Monday, April 21, 2025
Homeఓపన్ పేజ్అభినవ అంబేడ్కర్‌!

అభినవ అంబేడ్కర్‌!

భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షలు కొనసాగినంత కాలం.. రాజ్యాంగం ఉన్నంత వరకు, రిజర్వేషన్లు అమలైనంత కాలం.. వాటి ఫలితాలు పొందే షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), వెనుక బడిన తరగతులు (ఓబీసీలు), ముస్లిం మైనార్టీలు, ఆధిపత్య కులా(ఓసీలు)ల్లోని పేదలు ఉన్నంత వరకు బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఎలా గుర్తు పెట్టుకుం టారో… మందకృష్ణ మాదిగను అలాగే గుర్తుపెట్టుకుంటారు. గుర్తు పెట్టుకోవాలి కూడా. స్వాతంత్రోద్యమకాలంలో అంటరానితనంలో మగ్గిన జాతులకు అంబేడ్కర్‌ దారి దీపమైతే.. 75 ఏళ్ళు నిండిన స్వతంత్ర భారతంలో అంటరానిజాతుల్లోనే అంటరానివారిగా మగ్గిన సమూహాలకు కృష్ణ మాదిగ అభినవ అంబేడ్కరుడే! తిట్టుకు ఊతపదమై, ఛీత్కారాలు, అవమానాలతో పాతాళానికి తొక్కి వేయబడ్డ అస్థిత్వం నిండిన భూమిని చీల్చుకుంటూ ‘నేను మాదిగ’ అని సగర్వంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదమైందంటే అందుకు మందకృష్ణ నాయకత్వంలో సాగిన దండోరా మహోద్యమమే కారణం!! ఆత్మగౌరవం, సామాజిక న్యాయం పునాదులుగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఉద్యమం 30 ఏళ్లపాటు సాగి అంతిమంగా లక్ష్యాన్ని చేరుకుంది. రాత్రయినా, పగలయినా, ఎండయినా, వానయినా ఏ క్షణంలో పిలుపునిచ్చినా ఎలాంటి త్యానికైనా సిద్ధపడే వెలకట్టలేని కార్యకర్తలుండటం.. అలాంటి వారిని తయారు చేసుకోవడం ఆయన నాయకత్వానికి నిదర్శనం. జాతి సంక్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకూ…లాఠీలు, తూటాలకు వెరవని కార్యకర్తలకూ… పస్తులుండైనా మానవ హక్కుల దండోరా పోరులో బిడ్డల్ని సాగనం పిన తల్లిదండ్రులకూ ఈ విజయం అంకితం. ఈ విజయం మాదిగలది మాత్రమే కాదు సమానత్వం కోసం సాగిన సమరంలో సంఘీ భావంగా నిలిచిన రాజకీయపార్టీలది, మీడియాది, న్యాయవాదులది.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామికవాదులందరిది.

- Advertisement -

చరిత్ర

స్వాతంత్రోద్యమకాలంలో సమాజానికి దూరంగా విసిరివేయ బడి అంటరాని జాతులుగా మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టి సూర్యుడు నడి నెత్తిన వస్తేనేగానీ ఇతరకులాల వీధుల్లో నడిచేందుకు వీల్లేకుండా కనీసం మనుషులుగా కూడా రోజులవి. కొండ, కోనలు, అడవుల్లో ఉండే ఆదివాసీలను దొంగలుగా చిత్రీకరించిన కాలం అది. అలాంటి దీన జనులు మనుషులేనంటూ పాలకులు గుర్తించేలా.. మిగతా సమూహాలతో సమానంగా ఆత్మగౌరవంతో బతికేలా వారి జీవితాల్లో అంబేడ్కర్‌ వెలుగులు నింపారు. నాటి పరి స్థితుల దృష్ట్యా అంటరానివారిలోనూ అంటరానివారుగా మిగిలి పోయిన జనం గొంతులు పెగల్లేదు. అక్కడక్కడ దళితుల్లోనే దళితులు పడుతున్న బాధలు కనపడుతున్నప్పటికీ ఉపజాతులన్నీ ఏకజాతిగా ఉంటే తప్ప సంఖ్యాపరంగా సవర్ణులను ఢికొట్టలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా చట్టాలు చేసే బ్రిటీష్‌ పాలకులకు కులం.. ఆ కులంలోని ఉపకులాలు అర్థమయ్యే పరిస్థితి లేదు. అందువల్ల అంబేడ్కర్‌ షెడ్యూల్డు కులాల న్నింటినీ ఏకతాటిపై నిలబెట్టి నల్లదొరలతోపాటు, తెల్లదొరలతోనూ పోరాటం చేశారు. 1941లో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా 4 కోట్ల 88 లక్షలు (12.6శాతం), 1951నాటికి 5 కోట్ల 13 లక్షలు (14.4శాతం). 2011 జనాభా లెక్కల ప్రకారం 20 కోట్ల 13 లక్షలు (16.6శాతం). ప్రస్తుతం మనం 2025లో ఉన్నాం. అదే 2011లో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణలు కలిపి)లో ఎస్సీ కులాల జనాభా 1 కోటి 38 లక్షలు. అన్ని కులాల్లో జనాభా పెరిగినట్లే ఎస్సీల జనాభా పెరుగుతూ వస్తోంది. కుటుంబాలు విస్తరించాయి. వాడలు, గూడెలు గ్రామాలయ్యాయి. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచకపోవడం.. అమలవు తున్న రిజర్వేషన్లతో కొన్ని కులాలు, కుటుంబాలే లబ్ది పొందడం వల్ల ఏర్పడిన అంతరాలను ప్రభుత్వాలు పూడ్చకపోవడం.. పాలకులు కనీసం వాటిని సమీక్షించకపోవడం, అసమానతలు సరి చేయకపోవడం వల్ల ఆందోళలు, ఆక్రందనలు తీవ్రరూపం దాల్చి మాదిగ దండోరా వంటి ఉద్యమాలుగా రూపాంతరం చెందాయి.

