Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Soil protection: నేలల సంరక్షణతో మానవ మనుగడ

Soil protection: నేలల సంరక్షణతో మానవ మనుగడ

నేల మానవునికి ప్రకృతి సిద్దంగా లభించిన సహజ సంపద. సహజ వనరులలో నేల అతి ప్రధానమైంది. సమస్త జీవరాశుల మానవాళి మనుగడ నేలపై ఆధారపడి ఉంది. వ్యవసాయ ప్రధాన దేశాలకు నేల తల్లి వంటిది. అందుకే భారతీయులు నేలను ‘భూమాత’ అని పిలుస్తారు. పంటలు పండించడానికి అవసరమయ్యే తేమ ‘పోషకాలు’ సూక్ష్మ జీవులు తమలో ఇముడ్చుకుని మొక్కలకు అవసర మైన మేరకు అందిస్తుంది. నేల ఆహారం కొరకే కాకుండా ‘జాతి సౌభాగ్యానికి ‘దేశ ఆర్థికాభివృద్ధికి’ దోహద పడుతుంది. నేలలను(మట్టి) పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద వుంది. ఆధునిక రోజుల్లో నేలల (మట్టి) (భూమి) కోతను తగ్గించే దిశగా కృషి జరుగుతోంది. నేలల సారవంతాన్ని రక్షించడం వల్ల ఆహార భద్రత కల్పించ వచ్చు. నేలలు వివిధ అనుపాతాల్లో ఖనిజ లవణాలు సేం ద్రీయ పదార్థాలు మరియు గాలిలో నిర్మితమై ఉంటాయి. మొక్క ఎదుగుదలకు ఎంతో దోహదపడుతాయి.
నేలలో ఉన్న బంక మన్ను ‘ఒండ్రు’ ఇసుక రేణువులతో పాటు సేంద్రియ పదార్థం అలాగే ‘గాలి’ నీరు’ సూక్ష్మజీవులు ‘ఇతరక్రిమి కీటకాలు’ వానపాములు ఇతరత్రా పురుగులు ఉంటాయి. రసాయనికంగా ఉండే లవణాల పరిమాణం ఉదజని సూచిక పోషకాల లభ్యత సూక్ష్మ జీవుల చర్య ఇవన్నీమొక్కల పెరుగుదల దిగిబడులు పెంచి తద్వారా ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపిస్తాయి. ఈ లక్ష ణాలన్ని భూసారాన్ని తెలిపే సూచికలు. ఇవి భూమిలో ఎంత శాతం ఉన్నాయి? పంటకి ఎంత అవసరం? ఏ విధంగా అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? మొదలైన విషయాలు భూసార పరీక్షలు ద్వారా తెలుసుకోవాలి.
నేలలు జీవులకు ఆవాసాలు
నేలలు అనేక కీటకాలకు జీవులకు ఆవాసంగా ఉంటాయి. ఆహారం, దుస్తులు, ఆశ్రయం మరియు వైద్యంతో సహా నాలుగు ముఖ్యమైన సజీవ కారకాలకు నేలలే మూలం. కాల క్రమేణ నేలల సంరక్షణ ప్రాముఖ్యత సంతరించుకుంది.
ప్రపంచ నేలల దినోత్సవం
ప్రపంచ సాయిల్‌ డే 2002లో ప్రారంభమైంది. అంతర్జాతీయ సాయిల్‌ సైన్స్‌ అసోసియేషన్‌ దీనిని జరుపు కోవడానికి డిసెంబర్‌ 5వ తేదీ ప్రపంచ నేలల దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. 2013 డిసెంబర్‌లో 68వ సెషన్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ డిసెంబర్‌ 5ను మొదటి మట్టి (నేల) దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తం గా మట్టి నేలల మీద అవగాహన చైతన్యం కలిగించి ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థ మరియు మానవ సంక్షేమం పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నేలలు ఆర్థిక ప్రగతి
నేలలు సారవంతంగా ఉన్నప్పుడే పంటలు పుష్కలంగా పండుతాయి. పంటల తీరును నిర్ణయించడంలో నేలల తీరు, నేలల స్వభావం, నీటి లభ్యత ప్రధాన పాత్ర వహిస్థాయి. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అన్నదాతల ఆత్మహత్యలు తగ్గుతాయి. వ్యవసాయ రంగం ప్రగతి సాధిస్తే వ్యవసాయ అనుబంధ రంగాలలో పురోగతి సాధ్యమౌతుంది. ‘రైతే రాజు’ అనే నినాదానికి సార్థకత చేకూరుతుంది. ఆర్థిక వ్యవస్థలో మిగతా రంగాలు పురోగమిస్థాయి. ఇది జగమెరిగిన సత్యం. అయితే అవగాహన లోపంతో నేల, నీరు, కలుషితం అవుతుంది. నేలను, నీటిని సంరక్షించే చర్యల పట్ల ప్రజలు, ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపడం లేదు. నేల స్వభావాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో 2013 నుండి డిసెంబర్‌ ప్రపంచవ్యాప్తంగా ‘నేలల (మట్టి) దినోత్సవం’ నిర్వహిస్తారు. ఈ క్రమంలో నేలలు (మట్టి) రక్షణ నీటి సంరక్షణ అందుకు అవసరమైన పద్ధతులపై చర్చలు, సమావేశాలు సదస్సులు, వర్క్‌ షాపులను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు నిర్వహిస్తాయి.
