ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినప్పుడే పాలకుల్లో లేదా అధికారుల్లో కదలిక వస్తుంది. ఆ విద్యార్థికి చెందిన విద్యాసంస్థలోని కార్యకలాపాలపై విచారణ జరుగుతుంది. పాలక, స్రతిపక్ష నేతల్లో హడావిడి, హంగామా కనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అంతా మామూలే. నిజానికి, దేశంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్యను గమనించినా, వారు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణాలను పరిశీలించినా తీవ్రంగా ఆందోళన కలుగుతుంది. 2014-21 మధ్య కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇతర కేంద్ర విద్యాసంస్థలతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్య చేసుకున్న వందలాది మంది విద్యార్థులలో 58 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుక బడిన తరగతులకు చెందిన విద్యార్థులే కావడం గమనించాల్సిన విషయం. ముంబైలో ఇటీవల ఒక దళిత ఐఐటివిద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక చోట తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, విద్యాసంస్థలు విద్యా ర్థుల పురోగతికి, మానసిక పరిపక్వతకు ఉపయోగపడాలే తప్ప వారిని ఆత్మహత్య లకు, కష్టనష్టాలకు పురిగొల్పకూడదని వ్యాఖ్యానించారు. ముంబై ఐ.ఐ.టిలో విద్యా ర్థులు ఆత్మహత్య చేసుకోవడమనేది దాదాపు నిత్యకృత్యమైపోయింది. ఇటీవల ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైంది.
ఈ విధంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీస్తున్న కారణాలు సామాజికంగా లోతైన మూలాలు కలిగి ఉన్నాయనిపిస్తుంది. తమ విద్యాసంస్థల్లో విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేయడం గానీ, వారిపట్ల వివక్ష చూపించడం కానీ జరగడం లేదంటూ విద్యాసంస్థలు ఖండన మండనలు జారీ చేయడం సాధారణమైపోయింది కానీ, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీస్తున్న పరిస్థితులను మాత్రం విద్యాసంస్థలు నిర్వాహకులు, యాజమాన్యాలు అర్థం చేసుకుంటున్నట్టు కనిపించడం లేదు. వివక్ష అనే పదానికి సరైన నిర్వచనాన్ని కనిపెట్టడం సాధ్యమయ్యే పని కాదు. విద్యాసంస్థల్లో బడుగు వర్గాల విద్యార్థులకు ‘కోటా విద్యార్థులు’ అనే పేరుంది. వారు ఈ రకమైన చదువులు చదవడానికి ‘అన ర్హులు’ అనే అభిప్రాయం కూడా బలపడి ఉంది. విద్యార్థుల మార్కులను బట్టి హాస్టళ్లను కేటాయించాలే తప్ప, వారి కుల, మతాల ఆధారంగా కేటాయించడం, ఆ వివరాలను గది బయట డిస్‌ప్లే చేయడం మంచిది కాదని ప్రధాన న్యాయమూర్తి సూచించాల్సి వచ్చిందంటే, సమస్య మూలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి కొన్ని కారణాలు, నిబంధనలు కూడా వివక్షకు కారణమవుతున్నాయి.
విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో భాషా సంబంధమైన నైపుణ్యాలు, సామాజిక సంబంధమైన ఆత్మవిశ్వాసాలు, ఆ విద్య చదవడానికి ఉండాల్సిన అర్హతులు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. చదువు తర్వాత సంపాదించుకునే ఉద్యోగాల కోసం ఇచ్చే శిక్షణలో కొన్ని రకాల వివక్షలు బయటపడుతుంటాయి. సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇటువంటి అర్హతలను, నైపుణ్యాలను ఎదు ర్కోవడం కష్టసాధ్యమైన విషయంగా మారుతుంటుంది. ఫలితంగా విద్యార్థుల మీద స్పష్టంగా తేడాలు కనిపిస్తుంటాయి. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రస్తుత స్థాయికి రావడానికి ఎంత కష్టనష్టాలను అనుభవించిందీ, ఎన్ని ఆటంకాలను, అవ రోధాలను అధిగమించిందీ ఇతర విద్యార్థులకు ఒక పట్టాన అర్థం కాదు. ఇటువంటి వివక్షలన్నిటికీ గమనించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఇటువంటి విద్యార్థుల వ్యక్తిగత రూపలావణ్యాల మీద వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను చేయడాన్ని కఠినంగా నిరోధించాలని, వారి శక్తియుక్తులను, ప్రతిభా పాటవాలను శంకించడం కూడా మానుకోవాలని ఆయన సూచించారు.
అంతేకాక, నిమ్న వర్గాలకు చెందిన విద్యార్థులను మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, వారిలోని ఆత్మన్యూనతా భావాన్ని, అభ్రదతా భావాన్ని తొలగిం చడానికి విద్యాసంస్థలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉందని కూడా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. సున్నితమైన మనసు కలిగిన విద్యార్థుల పట్ల అధ్యాప కులు తల్లితండ్రుల్లా వ్యవహరిస్తే తప్ప ఆ ఆత్మహత్యా ధోరణులకు కళ్లెం వేయడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. చదువుల్లో ఘన విజయాలు సాధించినంత మాత్రాన విద్యలో పరిపూర్ణులు అయినట్టు కాదని, విద్యార్థులు దయాదాక్షిణ్యాలను, సానుభూతిని అలవరచుకున్నప్పుడే విద్య పూర్తయినట్టుగా భావించాలనికూడా ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆలోచనా ధోరణిని మార్చడానికి అధ్యాపకులు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన అన్నారు. కులపరంగా, జాతిపరంగా వివక్షా ధోరణులు వ్యక్తమైనప్పుడు అధ్యాపకులు వెంటనే రంగంలోకి దిగి ఈ ధోరణు లను అడ్డుకోవడమే కాకుండా, సంబంధిత విద్యార్థులను కఠినంగా శిక్షించాలని, విద్యాసంస్థల్లో అన్ని రకాల విద్యార్థులకు భాగస్వామ్యం ఉండేటట్టు చూడాలని ఆయన సూచించారు. సమానత్వం గురించి ఉపదేశించడం, ప్రసంగాలు చేయడం కాకుండా, అనుభవించి, ఆచరించి విద్యార్థుల మనసుల్లో అది నాటుకునేలా చేయా లని ఆయన కోరారు.