Monday, September 16, 2024
Homeఓపన్ పేజ్Students suicide on rise: ఆందోళన పెంచుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

Students suicide on rise: ఆందోళన పెంచుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాగా పెరుగుతున్నాయనే వార్తలు విన వస్తున్నాయి. దేశ భవిష్యత్తుకు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ధోరణి చాలా అవసరమైనందువల్ల విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రైతులు, చేనేత కార్మికులు, సాధారణ ప్రజానీకం ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నట్టు అధ్యయ నాలు తెలియజేస్తున్నాయి. జనాభా పెరుగుదల శాతం కంటే కూడా ఇవి ఎక్కువగా ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘ఐ.సి 3 వార్షిక సమావేశం, ఎక్స్‌ పో’ కార్య క్రమంలో ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో పొందుపరచిన అంశాలన్నీ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ క్రైమ్‌ రికార్డ్‌ నుంచి తీసుకున్నవే. ఈ నివేదిక ప్రకారం, దేశంలో విద్యార్థులు ఆత్మహత్యలు ఏటా నాలుగు శాతం చొప్పున పెరుగుతున్నాయి.
ఇతరత్రా జనాభాలో పెరుగుతున్న ఆత్మహత్యలు రెండు శాతం మాత్రమే. ఆత్మహత్యలు చేసుకున్న మొత్తం విద్యార్థు లలో బాలుర సంఖ్య 53 శాతం కాగా బాలికల సంఖ్య 7 శాతం. ఇవి గత ఏడాదికి సంబంధించిన గణాంకాలు. వివిధ కారణాల వల్ల అధికారికంగా వివరాలు వెల్లడి కాకపోవచ్చు కానీ, అనధికార ఆత్మహత్యల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థుల్లో భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన కాస్తంత ఎక్కువగా ఉంటుంది. 2019-23 సంవత్సరాల మధ్య ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో 63 శాతం ఐ.ఐ.టి విద్యార్థులు కావడం గమనించాల్సిన విషయం. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమనేది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి, విద్యార్థి దశలో ఒక్క చదువుల సమస్య, ర్యాంకుల సమస్య తప్ప వారికి వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమనేది ఒక సామాజిక సమస్యగా భావించవచ్చు. ఒకప్పుడు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడమనేది చాలా అరుదుగా, చెదురు మదురుగా జరుగుతుండేవి. ఇప్పుడు దాదాపు నిత్యకృత్యం అయిపోయాయి. దిగ్బ్రాంతికరమైన విషయమేమిటంటే, ఇంకా యుక్త వయసులోకి రాని విద్యార్థులు, చిన్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతోంది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ క్రైమ్‌ రికారడ్స్‌ ప్రకారం, దేశంలో ఏటా 13 వేల మంది బాల బాలికలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం వంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో చదువుల భారం, అధ్యాపకుల ఒత్తిడి, వేధింపుల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయని అర్థమవుతోంది. అనేక విద్యాసంస్థలు ర్యాంకులు, మార్కులకు ఇస్తున్నంత ప్రాధాన్యం విద్యార్థుల సంక్షేమానికి ఇస్తున్నట్టు కనిపించడం లేదు. వారి మానసిక, శారీరక ఒత్తిడిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
రాజస్థాన్‌ లోని కోటాలో ఉన్న కోచింగ్‌ సెంటర్లు పూర్తిగా ఆత్మహత్యలకు మారుపేరుగా గుర్తింపు పొందాయి. గత ఏడాది మే నెలలో హైదరాబాద్‌ నగరంలో అయిదు మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు, నిజామాబాద్‌ లో ఒక విద్యార్థి ఒకే రోజున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్‌ లో ఫెయిల్‌ అయిన కారణంపై ఈ టీనేజ్‌ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత ఏడాది జూన్‌ లో బాసరలో కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజానికి, ఒక్కోసారి ఇదమిత్థంగా కారణం చెప్పలేని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. సోషల్‌ మీడియా, తోటివారి ప్రభావం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. సరిగ్గా చదవడం లేదనో, సెల్‌ ఫోన్లతో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారనో పెద్దలు మందలించినప్పుడు కూడా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. ఆధునిక యువ తరం మానసికంగా బలహీనంగా తయారవుతోందా? వీరిని సోషల్‌ మీడియా బలహీనంగా మారుస్తోందా? పిల్లలకు వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని తల్లితండ్రులే కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, దానికి ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదని తల్లితండ్రులు పిల్లలకు నూరిపోయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News