ద్వీప దేశమైన శ్రీలంక ప్రస్తుతం అనేక రకాలుగా సంక్షోభాల్లో కూరుకుపోయింది. స్నేహితులను దూరం పెట్టి శత్రువును దగ్గరకు తీసుకున్నందుకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నానా అవస్థలూ పడుతోంది. ఎరక్కపోయి చైనాతో సాన్నిహిత్యం పెంపొందించుకున్న శ్రీలంక ఇప్పుడు దాని కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతోంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బి.ఆర్.ఐ)లో చేరిన దగ్గర నుంచి శ్రీలంక రుణాల ఊబిలో కూరుకుపోవడం ప్రారంభించింది. దక్షిణాసియాలో చైనా ప్రవేశించడానికి అవకాశం కల్పించి ఇప్పుడు ఆ దేశం చైనా ఆధిపత్య ధోరణి కారణంగా నానా అవస్థలూ పడుతోంది. శ్రీలంకలో చైనా పెట్టుబడులు పెట్టడం మొదట్లో బాగానే ఉంది కానీ,
2017 తర్వాత నుంచి చైనా అసలు ప్రణాళిక, వ్యూహం అర్థమై శ్రీలంక ఈ చిక్కుముడి నుంచి బయటకు రాలేక, ఎట్లా దీని నుంచి బయటపడాలో తెలియక దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. చైనా నుంచి తీసుకున్న రుణాన్ని తీర్చలేక అది హంబాన్ తోట పోర్టును చైనాకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. చైనా నుంచే కాక, చైనా కారణంగా శ్రీలంక అనేక దేశాల నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది.
శ్రీలంక మొత్తం విదేశీ రుణం 4600 కోట్ల డాలర్లు కాగా, అందులో సగానికి పైగా రుణాన్ని చైనాకు చెల్లించాల్సి ఉంది. ఇక 2022 సంవత్సరంలో శ్రీలంక ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారడంతో ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్)ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ రుణాల ఊబిలో నుంచి బయటపడడానికి శ్రీలంక ప్రభుత్వం గత రెండేళ్లుగా నానా పాట్లూ పడుతోంది. నిజానికి, శ్రీలంకకు ఈ సమస్యను సృష్టించిన చైనాయే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గత అక్టోబర్ నెలలో శ్రీలంక నానా తంటాలూ పడి, చైనా ఎగుమతులు, దిగుమతుల బ్యాంకుతో 420 కోట్ల డాలర్లకు సంబంధించిన ఒక రుణాన్ని తిరగరాసుకుని, ఒక ఒప్పందం కుదర్చుకుంది. అయినప్పటికీ చైనా ప్రభుత్వం నుంచి శ్రీలంకపై ఏమాత్రం ఒత్తిడి తగ్గలేదు. దాంతో శ్రీలంక చైనాకు చెందిన సైనోపెక్ అనే చమురు శుద్ధి కర్మాగారంతో 450 కోట్ల డాలర్ల మేరకు ఒక ఒప్పందాన్ని కుదర్చుకోవాల్సి వచ్చింది. శ్రీలంక ఏ దేశంలోనైనా ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. అప్పటికి చైనా కొద్దిగా శాంతించింది. ఎటువంటి షరతులూ లేకుండా ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నట్టు చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్ దీనిపై వ్యాఖ్యానించడం
గమనించాల్సిన విషయం.
దేశ ప్రయోజనాలు తాకట్టు
సైనోపెక్ అనే చమురు శుద్ధి సంస్థ ప్రభుత్వ యాజమాన్యంలోనిది. ఇది ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. ఈ సంస్థ సౌదీ అరేబియా, రష్యాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. దక్షిణాసియా మార్కెట్టును చేజిక్కించుకోవడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. శ్రీలంకలోని హంబన్ తోట పోర్టుకు ఈ సంస్థ 2019 నుంచి ఆయిల్ సరఫరా చేస్తోంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారుతున్నందువల్ల ఆ దేశానికి ఇటువంటి చేయూత తప్పనిసరి అవు తోంది. వాస్తవానికి నిరుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితి తలెత్తింది. చైనాతో కొత్తగా రుణ ఒప్పందాన్ని కుదర్చుకోవడం, సైనోపెక్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘ కాలంలో తమ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందని శ్రీలంక కొద్దిగా ఆశావహంగా ఉంది. విచిత్ర మేమిటంటే, చైనా అధ్యక్షుడు చెప్పినట్టుగా ‘ఎటువంటి షరతులూ లేకుండా’ సైనోపెక్ లో శ్రీలంక పెట్టుబడులు పెట్టడం జరగలేదు. చైనా అదనపు ఆర్థిక సహాయం అందించడానికి తద్వారా మార్గం సుగమం అయింది. చైనా ఇస్తున్న నిధుల వల్ల శ్రీలంకకు ఐ.ఎం.ఎఫ్ నుంచి రుణం మంజూరు కావడం సులువైంది. అయితే, దీర్ఘకాలంలో శ్రీలంక నిజంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుందా అన్నది ప్రశ్న.
