గత ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత జట్టుపై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన వ్యాఖ్యలు, దుర్భాషలు చూసిన వారికి ఈ మీడియా తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. భారతీయ క్రికెట్ అభిమానులు ఇటు ఆస్ట్రేలియా క్రికెటర్ల మీదా, అటు భారతీయ క్రికెటర్ల మీదా చేసిన వ్యాఖ్యలు, వాడిని దుర్భాషలు పరమ జిగుప్సాకరంగా కనిపించాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ను, అతని కుటుంబ సభ్యులను అశ్లీల, అసభ్య పదజాలంతో తూలనాడడం దేశానికి తలవంపులు కలగజేసింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ భార్య వినీ రామన్ భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం వల్ల ఆమెను కూడా దుర్భాషలతో తూర్పారపట్టడం జరిగింది.
భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండీ భారత జట్లును సమర్థించడం లేదేమిటని ఆమెను ప్రశ్నించడం కూడా జరిగింది. ఇక భారతీయ బౌలర్ మహమ్మద్ షిరాజ్ పై చేసినన్ని విమర్శలు, వాడిన పదజాలం గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. తమకు నచ్చని విధంగా వ్యవహరించినప్పుడు, తమకు నచ్చని పని చేసినప్పుడు ప్రముఖులను, క్రీడాకారులను, నటీనటులను, రాజకీయ నాయకులను యథేచ్ఛగా విమర్శించడానికి, అర్థరహితమైన ఆరోపణలను చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడమన్నది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోయింది. తమ పేరు పెట్టకుండా, మారుపేర్లు పెట్టుకుని, తమ దుర్మార్గమైన అభిప్రాయాలను, తమలోని అసూయా ద్వేషాలను ట్రోల్స్ పేరుతో వెళ్లగక్కడం విస్తారంగా జరుగుతోంది.
భావ సారూప్యం కలిగిన వ్యక్తులు ఇందుకు వీలైనంతగా వంత పాడడం కూడా జరుగుతోంది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, సన్నివేశాలు చోటు చేసుకున్నప్పుడు చాలా మంది తమ అయిష్టతను, అశక్తతను చాటి చెప్పడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని కొందరు మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే, దీని వెనుక ఇంత ఎక్కువగానే ఉందనిపిస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను మానసికంగా దెబ్బతీయడానికి, అవమానపరచడానికి కొన్ని రకాల దుష్టశక్తులకు సోషల్ మీడియా ఒక సురక్షిత మార్గంగా కనిపిస్తోంది. రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వారి రాతలు, చేతలకు హద్దులుండడం లేదు. అవకాశమున్నంత వరకు, సాగినంత కాలం తమ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి వారు సిద్ధపడుతున్నారు.
తమ పేరు, తమ ఊరు చెప్పి విమర్శలు సాగించేవారికంటే, మారుపేర్లతో, తప్పుడు పేర్లతో విమర్శలు సాగించేవారి తీరు మరింత ద్వేషపూరితంగా ఉంటోంది. సోషల్ మీడియాలో పిల్లలను లైంగికంగా వేధించేవారి సంఖ్య ఆయేటికాయేడు వేల సంఖ్యలో పెరుగుతున్నట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. 2020లో 17,390 ఉన్న ఈ సంఖ్య 2021 నాటికి 1.63 లక్షలకు
చేరుకుంది. ఇది ఇక్కడితో ఆగలేదు. 2022 నాటికి 2.04 లక్షలకు చేరుకుంది. సోషల్ మీడియా వల్ల మానవ హక్కులకు భంగం కలగడం అనేది వెర్రి తలలు వేస్తున్నట్టు ఈ కమిషన్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. సోషల్ మీడియా దుర్భాషల మీద ఇంకా ఒక పూర్తి స్థాయి రికార్డంటూ ప్రారంభం కాలేదు.
క్రీడలు, మతాలు, రాజకీయాలు, కులాలు, జెండర్ వగైరాలన్నిటి మీదా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా, సంస్కారరహితంగా, ద్వేషపూరితంగా వ్యాఖ్యలు, విమర్శలు చేయడం అనే దానికి విరామమే ఉండడం లేదు. ప్రత్యక్షంగా ఎటువంటి బెదరింపూ, విమర్శా లేకపోయినా, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వస్తున్న విమర్శల ప్రభావం చాలా కాలంపాటు మనసుల్లో ఉండిపోతుందన్నది వాస్తవం. ఈ అదృశ్య శక్తుల దాడులకు మానసికంగా సిద్ధపడి ఉండడం అనేది దేశంలోని ప్రతి పౌరుడూ సిద్ధపడి ఉండాల్సిన అగత్యం ఏర్పడుతోంది. దుర్భాషలాడేవారిని, కువిమర్శలు చేసేవారిని పట్టుకోవడానికి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీ, పౌరుల అప్పమత్తత, ప్రభుత్వాలు, పోలీసుల విధానాలు, చర్యల వల్ల ఈ బెడదకు తెరపడే అవకాశం ఉంది.