Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Suddala Hanumanthu death anniversary: ప్రజల పాటల పొద్దు పొడుపు

Suddala Hanumanthu death anniversary: ప్రజల పాటల పొద్దు పొడుపు

ప్రజల నాలుకలపై నాట్యమాడే సుద్దాల ఆటలు, మాటలు, పాటలు

ప్రజాచైతన్యం కోసం పాటలు రాసిన కవిగా, ప్రత్యక్ష పోరాటయోధునిగా సాహసంతో కూడిన సాహిత్య ప్రస్థానాన్ని చేసిన అగ్నికణం సుద్దాల హనుమంతు. పాటలలో పదునుతో నిజాం, భూ స్వాములకు వ్యతిరేకంగా కలాన్ని కదిపి అక్షరాల అగ్నివర్షం కురిపించిన యోధుడు. దొరల గుండెల్లో ఆయన పాటలు తూటాల్లా పేలాయి. బుర్ర కథలు, హరికథలు, యక్ష గానాలు, గొల్ల సుద్దాలు ఇలా అనేక ప్రక్రియ లలో ప్రజల వాడుక భాషను వినియోగించుకుని గుండెకు చేరువయ్యే బాణీలతో భావావేశాన్ని రగిల్చిన సమరశీల యోధుడు హనుమంతు. నిజాంకు వ్యతిరేకంగా అమరుల స్మృతిపథంలో, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంగా, ఆంధ్రమహాసభ ఆవశ్యకత అన్న అనేక వస్తువులతో ఆయన పాటలు పుట్టాయి. రజాకార్లకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించి ప్రజలను యుద్ధం వైపు నడిపించాడు. వెయ్‌ వెయ్‌ వేతురా దెబ్బ… దెబ్బకు దెబ్బ వెయ్‌ వెయ్‌ అంటూ ప్రజలకు పాటతో పిలుపునిచ్చి ధైర్యాన్ని నూరిపోసిన హనుమంతు తన లక్ష్యం కోసం తెగించి పోరాడిన వ్యక్తి.
రామన్నపేట తాలుకా పాలడుగు గ్రామంలో 6 జూన్‌ 1910లో లక్ష్మీనర్సమ్మ, బుచ్చిరాములు దంపతులకు జన్మించిన హనుమంతు తాత హరికథలు చెప్పే మంచి కళాకారుడు. చిన్ననాటి నుండి తమ గ్రామంలో నాటకాలను చూస్తూ వైద్యుడైన తన తండ్రికి హనుమంతు సహాయకుడిగా ఉండేవాడు. నాటకాలపై మక్కువతో హనుమంతు పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలు వేసి మెప్పించాడు. శతకాలు, సీస కంద పద్యాలు, కీర్తనలు చిన్ననాడే కంఠస్థం చేసి యక్షగానాలపై హనుమంతు పట్టుపెంచుకున్నాడు. ఉత్పల వెంకటరావు సహచర్యంలో ఆర్యసమాజం ఆశయాల పట్ల ఆకర్షితుడై వితంతు పునర్వివాహాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో హనుమంతు పాల్గొన్నాడు. పొట్టకూటి కోసం హైద్రాబాదు వలస వచ్చాక హిమాయత్‌సాగర్‌లోని వృక్ష శాఖకు చెందిన కార్యాలయంలో అటెండర్‌ గా ఉద్యోగంలో చేరి అక్కడ మహ్మదీయ అధికారుల జులం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఉద్యోగాన్ని వదిలేసి సామాజిక చైతన్య పోరాటంలో నిమగ్నమయ్యాడు. 1943 లో హైద్రాబాదు ఆంధ్రమహాసభల్లో పాల్గొన్నాడు. జానకమ్మతో జీవితాన్ని పంచుకున్నాడు.
భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ (1947)లో వాలంటీర్‌గా పాల్గొని రావి నారాయణరెడ్డి ఉపన్యాసంతో ప్రేరణ పొంది కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొంది ఉత్తమ కమ్యూనిస్టుగా చివరి వరకు పార్టీ ఆశయాల సాదన కోసం పనిచేశాడు. కళా రూపాలను ప్రజాచైతన్యానికి ప్రతిరూపాలుగా మలచిన హనుమంతు సంఘం వచ్చిందిరో రైతన్న – మనకు బలం చాలా తెచ్చిందిరో కూలన్న అని సంఘం వల్ల జరిగిన మేలేమిటో వివరించాడు.