కోవిడ్ కాలం నుంచి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రుణ భారాలతో విలవిల్లాడిపోతోంది. పర్యాటక రంగం ద్వారా కోట్లాది డాలర్లు గడిస్తున్న శ్రీలంకలో కోవిడ్ కాలం నుంచి ఈ రంగం పూర్తిగా కుదేలయి పోయింది. అందువల్ల శ్రీలంక ముప్ఫయ్ రోజుల పాటు చైనా, భారత్ పర్యాటకులకు వీసాలతో నిమిత్తం లేకుండా స్వేచ్ఛగా శ్రీలంకలో ప్రవేశించడానికి అవకాశం కల్పించింది. అది ఇంతకు ముందు మలేషియా, థాయ్ లాండ్, జపాన్, రష్యా, ఇండొనీషియా దేశాలకు కూడా ఈ వసతి కల్పించింది. దీని ద్వారా పర్యాటక రంగాన్ని పునరుద్ధరించవచ్చని ఆ దేశం భావిస్తోంది. కాగా, చైనా తన పెట్టుబడులు, రుణాల ద్వారా ఏ విధంగా ఆసియాపై ఆధిపత్యం సాధిస్తోంది, ఏ విధంగా చిన్న దేశాలను దెబ్బతీస్తోందనడానికి శ్రీలంక అనుభవం ఒక ఉదాహరణ. ఒక పక్క శ్రీలంకతో రుణ సవరణ ఒప్పందం కుదర్చుకుంటూనే మరో పక్క ఆ దేశం తమ సైనోపెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టేలా చేసింది. సైనోపెక్ లో పెట్టిన పెట్టుబడులతో సహా ఎక్కడెక్కడి పెట్టుబడులను చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోసమే ఉపయోగిస్తోంది. ప్రధాన పెట్టుబడుల రూపంలో చైనా శ్రీలంకకు చెందిన ప్రతి విభాగంపైనా పట్టు సంపాదించింది.
రుణ పంజరంలో విలవిల
మొత్తం మీద చైనాతో శ్రీలంక ఒక రుణ పంజరంలో చిక్కుకుంది. చైనా కబంధ హస్తాల
నుంచి శ్రీలంక ఇప్పట్లో బయటపడే అవకాశం లేదు. చమురు సంస్థలో పెట్టుబడుల
కారణంగా చైనా ఇప్పుడు శ్రీలంక విమానాశ్రయాలు, పరిశ్రమలు, రేవు పట్టణాలపై
కూడా పట్టు సంపాదించింది. ఆసియాలో తన రాజకీయ ఆధిపత్యానికి శ్రీలంక ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఒకపక్క తాను ‘సహాయం’ చేస్తూనే, ఇతర దేశాలు శ్రీలంకకు సహాయం చేయకుండా ఆ
దేశం మీద ఒత్తిడి తెస్తోంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల, అది చైనా ఆధిపత్యంలో ఉండడం వల్ల ఇతర దేశాలు కూడా శ్రీలంకలో పెట్టుబడులు పెట్టడానికి, శ్రీలంకకు సహాయం చేయడానికి జంకుతున్నాయి.