నేలల, నీటి సంరక్షణ అభివృద్ధి
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, వాణిజ్యపరమైన ఆలోచనలు రాజ్యమేలటం వల్ల అధిక దిగుబడుల పేరుతో, అత్యాశతో, పంటలకు అవసరం ఉన్నా లేకున్నా విచక్షణారహితంగా రైతాంగం రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడటం వల్ల నేల కాలుష్యమైంది. రైతులు పండించే కూర గాయలు పండ్లు, పాలు, కలుషితమై ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పలు వైద్య ఆరోగ్య సర్వే ల్లో తేలింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నేలల భౌతిక లక్షణాలలో మార్పు రావడం. భూసారము క్రమంగా తగ్గిపోవడం. పోషకాలు లేని నిస్సారమైన(తాలు) పంటలు పండడం. పండిన పంటలో తగినంత ప్రమాణంలో పోషకాలు లేకపోవడం, ఆహార పదార్థాలలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉండడం.
పంటల కాలుష్యం
వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం ప్రమాద స్థితికి చేరుకుంది. భావితరాలకు సారవంతమైన నేలలు (మట్టి) అందించలేని దుస్థితి నెలకొంది. రాబోయే కాలంలో వ్యవసాయ రంగం మనుగడ ప్రశ్నార్ధకంగా మిగిలింది. నేలతో పాటు నీటి సంరక్షణ చర్యలను తీసుకున్నప్పుడే వ్యవసాయ అభివృధి సమాజాభివృద్ధి సాధ్యమౌతుంది.
నేలలు సుస్తిరాభివృద్ధి
నేలల, నీటి సంరక్షణ వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత, ఉపాధి, ఆదాయ సృష్టి తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణం, కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో వస్తు సేవలకు గిరాకీ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో ‘వృద్ధి’ ‘అభివృద్ధి’ గుణాత్మక పరిణామాత్మక మార్పులు జరిగి ప్రజల జీవితాలలో మెరుగైన జీవన ప్రమాణాలతో స్వావలంబన స్వయం స్వమృద్ధి సుస్థిరాభివృద్ధి సాధ్యమౌతుంది.
నిరంతరం భూసార పరీక్షలు నిర్వహించాలి
వ్యవసాయ శాస్త్ర వేత్తలు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లాబ్‌ టు ద లాండ్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చెయ్యాలి. రైతులు భూమిలో ఏ పంటలు వేయాలి? ఏ రకమైన రసాయనిక ఎరువులను, పురుగు మందులను ఎంత మోతాదులో వేయాలి? అనే విషయంపై రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకొరకు గాను భూసార పరీక్షలు చేయించడమే దీనికి సరైన మార్గం. ఎంపిక చేసిన భూమిలో సూక్ష్మ పోషకాలు విశ్లేషణ చేసి సలహా ఇవ్వాలి. మట్టి నమూనాలు సేకరించాలి. ప్రయోగశాలలో పరీక్షించాలి. ఫలితాల ఆధారంగా ఎరువులను సిఫారసు చెయ్యాలి. అదే సమయంలో నీటి పరీక్షలు కూడా నిర్వహించాలి. అవసరం అనిపిస్తే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. ఇలా చేయించడం వల్ల నేలలు, నీరు ఆకులు, మొక్కల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుస్తాయి. వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత మేరకు వేయాలో కచ్చితంగా తెలుస్తుంది. తద్వారా రైతులకు ఎరువులు పురుగు మందులపై పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది. వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. రైతాంగానికి ఆర్థిక భారం తగ్గుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్‌ పి కే)తో పాటు జింక్‌, మెగ్నీషియం, ఇనుము లాంటి సూక్ష్మ పోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్‌) నిష్పత్తి ఎంత ఉండాలో తెలుస్తుంది. ఎరువులు వాడకంలో సమతుల్యత పాటిస్తే భూమి సారవంతం అవుతుంది. దీనివల్ల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడంతో పాటు భవిష్యత్‌ తరాలకు పంటలు పండించడానికి అనుకూలమైన సారవంతమైన భూములను ఇచ్చిన వాళ్ళము అవుతాము.
