Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Starvation deaths: ఆహార సంక్షోభం మానవ సృష్టి

Starvation deaths: ఆహార సంక్షోభం మానవ సృష్టి

ప్రపంచంలో ఆహార సంక్షోభం అనేది నిజానికి లేనేలేదని తాజాగా కుండబద్ధలు కొట్టింది ఐక్యరాజ్య సమితి. యునైటెడ్ నేషనస్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 చెప్పిన లెక్కలు స్పష్టంగా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అంటే ఉన్నవారు తిండి వృథా చేస్తుంటే మరోవైపు ఆకలి చావులు ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగాన్ని మోగిస్తున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ ఆహార సంక్షోభానికి మనమంతా ప్రత్యక్షంగానే కారణం అవుతున్నాం అనేది మానవాళి గ్రహించడం లేదు.

కరువు కాటకాలకు ప్రధాన కారణం అతీవృష్టి లేదా అనావృష్టి. కానీ ఇలాంటి కారణాలు కాకుండానే ప్రపంచంలో ఆహార వృథా కారణంగా కృత్రిమంగా ఆహార సంక్షోభం తలెత్తటం అమానవీయంగా ధ్వనిస్తోంది. కానీ ఈ విషయంపై మనలో ఎంతమంది అవగాహన ఉందనేది ఈ సమస్యకు మూలకారణం, శాశ్వత పరిష్కారం కూడా. అక్షర జ్ఞానం ఉన్నవారైనా, లేనివారైనా ఆహార జ్ఞానం కలిగి ఉంటారు. మరి మనమెందుకు ఈదిశగా ఎవరూ చొరవ చూపటం లేదనే విషయంపై దృష్టి సారించాల్సిన అసలు సమయం వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఒక బిలియన్ మెట్రిక్ టన్ను ఆహారాన్ని వృథా చేస్తున్నారు. అంటే పడేస్తున్నారు. ఇది ఎవరి పొట్టా నింపకపోగా పొట్టలు కాల్చేస్తోంది. అంటే ఏకంగా ప్రపంచంలో పండే మూడవ వంతు ఆహారం మనం కుళ్లబెట్టేందుకు అలా డంప్ చేసేస్తున్నాం. ఆహారం తినేందుకు ఫుడ్ సిస్టం అనేది ఒకటి తెస్తేగానీ దీన్ని అరికట్టలేని పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే పాక్ వంటి పేద దేశాల్లో వన్ డిష్ లా వంటివి కఠినంగా అమల్లో ఉన్నాయి. పంటలు పండి వాటిని ఇంటికి చేర్చుకునేలోగానే 14శాతం ప్రపంచ ఆహారం నాశనం అయిపోతోంది. ఇక రీటైల్ నుంచి వినియోగానికి వచ్చేసరికి మరో 17శాతం ఆహారం ధరలకు రెక్కలు వచ్చేస్తాయి. మరి ఇంతటి ధరల వ్యత్యాసం వస్తుందా అంటే క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువే తేడా వస్తుంది ఈ లెక్కలన్నీ రమారమి లెక్కలని గుర్తుంచుకోండి. ఇక ప్రపంచంలో నిత్యం ఖాళీ కడుపుతోనే పడుకునేవారి సంఖ్య 811 మిలియన్ల మంది. మానవులు ఇంత అభివృద్ధి సాధించి అంతరిక్షంలో ఇళ్లు కట్టుకుని, స్థిరపడే రోజుల్లోనూ ఇంత దరిద్రమా అంటే అదంతే.

