Monday, August 19, 2024
Homeఓపన్ పేజ్Stampedes a big challenge to administrators: పాలకులు, ప్రజలకు హత్రాస్‌ గుణపాఠం

Stampedes a big challenge to administrators: పాలకులు, ప్రజలకు హత్రాస్‌ గుణపాఠం

హత్రాస్‌ దుర్ఘటన నుంచి పాలకులే కాదు, ప్రజలు కూడా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. ఉత్తర ప్రదేశ్‌ లోని హత్రాస్‌ జిల్లాలో ఉన్న పూల్రాయ్‌ గ్రామంలో గత వారం భోలే బాబా సారథ్యంలో జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి, 121 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజల మనసుల్ని తీవ్రంగా కలచివేసింది. అత్యంత బాధాకరమైన ఈ మరణాలను అక్కడి దేవుళ్లు గానీ, భోలే బాబా గానీ నివారించలేకపోయారు. యుద్ధాలు, ఉత్పాతాలు, ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాల తర్వాత అత్యంత ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించేది మూఢ నమ్మకాల వల్లేనని గణాంకాలు తెలియజేస్తున్నాయి. భోలే బాబాలో అనేక మహిమలు దాగి ఉన్నాయని, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తారని ప్రజలు అమాయకంగా నమ్మడం సబబేనా? భోలే బాబా మహిమలను నమ్మడం మూఢ నమ్మకం కాదా?
సుమారు మూడు దశాబ్దాల క్రితం భోలే బాబా ఉత్తర ప్రదేశ్‌ లో సూరజ్‌ పాల్‌ సింగ్‌ పేరుతో ఒక కానిస్టేబుల్‌గా పనిచేస్తుండేవాడు. అతను ఓ పేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. జ్ఞానోదయం కలిగే సరికి సహజంగా అతని పేరు సూరజ్‌ పాల్‌ సింగ్‌ నుంచి భోలే బాబాగా మారిపోయింది. అతను తన పేరును మొదట నారాయణ్‌ సాకార్‌ హరిగా మార్చుకుని, స్వచ్ఛతకు, శాంతి సౌభాగ్యాలకు ప్రతీక అయిన తెల్ల దుస్తులు ధరించడం ప్రారంభించాడు. అతని ఆశీస్సులతో ప్రజల జీవితాలు మారిపోవడం ప్రారంభించాయి. అందుకు ప్రతిఫలంగా అతను కూడా సిరిసంపదలను కూడగట్టుకున్నాడు. ఆయనకు హత్రాస్‌ జిల్లాలోనే కాక, ఉత్తరప్రదేశ్‌ లో ఎక్కడ, ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నది అంతుబట్టడం లేదు. భోలే బాబా విషయంలో ఇది నిజంగా అద్భుతమే.
పూల్రాయ్‌ గ్రామంలో ఆ రోజున రెండు లక్షల మంది ‘భక్తులు’ గుమికూడారు. భోలే బాబా వ్యక్తిగత భద్రతా బృందం ఈ ప్రవచన, ప్రభోద కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ బృందంలో ఉన్నది 20 మంది సభ్యులు మాత్రమే. అయితే, ప్రజలను ఏ విధంగా అదుపు చేయాలన్నది వారికి తెలియదు. తొక్కిసలాట లాంటిది జరిగితే ఏం చేయాలన్నది కూడా వారికి ఏమాత్రం తెలియదు. సాధారణంగా ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి ముందుగా సమాచారం అందించిన పాపాన పోలేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ విధంగా తండోపతండాలుగా జనం వస్తారని ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ, చివరికి జిల్లా యంత్రాంగానికి గానీ తెలియదు. అయినప్పటికీ, భోలే బాబా, ఆయన అనుచరులు చేసిన దుష్కృత్యానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తోంది. నిజానికి, ఇంత పెద్ద సంఖ్యలో జనం హాజరయినప్పుడు కేవలం భద్రతా సిబ్బంది ఉన్నంత మాత్రాన సరిపోదు. జనం క్యూలలో వచ్చేలా చేయడం, లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి పద్ధతులను పాటించడం, అత్యవసర సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటి వన్నీ అవసరమవుతాయి. అక్కడ అటువంటివేవీ ఏర్పాటు కాలేదు.
అవగాహనా రాహిత్యం
హత్రాస్‌ దుర్ఘటన తర్వాత ముంబైలో క్రికెట్‌ విజయాన్ని పురస్కరించుకుని అతి పెద్ద అభినందన సభ జరిగింది. ఈ సభకు సుమారు 3 లక్షల మంది హాజరయ్యారు. సభంతా ప్రశాంతంగా, ఒక క్రమశిక్షణతో సాగిపోయింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనా చోటు చేసుకోలేదు. భోలే బాబా తన ప్రవచనాన్ని పూర్తి చేసుకుని నిష్క్రమించగానే తొక్కిసలాట ప్రారంభం అయింది. భోలే బాబా నడిచిన ప్రదేశం నుంచి మట్టిని సేకరించి బొట్టు పెట్టుకోవడానికి జనం ఎగబడడంతో తొక్కిసలాట మొదలైంది. మట్టిని సేకరించడానికి కొందరు వంగడంతో ఆ తోపులాటలో ఒకరి మీద ఒకరు పడిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో అనేక ఆశ్రమాలు వద్ద, ఆలయాల వద్ద ఇటువంటి తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. లక్షలాది మంది హాజరయినప్పటికీ, ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగని ప్రవచన కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