నిజానికి పొరుగు దేశమైన శ్రీలంకతో మైత్రీ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత్ కొద్ది నెలల క్రితం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కొద్ది కాలం క్రితం శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పుడు స్నేహానికి సంబంధించిన పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు కనిపించింది. ఈ రెండు దేశాల అధినేతలు సమావేశం పూర్తయిన తర్వాత జారీ చేసిన సంయుక్త ప్రకటన ఆర్థిక సహకారం, మైత్రీ సంబంధాల పటిష్టత విషయంలో స్పష్టతను వ్యక్తం చేసింది. ఉభయ దేశాల మధ్య కనెక్టివిటీని ప్రోత్సహించడం, అభివృద్ధికి దోహదం చేయడం, భారత, శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని పరిపూర్ణంగా అమలు చేయడం ఈ సంయుక్త ప్రకటనలో
ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాక, ముఖ్యంగా అయిదు అంశాల మీద వీరి దృష్టి కేంద్రీకృతమైంది. అవిః నౌకాయానం-సముద్రతీర వ్యాపారాలు, విమానయానం, ఎనర్జీ, వాణిజ్యం, పరస్పరం వ్యక్తుల మార్పిళ్లు.
ఇండియాతో సాన్నిహిత్యం
ఈ రెండు దేశాల మధ్య సముద్రయానం, సాగరతీర వ్యాపారాలు, విమానయానం అభివృద్ధి చెందడమంటే కొత్తగా విమానాశ్రయాలను, రేవు పట్టణాలను నిర్మించాల్సి ఉంటుంది. శ్రీలంకలో భారత్ కు చేరువుగా ఉన్న ప్రాంతాలకు తమిళనాడు నుంచి కూడా ప్రజలు తేలికగా వెళ్లగలిగే ఏర్పాట్లు చేయాలి. ఫెర్రీ సేవలను, విమాన సర్వీసులను పొడిగించాల్సి ఉంటుంది. ఇక ఆ దేశంలో వాయు విద్యుత్తు, సౌర విద్యుత్తుల ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్లను నెలకొల్పవలసి ఉంటుంది. గత ఏడాది కుప్పకూలిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యత భారత్ మీద పడింది. ఈ ఆర్థిక సంబంధాలను చాలా కాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకే కాకుండా, భారత్ కు కూడా రుణపడిన శ్రీలంకను ఈ దుస్థితి నుంచి పైకి తీసుకు రావడానికి భారత్ ఈ రుణాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. శ్రీలంకలో యు.పి.ఐ డిజిటల్ కార్యకలాపాలు చేపట్టడానికి, వాణిజ్యానికి
భారతదేశ కరెన్సీని ఉపయోగించడానికి సంబంధించి ఉభయ దేశాల మధ్య అవగాహన
ఒప్పందం కుదిరింది. టూరిజాన్ని, సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి, విద్యావిషయిక బంధాలను పెంపొందించుకోవడానికి కూడా ఉభయ
దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
అయితే, శ్రీలంక ఏ కారణంగానో ఆ తర్వాత తన దిశను మార్చుకుంది. దిశతో పాటే దశ కూడా మారిపోయింది. గోదుమ, టీ పౌడర్, కాఫీ పౌడర్ వగైరాలతో సహా అనేక నిత్యావసర వస్తువులను శ్రీలంకకు సరఫరా చేసింది. కోవిడ్ సమయలోనే కాదు, ఆ తర్వాత కూడా ఈ దేశానికి నిత్యాసరాలను సరఫరా చేయడం జరిగింది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ లను కూడా భారీ ఎత్తున సరఫరా చేసింది. దాదాపు నాలుగు వందల డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చింది. ఈ సహాయం అందుకోవడానికి సిద్ధపడ్డ శ్రీలంక కొద్ది కాలం గడిచిన తర్వాత చైనా ఒత్తిడి కారణంగా వెనుకడుగు వేసింది. విచిత్రమేమిటంటే, శ్రీలంక అధినేత ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దేశం గడ్డు పరిస్థితుల నుంచి బయటపడడానికి మోదీ చేయూత నందించడానికి అనేక మార్గాలు సూచించారు. ఇతర దేశాల ద్వారా ఆ దేశానికి రుణ సహాయం అందించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే, శ్రీలంక ఇక్కడికి వచ్చి కుదర్చుకున్న ఒప్పందాలను సైతం అక్కడికి వెళ్లిన తర్వాత పక్కన పెట్టేసింది. ఇప్పుడు తీరి కూర్చుని తాను చేసిన తప్పిదాలకు, వేసిన తప్పటడుగులకు విచారిస్తోంది.
– వి. జగదీశ్వరరావు,
విశ్రాంత ఆచార్యుడు