అనగనగా ఓ పల్లెటూరు (మామూలేకదా) ఆ ఉళ్ళో ఒక నిరుపేద దళిత రైతు కూలీ వంగయ్య (పేరు భలే ఉందికదా). ఎండాకాలం, పైగా లాక్ డౌన్ పనీ పాటా లేకపాయే నాలుగు రూపాయలకు దగ్గరి దారి కనిపించలేదు వంగయ్యకు, ఇంతలో తనలాగే డబ్బుల కోసం దగ్గరిదారి వెతుకుతున్న దానయ్య కనిపించాడు, ఓ దిక్కుమాలిన సలహా కూడా ఇచ్చాడు. ఎండాకాలం నీటి కోసం వన్యప్రాణులు (అదేనండీ జింకలు, దుప్పులు లాం టివి) ఊరి చివర పొలాల దగ్గరికి వస్తుంటాయి, కోతలు అయిపోయాయి రైతులెవరూ అటువైపు రారు, కరెంటు వైరుతో ఉచ్చు బిగిస్తే అవి చనిపోతాయి అమ్ముకుంటే బోలెడు డబ్బు (లక్షల్లో మాత్రం కాదులెండి) వస్తుంది, ఇదీ ఆ సలహా సారాంశం. ఆలస్యం చేయకుండా మన వంగయ్య, దానయ్యతో కలిసి ఓ కిలోవైరు తెచ్చుకుని కోసిన పొలాల గట్లమీద పాతి కరెంటు కనెక్షన్ ఇచ్చిండు.
కట్ చేస్తే, ఈ విషయం అక్కడి పోలీసులకు తెలిసింది, ఇంకేముంది వంగయ్య, దానయ్యలు కరెంటు వైరుతో సహా పోలీసుస్టేషన్‌లో వచ్చి పడ్డారు. వన్యప్రాణుల సంరక్షణా చట్టం ఎంత కఠినమైనదో సీనిమా తీసి మరీ చూపించారు పోలీసులు, మనోల్ల బుర్రలకి ఎక్కితేకదా (చదువా పాడా). అలాకాదని తమ భాషలో రెండు రాత్రులు కోటింగు ఇచ్చారు. అయితే మాత్రం మన వంగయ్య చలిస్తాడా (చలించడానికి ఏమున్నది గనుక, ఇంటివెనుక 10 గుంటల భూమి తప్ప). అయితే మాత్రం పోలీసులు అంత సులువుగా వదిలిపెడతారా ఏందీ, బేతాళ కథలో భుతాల్లాగా పట్టుకున్నారు. అన్నట్లు చెప్పడం మరిచిపోయా, స్టేషన్‌కు వచ్చేటప్పుడు వంగయ్య తన బిడ్డ చున్నీ తనతో పాటు తెచ్చుకున్నాడు. ఎందుకంటారా గీ దినాల్లో మాస్కు లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు కదా (మాస్కు పెట్టుకొని పెద్దాయనకు కూడా వేస్తారా అనిమాత్రం అడక్కండి), మనోడికి తిండికే టికానా లేకపాయే మరి మాస్కు ఎక్కడి నుండి తెచ్చుకుంటాడు అందుకే బిడ్డ చున్నీ మాస్కు లెక్క చుట్టుకున్నాదన్న మాట (అన్నట్లు గీ మద్య మోదీ సారు గూడా గట్లనే చుట్టుకుంటున్నాడట కదా!). గదేదో సీనిమాలో జగపతి బాబు చెప్పినట్లు గీ పాయింటు గదే చున్నీ విషయం గుర్తుపెట్టుకొండ్రి, ఆనంక మాట్లాడుకుందాం.
ఇక్కడ అందరికీ ఒక అనుమానం రావాలి కదా! గదే కరెంటు వైరుతో వంగయ్య, దానయ్యలు నేరానికి ప్రయత్నిస్తూ ( రెడ్ హాండెడ్ దొరికిపోయారు కదా, జంతువులైతే చనిపోలేదు (మొదటిరోజే దొరికిండ్రు మరి) చట్టంలో చెప్పి నట్లు పట్టుకున్న 24 గంటలల్ల కోర్టుకు పంపితే సరిపోదా! ఇన్నేసి రోజులు స్టేషన్ల ఉంచుకోనుడు దేనికి, ఉతుకుడు దేనికి? శిక్షలేసేది కోర్టులు కాదా?. ఇగ్గో అసలు కిటుకు ఇక్కడ్నే ఉన్నది. అక్కడ ఊల్లలో వంగయ్య, దానయ్య మల్లెనేగా పోలీసు స్టేషన్‌లో గూడా పైసలు అవసరం పడ్డోల్లు ఉంటారన్నమాట. గిసొంటోల్లను నాలుగు ఉతికితేనే గాని పైసలు రాలవు. సరేగాని కథలోకి వద్దాం. రోజులు గడిసిపోబట్టే. దానయ్య తాలు, తౌడు లేనోడు, గా విషయం మొదటి దినమే అర్థమైంది, అందుకే వాడినో మూలకు కూసోవెట్టిండ్రు, పదిగుంటల ఆసామి వంగయ్యను జలగ లెక్క పట్టుకున్నరు.