షెడ్యూల్డు కులాల్లో నెలకొన్న అసమానతలను ప్రభుత్వాలే సరిద్దాలనే డిమాండ్‌తో జూలై 7, 1994న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే మారుమూల గ్రామంలో మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో 20 మంది యువకులు మాదిగ రిజర్వే షన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) పేరిట ఉద్యమం ప్రారంభిం చారు. ఈ యువకులు నక్సలైట్‌ ఉద్యమం, కారంచేడు సంఘటన నేపథ్యంలో మొదలైన దళితమహాసభ ఉద్యమాల్లో ఓనమాలు నేర్చు కున్నారు తప్ప రాజకీయ ఉద్యమాలు చేయలేదు. అందరిదీ 30 ఏళ్ల లోపు వయసే. తమకు అన్యాయం జరిగిందన్నదానికి లెక్కలతో పాటు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అన్న స్ఫూర్తే వారి మార్గం. వాస్తవానికి మాదిగలది 50 ఏళ్లకు పైబడ్డ ఆరాటం. 1970లలో అడ్మిషన్లు, ఉద్యోగాల కల్పనలో ఎస్సీ రిజర్వే షన్లు ఒక్క కులం మాత్రమే అనుభవించడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆంధ్రాయూనివర్సిటీలో చదువుకునే మాదిగ విద్యార్థులు గుర్తించారు. విద్య, ఉద్యోగాల్లో మాదిగలకు న్యాయం చేయాలని అప్పటి మంత్రి టీఎన్‌ సదాలక్ష్మీ.. ముఖ్య మంత్రి జలగం వెంగళ్రావ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 1976లో హైదరాబా ద్‌లో జరిగిన హరిజన మహాసభలో రిజర్వేషన్లను వర్గీకరిస్తే తప్ప తమకు న్యాయం జరగదని మాదిగలు నినదించారు. 1982లో మాధవరావు, బి. విద్యాకుమార్‌ వంటి వారు తమ పేర్ల పక్కన మాదిగ అని చేర్చుకొని పత్రికా ప్రకటనలు చేసేవారు. ఆదిజాంబవ అరుంధతీయ సమాఖ్య, అరుంధతీయ బంధుసేవా మండలి పేరుతో మాదిగ ఉద్యోగస్తులు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని డిమాండ్‌ మొదలుపెట్టారు.
1982లో 12 మంది యువకులు ఎ.బి.సి.డి వర్గీ కరణ చేపట్టాలని అసెంబ్లీలో కరపత్రాలు విసిరారు. ఆ తర్వాత ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలు సైతం ఇదే డిమాండ్‌తో రెండు సార్లు అసెంబ్లీ లాబీల్లో, అసెంబ్లీ భవనంపై హల్‌చల్‌ చేశారు. వర్గీకరణ కోసం కేవలం డిమాండ్లు, పత్రికాసమావేశాలకే పరిమితమైన ఉద్యమం కృష్ణ మాదిగ నాయకత్వంలో కొత్తపుంతలు తొక్కి నేడు భారతదేశ సామా జిక ఉద్యమాలకు సరికొత్త బాటలు వేసింది. దండోరా పోరాట ఫలితం రిజర్వేషన్ల అమలు వ్యవస్థను పరిపూర్ణం చేసేం దుకు మరో అడుగుపడింది. దేశంలో ఒక కమ్యూనిటీ తన హక్కుల కోసం సుధీర్ఘకాలం పాటు ఉద్యమించడం బహుశా ఇదే!

