మనిషి సంతోషంగా ఉండాలంటే ముందుగా కావల్సింది మంచి ఆరోగ్యం. అందుకే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని అంటారు. అయితే కొంతమంది విధివశాత్తు ఆ భాగ్యానికి నోచుకోలేక పోతుంటే, మరి కొంతమంది దానిని చేజేతులారా దూరం చేసికొంటున్నారు. ఈ రెండవ కోవకి చెందిన వారిగా ధూమపాన ప్రియుల్ని పేర్కొనవచ్చు. పొగాకు పొగని చుట్ట, బీడీ, సిగరెట్ లాంటి ఏ రూపంలో పీల్చినప్పటికీ అది ధూమపానమే అవుతుంది. పొగతాగడం ఆరోగ్యానికి మంచిది కాదని మనలో చాలా మందికి తెలుసు. అయినప్పటికీ నేటి సమాజంలో పొగతాగేవారి సంఖ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. పేదలు-సంపన్నలు, యువకులు-వృద్ధులు అనే తారతమ్యం లేకుండా చాలా మందిలో ఈ ధూమపానం అలవాటు ఏదో ఒక రూపంలో కన్పిస్తూనే ఉంటుంది. పొగ పీల్చడం వల్ల రక్తపోటు, క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ పదే పదే హెచ్చరిస్తున్నా, ధూమపాన ప్రియులు ఖాతరు చేయడం లేదు. అలాగే ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పెట్టెల మీద ముద్రించే ప్రభుత్వం వారి చట్టపరమైన హెచ్చరికలను సైతం పెడచెవిని పెడుతున్నారు. పొగాకు వినియోగం భారత్‌లో కొంతమేర తగ్గినప్పటికీ ఇంకా 120 మిలియన్ల మంది దాకాధూమపానం చేసేవారున్నారు. మన దేశంలో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో పొగతాగే అలవాటు ఎక్కువ.
- అనర్థాలు
- ప్రాణాంతకమైన పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు తదితర జబ్బులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా8 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో 1మిలియన్ కంటే ఎక్కువ మంది మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధూమపా నాన్ని గురించి శాస్త్రజ్ఞులు నిశిత పరిశోధనలు గావించి, కొన్ని నగ్న సత్యాలు కనుగొన్నారు. పొగతాగడం వల్ల బ్రోంకైటీస్, ఆస్తమా, రక్తపోటు, గుండెనొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని నిర్ధారించారు. పొగాకు పొగలో దాదాపు 4వేల రసాయనిక విష పదార్ధాలున్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా! భారత్‌లో నోటి క్యాన్సర్ మరణాల్లో 90 శాతం పొగాకును సేవించడం వల్లే సంభవిస్తున్నాయని ‘జాతీయ పొగాకు నియంత్రణ మండలి’ పేర్కొంది. గుండెనొప్పి వల్ల సంభవించే మరణాల్లో 45 శాతం కేవలం ధూమపానం వల్లేనని ‘హార్ట్‌కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయే ప్రతి 10 మందిలో 9 మంది పొగతాగడం వల్లే క్యాన్సర్ బారినపడి చనిపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ధూమపానం వల్ల పొగ తాగని వారికి కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పొగతాగేవారి పక్కన పొగతాగని వారుంటే మామూలు ధూమపానంవల్ల వచ్చే వ్యాధులన్నీ వీరికి కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు.సెకండ్ హ్యాండ్ పొగ ఇతరుల ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుందనీ, తద్వారా వారికి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయని వాషింగ్టన్ లోని ‘ప్రపంచ రక్షక సంస్థ’ పేర్కొంది. గత మూడేళ్ళూ కరోనా మహమ్మారి పెను భూతంలా ప్రపంచాన్నంతటినీ వెంటాడింది. భారత్‌లో కోవి్‌డ ఉద్ధృతంగా వ్యాపించి ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను హరించి వేసింది. ఆ విపత్కర పరిస్థితులలో ధూమపాన ప్రియులు ఎక్కువగా కరోనా బారినపడి, ఊపిరితిత్తులు దెబ్బతిని మృత్యువాత పడ్డారు.
- పొగాకు వ్యతిరేక దినం
- ప్రతి ఏటా మే 31న ప్రపంచ వ్యాప్తంగా ‘పొగాకు వ్యతిరేక దినోత్సవం’ను నిర్వహిస్తారు. పొగాకు వాడకం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఏటా ఒక్కొక్క ఇతివృత్తంతో ఈ దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం ‘మనకు కావాల్సింది ఆహారం, పొగాకు కాదు’ (ఉయ్ నీడ్ పుడ్ నాట్ టొబాకో). పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియచెప్పి, దానిపై అవగాహన కల్పించడమే పొగాకు వ్యతిరేక దినం ముఖ్యోద్దేశం. పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తి మరియు వాటి మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన పెంచి, వారిని ఆ దిశగా ప్రోత్సహించడం ఈ ఏడాది పొగాకు వ్యతిరేక దినోత్సవం లో భాగం. ఈ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యాన్ని కలి గించి, మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహద పడతాయి.
