Actor Shivaji Controversy: కత్తికన్నా మాట పదునైనది. క్షణంలో జారిన మాట, కత్తి చేయలేని గాయాన్ని చేస్తుంది. శరీరంపై ఏర్పడిన గాయం కాలంతో మానిపోతుంది కానీ, మాటతో పడిన గాయం జీవితకాలం వెంటాడుతుంది. అందుకే, మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా ప్రజాజీవితంలో ఉన్నవారు వేదికలపై మాట్లాడే ప్రతి మాటకు సామాజిక ప్రభావం ఉంటుందన్న స్పృహ తప్పనిసరిగా ఉండాలి.ఈ డిజిటల్ కాలంలో వేదికలపై క్షణ కాలంలో జారిన ఒక్క మాట నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడితో ఆగకుండా చట్టపరమైన నోటీసులు, విచారణలు, పరువు నష్టం దావా కేసులు వెంట వెంటనే మొదలవుతున్నాయి.
తాజాగా ఒక సినిమా ఫంక్షన్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మహిళా కమిషన్ తక్షణమే స్పందించి నోటీసులు జారీ చేయడం, హాజరు, వివరణ అన్నీ జెట్ స్పీడులో జరిగిపోయాయి. ఇక్కడ వ్యవస్థ స్పందించిన తీరు ప్రశంసనీయం. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన మాటలే ఉండాలి. ఎవరు మాట్లాడినా చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇది సమాజానికి అవసరమైన కఠినతే. కానీ ఇక్కడితో ప్రశ్న ముగియదు.
శివాజీ విషయంలో కనిపించిన ఇదే స్పీడు, ఇదే కఠినత– సోషల్ మీడియాలో మహిళలను రోజూ దారుణంగా దూషించే ‘సామాన్యుల’ విషయంలో ఎందుకు కనిపించదు..? ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్– పేరు ఏదైనా సరే– అక్కడ మహిళలపై జరుగుతున్న మాటల అత్యాచారం అందరికీ కనిపిస్తూనే ఉంది. వేలాది అకౌంట్లు, వందలాది వికృత వ్యాఖ్యలు, నిరంతర అవమానాలు, అయినా చర్యలు ఎందుకు నెమ్మదిగా సాగుతున్నాయి..? ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కాదు.. ఇది అభిప్రాయం కాదు.. ఇది ద్వేషం. ఇది హింసకు మానసిక వేదిక. మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే దూషణలు, బెదిరింపులు, లైంగిక వ్యాఖ్యలు ఇవన్నీ చట్టప్రకారం నేరాలే.. ఐటీ యాక్ట్, ఐపీసీ, కొత్త క్రిమినల్ చట్టాలు శిక్షలకు తావిస్తున్నాయి. చట్టాలు ఉన్నాయి. కానీ అమలు ఊదాసీనంగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థల్లో వనరుల కొరత, సిబ్బంది లేమి, రాజకీయ– పరిపాలనా లోపం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
సాధారణంగా సమాజంలో ఒక భావన బలంగా ఉంది. పలుకుబడి ఉన్నవాళ్లు తప్పించుకుంటారు, పలుకుబడి లేనివాళ్లకు శిక్షలు పడతాయి. కానీ సినిమా సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇది కొంతవరకు రివర్స్‌గా కనిపిస్తోంది. నటీ, నటులు నోరు జారితే నిమిషాల్లో వ్యవస్థలు కదులుతున్నాయి. ఇది తప్పు కాదు.. కానీ ఇదే ప్రమాణం సామాన్యులకూ వర్తించాలి. “సామాన్యులం” అనే ముసుగులో తిరిగే అరాచకవాదులపై కూడా ఇదే వేగం, ఇదే కఠినత అవసరం. జల్లెడ పడితే సోషల్ మీడియాలో మహిళలను తిట్టిన అకౌంట్లు వందలు వేలుగా కనిపిస్తాయి. వీళ్లందరూ గుర్తు తెలియని వాళ్లు కాదు. ఐపీ అడ్రసులు ఉన్నాయి. ఫోన్ నంబర్లు ఉన్నాయి. డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఉంది. కావాలంటే గంటల్లోనే ట్రేస్ చేయవచ్చు. అయినా ఎందుకు జరగడం లేదు..? కొన్ని ఉదాహరణలు చూపించి అరెస్టులు చేసి, కేసులు పెట్టి, శిక్షలు అమలు చేస్తే అది లక్షలాది మందికి ముందస్తు హెచ్చరిక అవుతుంది.
ఇక్కడ మహిళా కమిషన్ల పాత్ర అత్యంత కీలకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్లు ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన సమయం ఇది. సోషల్ మీడియా తీవ్రవాదంపై ప్రత్యేక డ్రైవ్‌లు అవసరం. షీ టీమ్స్, సైబర్ పోలీస్లు, మహిళా కమిషన్ మూడు కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత తప్పనిసరి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు, 24×7 మానిటరింగ్ సెల్‌లు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు చేసిన మహిళలకు వెంటనే రక్షణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించే విధంగా వ్యవస్థల పనితీరు ఉండాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ‘సెలబ్రిటీ కేసులు’ మాత్రమే కాదు సామాన్య మహిళల కేసులపై కూడా ఇదే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం కూడా ప్రజాజీవితంలో భాగమే అన్న విషయాన్ని మరవొద్దు. అక్కడ జరిగే హింసను తేలికగా తీసుకునే వీలు లేదు. ఆన్‌లైన్ దూషణలు ఆఫ్‌లైన్ హింసకు దారితీసిన ఉదాహరణలు ప్రపంచమంతా కొకొల్లలుగా ఉన్నాయి.
“ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది” అన్న పాత సామెతకు ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా తిరగగలిగిన నాడే వ్యవస్థ సరిగ్గా ఉన్నట్టు. ఆ స్వేచ్ఛకు భద్రతే పునాది.
ఇది ఒక్కరోజు పోరాటం కాదు. మహిళలను తిట్టే థర్డ్ క్లాస్ మెంటాలిటీపై కొన్ని ఏళ్ల పాటు సాగాల్సిన యుద్ధం. ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. ఇప్పుడు కావాల్సింది కఠిన అమలు మాత్రమే… వనరులు, సిబ్బందిని పెంచుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సంస్థలతో కఠిన ఒప్పందాలు చేసుకోవాలి. ద్వేషపూరిత కంటెంట్‌పై జీరో టాలరెన్స్ చూపించాలి.
సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రం డిజిటల్ యుగంలో నిజంగా అమలయ్యే రోజు కోసం సమాజం అంతా ఎదురు చూస్తోంది. అయితే, ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఆ రోజు ఎప్పుడు అని…?
అమరవాజీ నాగరాజు
(జర్నలిస్ట్)

