Monday, December 9, 2024
Homeఓపన్ పేజ్Samayam Column-South leaders want more babies: సమయం కాలమ్-జనాభా .. రాజకీయ గలాభా

Samayam Column-South leaders want more babies: సమయం కాలమ్-జనాభా .. రాజకీయ గలాభా

ఎంపీ సీట్ల కోసం!

తాజా లెక్కల ప్రకారం చూసు­కుంటే భార­త­దేశ జనాభా.. 145 కోట్ల పైచి­లుకు. చైనా జనాభా మాత్రం 142 కోట్లే! అంటే ప్రపం­చం­లోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం మనదే అయి­పో­యింది. అధి­కా­రి­కంగా ఈ లెక్కను ఇంకా ప్రక­టిం­చ­లేదు గానీ, వాస్తవం ఇదే. అయినా కొంత­మంది నాయ­కులు మాత్రం మన జనాభా ఇంకా పెర­గా­లని ఆశి­స్తు­న్నారు. ఆంధ్ర­ప్ర­దేశ్‌ ముఖ్య­మంత్రి చంద్ర­బా­బు­నా­యుడు, తమి­ళ­నాడు ముఖ్య­మంత్రి ఎంకే స్టాలిన్‌ లాంటి వాళ్లు తమ తమ రాష్ట్రాల్లో జనాభా ఎంత పెరి­గితే అంత మంచి­దని అంటు­న్నారు. దేశంలో వృద్ధుల జనాభా పెరి­గి­పో­తోం­దని, యువత రాను­రాను తగ్గి­పో­వ­డంతో రాబోయే కాలంలో ఉత్పా­ద­కత మీద దాని ప్రభావం చాలా బలంగా పడు­తుం­దని అంటూ.. అందు­కోసం ప్రస్తుత యువత పిల్ల­లను విరి­విగా కనా­లని దక్షి­ణాది రాష్ట్రాల ముఖ్య­మం­త్రుల్లో కొందరు కోరు­తు­న్నారు. అయితే.. దీని వెనక మరో పర­మార్థం లేక­పో­లేదు. లోక్‌­సభ నియో­జ­క­వ­ర్గాల పున­ర్వ్య­వ­స్థీ­క­రణ 2029 ఎన్ని­క­లకు ముందే జర­గాల్సి ఉంది. అదే ఇప్పుడు అస­లైన అగ్గిని రాజే­స్తోంది. ఎన్‌­ఎ­ఫ్‌­హె­చ్‌­ఎస్5 (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే) ప్రకారం సంతా­నో­త్పత్తి జాతీయ సగటు రేటు 2.0 కాగా, తెలం­గా­ణలో 1.8 గాను, ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో 1.7గాను ఉంది. అంటే సగ­టున ఒక్కో మహిళ ఎంత­మంది పిల్ల­లను కంటు­న్నా­రనే లెక్క మాట.

- Advertisement -

లోక్‌­సభ నియో­జ­క­వ­ర్గా­లకు, జనా­భాకు సంబంధం ఏంటని చూస్తు­న్నారా..?
