Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Smoking: తాగితే ప్రాణం పోతుందా ?

Smoking: తాగితే ప్రాణం పోతుందా ?

ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ, సిగరెట్‌ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. ఇది అందరికీ తెలిసిందే. మొదట సరదాగా యువత చేసుకుంటున్న స్మొకింగ్‌ (ధూమ పానం) అలవాటే జీవితాంతం కొనసాగే చెడు అలవాటుగా మారుతోంది. ఇది కాస్తా వ్యసనంగా మారి క్రమంగా ప్రాణాల మీదికి తెస్తుంది. ధూమపానం చేసే వారి యువత సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. సిగరెట్లు కాల్చేందుకు డబ్బులు ఖర్చు పెట్టిన దానికంటే.. ధూమపానంతో వచ్చే వ్యాధులను తగ్గించుకునేందుకు వందల రేట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేస్తున్నారు. పొగాకు పదార్థాల ప్యాకెట్లపై తేలు బొమ్మ, కాన్సర్‌ రోగి బొమ్మను ముద్రించినా, సిగరెట్‌ ధర ఎంత పెంచినా, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేదించినా, ధూమపానం ప్రాణాంతకం అని తెలిసినా సిగరెట్‌ అమ్మకాలు పొగాకు ప్రియుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయేగాని తగ్గడం లేదు.
ధూమపానం ప్రాణాంతకమే
ధూమపానం వల్ల వ్యక్తులలో నోటి కాన్సర్‌, దంత వ్యాధులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, ఉదరకోశ క్యాన్సర్‌ సోకే అవకా శాలు ఎక్కువ. సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గుండెకు సంబంధించిన రక్త నాళాలు దెబ్బ తిని రక్తపోటు, గుండెపోటు సంభవిస్తాయి. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవాతం, నరాల బలహీనత ఏర్పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో వినికిడి, మాట్లాడే సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసేవారిండ్లలో ఉన్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.
మానాలనుకుంటున్న మానలేక పోతున్నారా
పొగ తాగడం మానేయ్యాలనే ఆలోచన వచ్చినా అమలులో మాత్రం సాధ్యం కావడం లేదనే వారు ఎక్కువయ్యారు. ఒక చెడు మొక్కను నిర్మూలించాలని ఆకులు, కొమ్మలు, కాండంలను నరికి వేసినంత మాత్రాన చెడు మొక్క పూర్తిగా నశించదు. మరలా కొద్ది రోజు లకు మళ్లి మొలకెత్తుతుందనే విషయం మనకందరికీ తెలుసు. ఆ చెడు మొక్కను వేర్లతో సహా, నామారూపాలు లేకుండా పెకిలి వేసినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. పొగ తాగడం మానేయాలనుకోవడం మంచి నిర్ణయమే. పొగతాగడం మానేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే మాత్రం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. పొగ తాగే వ్యసనపరులందరికీ ఒకే రకమైన నియమాలు పనిచేయవనే విషయాన్ని ముందుగా గుర్తించడం మంచిది. పొగ తాగడాన్ని ఎందుకు మానేయాలనుకుంటున్నారో మిమ్నల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి. సిగరెట్‌ తాగడానికి మిమ్మల్ని ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయో గమనించండి. సిగరేట్లు మానే డం సులువే. పొగతాగడం మానివేసే సమయంలో ఉత్పన్నమయ్యే అసహనం, ఆందోళన వంటి లక్షణాలు అగుపిస్తాయి. వీటిని ధృఢసంకల్పంతో, ధీమాగా ఎదుర్కొవాలి.
ధూమపానానికి దూరంగా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు
