Wednesday, July 16, 2025
Homeఓపన్ పేజ్MRPS: నేడు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం.. దండోరా ప్రజాకోర్టు ఒక చారిత్రక ఘట్టం..!

MRPS: నేడు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం.. దండోరా ప్రజాకోర్టు ఒక చారిత్రక ఘట్టం..!

నేడు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకోవడం ద్వారా ఎమ్మార్పీఎస్ సామాజిక న్యాయం కోసం చేసిన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

అది 1998-99 మధ్య కాలం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తమ హక్కుల సాధన కోసం తీవ్రంగా పోరాడుతున్న రోజులు. అదే సమయంలో అడవులలో పీపుల్స్ వార్ (ప్రస్తుతం మావోయిస్టు పార్టీ) మరియు జనశక్తి నక్సలైట్ల పోరాటాలు కూడా ఉధృతంగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యంగా కొనసాగుతున్న దండోరా ఉద్యమంలో మెదక్ జిల్లా, రామాయంపేట మండలం, నస్కల్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు మైసయ్య క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. ఎం.ఏ. వరకు చదువుకున్న మైసయ్య, అప్పటికే అంబేద్కర్ యువజన సంఘంలో చురుకుగా పనిచేసిన అనుభవంతో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడిగా ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. దండోరా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను మేల్కొలుపుతూ, స్థానికంగా ఉన్న సమస్యలపైనా పోరాడుతున్నాడు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాడు.

అలాంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. గ్రామంలో మంచి నీటి బోరు బావి వద్ద గొడవ రేగింది. దళితులు నీటిని ఉపయోగించకూడదన్న వాదన బలపడింది.మైసయ్య ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాడు.అయితే, అప్పటికే నక్సలైట్లు ఈ సంఘటనపై వేరే తీర్పు ఇచ్చి ఉండటం, మైసయ్య అన్యాయాన్ని ప్రశ్నించడం,
మరియు అతను ప్రజల్లోకి దూసుకుపోవడం కొంతమందికి నచ్చలేదు. అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ తిరిగే కొందరికి మైసయ్య అడ్డుగా కనిపించాడు.దీంతో వారు మైసయ్యపై నక్సల్స్ వ్యతిరేకి అనే ముద్ర వేశారు.పీపుల్స్ వార్ మరియు జనశక్తి నక్సల్స్ మధ్య ఉన్న వైరాన్ని అదునుగా చేసుకుని, మైసయ్య పీపుల్స్ వార్‌కు వ్యతిరేకంగా,జనశక్తికి సానుభూతి పరుడిగా పని చేస్తున్నాడని ప్రచారం చేశారు.

బెదిరింపులు పెరగడంతో మైసయ్య ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి పరిస్థితి వివరించాడు.అప్పుడు దండోరా నాయకత్వం హక్కుల నేతలు,జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సల్స్‌ను జోక్యం చేసుకోవాలని కోరింది. అయితే, ఇది “అన్నదమ్ముల మధ్య గొడవ, సున్నితమైన అంశం”గా భావించి వారు పెద్దగా పట్టించుకోలేదు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఒక దండోరా కార్యకర్తను లక్ష్యంగా చేసుకున్నారనే విషయం అప్పటి పీపుల్స్ వార్ పార్టీ జిల్లా కార్యదర్శి సుదర్శన్‌కు తెలియకుండా, ఎలాంటి విచారణ లేకుండానే కిందిస్థాయి నక్సల్స్ మరియు అంబేద్కర్ పేరు చెప్పుకునే కొందరు మైసయ్యను దారుణంగా హత్య చేశారు.

ఈ విషయం తెలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెంటనే నస్కల్ సందర్శించి, అటు నక్సల్స్‌కు, ఇటు జనశక్తికీ సవాల్ విసిరాడు. మైసయ్య హత్యపై ప్రజాకోర్టు నిర్వహిస్తున్నామని, అక్కడి పీపుల్స్ వార్, జనశక్తి నేతలు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా “యుద్ధ వాతావరణం” నెలకొంది. అప్పటివరకు భూమి కోసం, భుక్తి కోసం, సమసమాజ విముక్తి కోసం అంటూ అడవి బాటపట్టిన అన్నలు, “ప్రజాకోర్టు”ల పేరుతో గ్రామాలలో అన్యాయాలకు పాల్పడేవారికి శిక్షలు అమలు చేసేవారు. దండోరా సవాల్‌తో అన్నల్లోనూ అలజడి మొదలైంది. ముందూ వెనకా చూసుకోకుండా, అగ్ర నాయకత్వానికి తెలియకుండా మాదిగ యువకుడిని “వ్యక్తిగత కక్ష”లతో చంపేయడంపై “దండోరా ప్రజాకోర్టు” సంచలనం సృష్టించింది. పత్రికల్లో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. పోలీసులు సహా అందరికీ వింత అనుభవం ఎదురైన సందర్భం అది.