పున­ర్వ్య­వ­స్థీ­క­రణ తర్వాత ప్రస్తు­త­మున్న 543 లోక్‌ సభ నియో­జ­క­వ­ర్గాల సంఖ్య 753కు పెరు­గు­తుంది. అత్య­ధిక జనాభా గల రాష్ట్రం యూపీలో 80 నుంచి 126కు సీట్లు పెర­గొచ్చు. దక్షి­ణా­దిలో కర్ణా­ట­కలో మాత్రమే చెప్పు­కో­దగ్గ స్థాయిలో అంటే 28 నుంచి 36 సీట్లకు పెరిగే అవ­కాశం కని­పి­స్తోంది. తమి­ళ­నా­డులో 39 నుంచి 41కి, ఆంధ్ర­ప్ర­దేశ్‌, తెలం­గా­ణల్లో మూడేసి సీట్లు పెరిగే అవ­కాశం ఉండొచ్చు. అంటే ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో ప్రస్తుతం ఉన్న 25 సీట్ల నుంచి 28కి, తెలం­గా­ణలో ఇప్పు­డున్న 19 నుంచి 22కు మాత్రమే పెరి­గేం­దుకు అవ­కాశం ఉంటుంది. ఇక జనాభా నియం­త్ర­ణను అత్యంత సమ­ర్థంగా చేప­ట్టిన కేర­ళలో ప్రస్తుతం ఉన్న 20 లోక్‌­సభ స్థానాల్లో ఒకటి తగ్గినా తగ్గొచ్చు. బీజే­పీకి అను­కూ­లంగా ఉండే ఉత్త­రా­దిలో ఎంపీ స్థానాల సంఖ్య పెర­గడం, జనాభా నియం­త్ర­ణను మెరుగ్గా పాటిం­చిన రాష్ట్రా­లలో ఆశిం­చిన స్థాయిలో పెర­గ­క­పో­వ­డంపై ప్రతి­ప­క్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు­న్నాయి. జనాభా కట్టడి పాటిం­చని రాష్ట్రా­లకు ఎంపీ సీట్ల రూపంలో రివార్డ్‍ ఇవ్వడం ఏ మేరకు సమం­జసం అనే ప్రశ్నలు వేస్తు­న్నాయి. మరో లెక్క ప్రకారం అయితే.. ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో ఉన్న 25 స్థానాలు పెర­గ­క­పోగా, 20కి తగ్గే ప్రమాదం కూడా లేక­పో­లేదు.
అలాగే తెలం­గా­ణలో 19 నుంచి 15కు తగ్గొ­చ్చని కూడా అంటు­న్నారు. తమి­ళ­నా­డులో 39 నుంచి 30, కేర­ళలో 28 నుంచి 26కి, కర్ణా­ట­కలో 20 నుంచి 14కి తగ్గే అవ­కాశం ఉందని చెబు­తు­న్నారు. ఇదే జరి­గితే పార్ల­మెం­టులో మన గొంతు విని­పించే అవ­కాశం దక్షి­ణాది రాష్ట్రా­లకు ఇప్ప­టికే అంతం­త­మా­త్రంగా ఉండగా.. ఇక మీదట అస్సలు విని­పిం­చదు. సంఖ్యా­బలం ఆధా­రం­గానే పార్టీ­లకు మాట్లాడే అవ­కాశం కల్పి­స్తారు. దాని­కి­తోడు.. ఉత్త­రాది రాష్ట్రాల్లో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీయే కేంద్రంలో అధి­కా­రం­లోకి వస్తుంది. ఉదా­హ­ర­ణకు తాజా సార్వ­త్రిక ఎన్ని­క­లనే చూసు­కుంటే.. బీజే­పీకి ఉత్త­రా­దిలో కొంత బలం తగ్గింది. అదే సమ­యంలో ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో తెలు­గు­దేశం పార్టీ ఘన విజయం సాధిం­చడం, దానితో పొత్తు పెట్టు­కున్న సంద­ర్భంగా బీజే­పీకి కూడా కొంత ప్రయో­జనం కల­గడం మనం చూశాం. ఇక్కడ చంద్ర­బాబు, బీహా­ర్‌లో నీతీ­ష్‌­కు­మార్‌ ఇద్దరూ అండ­దం­డలు అందిం­చడం వల్లే కేంద్రంలో ఎన్డీయే వరు­సగా మూడో­సారి అధి­కా­ర­ప­గ్గాలు చేప­ట్ట­గ­లి­గింది అని చెప్ప­డంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇక మీదట ఇలాంటి పరి­స్థితి ఉండే అవ­కాశం ఏమాత్రం కని­పిం­చడం లేదు. కేంద్రంలో ఎన్డీయే వచ్చినా, యూపీఏ వచ్చినా, లేదా మరే­దైనా కూటమి వచ్చినా… వాళ్లంతా కేవలం ఉత్త­రా­దిలో గెలు­చు­కునే స్థానాల ఆధా­రం­గానే అధి­కారం చేప­డ­తారు. వారికి దక్షి­ణాది బలం దాదా­పుగా అవ­సరం ఉండ­క­పో­వచ్చు. అందు­వల్ల దక్షి­ణాది రాష్ట్రాల ప్రయో­జ­నాల గురించి కొట్లాడే అవ­కాశం కూడా ఆయా ప్రభు­త్వా­లకు దొర­కదు.
