Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Social justice: సామాజిక న్యాయం కోసం అక్షర సమరం

Social justice: సామాజిక న్యాయం కోసం అక్షర సమరం

మౌనం నిద్రిస్తుండగా సహనం వింజామరలు విసిరిందట !

డియర్‌ కామ్రేడ్స్‌.. యుద్ధం ముగిసిపోలేదు. చేయాల్సిందింకా మిగిలే ఉంది. అలిసిపోయి ఆయుధం పక్కన బెట్టావా.. ఆయుధంతో పాటు అస్తిత్వం మాయం అంటారు కవి. ప్రపంచ చిత్రపటంలో యుద్దం జరగని ప్రాంతం లేదేమో. నాగరిక ప్రపంచంలో అనాగరిక పోకడలకు అదుపే లేదేమో.. సమానత్వం కోసం కాదు .. చివరకు మనుగడ కోసం తనని తాను కాపాడుకునేందుకు, మనిషి కనిపించని శత్రువుతో యుద్దం చేయక తప్పని పరిస్థితుల్లో.. ఒక కవి హృదయంలో నివురుగప్పిన నిప్పులా జ్వలిస్తూ.. సమాజం వైపు దూసుకువస్తున్న అక్షర ఖడ్గం ‘యుద్దం ముగిసిపోలేదు’ కవితా సంపుటి.
గద్దపాటి శ్రీనివాసు గారి కవిత్వంతో ప్రకృతి వర్ణనలు, అభూత కల్పనలు, ప్రేమ కావ్యాలకి భిన్నంగా దళిత వాడల్లోని మానవత, అణగారిన బ్రతుకుల ఆక్రందన, శ్రమ జీవులు స్వేద పరిమళం. స్వేచ్చ కోసం తపించే తనువులు.. మన మనసు ముంగిట్లో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు కవి. ప్రముఖ కార్టూనిస్ట్‌ మాథవ్‌ గారు అందించిన ముఖ చిత్రం, ఈ కవిత్వానికి జీవం పోసింది అనవచ్చు. ఎంతగా తొక్కాలని చూసినా. పిడికిలితో బద్దలు కొట్టుకు పైకొస్తా అనే పేదవాడి సంకల్పం ప్రతిబింబించిన చిత్రం అందించారు.
సాటి మనిషిని మనిషిగానే గుర్తించే ప్రయత్నం చేయమంటారు కవి. ‘వాళ్ళంతా కవులే….. కాలానికో కష్టానికో పుట్టినవాళ్ళే ఎండిన గుండె మండినప్పుడు నిప్పురవ్వలై ఎగిసినవాళ్ళే పిడికిట్లో నినాదాల్ని పట్టుకొని ప్రతిగుండె తలుపుల్నీ తట్టిన వాళ్ళే. ఇలా సాగుతున్న కవిత్వం గురించి నాలుగు మాటలు పంచుకుందాం.
యువ కవి, ఉపాధ్యాయుడు గద్దపాటి శ్రీనివాసు గారి జీవితానుభవాలు నుండి జాలువారిన అభ్యుదయ కవిత్వం. ‘యుద్ధం ముగిసిపోలేదు’ కవితా సంపుటి.
‘యుద్ధం‘ తరతరాలుగా మనం వింటున్న మాట. సమస్తం కోల్పోయి క్షతగాత్రులుగా మింగిన కొన్ని వేల ప్రజానికాన్ని గుర్తుచేసే మాట. రాజ్యకాంక్ష ధన కాంక్షతో పరుగులు తీస్తున్న నేటి సమాజంలో, జరుగుతున్న అనేక అసాంఘిక, అసమానతల కార్యకలాపాలపై, యువకవి సంధిస్తున్న అస్త్రమే ‘యుద్ధం ముగిసిపోలేదు‘ కవితా సంపుటిలోని కవిత్వం.
కుల మతాల దుర్గంధాన్ని, ఆర్థిక అసమానతలను, అడుగడుగునా ఎత్తిచూపుతున్న సమాజంపై, అక్షరంతో చేస్తున్న ‘యుద్ధం’ యుద్ధం ముగిసిపోలేదు’ కవిత్వం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో నిరుద్యోగులు ప్రభుత్వంపై సాగించే నిరసన యుద్ధానికి ప్రతీక. అనేక రంగాల్లో తమ సత్తాను చాటుకున్న స్త్రీ మూర్తి, తన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, కుటుంబ వ్యవస్థ కట్టుబాట్లపై సాగించే యుద్ధం. స్వాతంత్య్ర భారతావనిలో ‘ఇంకా! మా బ్రతుకులు మారలేదు ఎందుకనీ?.’ అని ప్రశ్నించే బడుగు వర్గాల అశ్రునయనాల ఆక్రోశాన్ని ఆపుకోలేక, మౌనంగా మనసుతో చేసే యుద్ధం. సామాన్యుడు కార్పొరేట్‌ సంస్థలు సాగిస్తున్న దోపిడీని నిలదీస్తూ ప్రశ్నించిన యుద్ధం నిరంతరం సాగుతూనే ఉంది.
