ఎన్నికల వ్యూహకర్తలు…రాజకీయాల్లో ఇదొక సరికొత్త కల్చర్. దాదాపుగా ముప్ఫయి ఏళ్ల కిందట ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త అంటూ ఎవరూ ఉండేవారు కాదు. జనబలమే పునాదిగా ప్రతి రాజకీయ పార్టీ ఉండేది. పేద, మధ్య తరగతి ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది. పార్టీ పెద్దల సలహాలు, సూచనల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రజలను ఓట్‌బ్యాంకులుగా రాజకీయ పార్టీలు చూడటం మొదలైంది. దీంతో ప్రజల మనసుల్లోకి రాజకీయ పార్టీలు తొంగిచూడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీలను గెలుపు తీరాలకు చేర్చడానికి తమదైన వ్యూహాలు, ఎత్తుగడలతో శ్రమిస్తున్నారు.
సునీల్ కనుగోలు….తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెరమీదకు వచ్చిన పేరు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తొలిసారిగా సునీల్ కనుగోలు పేరు రాజకీయవర్గాల్లో మార్మోగింది. కాగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు మరోసారి సత్తా చాటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో సునీల్ కొనుగోలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతో సునీల్‌కు కొంతకాలంగా అనుబంధం ఉంది. గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ దగ్గర సునీల్ కనుగోలు పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐ ప్యాక్ రీసెర్చ్ టీమ్‌కు చాలా కాలం సునీల్ కనుగోలు సేవలందించారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సునీల్‌దే మేజర్ రోల్ అంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు. ఈ ఏడాది మేనెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి వెనుక సునీల్ కనగోలుదే కీలకపాత్ర అంటారు రాజకీయ విశ్లేషకులు. బొమ్మైది 40 శాతం కమిషన్ సర్కార్ అనడం, పే సీఎం నినాదం….ఈ అంశాలతో కర్ణాటక ఎన్నికల్లో సునీల్ కనుగోలు వినూత్న క్యాంపెయిన్ నిర్వహించారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని సునీల్ కనుగోలు డిజైన్ చేసిన క్యాంపెయిన్ కర్ణాటకలో సూపర్ డూపర్‌గా సక్సెస్ అయింది. కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి సునీల్ కనుగోలు ఆయా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలను పట్టించుకోడు. నేరుగా ఏఐసీసీకే ఆయన బాధ్యుడు. జనం అభిప్రాయాలను గాంధీ కుటుంబానికే ఉన్నది ఉన్నట్లుగా చేరవేస్తాడు. కర్ణాటకలో గెలవడంతో వ్యూహకర్త సునీల్‌పై కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌కు భరోసా పెరిగింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించే వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలుకు ఏఐసీసీ అప్పగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపు కోసం సునీల్ కనుగోలు తీవ్రంగా శ్రమించారంటారు రాజకీయ విశ్లేషకులు. తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి సునీల్ మన తెలుగోడే అంటారు. సునీల్ హడావిడి చేసే మనిషి కాదు. ప్రజా జీవితంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అందువల్లే ఆయన వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు.
క్షేత్రస్థాయిలో పనిచేసే సునీల్ నెట్‌వర్క్ !
ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నెట్‌వర్క్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆయనకు సంబంధించిన మైక్రో టీమ్‌లు ప్రతి నియోజకవర్గంలోనూ అనునిత్యం పనిచేస్తుంటాయి. ఈ టీమ్‌లు అన్నిటినీ సమన్వయ పరచేందుకు జిల్లా స్థాయిలో ఓ టీమ్ లీడర్ ఉంటాడు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఇలాంటి నివేదికలు రాష్ట్రస్థాయిలో పనిచేసే బాధ్యులకు చేరతాయి. వీటిని విశ్లేషించి అంతిమంగా ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సునీల్ టీమ్‌లు ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను కూడా రికార్డు చేస్తుంటాయి. మౌలికంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ? ఆయా సెగ్మెంట్లలో వివిధ కులాల సమీకరణాలు, టికెట్ ఆశిస్తున్నవారి బలాలు, బలహీనతలు..వీటన్నిటిపై అంతిమంగా ఒక నివేదిక తయారు చేసి ఏఐసీసీకి ఓ నివేదిక పంపుతారు సునీల్ కనుగోలు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఎవరు ఎన్ని సిఫార్సులు చేసినా చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడంలో సునీల్ కనుగోలు మాటే శాసనంగా మారిందంటారు రాజకీయ విశ్లేషకులు.
వందల కోట్లలో వ్యూహకర్తల ఫీజులు
ప్రశాంత్ కిశోర్ కానివ్వండి, సునీల్ కనుగోలు కానివ్వండి… ఆయా రాజకీయ పార్టీల నుంచి వీళ్లు వసూలు చేసే ఫీజు చాలా హై రేంజ్ లో ఉంటుంది. అలా ఇలా కాదు. కొన్ని వందల కోట్లలో ఉంటుందంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు. పాత రోజుల్లో ఇలాంటి ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి రాజకీయ పార్టీ అనునిత్యం జనంతో మమేకం అయి ఉండేది. సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది. ఆయా పార్టీలకు సలహాలు ఇచ్చే పెద్దలు అందులోనే వివిధ కీలక పదవుల్లో ఉండేవారు. వారి ఎత్తుగడల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజలతో రాజకీయ పార్టీలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జనం గుండె లోతుల్లోకి వెళ్లి తొంగి చూసేంతటి ఓపిక, తీరికా రాజకీయ పార్టీలకు లేకుండా పోయాయి. అందుకే ఆ పని చేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి రాజకీయపార్టీలు.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్, 63001 74320