ప్రజాకోర్టు నిర్వహణ రోజు రానే వచ్చింది. మందకృష్ణ మాదిగ అర్జంటు పని మీద ఒంగోలు వెళ్ళడంతో, ఆయన ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి దేవని సతీష్ మాదిగ (ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు) ప్రజాకోర్టుకు “జడ్జి”గా వచ్చారు. ఒకవైపు సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న మాదిగలు, మరోవైపు మాదిగ దండోరాకు అండగా ఉన్న పీపుల్స్ వార్, జనశక్తి నక్సలైట్లపై ఆరోపణలు, ఇంకోవైపు నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న అన్నలు ప్రజాకోర్టుకు వస్తారా? వస్తే జరిగే “ఎన్‌కౌంటర్”పై రకరకాల ఊహాగానాలు. మఫ్టీలో పోలీసుల పహారా. జనాల్లో కలిసిన “మఫ్టీ” అన్నలు. దాదాపు ఐదు వేల మంది జనం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

“మా గూడెల్లో కారం మెతుకులు తిన్న అన్నలు… మా కోసం పని చేసిన అన్నలు… మా కోసమే పని చేస్తామని చెబుతున్న అన్నలు… ప్రజాకోర్టులో శిక్షలు వేసే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై అన్ని విధాలుగా విచారణ జరిపాక నిర్ణయం తీసుకుంటారు. ఏ సామాజిక న్యాయం కోసమైతే మీరు పని చేస్తున్నారో మేమూ అదే సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నాం.. మీరు చేసిన పనికి మైసయ్య భార్యా పిల్లలు అనాథలయ్యారు. మీ పోరాటం ఎవరి మీద? మీది ‘పీపుల్స్ వార్’ కాదు, ‘సెల్ఫ్ వార్’!” అంటూ సతీష్ మాదిగ అన్నలను నిలదీశాడు. ఆయన సూటి ప్రశ్నలకు అంతా నిశ్శబ్దం. మైసయ్య మృతితో అనాథలైన ఆయన భార్య, ఇద్దరు పిల్లలకూ పీపుల్స్ వార్, జనశక్తి నక్సల్స్ గానీ, వారి తరఫునగానీ ఎవరూ సమాధానం చెప్పలేదు.

ఆ తర్వాత కొన్నాళ్లకు తమకు సమాచారం లేకుండా, తమ ప్రమేయం లేకుండా మైసయ్య హత్య జరిగిందని, పొరపాటుకు చింతిస్తున్నామని పీపుల్స్ వార్ నుంచి ప్రకటన విడుదలైంది. ఆ సంఘటన వల్ల దళితులు, గిరిజనుల విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఒకటికి వందసార్లు విచారణ జరపాలని పీపుల్స్ వార్ ప్లీనరీ సమావేశాలలో నిర్ణయం తీసుకున్నారని మాజీ నక్సల్స్ గుర్తు చేస్తారు.

ఈ సంఘటనను ఈరోజు గుర్తు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, తప్పు చేస్తే అన్నలను సైతం వదలని మాదిగ దండోరా న్యాయాన్యాయాలను సమాజం ముందు ఉంచింది. మొదటి నుంచి ఇదే తమ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు రిజర్వేషన్ల వర్గీకరణ అనే సామాజిక న్యాయ డిమాండ్‌ను సాధించుకోవడానికి పోరాటం చేస్తూనే, సమాజ హితం కోసం పాటుపడింది. అన్యాయం ఎక్కడ జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాడింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష రాజ్యమేలేది. చాలావరకు గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఎమ్మార్పీఎస్ ఆ అసహ్యకరమైన రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పోరాడటం వల్ల వామపక్ష సీపీఐ, సీపీఐఎం వంటి పార్టీలు “కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం”, “కుల వివక్ష నిర్మూలన సంఘం” పేరుతో అనుబంధ సంఘాలను ప్రారంభించాయి.

ఇప్పుడంటే మలిదశ దండోరా ఉద్యమం (2004 తర్వాత)లో డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. కానీ 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే మారుమూల గ్రామంలో 20 మంది యువకులతో ప్రారంభమైనప్పుడు వారిలో చాలామంది హైస్కూలు కూడా దాటలేదు. మైసయ్య లాంటి చదువుకున్న యువకులు అరుదు. దండోరా నాయకత్వం కూడా “అనాటి పరిస్థితులను” బట్టి పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులనే ఉద్యమంలో ప్రధానంగా భాగస్వాములను చేసింది. తమ బిడ్డలైనా బాగా చదువుకోవాలన్న చిన్న ఆశ ఆనాటి తల్లిదండ్రులది. మిగతా సమాజంతో కలిసిపోవాలని, ఎదగాలన్న ఆకాంక్షలతో ఆ వెట్టి మనుషులు.. పిడికెడు మెతుకుల కోసం నాయకత్వం పిలుపునిచ్చినప్పుడల్లా ఎండిన డొక్కలతో రోడ్డెక్కేవారు. పోలీసు లాఠీలకు ఎదురొడ్డి నిలబడ్డారు. రాజధానులను దిగ్బంధించారు. చివరికి ఆత్మబలిదానాలూ చేశారు. రాజ్యం కుట్రలకు కూడా బలయ్యారు. ఆ వెట్టి కాళ్లకు, ఆ మట్టి మనుషుల త్యాగాలకు జై భీంలు! ఆ ఘన చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత కూడా ఉంది!

డా. మహేష్ కొంగర.
– సీనియర్ జర్నలిస్ట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News