ఏది ఎమైనా, ప్రతిచోట కనిపిస్తూ వినిపిస్తూ.. మనసును కలిసి వేస్తున్న సంఘటనలకు చలించిన యువ కవి గద్దపాటి శ్రీనివాసు గారి కలం నుంచి జాలువారిన అద్భుతమైన భావాల కవితల సమాహారం ‘యుద్దం ముగిసి పోలేదు’ కవితా సంపుటి.
కవిత్వం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. సాహిత్య ప్రియుల నాడి తెలుసుకుంటూనే, అక్షరాల్తో భావాలను చెక్కుకుంటూ సాగించడం. ఒక విధంగా చెప్పాలంటే, కవి తనతో తాను చేసుకునే మానసిక సంఘర్షణలో జనించిన అక్షర జ్వాలను బ్యాలెన్స్‌ గా వ్రాస్తూ, యుద్దం చేసుకునే ప్రక్రియ కత్తిమీద సాము వంటిది.
అక్షర కూర్పుతో… రాసేదంతా కవిత్వమంటే సరిపోదోయ్‌..! కొందరు మనస్సుకు హత్తుకునేలా వ్రాస్తారు.. మరికొందరు మస్తిష్కంను ఆలోచనలతో చైతన్య పరిచేలా వ్రాస్తుంటారు. కవికి కావాల్సిందల్లా, తనకు ఏది సముచితమో … అది మాత్రమే వ్రాస్తూ… ఆత్మ పరిశీలనతో సమాజంలోని వాస్తవికతకు తన కవిత్వం దర్పణంగా చూపగలగాలి. అదే నేడు సమాజంలో యువత కలం నుండి పురుడోసుకున్న భావకవిత్వం .
ఇప్పుడేమంటావ్‌..? ఇంకా కలిసే ఉంటావా! (అసత్య) ప్రవచనాల్ని నమ్ముతూనే ఉంటావా….!? నాలుకలపై వాతలు వేయించుకుంటావా. అన్యాయాన్ని భరిస్తూ… అవమానాల్ని సహిస్తూ… ఇంకెంత కాలం.. దొరలు ముందు తలవంచుతూ… రంగురంగుల జెండాలను భుజాలపై మోస్తూ.. అధికారం చెలాయించే వారిని అమాంతంగా ఆకాశానికెత్తేస్తూ.. నాలుగు మాటలు ముందేసి, నాలుగు రాళ్లు వెనకేసుకునే మనస్తత్వంతో అభ్యుదయ సిద్ధాంతాల్ని భద్రంగా లాకర్లలో బందిస్తూ, ఎంత కాలం జీవశ్చవంలా జీవిస్తుంటావ్‌ అని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్న గద్దపాటి శ్రీనివాసు కవిత్వం.. ‘యుద్దం ముగిసి పోలేదు.’
ఇటువంటి కవిత్వం వ్రాయాలంటే లోకానుభవం కావాలి. ఒక తాత్విక ప్రపంచంలోకి వెళ్ళగలగాలి. నిఘంటువుల్లో కొత్త అర్థాలను శోధించాలి. నడిచే దారి ముళ్ళ దారైనా.. గమ్యం అగమ్యగోచరంగా మారుతున్నా..! వెన్నంటి వస్తున్న అవమానాలు అవహేళనలకు తలవంచకూడదు.
‘మౌనం నిద్రిస్తుండగా.. సహనం వింజామరలు విసిరిందట..’ ఇలా నేను వ్రాసుకున్న పదాలను గుర్తుచేస్తుంది ఈ కవిత్వం. శతాబ్దాలుగా మౌనం వహిస్తూ.. నాలుగు అక్షరాలను, ముఖపుస్తకపు గోడలపై చిలకరిస్తూ.. నాలుగు వాక్యాలు వ్రాసుకుని.. సమాజానికి నావంతుగా చేయవలసింది చేసేసాననుకునే.. మహానుభావులను అక్షర కొరడాలతో నిద్రలేపిన కవిత్వం యుద్దం ముగిసిపోలేదు కవిత్వం. ఆదర్శాలు కూడు పెట్టావు.. అభ్యుదయ భావాలను భుజాలపై మోస్తూ తిరిగితే సరిపోదు. సమస్యను ప్రశ్నించడం నేర్చుకోవాలి. అనే అభిప్రాయం కవిత్వంలో కనిపిస్తుంది.
‘నాలోని ఆవేశాన్ని చెప్పుకునేందుకు ఎవరున్నారు.. పెన్ను పేపర్‌ తప్ప.’ అంటారు కవి.. ఒక్క వాక్యంలో తనలోని అంతరంగ సంఘర్షణ సూటిగా స్పష్టంగా చెప్పగలిగే ఇటువంటి భావాలు ఎన్నో, ఈ కవితా సంపుటిలో .
అదే విధంగా ‘నేటి ప్రజాస్వామ్యలో ఓటు తన విలువను కోల్పోతుంది‘ అనేందుకు వారు వ్రాసిన వాక్యాలు, నేటి వ్యవస్థను అక్షరంతో నిగ్గదీస్తూ సంపాదించిన విధానం ‘ఓట్లు నోట్లై కడుపులో దిగుతుంటే, భవిష్యత్తు బానిసై బ్యాలెట్‌ బాక్స్‌లో దూరిపోతుంది. ఓటును నోటుకు అమ్ముకుంటూ, మాధుర్యంతో కడుపు నింపుకునే ఓటర్లు మీ మనసును ప్రశ్నించుకోండి.