వర్తమానం

మాదిగ దండోరా ఉద్యమం తెలుగు నేలపై చూపిన ప్రభావం అంతా ఇంతాకాదు. రెడ్డి, రావు, చౌదరి, నాయుడు, శర్మ, గౌడ్‌, ముదిరాజ్‌, యాదవ్‌, నాయక్‌ అంటూ ఓసీలు, బీసీలు, ఎస్టీలు తమ పేర్ల పక్క కులాల పేర్లు చేర్చుకోగా లేనిది తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం తమ కులాన్ని పేరు పక్కన చేర్చుకుంటే తప్పేం టని మందకృష్ణ మాదిగ బలంగా వాదించారు. మాదిగ దండోరా ఉద్యమ స్ఫూర్తితో లంబాడీలు నంగారా భేరి, గౌడ్లు మోకు దెబ్బ, ఆదివాసీలు తుడుం దెబ్బ, రజకులు చాకిరేవు, గొల్లకురుమలు డోలు దెబ్బ, వడ్డెర్లు గన్నుదెబ్బ అంటూ తమ హక్కుల కోసం ఉద్యమిం చారు. దళితులు అంటే కేవలం ఒకట్రెండు కులాలు మాత్రమే కాదు ఇదో 59 ఉపకులాల సమూహాం అన్న ఎరుకను గుర్తించేలా చేసిం ది. 1994కు ముందు దళితుల పంచాయితీలను ఊరి పెద్దలు లేదా ఆధిపత్య కులాలు తీర్చేవి. సంఘటనా ఆధారంగా అప్పుడప్పుడు నక్సలైట్లు ప్రజాకోర్టుల ద్వారా పరిష్కరించేవారు. అప్పటికే కారం చేడు వంటి దుర్ఘటనల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలవ్వడం.. తామే దండోరా ఉద్యమాన్ని నడుపుతుండటం వల్ల తమ పంచాయితీలు తామే, తమ వాడల్లోనే తీర్చుకోవడం మొద లైంది. మందకృష్ణ నాయకత్వంలో నడిచిన మాదిగ దండోరా ఉద్య మం విద్య, ఉద్యోగ రంగాలతోపాటు రాజకీయ, సంక్షేమ రంగా ల్లోనూ తమ వాటాతమకు దక్కేలా చేసింది. అందుకే ఉద్యమం మొదలైనప్పటి నుంచి నేటి దాకా మాదిగలు , మాదిగ ఉపకులాలు మిగతా ఎస్సీ కులాలతో సమానంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు అవకాశం ఏర్పడింది.

ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సహేతుకమైందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుని చ్చిన నేపథ్యంలో ఏప్రిల్‌ 14, 2025న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్‌ 17, 2025న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టాల అమలుకు గెజిట్లు, ఆర్డినెన్సులు, జీవోలు జారీ చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీలను గతంలో 2000–2004 వరకు అమలు చేసిన ఎ.బి.సి.డి విధానానికి బదు లుగా మూడేసి గ్రూపుల చొప్పున వర్గీకరించాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలు ఇప్పటి దాకా అనుభవించిన రిజర్వేషన్ల ఆధారంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 15శాతం రిజర్వేషన్లను అత్యంత వెనుకబడిన వారిని తొలి లబ్దిదారులుగా గ్రూప్‌–1లో, మధ్యస్తంగా లబ్దిపొందిన వారిని గ్రూప్‌–2లో, మెరుగైన ప్రయోజన పొందిన వారిని గ్రూప్‌–3లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 12 కులాలతో గ్రూప్‌–1లో రెల్లి, ఇతర ఉపకులాలకు 1 శాతం , 18 కులాలతో గ్రూప్‌–2లో మాదిగ, ఉప కులాలకు 6.5శాతం, గ్రూప్‌–3లో మాల, ఉప కులాలకు 7.5శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆర్డినెన్స్‍ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్యాపరం గా వెనుకబడిన 15 కులాలను గ్రూప్‌–1లో చేర్చి 1 శాతం (జనా భా 1,71625 3.288శాతం), మధ్యస్తంగా లబ్ధిపొందిన 18 కులాలను గ్రూప్‌–2లో చేర్చి వారికి 9 శాతం (జనాభా 3274377, 62.748శాతం), మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్‌–3లో చేర్చి 5శాతం (జనాభా1771682, 33,963శాతం) రిజర్వేషన్‌ చొప్పున కల్పిస్తూ చట్టం చేసింది. గ్రూపులవారీగా వర్గీక రించిన ఈ రిజర్వేషన్లలో మహిళలకు 33.33శాతం కేటాయిం చారు. విద్యా, ఉద్యోగాల్లో నిర్దేశించిన గ్రూప్‌లోని అభ్యర్థి లేకపోతే రోస్టర్‌ విధానంలో ఆ సీటు, ఉద్యోగం తర్వాతి గ్రూప్‌కు వెళ్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు రిజర్వేషన్ల సమపంపిణీ చట్టం అమలు చేయడం ద్వారా దేశంలో రిజ ర్వేషన్‌ పంపణీ విధానం మరో అడు గేసినట్లయ్యింది. డిమాండ్లు వినిపిస్తున్న మిగతా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ విధానానికి రోల్‌ మోడల్‌గా నిల వనుంది. దీంతో దేశంలో రిజర్వే షన్ల ప్రక్రియ గురించి మాట్లాడా లంటే దండోరా ఉద్యమానికి ముందు.. దండోరా ఉద్యమం తర్వాత అన్న అనివార్య తను కల్పించింది. దండోరా ఉద్యమ ఫలితంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అసమాన, అస మగ్ర పంపిణీ ప్రక్షాళనకు మార్గం ఏర్ప డింది. రిజర్వేషన్ల సమ పంపిణీ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు. పైగా ఇన్ని రోజులు ఉప్పునిప్పులా ఉన్న దళితులు ఏకమయ్యేందుకు ఇదో అవకాశం.!