సమగ్ర భూసార సమతుల్యత సంరక్షణ విధానం
గ్రోమోర్‌ అంటు ఉత్పత్తి పేరు మీద వ్యవసాయంలో రసాయనిక ఎరువులు పురుగు మందులను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల భూసారము క్షీణించి నేలలు తమ ఉ త్పాదక సామర్థ్యాన్ని ఉనికిని భూసార లక్షణాలను కోల్పోతున్నాయి. నేలలు నిస్సారంగా ‘చౌడు‘ భూములుగా మా రుతున్నాయి. నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. నేలల్లో నిస్సారత చోటు చేసుకుంటుంది. నేలల ఆరోగ్యాన్ని సూచించే భూ భౌతిక, రసాయన జీవన పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి కాలుష్య సమస్యలు ప్రజారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గుతుంది. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్ల రైతులు వ్యవసాయ రంగం నుంచి నిష్క్రమించి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. పట్టణాలలో కాలుష్య సమస్యలు ప్రజారోగ్య సమస్యలు నివాస సమస్యలు ఎదురుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే భూమి యొక్క సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులు చేపట్టవలసిన అవసరం ఉంది. కాలుష్య సమస్యలు ఆరోగ్య సమస్యలు పరస్పరం ఒదానికొకటి ప్రభావితమై ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారనీ భూసారం సంరక్షణ మీద జరిగిన పలు అధ్యయనాలు వెల్లడించాయి. భూసారం భూమిలో పోషకాలు రక్షించే విధంగా సమగ్ర భూసార పోషక సంతులిత యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.
సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె
ఎరువులు మేకల, గొర్రెల ఎరువులు కూరగాయల వ్యర్థాలు ఎరువులుగా వాడాలి. ఆర్గానిక్‌ ఎరువులు, రసాయనిక ఎరువులను క్రమ పద్ధతులో తగిన నిష్పత్తిలో ఉపయోగించాలి. పశువులు, పందులు, కోళ్ల ఎరువులు వర్మీ కంపోస్ట్‌, వేరుశనగ చెక్క, వేప పిండి, గానుగ పిండి, ఎముకలపొడి తదితర సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేలలు ఆరోగ్యంగా ఉంటేనే పంటలు పుష్కలంగా పండుతాయి. పంటలు దిగుబడి ఏ ఆర్థిక వ్యవస్థలైతే అధికంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది.
వ్యవసాయ శాఖ మట్టి పరీక్షలు చెయ్యాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేలల సంరక్షణకు, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తుంది. నేలల సంరక్షణ పోషక యాజమాన్యం పద్ధతులు నియంత్రణకు కావలసినటువంటి శిక్షణ పరిశోధన కార్యక్రమాలను వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా చేపడుతుంది. వ్యవసాయ శాఖ మట్టి నమూనాలను సేకరించి వాటి ఫలితాలను రైతులకు ఇస్తుంది. నేలల భూసారాన్ని బట్టి పంటలు వేయాలని సూచిస్తుంది. ఖరీఫ్‌లో ఏ పంటలు వేయాలి. రబీలో ఏపంటలు వేయాలి? అనే అంశాల మీద ఎప్పటికప్పుడు సమయానుకూలంగా సూచనలు ఇస్తుంది. భూసార పరీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు ఫలితాలను ఆన్‌లైన్‌లో పెట్టడమే కాకుండా ‘సాయిల్‌ హెల్త్‌ కార్డులు’ కూడా రైతులకు ఇచ్చే సమగ్ర పోషక యాజ మాన్యం చర్యలు చేపడుతుంది. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా భవిష్యత్‌ కాలం కోసం ‘భూమాత రక్షణ’ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. భూమాత రక్షణ అందరిపై ఉంది. ప్రభుత్వం పాఠశాల, కళాశాల స్థాయిలో నేలల, నీటి సంరక్షణ యాజమాన్య పద్ధతులు నిర్వహణ సహజవనరుల సంరక్షణను, పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి. ప్రకృతి ప్రసాదించిన నేలతో పాటునీళ్లను రక్షించుకునేందుకు రైతులు, ప్రజలు పౌర సమాజం బహుముఖ కార్యాచరణతో ముందుకు రావాలి. కాంటూరు కందకాలు, సామాజిక వనాల పెంపకం, గుట్టలపై సరిహద్దు గట్లపై చెట్లను పెంచాలి. చిన్ననీటి వనరుల సంరక్షణ, గృహాలలో ఇంకుడు గుంతల ఏర్పాటు. పచ్చదనం పరి శుభ్రత, హరితహారం సామాజిక ఉద్యమంగా కొనసాగాలి. నేల, నీరు సంరక్షణ యజ్ఞములో ప్రభుత్వం పౌర సమాజం, మహిళా, యువజన ధార్మిక స్వచ్ఛంద సంస్థలు సం పూర్ణ భాగస్వాములు కావాలి. ‘నేలల రక్షణే మానవ రక్షణ’ అనే లక్ష్యంతో ‘ధరిత్రి రక్షితే రక్షితః’ అనేది నినా దం కాకుండా జాతీయ విధంగా వర్ధిల్లాలి.
నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News