అయితే, నమ్మకం లేదా విశ్వాసం అనేది ఈ విధంగా ప్రాణాంతకంగా మారుతుందని ఊహించలేం. ఒక మాజీ కానిస్టేబుల్‌ ధవళ వస్త్రాలు ధరించినంత మాత్రాన ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించ గలడని, వారి జీవితాలను సుఖ సంతోషాలతో ముంచెత్తగలడని ఆశించిడంలో అర్థం లేదు. దీన్ని మూఢ నమ్మకం కూడా పరిగణించలేం. ఇదొక రకమైన నిస్సహాయత. ప్రజలు లేదా భక్తులు వాళ్ల కాళ్ల దగ్గరే చనిపోతున్నా వారేమీ చేయలేకపోవడం, దాన్ని సామాన్య ప్రజానీకం అర్థం చేసుకోలేక పోవడం నిజంగా విచిత్రం. మూఢనమ్మకాల కారణంగా ప్రాణాలు కోల్పోవడానికి, ఇక్కడి సామాజిక వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేకపోవడానికి బాగా సన్నిహిత సంబంధం ఉంది. మన దాకా వచ్చేసరికి సినిమా టికెట్ల కౌంటర్‌ మూతపడినా, మన దాకా వచ్చేసరికి రేషన్‌ షాపును మూసేసినా సగటు భారతీయుడు దాన్ని కర్మఫలంగానే భావిస్తాడు. ఇటువంటి చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడడానికి కూడా సగటు వ్యక్తి ధవళ వస్త్రధారుల్ని, కాషాయ వస్త్రధారుల్నే ఆశ్రయిస్తుంటాడు.
పాలకుల అశ్రద్ధ
ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా ఈ వాస్తవాన్ని మాత్రం తుడిచిపెట్టలేకపోతున్నాయి. ఇది అన్ని మతాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న జరుగుతున్న వ్యవహారమే. విచిత్రంగా భారతదేశ రాజకీయాలు కూడా ఇటువంటి నమ్మకాలు చుట్టూ, ఇటువంటి బాబాల చుట్టూనే తిరుగుతుంటాయి. బీజేపీ ఓటు బ్యాంకంతా దేవుళ్లు, దేవాలయాలనే ఆశ్రయించుకుని ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా మత పరమైన ఓటు బ్యాంకులను సృష్టించుకునే పనిలోనే అహర్నిశలూ నిమగ్నం అయి ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఇటీవల పార్లమెంటులో శివుడి చిత్రపటాన్ని ప్రదర్శించడం కూడా ఈ కారణంగానే జరిగింది. ప్రజలకు తాను శివుడి భక్తుడినని నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకు ఏర్పడింది. ప్రజలకు చేరువ కావాలన్న పక్షంలో తనలో కూడా మూఢ నమ్మకాలున్నాయని ఆయన రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అద్భుతాలను, మహిమలను నమ్మని పక్షంలో రాజకీయ నాయకులను కూడా ప్రజలు నమ్మరు.
ప్రజలకు అద్భుతాల మీదా, మహిమల మీదా, మహత్యాల మీదా నమ్మకం ఎక్కువ. అందుకనే ఆశ్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కిటకిటలాడిపోతుంటాయి. ఇవన్నీ దేశంలో పాలన బలహీన పడుతోందనడానికి, ప్రభుత్వాలు ప్రజలకు అండగా లేవనడానికి ప్రబల నిదర్శనాలు. పాలనా సామర్థ్యం తగ్గిపోతున్న కొద్దీ హత్రాస్‌ వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. హత్రాస్‌ లో ప్రాణాలు కోల్పోయిన తల్లులు స్వర్గంలో స్థానం కోరుకోవడం లేదు. తమ జీవితాలు సవ్యంగా సాగిపోవాలని మాత్రమే వారు ఆశిస్తున్నారు. తమ పిల్లలకు, తమ భర్తలకు కనీస సౌకర్యాలు ఏర్పడాలని వారు భావిస్తున్నారు. కూడు, గూడు, గుడ్డ మాత్రమే వారికి కావాల్సింది. అవి లేనందువల్లే, ఆ మాత్రం సుఖ సంతోషాలకు కూడా మొహం వాచిపోయినందువల్లే వారు భోలే బాబా వంటివారిని ఆశ్రయిస్తున్నారు. నిజానికి అటువంటి వన్నీ ప్రభుత్వాలు వారికి సమకూర్చవలసి ఉంటుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో విఫలం అవుతుండడంతో వారు గత్యంతరంలేక భోలే బాబా వంటి వారిని నమ్ముకోవాల్సి వస్తోంది.
ప్రజలు తమ ప్రాథమిక అవసరాల కోసం, సౌకర్యాల కోసం భగవంతుడిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇటువంటి సాధారణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు నడుం బిగిస్తే భోలే బాబాలూ అవతరించరు. మూఢ నమ్మకాలూ ఉండవు. ప్రజల జీవితాల్లో ఉన్న అనిశ్చిత, సందిగ్ధ పరిస్థితుల వల్లే వారు ఇటువంటి నకిలీ సాధువుల శరణు కోరాల్సి వస్తోంది. ఇదే అనిశ్చిత పరిస్థితిని అవకాశంగా తీసుకుని మోసగాళ్లు, వంచకులు తెల్ల దుస్తులు ధరించి పీఠ మెక్కుతున్నారు. సమాజాలు, ప్రభుత్వాలు విఫలమైనప్పుడే ప్రజలు సంప్రదాయాల వైపు మొగ్గు చూపిస్తుంటారు.

  • కె. రాఘవానంద
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News