భవిష్యత్‌

మూడు దశబ్దాల దండోరా ‘వర్గీకరణ’ ఉద్యమం విజయం సాధించిందంటే పాలకుల గొప్పతనం కాదు మాదిగల పట్టువదలని పోరాటం. కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు మాది గల్ని ఈ 30 ఏళ్లకాలంలో అనేక రకాలుగా వాడుకున్నాయి. జైళ్ల పాల్జేశాయి. అవమానించాయి. వర్గీకరణ మలిదశ పోరాటం నడిచిన 2004 నుంచి 2025 వరకు అన్నీ పార్టీలు వర్గీకరణకు సై అన్నాయి. కానీ ఆచరణలో వెనుకడుగేశాయి. తాము అధికారం లోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని వాగ్ధానం చేసిన బీజేపీ పదేండ్ల తర్వాత న్యాయపరమైన చిక్కుల నుంచి బయటప డేలా నిపుణుల కమిటీని వేసింది. దండోరా నాయకత్వం మిన్న కుండి ఉంటే, దశలవారీగా పోరాటమనేదే చేయలేకుండా ఉండి ఉంటే ప్రధానమంత్రి మోడీ సైతం పట్టించుకోక పోయే వారు. మందకృష్ణ కాకుండా ఈ ఉద్యమాన్ని వేరే ఎవరూ లీడ్‌ చేసినా ఇక్కడి దాకా వచ్చేది కాదేమో! వచ్చినా మరో 300 ఏండ్లయినా పట్టేది గమ్యం చేరే సరికి!! కృష్ణ మాదిగను కేవలం మాదిగలు, మాదిగ ఉపకులాల నాయకుడిగా మాత్రమే చూడొద్దు. ఎందుకంటే ఆయన సమాజ శ్రేయస్సు కోసం తన వంతుగా కృషి చేశారు. అన్ని కులాలు, మతాలకు చెందిన గుండె జబ్బులతో బాధపడే చిన్నారు లకు ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయాలని ఉద్యమించి ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి ఆద్యుడయ్యారు. అన్ని వర్గాల్లో ఉండే వికలాం గులకు ప్రభుత్వం పెన్షన్‌ పెంచేలా పోరాటం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. సామా జిక తెలంగాణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వాటా తేల్చండంటూ బహుజన సమాజాన్ని మేల్కొలిపారు.
పాలకుల నిర్లక్ష్యమో, ప్రతిఘాతుక ఆందోళనల ప్రభావమో ఒక్క పిలుపుతో లక్షలాదిమందిని సమీకరించే శక్తి ఉన్న మందకృష్ణ పోరాట పటిమ మెజార్టీగా 30 ఏండ్లు రిజర్వేషన్ల చుట్టే తిరిగింది. దండోరా సహా పలు ఉద్యమాలు, ప్రపంచీకరణ ప్రభావాల వల్ల అణ గారిన వర్గాల్లో వచ్చిన చైతన్యం కారణంగా రాజకీయ కాంక్ష పెరి గింది. కానీ అధికారం ఆధిపత్య వర్గాల ఆధీనంలోనే బందీ అయ్యిం ది. ఇప్పుడు కృష్ణమాదిగ చేయాల్సింది రాజకీయ ఉద్యమం. రాజ్యా ధికార కాంక్షతో కూడిన రాజకీయ ఉద్యమం. రాజ్యాధికా రాన్ని ఛేజిక్కించుకునేలా, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండేలా కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత ఉద్యమాల పెద్దన్నపై ఎంతైనా ఉంది!
– డాక్టర్ మహేష్‌ కొంగర
సీనియర్ జర్నలిస్ట్, 9866464567

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News