2030 కల్లా ప్రపంచ ఆహార వృథాను అరికడదామని ప్రపంచ దేశాలన్నీ ప్రతిజ్ఞ చేసాయి. ఇదంతా 2015లోనే జరిగినా అవన్నీ కాగితాలకే పరిమితం. ఈ ఏడేళ్లలో ప్రపంచ దేశాలు ఆహారాన్ని వృథా కాకుండా కాపాడే మార్గాలు ఏవైనా చిత్తశుద్ధితో అన్వేషించాయా అంటే దానికి జవాబే దొరకదు, నిజంగా ఈ దిశలో అడుగులు వేసిన దేశం ఏదైనా ఉంటేనే కదా. తప్పితే మరో ఏడేళ్లలో ఏ అద్భుతాలు జరిగితే ఆహారం వృథా కాకుండా రక్షించుకుని, అన్నార్థుల కడుపులు నింపగలం? అందుకే మనదేశంలో చిన్నప్పుడే పిల్లలకు కొన్ని సంస్కారాలు నూరిపోస్తారు. అన్నం పరబ్రహ్మం, అన్నం వృథా చేస్తే పాపం వస్తుందనే సెంటిమెంట్లను నుగ్గుపాలలో రంగరించి పోస్తారు. అప్పుడే మనం ప్రతి గింజగింజను జాగ్రత్త చేస్తామని పూర్వీకుల ఆలోచన.
నాగరికత పెరిగేకొద్దీ ఎదుటివారి ఆకలి, కష్టాలు గుర్తించి సాయం చేసే సంస్కారం మాయం అవుతోంది. దీనికి నిలువెత్తు ఉదాహరణ ఒకటి ఉంది. ఇలా అత్యధికంగా ఆహారం వృథా చేస్తున్నదే అగ్రరాజ్యంగా చెలామణి అయ్యే అమెరికాలో. అవును ఈ జాబితాలో అమెరికా నంబర్ 1 స్థానంలో నిలిచింది. తలసరి ఆహార వృథా విషయంలో ప్రపంచంలో అమెరికన్ల తరువాతే ఎవరైనా. ఇక ఆహార వృథాలో ప్రపంచ దేశాల్లో రెండవ స్థానంలో నిలిచంది ఆస్ట్రేలియా. మూడవ స్థానంలో న్యూజిలాండ్ కాగా తరువాతి స్థానాలు ఐర్లండ్, కెనడాలుగా ఉన్నాయి.

బఫే కల్చర్ కారణంగా అమెరికా వంటి దేశాల్లో నిత్యం టన్నులకొద్దీ ఆహారం నేలపాలవుతోంది. పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీల పేరుతో ఇదే పని రోజూ యూఎస్ లో జరుగుతుందంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఇంకెంత ఆహార వృథా వివిధ దశల్లో జరుగుతుందో లెక్కించండి. ఇది మనందరి కనీస బాధ్యత. ఆహారం వృథా కారాదన్న స్పృహ వచ్చిన సమాజంలో ఆకలి చావులు ఉండవు, ఆహార భద్రత ఉన్న ప్రాంతం సుభిక్షంగా అలరారుతుంది. ఇదంతా గుర్తించిన భారత ప్రభుత్వం కరోనా సంక్షోభ సమయంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తోంది. 2023 చివరి వరకు ఈ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగనుంది. ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా ఉన్న భారత్ లో పేదలకు ఇలా ఉచితంగా ధాన్యం పంపిణీ జరుగుతోందంటే మనదేశం నిజంగానే అన్నపూర్ణ అని పశ్చిమ దేశాలు కొనియాడుతున్నాయి.

గ్లోబల్ గా ఆర్థికంగా ఉన్నవాళ్లు, లేనివాళ్ల మధ్య వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధనికులు మరింత ఆగర్భ శ్రీమంతులుగా ఎదుగుతుంటే మరోవైపు పేదలు కడుపేదలుగా మారిపోతున్నారని గ్లోబల్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు రూపు మాపుతామంటూ ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మళ్లీ ఇదే ఆర్థిక అసమానతలను పెంచి పోషిస్తున్నాయి. ఇదో గ్లోబల్ ఫినామినాగా ఎప్పుడో మారిపోయింది.