పార్ల­మెం­టులో ప్రాతి­నిధ్యం ఒక్కటే కాదు..
దక్షి­ణా­దిలో జనాభా పెరు­గు­దల ఆగి­పో­వడం వల్ల పార్ల­మెం­టులో ప్రాతి­నిధ్యం తగ్గు­తుం­దనే ఆందో­ళ­న­లు­న్నాయి. కేంద్ర ఆరో­గ్య­కు­టుంబ సంక్షే­మ­శా­ఖకు చెందిన 2020 నివే­దిక ప్రకారం, 2011తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లు పెరు­గు­తుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బిహార్‌, ఉత్త­ర­ప్ర­దేశ్‌, మహా­రాష్ట్ర, వెస్ట్‍ బెంగాల్‌, మధ్య­ప్ర­దే­శ్‌­ల­లోనే ఉంటుంది. ఇది మొత్తం పెరి­గిన జనా­భాలో సుమారు 54 శాతం. ఇదే సమ­యంలో ఆంధ్ర­ప్ర­దేశ్‌, తెలం­గాణ, కేరళ, తమి­ళ­నాడు, కర్ణా­ట­కల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరి­గిన జనా­భాలో కేవలం 9శాతం. జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌­సభ నియో­జ­క­వ­ర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజ­కీయ బలం తగ్గి­పో­తుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధిం­చు­కో­వ­డంలో ముందుం­టాయి. పార్ల­మెం­టులో ప్రాతి­నిధ్యం మాత్రమే కాదు కేంద్రం పంచే నిధు­లకు సంబం­ధించి కూడా ఆందో­ళ­న­లు­న్నాయి. ఈ ఏడాది ఫ్రిబ­వ­రిలో కర్ణా­టక ముఖ్య­మంత్రి సిద్ధ­రా­మయ్య, కేరళ ముఖ్య­మంత్రి పిన­రయి విజ­యన్‌ దిల్లీలో నిర­సన కూడా చేప­ట్టారు. పన్నుల రూపంలో తాము కేంద్రా­నికి కట్టే­దా­నికి, కేంద్రం నుంచి తమకు దక్కే­దా­నికి పొంతనే లేద­న్నది వారి ప్రధాన అభ్యం­తరం. కేంద్రం న్యాయ­బ­ద్ధంగా పన్నుల్లో వాటా ఇవ్వ­క­పోతే దక్షి­ణాది ప్రజలు ప్రత్యేక దేశం కోసం గళ­మె­త్తు­తా­రని కర్ణా­టకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్‌ అనడం కొంత వివా­దా­నికి కార­ణ­మైంది. 15వ ఫైనాన్స్​‍ కమి­షన్‌ ప్రకారం 2020–21లో కేంద్రం నుంచి ఆంధ్ర­ప్ర­దే­శ్‌కు 10శాతం కంటే తక్కువ నిధులు వస్తుంటే అదే ఉత్త­ర­ప్ర­దే­శ్‌కు 15శాతా­నికి పైగా వస్తు­న్నాయి. బీహార్‌ విష­యంలో అది 30శాతం పైగా ఉంది. తెలం­గాణ, తమి­ళ­నాడు, కర్ణా­టక, కేరళ విష­యంలో 10శాతం కంటే తక్కు­వగా ఉంది.
సీఎంలు ఏమం­టు­న్నారు?