- ప్రభుత్వంపై ఆర్థిక భారం
- భారత దేశంలో పొగాకు వాడకం వల్ల సంభవించే వ్యాధుల మూలంగానూ, అకాల మరణాల వల్లనూ దేశ జీడీపీ 1శాతం నష్టపోతోందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ తెలిపింది. భారత్‌లో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చేఆదాయం కంటే వైద్యానికయ్యే వ్యయ భారం అనేకరెట్లుఅధికంగా ఉంటోందని ఆ సంస్థ పేర్కొంది. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ప్రతి ఏడాది ఆరోగ్యంపై వెచ్చించే సొమ్ములో 5.3 శాతం కేవలం పొగాకు వాడకం వల్ల వచ్చే వ్యాధులపై ఖర్చుఅవుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కన పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఈ ఉత్పత్తుల వినియోగం కారణంగా తలెత్తుతున్న వ్యాధుల చికిత్సలకు పడుతున్న భారమే అధికంగా ఉంటోంది. ఆ విధంగా పొగాకు వాడకం వల్ల అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి తీవ్ర నష్టాలు సంభవిస్తున్నాయనేది నిర్వివాదాంశం.
- పూర్తి నిషేధం అవసరం
- పొగాకు ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రం ధూమ పానాన్ని దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో నిషేధిస్తూ 2008లోచట్టం చేసింది. అయితే చట్ట నిబంధనలు నిర్దిష్టంగా అమలుకాకపోవడంతో, ప్రజల్లో అవగాహన కొరవడి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ప్రస్తుతం రైళ్ళు, బస్సులలో పొగతాగడంపై నిషేధం సాధ్యమైంది. ఇతరత్రా బహిరంగ ప్రదేశాలలో మాత్రందీని పీడ పూర్తిగా విరగడ కాలేదు. ముఖ్యంగా టీ స్టాల్స్ దగ్గర, రోడ్లువెంబడి బహిరంగ ధూమపానం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది. మనిషి తెలిసి చేసే ఈ పొరపాటు వల్ల వాళ్ళ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతోంది. తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతున్న ధూమపాన నిషేధానికి ప్రభుత్వాలు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. ‘బహిరంగ ధూమపాన నిషేధ చట్టంలోని నిబంధనల్ని కట్టదిట్టంగా అమలుచేసి, కనీసం పొగతాగనివారి ఆరోగ్యాలకైనా రక్షణ కల్పించాలి.చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి. నేడుచలన చిత్రాలు, టీవీ సీరియళ్ళలో ఒకప్రక్క నటులు దర్జాగా సిగరెట్లు కాల్చే దృశ్యాలు ప్రదర్శిస్తూ, మరోప్రక్క చిన్నచిన్న అక్షరాలతో ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ చూపిం చడం విచిత్రంగా ఉంటోంది. అలాగే సిగరెట్ పెట్టెలపై ముద్రించే ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం’ అనే హెచ్చరిక ప్రకటన కూడా మొక్కుబడి చర్యగానే మిగిలి పోతోంది. పొగాకు చేసే హాని అంతా ఇంతా కాదు. ధూమపానాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా, ఏటా కొత్త కొత్త పొగాకు ఉత్పత్తులను చేస్తూ ధనార్జనలో పోటీ పడుతున్నాయి. పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్న ధూమపానానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించడం ఒక్కటే మార్గం. అయితే మన దేశంలో పొగాకు పండించే రైతులు, దాని ఉత్పత్తులపై ఆధారపడిన కూలీలు, చిన్న తరహా వ్యాపారులు, బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. దేశ ప్రగతి ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. అయితే ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందనేది కూడా అంతే సత్యం. కనుక ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న పొగాకు వాడకాన్నిపూర్తిగా నిషేధించడం ఎంతైనా ఆవశ్యకం. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా దీని నిర్మూలనకు పాటుపడాలి. ధూమపానం వల్ల తమ ఆరోగ్యాలు, పక్కవారి ఆరోగ్యాలు పాడవటమేగాక, ధూమపానం చేసేవారికి ఆర్థికపర ఖర్చులు కూడా పెరుగుతాయనేది నిర్వివాదాంశం. ‘ప్రివెన్ష్ న్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అన్నారు. అంచేత ఈ ధూమపానం అలవాటుకి స్వస్తి పలికి, ఆరోగ్య లక్ష్య సాధనకై ధూమపాన ప్రియులు కూడా కృషి చేయాలి.
- పీ.వీ.ప్రసాద్
- 9440176824