వంగయ్య కండ్లముందు పెండ్లీడుకొచ్చిన బిడ్డ కనబడ్డది. చేతికందిన కొడుకు, భార్య పిలిచినట్లు అనిపించింది. ఉన్న పది గుంటలు ఖతం చేసి మమ్మల్ని రోడ్డుమీద నిలబెడతావా అని పెండ్లాం పిల్లలు అడిగినట్లు ఆలాపన. చచ్చిపోయిన రైతుకు ఐదు లక్షలిస్తామన్న పెద్దాయన మాటలు గుర్తుకోచ్చినై. అంతే మరో ఆలోచన లేకుండా స్టేషన్ బాత్రూం లోపలికి ఎల్లిండు. చుట్టూ చూసిండు, ఏమీ కనిపించలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది వంగయ్యకు అదే ఇందాక చున్నీ విషయం గుర్తుంచుకోమని చెప్పిన కదా గదే విషయం గుర్తొచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ చేతులు ప్రేమతో మెడచుట్టూ అలుముకున్నట్లు చున్నీని మెడచుట్టూ చుట్టుకుని ఉరిపోసుకున్నాడు. బక్కపాన మేమో వాళ్లు వీళ్ళు వచ్చేసరికే గుస్సుమన్నది. వంగయ్య చూపులు నిర్జీవమయ్యాయి.
నా కర్థమయ్యింది మీరేమాలోచిస్తున్నారో, పోలీసులు చిక్కుల్లో పడ్డారు, వాళ్ళ మీద కేసులయినాయి, ఉద్యోగాలు ఊడిపోయినాయి, జైలుకేల్లిండ్రు, జనాలు కొవ్వొత్తులతో వంగయ్యకు నివాళులు అర్పిస్తున్నారు గిదే కదా మీరనుకుంటున్నారు. ఇగో అసలు కథ గిప్పుడే మొదలైంది. జిల్లాలో ఏడేడనో ఉన్న పోలీసు బాసులందరూ దిగిపోయిండ్రు. అధికార పార్టీ నాయకుడైతే ముందే వచ్చిండు. అమీనుసా బును చెడామడా తిట్టిండ్రు (గా మాత్రమైనా తిట్టాలి కదా, లేకపోతే జనమేమనుకుంటారు). సర్పంచును, చిన్నా చితకా లీడర్లను పిలిపించుకున్నారు. ఇంతలోనే వంగయ్య భార్యా పిల్లలు వచ్చిండ్రు. స్టేషన్‌కు పిలవంగానే గిట్లా సచ్చి పోయేట్లైతే మేమెట్లా నౌకరిజేసుడంటూ దీర్ఘాలు తీసిండ్రు పోలీసులు. సర్పంచును కుర్చీలో కూసోబెట్టిండ్రు (పెద్ద సారు ముందు కూసునుడంటే మాటలా). పోయినోడైతే తిరిగి రాడు అంటూ మొదలు పెట్టిండ్రు. అక్షరజ్ఞానం లేని వంగయ్య భార్య దిక్కులు చూసింది, పిల్లలు సరే సరి వాళ్లకు ఏం జరుగుతున్నదో కూడా అర్థం కాలేదు. చివరికి ఏదైతేనేం బేరం కుదిరింది. వంగయ్య బిడ్డ పెండ్లికి ఐదు లక్షలు ఇచ్చుడు, కొడుక్కు ఔటుసోర్సింగ్‌లో నౌకరు ఇప్పించుడు, గవర్నమెంటు ఇచ్చే ఇన్సూరెన్స్ సొమ్ములు వంగయ్య భార్యకు చెల్లుతాయి. ఎట్లైతేనేం జీవితకాలంలో వంగయ్య చేయలేని పని వంగయ్య శవం చేసింది.