దాంతో­పాటు.. వృద్ధుల జనాభా పెరి­గి­పోతే ప్రభు­త్వాలు సంక్షేమ కార్య­క్ర­మాల మీద పెద్ద మొత్తంలో ఖర్చు­పె­ట్టాల్సి ఉంటుంది. అమ­రా­వ­తిలో ప్రజలు వృద్ధులు అవు­తు­న్నా­రని, రాష్ట్రా­నికి అదొక సమ­స్యగా మార­నుం­దని చంద్ర­బాబు అక్టో­బర్‌ 19న వ్యాఖ్యా­నిం­చారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్ల­లను కనా­లని మరొ­క­సారి పిలు­పు­ని­చ్చారు. ఇద్ద­రి­కంటే ఎక్కువ మంది పిల్ల­లను కన­కుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయ­డా­నికి ‘అన­ర్హు­లుగా’ చేస్తూ చట్టం కూడా తీసు­కొ­స్తా­మ­న్నారు. జపాన్‌, చైనా లాంటి దేశాలు ఈ వృద్ధుల జనాభా సమ­స్యతో ఎలా పోరా­డాల్సి వస్తోందో కూడా ఆయన ప్రస్తా­విం­చారు. 2014 నుంచే ఆయన దీని మీద మాట్లా­డుతూ వస్తు­న్నారు. జనాభా పెరి­గి­తేనే మానవ వన­రులు వృద్ధి చెంది సంపద పెరు­గు­తుం­దని చెబుతూ వచ్చారు. రాష్ట్రా­భి­వృద్ధి కోసం రూపొం­ది­స్తున్న విజన్‌2047లో జనాభా మీద ‘ప్రత్యేక శ్రద్ధ పెట్టా­ల్సిన అవ­సరం ఉంది’ అని ఆయన చెప్పారు. ఆ మర్నాడే.. అంటే అక్టో­బర్‌ 20న తమి­ళ­నాడు ముఖ్య­మంత్రి ఎంకే స్టాలిన్‌ పార్ల­మెం­టులో సీట్ల ప్రాతి­నిధ్యం మీద జనాభా నియం­త్రణ చూపి ంచే ప్రభా­వాన్ని ప్రస్తా­విం­చారు. ప్రభుత్వ ఆధ్వ­ర్యంలో జరి­గిన సామూ­హిక వివాహ వేడు­కకు హాజ­రైన ఆయన, ‘పార్ల­మెంటు స్థానాలు తగ్గి­పో­తున్న తరు­ణంలో 16 మంది పిల్ల­లను ఎందుకు కన­కూ­డదు?’ అని ప్రశ్నిం­చారు. నవ దంప­తు­లను ఉద్దే­శించి ఆయన మాట్లా­డుతూ, ‘మన సాంప్ర­దా­యంలో నవ దంప­తులు 16 రకాల సంప­దలు పొందా­లని కుటుం­బ­పె­ద్దలు ఆశీ­ర్వ­దిం­చే­వారు. 16 రకాల సంప­దలు పొంది సుసం­పన్న జీవి­తాన్ని అను­భ­విం­చా­లని చెప్పే­వారు. 16 మంది పిల్ల­లను కనా­లని చెప్పడం వారి ఉద్దేశం కాదు. కానీ, నిజం­గానే వాళ్లు 16 మంది పిల్ల­లను కనడం మంచి­దేమో అనే పరి­స్థి­తులు తలె­త్తాయి. చిన్న కుటుం­బమో, సుసం­పన్న కుటుం­బాన్నో కోరు­కో­క­పో­వడం బెటర్‌ అనే ఆలో­చ­నలు వస్తు­న్నాయి’ అని వివ­రిం­చారు. జనాభా నియం­త్రణ మీద ఆ ఇద్దరు ముఖ్య­మం­త్రులు ఆందో­ళన వ్యక్తం చేయడం ఇదే తొలి­సారి కాదు. ఉత్త­రాది రాష్ట్రా­లతో పోలిస్తే జనాభా నియం­త్ర­ణలో ముందున్న దక్షి­ణాది రాష్ట్రాలు డీలి­మి­టే­షన్‌ వల్ల నష్ట­పో­తా­యనే ఆందో­ళన ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం జనాభా ఆధా­రంగా రాష్ట్రా­లకు నిధు­లను పంచడం మీద ఎంతో కాలంగా దక్షి­ణాది రాష్ట్రాలు, ముఖ్య­మం­త్రులు ఆందో­ళన వ్యక్తం చేస్తు­న్నారు.
