాఫీ చేద్దామని, ఉచితాలు ప్రకటిద్దామని, సబ్సిడీలు, రాయితీలు ప్రకటిద్దామని మనసు తహ తహలాడుతుంది. ద్రవ్య సంబంధమైన జాగ్రత్తలను గాలికి వదిలేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే, ఈసారి బడ్జెట్ను సమర్పించడంలో ఆశ్చర్యకరంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక లోభత్వానికి కట్టుబడి ఉన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోలేదు. కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ప్రభుత్వం ఈసారి ఆదర్శంగా నిలిచింది. మాటల సంగతి అటుంచి చేతలకు ప్రాధాన్యం ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఎన్నడూ చేపట్టని చర్యలన్నీ చేపట్టబోతోంది. ఆర్థిక మాంద్య సంకేతాలను అవగాహన చేసుకుంటూనే, డిమాండ్‌ సరఫరాలకు మధ్య ఉన్న అంతరాలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కబళిస్తున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అయితే, ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిలో చేతులు ముడుచుకు కూర్చోకుండా ద్రవ్య క్రమశిక్షణకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలను పాటించదలచుకుంది. 1980లలో చేసినట్టుగా, కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం, జాతీయ బ్యాంకులు నగదు వ్యవహారాలను బిగించడం ప్రారంభించాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి, కఠిన సవాళ్ల నుంచి బయటపడడానికి ప్రభుత్వం చాకచక్యంగా ఈదాల్సి వస్తోంది.
స్థూల ఆర్థిక వ్యవహారాలను స్థిరీకరించడం అన్నది సామాన్య విషయం కాదు. ఒక పక్క ద్రవ్యోల్బణ సమస్యలను, ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే, మరొక పక్క ఆర్థికాభివృద్ధికి పాటుబడాల్సి ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమతూకాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇది నిజంగా కత్తి మీద సామే. ఒక విధంగా చూస్తే, కొన్ని కీలక అంశాలకు సంబంధించినంత వరకు ఈ బడ్జెట్‌ సరైన మార్గంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.
విచిత్రమేమిటంటే, ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు చోటు చేసుకోక ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఆర్థిక లోటును పరిమితం చేయడానికి, తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. లోటు సంబంధమైన లక్ష్యాలను సాధించడం లేదా అధిగమించడం జరుగుతూనే ఉంది. భారతదేశ ద్రవ్య లోటు 2020-21లో రికార్డు స్థాయిలో 9.3 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఏడాది అది 4.6 శాతం మాత్రమే ఉంది. ద్రవ్య లోటు పెరగడానికి కారణం కోవిడ్‌ మహమ్మారి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మితిమీరి ఖర్చు చేయాల్సి వచ్చింది.
ద్రవ్య లోటుకు కళ్లెం
కాగా, ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఉక్రెయిన్‌ యుద్ధ రూపంలో, ఆర్థిక మాంద్యం రూపంలో రెండు పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ద్రవ్య లోటును ఎటువంటి పరిస్థితుల్లోనూ 6.4 శాతాన్ని మించి పోకూడదని ప్రభుత్వం కంకణం కట్టుకోవడం అభినందించాల్సిన విషయం. దీనిని వచ్చే ఏడాది 5.9 శాతానికే పరిమితం చేయాలని కూడా కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ఇక 202 5-26 నాటికి ఈ ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతానికి తగ్గిపోవాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజానికి, ఇందులో అర శాతం తగ్గినా కొత్త ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే, ఆర్థిక మాంద్యంతో నిమిత్తం లేకుండా, ఆర్థిక స్థిరీకరణను సాధించగలుగుతుంది. అంటే, ఇప్పుడు తీసుకుంటున్న ఆర్థిక క్రమశిక్షణా చర్యల వల్ల రెండేళ్ల పాటు దేశం ఆర్థికపరంగా సురక్షితంగా, సుస్థిరంగా ఉండగలుగుతుంది.