ఆహార ధాన్యాలను వృథాగా పోనివ్వకపోతే ప్రపంచంలో ఆకలి చావులే ఉండవని గ్లోబల్ హంగర్ అండ్ గ్లోబల్ ఫుడ్ వేస్ట్, UNEP రిపోర్టులు స్పష్టంచేస్తున్నాయి. ప్రపంచంలో మానవాళికి అవసరమైనంత ఆహారం లక్షణంగా పండుతోంది కానీ అది దాచుకోవటం, పంచటం, అందరికీ చేర్చటంలో వివక్ష, అసమానతలు, నిర్లక్ష్యం, బ్లాక్ మార్కెటింగ్, ప్రకృతి విపత్తులు నాశనం చేయటం వంటివి జరుగుతున్నాయి.
మనదేశంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ సంగతే తీసుకుంటే ఏటా వివిధ ధాన్యం లక్షల కోట్ల టన్నులు అలా పందులు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులపాలై వృథా అవుతోంది. ఇదేకాకుండా ఎఫ్సీఐ గోడౌన్లలో పురుగుపట్టిన, మొలకలు వచ్చి, బూజు పట్టి నాశనం అయ్యే ధాన్యం విలువ అంచనా కూడా వేయలేం. సరైన మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఆహార భద్రత, ప్రభుత్వ విధానాలు, రవాణా, గోడౌన్ వంటి ఎన్నో అంశాలు ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. పలు దశల్లో వ్యవసాయ ఉత్పత్తులను మనం భద్రం చేసుకోకపోతే ఆ ఉత్పత్తి మొత్తం సర్వనాశనం అయిపోతుంది.

మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఇలా ఆహారం వృథా చేయటం వల్ల్ ఆకలి చావులు పెరగటమే కాదు వాతావరణ సమతౌల్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఆహార వృథా వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తి 8-10శాతం మేర పెరుగుతుంది. గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏటా పెరుగుతున్నది అందుకే. అదే మనం ఆహారం వృథా కాకుండా చూసుకుంటే పర్యావరణం భద్రంగా ఉంటుంది. ఆహార భద్రతతోనే, వాతావరణ భద్రత కూడా పెనవేసుకుని ఉందన్నమాట. సుస్థిర అభివృద్ధికి సోపానమే ఆహార సంక్షోభం, ఆహార వృథాకు చెక్ పెట్టడం మొదలవుతుంది. ప్రతి ఒక్కరం మనం తింటున్న కంచం ఖాళీ అయ్యేలా కాకుండా కాస్త ఆహారం వదిలి పెట్టకూడదు. అంతేకాదు వండుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువగా వండకుండా మితంగా వండుకుని, మితంగా తిని, వృథా లేకుండా చూసుకుంటే క్షామాలు అస్సలు మానవాళి దరిచేరవు. ఇదే విషయంపై ప్రపంచ జనాభాకు అవగాహన కల్పించేందుకు థింక్ ఈట్ సేవ్ అంటూ 2013 నుంచి UNEP ప్రచారం చేస్తోంది. కొత్త వంగడాలు సృష్టించి, జన్యు పరివర్తన చేసిన ఆహారం తో ఆహార సంక్షోభాన్ని అరికట్టడం బదులు ఆహార వృథాను అరికడితే చాలని ఎందరో మేధావులు ఎప్పటినుంచో చెబుతున్నా దీన్ని తూ.చ. పాటించే దేశాలే లేవు. కమ్యూనిటీ ఫ్రిజ్జులు,
రోటీ బ్యాంక్, ఫుడ్ బ్యాంక్, ఎనీ టైం ఫుడ్, ఫుడ్ ఏటీఎం ఇలా పలు పేర్లతో జరుగుతున్నదంతా సోషల్ మీడియా హైప్ గానే మిగిలిపోతోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, వెస్ట్ ఏషియా, ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లో UNEP ఆధ్వర్యంలో రీజనల్ ఫుడ్ వేస్ట్ వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా ఆహారం ఎక్కడ వృథా అవుతోందో, దాన్ని ఎలా ముందే అరికట్టవచ్చో వీరు కనిబెట్టి, పరిష్కారాలను అమలు చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News