2001లో ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో వృద్ధుల జనాభా 12.6 శాతం. కొంత కాలంగా అది పెరు­గుతూ వస్తోం­దని డేటా చెబు­తోంది. భారత రిజి­స్ట్రార్‌ జన­రల్‌ గణాం­కాల ప్రకారం ఈ జనాభా 2011లో 15.4 శాతంగా ఉండగా 2021లో 18.5 శాతం, 2031 నాటికి 24.7 శాతా­నికి పెర­గొ­చ్చని అంచనా వేస్తు­న్నారు. వృద్ధుల జనాభా పెరు­గు­తోంది అంటే పని చేసే జనాభా తగ్గు­తోం­దని అర్థం. ఇది ప్రధా­నంగా మానవ వన­రుల కొర­తకు దారి తీస్తుంది. సౌత్‌ కొరియా, చైనా, జపాన్‌ వంటి దేశాలు ఇప్ప­టికే ఈ సమ­స్యను ఎదు­ర్కొం­టు­న్నాయి. పెళ్లి చేసు­కున్న వారికి ఆర్థిక ప్రోత్సా­హ­కా­లను దక్షిణ కొరియా ప్రక­టిం­చింది. జపాన్‌ అయితే మ్యారేజ్‌ బడ్జెట్‌ కేటా­యిం­చింది. అక్కడ 1972 నుంచే చైల్డ్​‍ బెని­ఫిట్‌ యాక్ట్‍ అమ­లులో ఉంది. అప్పట్లో జన­నాల రేటు పెంచేం­దుకు జపాన్‌ చేసిన ఆలో­చన ఇది. తర్వాత ఈ నజ­రా­నాను కొద్ది­కొ­ద్దిగా పెంచుతూ వచ్చింది కూడా. బిడ్డ పుట్ట­గానే గతంలో 2.52 లక్షల రూపా­యలు ఇస్తుం­డగా, దాన్ని ఇప్పుడు 3 లక్ష­లకు పెంచింది. జపాన్‌ లాగే జర్మనీ , రష్యా , తైవాన్‌, యూరో­పి­యన్‌ దేశా­ల్లోనూ జన­నాల రేటు తగ్గు­తోంది. దీంతో కొన్ని దేశాలు జనాభా పెంచేం­దుకు కుటుం­బా­లకు ఆర్థిక సాయాన్ని ఆయు­ధంగా మార్చు­కుం­టు­న్నాయి. ఈ దేశా­లన్నీ బేబీ బోనస్ స్కీమ్‌ అమలు చేస్తు­న్నాయి. కొవిడ్‌ కార­ణంగా సింగ­పూ­ర్‌­లోని చాలా జంటలు పిల్లల్ని వద్ద­ను­కో­వ­డంతో వారికి ఆర్థిక సాయం అంది­స్తా­మని పిల్లల్ని కనా­లంటూ ప్రోత్స­హి­స్తోంది అక్కడి ప్రభుత్వం. మొదటి బిడ్డకు రూ.4.80 లక్షలు, రెండో బిడ్డకు రూ.6 లక్ష­లను అంద­జే­స్తోంది. తల్లి­దం­డ్రు­లకు కూడా చైల్డ్​‍ డెవ­ల­ప్‌­మెంట్‌ బోనస్ కింద రూ.3.40 లక్షలు ఇస్తోంది.
ఎందుకీ తగ్గు­దల?
చాలా­మంది ఆర్థిక స్తోమత సరి­పో­దన్న భావ­నతో, పిల్లల్ని పోషిం­చడం కష్ట­మ­వు­తుం­దనే ఉద్దే­శంతో పిల్లల్ని కనడం మానే­స్తు­న్నారు. జనాభా నియం­త్రణ కార­ణంగా రాబోయే రోజుల్లో అనేక పరి­ణా­మాలు ఎదు­ర్కో­వాల్సి వస్తుం­దని పలు­వురు ఆందో­ళన చెందు­తు­న్నారు. ఇటీ­వలి సంవ­త్స­రా­లలో చాలా మంది కాబోయే తల్లి­దం­డ్రులు తమ ఆర్థిక స్థితిపై పిల్లల పెంప­కంతో కలిగే ప్రభావం గురించి ఆందో­ళన చెందు­తు­న్నా­రని అనేక సర్వేలు చెబు­తు­న్నాయి. ప్యూ రీసెర్చ్‍ సెంటర్‌ సర్వే­లలో అమె­రి­క­న్లలో 50 ఏళ్ల లోపు వయసు ఉండి.. అస్సలు పిల్లలు లేని­వారు 2018లో 37శాతం మాత్రమే ఉండగా.. అది 2023లో 47శాతా­నికి పెరి­గింది. తమకు పిల్లల్ని పెంచే స్తోమత లేక­పో­వడం వల్లే కన­లే­దని వారిలో 36 శాతం మంది చెప్పారు.