నిర్జీవంగా పడివున్న వంగయ్య శవం మీద తన చున్నీని చూసింది వంగయ్య కూతురు. నవ్వుతారేమో బాపూ అంటే ఏంకాదు బిడ్డా అనుకుంటూ తీసుకుపోయిండు పిచ్చిమారాజు. నీ మెడలోని ఉరితాడు నా మెడలో పసుపు తాడు అయ్యింది బాపు అనుకుంది మనసులో. చెంపల మీదుగా కన్నీరు కారుతుంటే తండ్రి శవం పక్కనుండి కదిలిపోయింది మౌనంగా. శరీరమైతే కదిలింది కాని తన మనసు చుట్టూ ఎన్నెన్నో సందేహాలు చుట్టుకునే ఉన్నాయి. పోలీసులెందుకలా బండబారి ఉన్నారు. నేను పోలీసునైతే సమాజానికి అండగా నిలుస్తాను, అక్రమార్కుల గుండెల్లో నిదురపోతాను, అంటూ కలలు కంటున్న యువతీ యువకులు ఒక్కసారి ఒంటిమీదకు యూనిఫాం రాగానే లంచ గొండులుగా, కర్కోటకులుగా ఎందుకు మారుతున్నారు? ఆ ఉత్సాహం, ఆ ఆవేశం, ఆ ఆశయాలు ఏమైపోతున్నాయి? వ్యవస్తలో మార్పులు తెస్తాం, పరిపాలిస్తాం, నూతన దారులు నిర్మిస్తామంటూ ఉరకలెత్తుతున్న నాయక గణం ఎందుకు నోరెత్తడంలేదు? భుజం మీద అధికారుల చేయి పడగానే ఎందుకు జావగారిపోతున్నారు? ముందు వరుసలో నిలుచుని బేరసారాలెందుకు చేస్తున్నారు? మేము నాల్గవ ఎస్టేటు, ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళం, కాపలా కుక్కలం అంటూ ఎలుగెత్తుతున్న పత్రికా మిత్రులు వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చే దిశలో స్వతంత్ర విచారణ ఎందుకు చేయడం లేదు? అధికారులు చెప్పింది వ్రాసుకోవడమేనా వారి విధి? కోళ్ళ గుంపులో నుండి ఒక కోడిని ఎవరైనా దొంగిలిస్తే మిగతా కోళ్ళు అరిచి గోలపెడతాయి. మేకల గుంపులో నుండి ఒక గొర్రెను ఎవరైనా బయటికి తీస్తే అరుచుకుంటూ అటూ ఇటూ పరుగులు తీస్తాయి. అటువంటిది మన మానవ సమాజంలో, నిన్నటి దాకా మనతో కలిసి తిరిగిన, మాట్లాడిన, మంచీ చెడులు పంచుకున్న సాటి మనిషి అకారణంగా, అమానుషంగా మనముందు నుండి నిష్క్రమిస్తే, నిస్సహాయంగా, నిర్జీవమై నిలిచిపోయిన అతని చూపులు ఈ జనాలనెందుకు కదిలించడం లేదు. మనకోసం మనమేర్పరచుకున్న చట్టాలు మన ఆస్తులను, ప్రాణాలను తోడేయడానికి ఆయుదాలౌతుంటే మనమెందుకు ప్రశ్నించడం లేదు? అయిన దానికి కాని దానికి మతంపేరుతో, కులం పేరుతొ కాదంటే మరో పేరు తో గళమెత్తే సంఘాలు, యువతీ యువకులు, సామాజిక ఉద్యమకారులు, సగటు మనుషులు ఎక్కడ చచ్చారు?
పరిపరి విధాలుగా పలువరిస్తున్న ఆమె మనసుకు సమాధానం దొరికింది, కాదు కాదు ఆమె దొరికించు కుంది. ఇది ఒక వంగయ్య కథ మాత్రమే కాదు. ఇది ఈ రోజే మొదలైన కథ అంతకన్నా కాదు. సమాజంలో అడుగడుగునా ఇటువంటి వంగయ్యలెందరో ఉన్నారు. తమ బతుక్కు అర్థాన్ని తమ చావులో వెతుక్కుంటూ నిస్సహాయంగా నిర్జీవులై పోతూనే ఉన్నారు, ఉంటారు కూడా. ఈ జనం మాత్రం ఏదో రూపంలో, మరేదో సాకుతో రాజీ పడుతూనే ఉంటారు, మనదాక రాలేదు కదా అని మనసుకు సర్దిచెప్పుకుంటు సాగిపోతుంటారు, ఏదో నిర్ణయించుకున్నట్లు చివరి సారిగా పోలీసుస్టేషన్ వైపు తిరిగిచుస్తూ సాగిపోతున్న ఆమె కండ్లలో లోకం మీద ఏవగింపు, వ్యవస్థ మీద అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- చందుపట్ల రమణ కుమార్ రెడ్డి. న్యాయవాది, 9440449392