పల్లెటూరి పిల్లగాడ పసులు గాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళైందో అంటూ ప్రజల నాలుకల మీద నాట్యమాడే అనేక పాటలు రాశాడు. ప్రజల జీవితాలను కళ్ళకు కట్టేలా పాటలను మలిచాడు. ప్రజల విముక్తి కోసం పాటను ఆయుధంగా మలచుకున్న హనుమంతు బాణీలలో పల్లెతనం ప్రజ్వరిల్లింది. ఆవేదనలోంచి పుట్టి జనం గుండెల్లో హనుమంతు పాట నిలిచింది. లేరాలేరా వేగమే రైతుకూలీ అంటూ పాటలతో పిలుపునిస్తూ చైతన్యదారులను నిబద్ధతతో చూపించి మార్గదర్శిగా ఆయన నిలిచాడు. హేతువాదిగా పేరొందాడు.
ప్రతి పాటలో తన ప్రత్యేక ముద్ర కలిగిన హనుమంతు భూస్వాముల ఆగడాలను ఎదిరించి ఇబ్బందులకు గురైనా వెనుకంజ వేయలేదు. తన గ్రామంలో భూస్వాముల వల్ల ఇబ్బందులకు గురైన హనుమంతు తరువాతి కాలంలో అదే గ్రామానికి కమ్యూనిస్టు పార్టీ నుండి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందాడు.
ప్రజా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం సాధిస్తాం.. నిజాములో ప్రతి బజారులో మాధ్వజం ఎర్రనిది ఎగరేస్తాం అని ఘంటాపథంగా హనుమంతు ప్రకటిస్తాడు. చదివింది రెండో ఫారమైనా జన క్షేత్రంలో అపారమైన జ్ఞాన సంపదను పొందిన దార్శనికుడు. 10 అక్టోబరు 1982న ఆయన కన్నుమూశాడు. 1944 నుండి 1952 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను పట్టి, మరో చేత్తో గన్ను పట్టి తన మాట, ఆట, పాటలతో కదను తొక్కిన ఉద్యమజీవి హనుమంతు. ప్రజల ఆర్తనాదాలు, ఆంతరంగిక ఆవేదనలే హనుమంతు గళం నుండి పాటలుగా పెల్లుబికాయి. బడుగు జనం కోసం పాటను ఆయుధంగా మలచిన అసాధారణ ప్రజాకవి, తొలితరం తెలంగాణ వాగ్గేయ కారుడు, ప్రజల పాటల పాఠశాల సుద్దాల హనుమంతు.
హనుమంతు పేరిట జాతీయ పురస్కారం
ప్రజాకవి సుద్దాల హనుమంతు పేరిట ఆయన కుమారుడు, ప్రఖ్యాత సినీగేయ కవి డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ, వారి కుటుంబ సభ్యులు సుద్దాల హనుమంతు – జానకమ్మ జానపద కళాపీఠం ద్వారా 2010 నుండి జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2023 సంవత్సరానికి గాను ఈ జాతీయ పురస్కారాన్ని అరుణోదయ విమలక్క అందుకోనున్నారు. గతంలో ప్రముఖ సినీ దర్శక నిర్మాత బి నరసింగరావు (2010), ప్రజా యుద్ధనౌక గద్దర్‌ (2011), ఛత్తీస్‌ఘ్‌డ పాండ్వాగాయని పద్మభూషణ్‌ డాక్టర్‌ తీజన్‌ బాయి (2012), కెన్యా దేశపు రచయిత ప్రొఫెసర్‌ ఎన్‌గూగి వాధియాంగో (2013), కవయిత్రి కుమారి సిరిసిల్ల రాజేశ్వరి (2014), ప్రజాకవి గూడ అంజయ్య (2015), ప్రజాకవి వంగపండు ప్రసాద రావు (2016), గోరటి వెంకన్న (2017) , జయరాజ్‌ (2018), ఆర్‌ నారాయణమూర్తి (2019), లోక కవి డాక్టర్‌ అందెశ్రీ (2022) అందుకున్నారు.

- Advertisement -
  • డా. తిరునగరి శ్రీనివాస్‌
    8466053933

(నేడు ప్రజాకవి సుద్దాల హనుమంతు వర్ధంతి…)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News