- Advertisement -

కవి వ్రాస్తున్నది మీ గురించే
ప్రతి పోరాటం వెనుక, చరిత్ర లిఖించని వ్యక్తులు ఎందరో ఉంటారు. అటువంటి వారిలో కవులు నిర్వహించే పాత్రను మరువలేము. కాల క్రమేణా కవుల గళం మూగబోయింది అనే వాస్తవం తన కవిత్వంలో పలికించిన విధానం. నేటి సమాజంలో కవిమిత్రుల ప్రముఖ్యతను తెలిపిన విధానం ‘వాళ్ళంతా కవులే….. కాలానికో కష్టాని కో పుట్టినవాళ్ళే ఎండిన గుండె మండినప్పుడు నిప్పురవ్వలై ఎగిసినవాళ్ళే పిడికిట్లో నినాదాల్ని పట్టుకొని ప్రతిగుండె తలుపుల్నీ తట్టిన వాళ్ళే రాజ్య ఆడే రాసక్రీడలో పావులయ్యారో సగటు బతుకు జీవులయ్యారో… ఎత్తిన పిడికిల్లిప్పుడు లాలలామ్‌లు చెప్పట్లేదు. గులామ్‌ లై వొంగిపోతున్నాయి అంటారు కవి. అక్షరం ప్రశ్నించడం నేర్చుకోవాలి నినాదాలకు జీవం నింపాలి. వీరులకు లాల్‌ సలాం కొట్టాలి… దళారులు గుండెల్లో గుబులు రేకెత్తించాలి. అనే ఆవేశాన్ని తన అక్షరాల్లో నిక్షిప్తం చేసిన కవిని మనం మరువగలమా.. ఇలా ఎన్నో సమస్యలను తనదైన విమర్శను జోడిస్తూ, ప్రజల్లో చైతన్యం కోసం మాత్రమే కాదు అలోచనా దృక్పథంను మార్చినా చాలు అనుకునే అవి అంతరంగాన్ని అర్దం చేసుకుందాం రండి.
‘మానవత్వం మంటగలిపి మనిషితనాన్ని మట్టుబెట్టి నీ శ్లోకం నన్నంటరాని వాణ్ణి జేసింది..’ మా అరుంధతి ఆకాశంలో’ మేము మాత్రం ఊరికి దూరంగా.. అంటారు కవి. కుల వివక్షతకు గురైన ఆనాటి తన గతాన్ని తల్చుకుంటూ… ఇలా, తన ప్రతి అనుభవాన్ని కవితగా మలచిన గద్దపాటి శ్రీనివాసు గారి రచన యుద్దం ముగిసి పోలేదు.

  • రాము కోలా
    సాహిత్య రత్న
    9849001201
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News