ఇది ఇలా ఉండగా, ప్రైవేట్‌ పెట్టుబడులను పెంచడం జరుగుతుందంటూ ఇటీవలి ఆర్థిక సర్వే ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సవాళ్ల వల్ల, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిమితుల వల్ల కేవలం ప్రైవేట్‌ పెట్టుబడులతోనే ఆర్థికాభి వృద్ధిని సాధించడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మాంద్యాన్ని, అనిశ్చిత పరిస్థితులను తట్టుకుని, కొద్దో గొప్పో ఆర్థికాభివృద్ధిని సాధించడానికి 2023-24లో కేంద్రం దీర్ఘకాలిక మూలధనం కింద సుమారు వెయ్యి లక్షల కోట్ల రూపాయలను కేటాయించదలచుకుంది. ఇది గత సంవత్సరం కంటే 33 శాతం ఎక్కువ. ఇందులో ప్రైవేట్‌ రంగానికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ఖర్చు ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రయోజనకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అదే స్థాయిలో మూలధన వ్యయం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కూడా ఆర్థికమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
అదే సమయంలో కేంద్రం తమ మూలధనాన్ని పెంచుకోవడానికి రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. యాభై ఏళ్లుగా రాష్ట్రాలకు వడ్డీ లేకుండా ఇస్తున్నరుణాలను మరో ఏడాది కాలం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రోత్సాహకాల పేరుతో ఇస్తున్న నిధులను రాష్ట్రాలు తమకు తోచిన రీతిలో ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, అవి తప్పనిసరిగా తమ మూల ధన వ్యయాన్ని పెంచాల్సి ఉంటుంది. రాష్ట్రాలు సంస్కరణలకు, ప్రాధాన్య ప్రాంతాలకు ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి సంబంధించి ఒకపక్క కఠిన చర్యలు తీసుకుంటూనే మరొక పక్క పన్నుల రాయితీలను ప్రకటించడం కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలకు కారణమైంది. అయితే, ప్రభుత్వం పాత పన్నుల వ్యవస్థకు స్వస్తి చెప్పి కొత్త పన్నుల వ్యవస్థకు మారడానికి ప్రయత్నం చేస్తోందని, ఇందుకు ప్రజలకు ప్రోత్సాహకాలు ఇస్తోందని అర్థం చేసుకోవాలి. పాత పన్నుల వ్యవస్థ వల్ల అనేక కేసులు ట్రైబ్యునల్స్‌లో, కోర్టుల్లో నలుగుతున్నాయి. ఇది అనేక వివాదాలకు కారణమవుతోంది. మినహాయింపుల కోసం పెట్టుకునే ఆర్జీలు, అభ్యర్థనలతో ఆఫీసులు నిండిపోతున్నాయి. పన్నుల వ్యవస్థను సరళం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, కొన్ని ఆర్థిక భారాలను తగ్గించుకోవడానికి, ఆర్థిక సమస్యలను పరిష్క రించుకోవడానికి ప్రభుత్వం రుణ సేకరణ మీద ఆధార పడుతుండేది. ఈ రుణాలు ద్రవ్య నిబంధనల కిందకు రావు. ఇక నుంచీ ఈ పద్ధతికి స్వస్తి చెప్పడం జరుగుతుంది. నిజానికి దీన్ని గత ఏడాదే ప్రారంభించడం జరిగింది. దీన్ని ఈ ఏడాది నుంచి మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పాటు, ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవడానికి ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేయ బోతోంది. ఇది సబ్కా సాథ్‌, సబ్కా వికాస్‌, సబ్కా ప్రయాస్‌ పథకం కిందకు వస్తుంది. ఇందులో భాగంగానే మహిళా సాధికారికతకు ఇబ్బడి ముబ్బడిగా నిధులను పెంచడం జరిగింది. ఇందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో 79,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మొత్తం మీద ఈసారి బడ్జెట్‌ సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి మాటలను తగ్గించారు. చేతలను పెంచారు. వాగ్దానాలను తగ్గించారు. కార్యాచరణకు అవకాశం పెంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News