పెరి­గితే వచ్చే నష్టాలు..
జనాభా ఇబ్బ­డి­ము­బ్బ­డిగా పెరి­గి­పో­వడం వల్ల ప్రభు­త్వాల మీద సంక్షేమ పథ­కాల భారం పెరు­గు­తుంది. మన దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రం­లోనూ పిల్ల­లకు ప్రభుత్వ పాఠ­శా­లల్లో ఉచి­తంగా చదువు చెప్పడం, పాఠ్య పుస్త­కాలు ఉచి­తంగా ఇవ్వడం, మధ్యాహ్న భోజన పథ­కాలు పెట్టడం లాంటివి ఉంటు­న్నాయి. కొందరు ఉద్యో­గాలు రాని­వా­ళ్లకు నిరు­ద్యోగ భృతి కూడా ఇస్తా­మం­టు­న్నారు. ఇలాంటి అన్నిం­టి­మీదా పెట్టే ఖర్చు జనా­భా­తో­పాటే పెరు­గు­తుంది. పెరి­గిన జనా­భాకు తగి­నం­తగా మౌలిక సదు­పా­యాలు కల్పిం­చాలి. ఇళ్లు, రోడ్లు, డ్రైనేజి, తాగు­నీరు, వైద్య సదు­పా­యాలు.. అన్నిం­టినీ పెంచాల్సి ఉంటుంది. పెరి­గిన జనా­భాకు తగి­నం­తగా ఆహార పదా­ర్థాల ఉత్పత్తి ఉండాలి. కానీ అది స్థిరంగా ఉండ­డంతో కొరత పెరు­గు­తుంది. అప్పుడు ధరలు కూడా ఆకా­శా­న్నం­టు­తాయి. ఇలా జనాభా పెరు­గు­దల వల్ల వచ్చే నష్టాలు కూడా చాలానే ఉన్నాయి.
ఏం చేయాలి?
జన­నాల రేటు మరీ జపాన్‌ స్థాయిలో తగ్గి­పో­యినా ఉత్పా­ద­క­తకు ప్రమా­దమే ఉంటుంది. వృద్ధుల జనాభా పెరి­గి­పోయి, పని­చే­సే­వాళ్ల సంఖ్య తగ్గు­తుంది. అలా­గని మరీ పెరి­గి­పో­యినా పైన చెప్పు­కొన్న సమ­స్యలు చాలా తలె­త్తు­తాయి. అందు­వల్ల మరీ అతి­వృష్టి, మరీ అనా­వృష్టి కాకుండా మధ్యే­మా­ర్గంగా వ్యవ­హ­రిం­చడం సమం­జసం. ఒక్కొక్క జంట 16 మందిని కనా­లంటే.. మహి­ళల ఆరోగ్యం మీద ఎంతటి ప్రభావం పడు­తుందో ఒక ముఖ్య­మంత్రి స్థాయిలో ఉన్న స్టాలిన్‌ కనీసం ఆలో­చిం­చారో లేదో అన్న అను­మానం వస్తుంది. అభి­వృద్ధి చెందిన అమె­రికా లాంటి అగ్ర­రా­జ్యా­ల్లోనే కొందరు మహా అయితే ముగ్గు­రిని కంటు­న్నారు. అక్కడ విస్తీర్ణం ఎక్కువ, జనాభా తక్కువ. అయినా అంత పరి­మితి పాటి­స్తు­న్నారు. అలాం­ట­ప్పుడు మన­కున్న వస­తులు, సదు­పా­యా­లను దృష్టిలో పెట్టు­కుని చర్యలు తీసు­కో­వాలే గానీ.. ఇష్టా­రా­జ్యంగా కేవలం రాజ­కీయ ప్రయో­జ­నాల కోసం నోటికి వచ్చి­నట్లు చెప్పేస్తే ఆ తర్వాత యావ­ద్దే­శంలో ఆర్థిక పరి­స్థి­తులు అత­లా­కు­తలం అయి­పో­తాయి.

సమయమంత్రి చంద్రశేఖర శర్మ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News