గ్లాసు పాలు: డ్యూక్‌ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ధూమపానం చేసే ముందు ఒక గ్లాసు పాలు తాగడం మూలంగా సిగరెట్‌ రుచి పట్ల ఆసక్తి ఉండదని తెలియచేసింది. సిగరెట్‌ ఆలోచన మనసుకు రాగానే, ఒక గ్లాసు పాలు త్రాగితే మంచి ఫలితము ఉంటుంది.
గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ టీ: ధూమపానం చేసేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ టీ తాగితే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
తల్లిదండ్రులూ బాధ్యతగా తీసుకోండి
మార్గదర్శి: తల్లిదండ్రులకు సిగరెట్‌ కాల్చడం ఒక అలవాటుగా ఉన్నట్లయితే యుక్తవయస్సులోని పిల్లల పరిశీలిస్తూ, వారు కూడా అలవాటుగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులుగా బాధ్యతగా తీసుకొని పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టియందుంచుకుని సాధ్యమైనంత త్వరగా పొగ తాగడం అలవాటును మానుకోవాలి. ధూమపానము నిర్మూలన దిశగా వ్యతిరేకంగా కఠినమైన నిభంధనలను, నియమాలను నిర్దేశిస్తూ, చిన్న వయస్సులోనే ధూమపానానికి అలవాటు పడటం మంచిది కాదని పిల్లలను హెచ్చరిస్తూ ఉం డాలి. ధూమపానం ఎంతమాత్రమూ మంచి అలవాటు కాదని ధృడంగా, ఖచ్చితంగా చెప్పాలి.
మనస్తత్వం: యుక్తవయస్సులోని పిల్లలకు ఎక్కువ సమయాన్ని కెటాయిస్తూ వారితో మాట్లాడుతూ వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. యుక్తవయసు పిల్లలలో కొత్త అంశాల వైపుగా మొగ్గుచూపుతూ వాటి ఆకర్షణకులోనవుతూ ఉంటారు. స్నేహ బృందంతో కలిసిపోవడానికి, వారి దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని, వారికి సరైన మార్గదర్శం చేయడం ద్వారా ధూమపానంనకు దూరంగా ఉండేందుకు ప్రోత్సహిస్తూ ఉండాలి.
మంచి చెడు: ధూమపానం చేయడం వలన కలిగే దుష్ప్రయోజనాలను, జీవితకాల వ్యసనంగా ఎలా మారుతుందో తెలియజేయాలి. సిగరెట్‌లో ఉండే హానికారక రసాయనాలు గురించి శ్వాసక్రియా వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్‌, గుండె సమస్యలు మొదలైన పలు ఆరోగ్య సమస్యలకు ఏ విధంగా సంభవిస్తాయో వారికి తెలియజేయాలి. మంచి చెడులను వివరిస్తూ ఉండాలి.
స్నేహితుడిగా భరోసా: ధూమపానం మానేయడం మూలంగా స్నేహితులు దూరమవుతారని, వారి అభిమానం కోసం తన స్నేహితులు చెప్పిన వాటికి లేదు అని చెప్పడానికి మీ యుక్తవయస్సులోని పిల్లలు భయపడవచ్చు. యుక్తవయస్సులోని పిల్లలతో మాట్లాడి, వారు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడాలి. కొన్ని దురలవాట్లకు లేదు అని చెప్పడం వలన జీవితాంతం సుఖంగా జీవించవచ్చని వారికి చెప్పాలి. తల్లిదండ్రులు ఒక స్నేహితుడిగా భరోసాను పిల్లలలో నింపుతూ ఉండాలి. తల్లిదండ్రులు యుక్త వయస్సులోని పిల్లలు బాధ్యతాయుతమైన వయోజనులగా ఎదగడానికి కీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు సరైన సమయంలో జోక్యం చేసుకుని, సరైన మార్గదర్శకం అందించి, పిల్లలకు బాసటగా నిలిచినప్పుడు సరైన మార్గంలో పయనిస్తారు. ఉన్నతస్థాయికి ఎదగగలుగుతారు.
కౌన్సెలింగ్‌: యువత ధూమపానం అలవాటును దూరం చేసుకోవడానికి సైకాలజిస్ట్‌ ద్వారా కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. లక్ష్యంవైపుగా పయనించడానికి కౌన్సెలింగ్‌ ద్వారా సాధించడం సులువవుతుంది.

  • డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
    9703935321
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News